నాడు పాటను మెచ్చి.. నేడు పద్యానికి మొక్కి.!

అలకలు కొన్ని; కినుకలు కొన్ని; భజనలు కొన్ని..వెరసి ప్రపంచ తెలుగు మహాసభలయ్యాయి. ఈ ఏడాది(2017) చివర్లో మొత్తానికి హైదరాబాద్‌ మోతెక్కిపోయింది. కోట్ల వ్యయం; లక్షల జనం; వేల కవులూ, రచయితలూ, భాషాభిమానులూ. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి(తెలుగువాడు కావటం యాదృచ్ఛికం.) శ్రీకారం చుడితే, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌(తెలుసుకున్న తెలుగు చరితతో) ‘శుభం’ కార్డు వేశారు.

ముగ్గురు ముఖ్యమంత్రులు: మూడు కారణాలు

తెలుగు గడ్డ మీద ఏప్రభుత్వమూ ఎప్పుడూ అకారణంగా తెలుగును తలచుకోలేదు. కానీ ఇలా అనుకోగానే అలా ‘ప్రపంచ సభలు’ మాత్రం నిర్వహించేస్తుంది. అది (1975లో) జలగం వెంగళరావు కావచ్చు; (2012లో) కిరణ్‌కుమార్‌ రెడ్డి కావచ్చు; (2017లో)కె.చంద్రశేఖరరావు కావచ్చు. వీరిలో ఎవరికయినా ‘తెలుగు భాష’ తక్షణ రాజకీయ అవసరమయినప్పుడు మాత్రమే ఈ సభలకు ఉపక్రమించారు. అందులో అనుమానమేమీ లేదు. శ్రీకాకుళం జిల్లా మన్యాన్ని ‘కల్లోల ప్రాంతం’గా ప్రకటించి నక్సలైట్లను ఏరివేశానన్న ఖ్యాతితో పాటు, గిరిజనుల హక్కులను హరించాడన్న అపఖ్యాతిని కూడామూట గట్టుకున్న జలగానికి హఠాత్తుగా ఒక ‘సాత్వికమైన, మానవీయమైన’ ముఖం అవసరమయ్యింది. విద్యావంతుల, బుధ్ధిజీవుల ప్రశంసలు ప్రాణవాయువంత ముఖ్యమయిపోయాయి. దాంతో ‘తెలుగు సభల’కు ఉపక్రమించారు. మరి 2012లో తెలంగాణలో కిరణ్‌ కమార్‌ రెడ్డి ఎందుకు ఈ పండగ చేశారు? ఒక పక్కన తెలంగాణ ప్రత్యేక ఉద్యమం, మరొక పక్క సమైక్య ఆంధ్ర కోసం ఆందోళనలూ జరుగుతున్నప్పుడు, ఆయన సమైక్యాంధ్రకు మద్దతుగా ‘తెలుగు వాళ్ళమందరమూ ఒక్కరమే’ అని చెప్పాల్సి వచ్చింది. అందుకోసం సభలు నిర్వహించారు. మరి కేసీఆర్‌కు? ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కవులూ, కళాకారులూ పోషించిన పాత్ర కీలకమయినది. అందుకే రాష్ట్రం ఏర్పాటు కాగానే వారిలో చాలామందికి ‘జీతభత్యాలు’ ఇచ్చే ఏర్పాటు చేశారు. కానీ మూడేళ్ళు తిరగకుండానే నిరసన ధ్వనులు వినిపించాయి. మరీ ముఖ్యంగా అప్పుడు తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(జె.ఎ.సి)లో కీలకంగా వున్న కవులూ, కళాకారులూ వ్యతిరేకమయ్యారు.ఈ సందర్భంలో మరోమారు తెలంగాణ కవులకూ, కళాకారులకూ ఉత్సాహాన్నివ్వాలనుకున్నారు.

జలగం, కిరణకుమార్‌ లతో పోలిస్తే, భాషా సాహిత్యాల్లో కేసీఆర్‌కు ఎక్కువ ప్రమేయమే వుండి వుండవచ్చు.(కిరణ్‌ కుమార్‌ రెడ్డి తెలుగు మీద ఇప్పటికీ ఛలోక్తులు వేస్తూనే వుంటారనుకోండి.) అంత మాత్రం చేతనే జరిగిపోవు. ఆ మాటకొస్తే సాక్షాత్తూ బహుభాషాకోవిదుడూ, సాహితీ వేత్తగా పేరొందిన తెలుగువాడు పి.వి.నరసింహరావు ముఖ్యమంత్రిగానో, ప్రధానమంత్రిగానో వున్నప్పుడు తెలుగు గడ్డ మీద ఇలాంటి సభలు నిర్వహించాలన్న యోచనే రాలేదు. ఎప్పుడో చిన్నప్పుడు ఒంట బట్టించుకున్న ‘సులక్షణ సారాన్ని’ ప్రదర్శించటానికో లేక, చెట్టుకింద కూర్చుని రాసిన పద్యాన్ని నెమరు వేసుకోవటానికో కేసీఆర్‌ ఈ సభలు నిర్వహించారని ఎవరూ భావించరు.

