మనుషుల కన్నా గోవులు ఎక్కువ సమానమా?

దాడి నుంచి తప్పించుకున్న అస్లాం ఖాన్

పురాణాన్ని నమ్మించినట్లే పుకార్లనీ నమ్మించేస్తున్నారు. గోవుల్ని వధిస్తున్నారని పుకారు; పిల్లల్ని ఎత్తుకుపోతున్నారని పుకారు; చేతబడులు చేస్తున్నారని పుకారు. నమ్మించెయ్యగా, నమ్మించెయ్యగా, జనానికి కూడా నమ్మకం వ్యసనం అయిపోతుంది.. తాగించగా తాగించగా తాగుడు అలవాటు అయిపోయినట్లు. ఆ తర్వాత జనం నమ్మటానికి సిధ్దంగా వుండి పుకారు కోసం ఎదురు చూస్తారు. తాగుడు అలవాటయి, తాగటానికి కారణం వెతుక్కున్నట్లు. దుఃఖం ఎక్కువయిందనో, సంతోషం ఎక్కువయిందనో, రెండూ లేక బోరు కొడుతోందనో బాటిల్‌ పట్టేస్తాడు.

నమ్మటానికి సిధ్దమైన వారికి, కొన్ని సమూహాల పట్ల ముందే ‘మూఢ’ నమ్మకాలు ఏర్పడతాయి. హిజ్రాలనగానే ఒకప్పుడు నవ్వులాట. వాళ్ళ ఎక్కడ పుట్టినా ఇళ్ళల్లో కాకుండా, వీధుల్లోనే బతకాలని ఎవరో జనానికి చెప్పేశారు. జనం నమ్మేశారు. అంటే అడుక్కునో, నేరం చేసో బతకాలని జనం కూడా నిర్థారించేసుకున్నారు. అందుకే ఆమధ్య హైదరాబాద్‌ పాత నగరంలో, ఒక ఉత్సవానికి వారొచ్చినప్పుడు, పిల్లల్ని ఎత్తుకుపోవటానికి వచ్చారేమోనని తొక్కి చంపేశారు. ఎవరూ? ఎవరేమిటి జనమే. ముస్లిం ల పట్ల ‘మెజారిటీ’ జనంలో కొన్ని నమ్మకాలను సృష్టించారు. వారు పశువులను వధిస్తారు కానీ, పశువులను పోషించరని. మరీ ముఖ్యంగా గోవులను పోషించరని. కాబట్టే రాజస్థాన్‌ అల్వార్‌లో ఇటీవల రెండు గోవులను ఇద్దరు ముస్లింలను తోలుకు వెళ్ళటం చూసి, అనుసరించి, ముట్టడించి, ఆ ఇద్దరినీ చావ చితకగొట్టేశారు. అస్లాం ఖాన్‌ అనే అతను దెబ్బలతోనే తప్పించుకున్నాడు. కానీ రక్బర్‌ ఖాన్‌ అనే ముస్లింని కొట్టి బురదలో పారేశారు. ఆతడు ప్రాణాలతో వుండగానే పోలీసులు వచ్చారు. కానీ పోలీసులు అక్కడకొచ్చింది ‘ధర్మ’ పరిరక్షణ కోసమే. దాంతో ‘ధర్మ విరుధ్ధం’గా గోవుల్ని వధకు తరలించటాన్ని నిలుపు చెయ్యాలనే వచ్చారు.దాంతో చావు బతుకుల్లో వున్న రక్బర్‌ ఖాన్‌ ను కాకుండా, చెదరిపోయిన గోవులను వెతికి గోశాలకు తీసుకు వెళ్ళటాన్ని తమ తక్షణ కర్తవ్యంగా భావించారు. నిజానికి రక్బర్‌ ఖాన్‌ ను రక్షించాలనుకుంటే, కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఆసుపత్రి వుంది. కానీ చాలా దూరంలో గోశాల వుంది. అర్థరాత్రి పన్నెండున్నరకి ఈ ఘటన జరిగితే, పోలీసులు గోవుల్ని గోశాలకు మూడు గంటలకు తరలించారు. ఆ తర్వాత తీరిగ్గా రక్బర్‌ ఖాన్‌ ను తెల్లవారు ఝామున నాలుగు గంటలకు తీసుకు వచ్చారు..ప్రాణాలతో కాదు, ప్రాణాలు లేకుండా.

గోశాలకు చేర్చిన గోవులు

ఈ దాడికి పాల్పడిన వారికి స్థానిక బీజేపీ శాసన సభ్యుడు జ్ఞాన్‌దేవ్‌ అహూజా మద్దతు వుందని ప్రాణాలతో బయిటపడ్డ అస్లాం ఖాన్‌ చెప్పాడు. ‘మన వెనకాల ఎమ్మెల్యే వున్నాడు. ఎవ్వడూ ఏమీ చెయ్యలేడు. వాడిని (రక్బర్‌ని) మంటల్లో వేసి తగలబెట్టండి’ అని అనటం పొదల్లో దాక్కున్న తాను విన్నానని చెప్పాడు. ఈ ఆరోపణను సంపూర్ణంగా ఖండించే పని కానీ, తప్పించుకునే పని కానీ ఎమ్మెల్యే చెయ్యలేదు. ఈ దాడికి పాల్పడ్డ స్వయం ప్రకటిత ‘గోరక్షకుల’ చర్యను తొట్టతొలిగా సమర్థించాడు కూడా. కాక పోతే, పోలీసులే రెచ్చగొట్టి తన మీద అస్లాం ఖాన్‌తో లేనిపోనివి మాట్లాడిస్తున్నారని తర్వాత తేరుకుని అన్నాడా ఎమ్మెల్యే. ఈ ఏడాదిలోనే ఒక్క రాజస్థాన్‌లో ఇలా ‘గోహత్య పుకారు’ మీద జనం దాడిచేసి తొక్కేసిన ఘటన ఇది ఏడవది. పుకారే న్యాయమయినప్పుడు, ‘మూకోన్మాదమే’ శిక్షాస్మృతి అవుతుంది. ఈ ఘటనలన్నిటిలోనూ జరిగింది అదే.