అలాగని తెలంగాణ ఉద్యమ కాలంలో లాగా ‘ఆది కవి ఎవరు?’ భారతాన్ని తొట్టతొలుత అనువదించడానికి తెగించిన ఆంధ్రప్రాంతపు నన్నయా? లేక బసవపురాణం రాసిన తెలంగాణ ప్రాంతపు పాల్కురికి సోమనాథుడా? ఈ పంచాయితీ మరోమారు పెట్టుకునేంత తీరికా, కోరికా కూడా కేసీఆర్‌కు వుండక పోవచ్చు. అదే నిజమయితే, అవధానాలు చేసుకునేవారిని ఆంధ్రనుంచి తీసుకొచ్చి శాలువాలు కప్పనవసరం లేదు. అలాగని అంధ్రనుంచి పేరొందిన అందర్నీ పిలిచారా- అంటే సందేహమే! మరి తెలంగాణ నుంచి పాటకు పట్టం కట్టిన గద్దర్‌ను పిలవలేదు; అందెశ్రీకి వెయ్యాల్సి అందలం వెయ్యలేదు. అందుకనే నిరసనలు రెండు రాష్ట్రాలనుంచీ వున్నాయి.

తెలంగాణ ‘చంద్రుని’ అల్లిక జిగిబిగి?

‘అల్లసాని వారి అల్లిక జిగిబిగి’ లాగే, ‘తెలంగాణ ‘చంద్రుని’ అల్లిక’ గజిబిజిగా వున్నట్లు కనిపిస్తుంది. కానీ, కాదు. తెలంగాణ సాంస్కృతిక నాయకత్వాన్ని ఇప్పుడు కొత్తగా చూపించాలనే వ్యూహం స్పష్టం కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నంత సేపూ ఎక్కడ జనం పోగుపడినా అక్కడ పాటా, దరువూ వుండేది. పాటే తెలంగాణ ఉనికి. ఇప్పుడు అదే పాటను స్మరిస్తే, ఇప్పటి నిరసన గళాలను గుర్తించినట్లవుతుంది. అందుకే పాట స్థానంలోకి, పద్యమొచ్చిపడింది. తెలంగాణ చరిత్రలో వున్న పద్యకవులను తలచుకోవాల్సిన అగత్యం వచ్చింది. అంతెందుకు? ఉద్యమం కాలంలో ‘నేనూ పాట రాస్తానని’ అన్న కేసీఆర్‌, ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘నేను చిన్నప్పుడే పద్యం రాశానని’ చెప్పి గుర్తు కొచ్చిన పద్యాలు చదివారు. పద్యం నేర్పిన గురువు(మృత్యుంజయ శర్మ) పాదాలకు నమస్కరించారు.

ఆధునిక తెలుగు సాహిత్యం పద్యాన్ని వీడి చాన్నాళ్ళయ్యింది. శ్రీశ్రీ ఏనాడో ‘చందోబందోబస్తులను చట్‌ఫట్‌ మని తెంచేశారు’. దాని స్థానంలోకి ముందు గేయం, తర్వాత వచన కవితలొచ్చేశాయి. పద్య కవులు కూడా అవధానకవుల పద్యాలను పలుచన చేసి మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఆ పద్యానికి ప్రపంచ సభలు కిరీటం పెట్టాయి. కథ,నవల వంటి వచన ప్రక్రియల మీద చర్చలు జరిగాయి కానీ, వాటి మీద వెలుగు అంతగా ప్రకాశించలేదు. బృహత్కవి సమ్మేళనాల్లాంటివి జరిగి వుండవచ్చు. కానీ అవి ఉచిత అన్న సంతర్పణల్లాగా పెద్దగా ముద్ర వెయ్యలేవు.

విశేషమేమిటంటే ఈ సభల వ్యూహరచన సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆరే చేసినా, నిర్వహణ బాధ్యతలు నెత్తిన బెట్టుకున్న వారిలో నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్‌, రమణా చారి ముఖ్యులు. వీరు ముగ్గురూ వరుసగా వచనకవితకూ, పాటకూ, పద్యానికీ ప్రతినిథుల్లాగా కనిపిస్తారు. పద్యమే పైకి వచ్చింది కాబట్టి, ఇందుకు ఎవరి కృషి విశేషంగా వుందో వివరించి చెప్పనవసరంలేదు.

ప్రపంచ సభల తర్వాత తెలంగాణ సాహిత్యమంటే ‘పద్యమే కాబోలు’ అని ఎవరయినా అనుకుంటే, ఏలినవారి వ్యూహం ఎంతో కొంత ఫలించినట్లే. ఈ రహస్యం తెలుసుకోకుండా ఆంధ్ర వారిని పిలవలేదని ఆంధ్ర వారూ( సినీనటులొచ్చారుగా? ఆంధ్ర వారు కారా?), తెలంగాణ వారిని పిలవ లేదని తెలంగాణ వారూ భావించాల్సిన పనిలేదు. దేశ నేతలందు తెలుగు నేతలు లెస్స!

-సతీష్ చందర్

1 comment for “నాడు పాటను మెచ్చి.. నేడు పద్యానికి మొక్కి.!

Leave a Reply