దేశాన్ని కుదిపేసిన దాద్రీ ఘటన కూడా పుకారే. అఖ్లాక్‌ ఇంట్లో గోమాంసం వుందని, అంతవరకూ దాద్రీలో తిరిగిన ఆవుదూడనే అతడు వధించి, ఇంట్లో వంట చేయించుకుని, ఇంకా కొంచెం దాచుకున్నాడని పుకారు. (కాదు.కాదు. పుకారులోంచి వచ్చిన పుకారులోంచి వచ్చిన పుకారు) అంతే ఫ్రిజ్‌ వెతికి ‘మాంసం’ చూసి, అది గోవుమాంసమే అని నమ్మేసి, ఊరు ఊరంతా గుంపుగా వెళ్ళి ఆ వృధ్ధుణ్ణి తొక్కి చంపేశారు.(తర్వాత అది గోవు మాంసం కాదూ.. గొర్రె మాంసమే అని తేలింది.) ఒక వేళ గోవు మాంసమే వుంటే తొక్కి చంపమని ‘భారత శీక్షా స్మృతి’లో రాసి వుందా..?

పుకార్లు అందరి మీదా నడవవు. అల్పసంఖ్యాకుల మీదా, అణగారిన వర్గాల, స్త్రీలమీద మాత్రం వేస్తేనే నమ్మబుధ్ధి అవుతుంది. సీతమ్మవారి మీద వేసిన పుకారును శ్రీరామచంద్రుడికీ నమ్మబుధ్ధి అవుతుంది. ఆమె స్త్రీ కదా! ఒకవేళ ఆయన నమ్మకపోయినా, జనం నమ్మేసివుంటారని నమ్మాల్సి వస్తుంది. ఎలాగయినా వ్యాఖ్యానించుకుని బయిట పడవచ్చు. ఒకటి నిజం. పుకారు గానీ, అభాండం కానీ కొందరి మీద వేస్తేనే నమ్ముతారు.

నిజానికి రక్బర్‌ ఖాస్‌ హర్యాణా మీవత్‌ జిల్లా నుంచి రాజస్థాన్‌ వెళ్ళి గోవుల్ని ఎత్తుకు రావటం లేదు. ముప్ఫయి వేలు రూపాయిలు వెచ్చించి కొనుక్కొని తెచ్చుకుంటున్నాడు. ఎందుకూ వధించటానికి కాదు. ఇంటి దగ్గర అప్పటికే కొన్ని గోవులు వున్నాయి. అవి ఇచ్చే పాలను అమ్మే ఇల్లు ( భార్యా, ఏడుగురు పిల్లల సంసారాన్ని) నెట్టుకొస్తున్నాడు. ఇంకో రెండు గోవులు వుంటే వచ్చే నాలుగువందల రూపాయిలకు మరో రెండు వందలు వస్తాయని ఆశించాడు. అంతవరకూ తానో గని కార్మికుడు. గనిలో పనులు లేకపోవటం తో ఈ గోవుల పెంపకాన్ని మొదలు పెట్టాడు. ఇదంత రక్బర్‌ ఖాన్‌ భార్య మీడియాతో చెప్పింది.

‘పుకార్లు’ నమ్మే గుంపులకు ఈ నిజాలను నమ్మాలనిపించదు. ముస్లిం చెంతన కానీ, దళితుడి చెంతన కానీ గోవును చూస్తే.. భక్షణకే అని తెంపు చేసేసుకుని మరణ శిక్ష విధించాలి. ఈ అల్వార్‌ ఘటన పై కేంద్ర పాలకులగా వున్న బీజేపీ నేతలే కాదు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ‘గో’ పక్షం వహించే మాట్లాడారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌ ఈ ఘటనపై మాట్లాడుతూ ‘మనుషుల ప్రాణాలు ముఖ్యమే. గోవుల ప్రాణాలు ముఖ్యమే’ అన్నాడు. మనుషుల ప్రాణాలతో, గోవుల ప్రాణాలు సమానమని ఏ చట్టంలో రాసి వుంది? రాజస్థాన్‌ పోలీసులు ఇదే పాటించినట్లున్నారు. ‘మనుషులు ప్రాణాలూ, గోవుల ప్రాణాలూ సమానమని భావిస్తూ, గోవులు ప్రాణాలు ‘ఎక్కువ సమానం’ అని భావించినట్లున్నారు. అందుకే గోవుల్ని మాత్రమే కాపాడారు.

-సతీష్ చందర్

(గ్రేట్ఆంధ్ర వార పత్రికలో ప్రచురితం)

1 comment for “మనుషుల కన్నా గోవులు ఎక్కువ సమానమా?

  1. పుకార్లు అందరి మీదా నడవవు. అల్పసంఖ్యాకుల మీదా, అణగారిన వర్గాల, స్త్రీలమీద మాత్రం వేస్తేనే నమ్మబుధ్ధి అవుతుంది. సీతమ్మవారి మీద వేసిన పుకారును శ్రీరామచంద్రుడికీ నమ్మబుధ్ధి అవుతుంది. ఆమె స్త్రీ కదా!

Leave a Reply