తెలుగు నాట ‘చిన్న’ బోయిన జాతీయ పార్టీలు!

తెలుగు రాష్ట్రాలు వేరయినా, ఒక రాష్ట్రంలోని రాజకీయాల ప్రభావం మరొక చోట పడుతూనే వుంది. నాలుగేళ్ళ తర్వాత ఈ ముద్ర మరింత పెరిగింది. ప్రాంతీయ వైరాలు- నేతల్లో సరేసరి- ప్రజల్లో తగ్గాయి. రాష్ట్రం ‘సమైక్యం’గా వున్నప్పటి అపోహలు ‘వేరు పడ్డాక’ తగ్గాయి. కాపురాలు వేరయ్యాక కలయకలు పెరిగాయి. తెలంగాణ కాస్త ముందుగా ఎన్నికలకు వెళ్ళటంతో ఈ ‘అన్యోన్యత’ మరీ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే తెలంగాణ ఎన్నికల ప్రభావం, తర్వాత(2019లో) రెండు రాష్ట్రాల్లో వచ్చే పార్లమెంటు ఎన్నికల పైనా ఆంధ్రప్రదేశ్‌ లో జరిగే అసెంబ్లీ ఎన్నిలపైనా వుండితీరుతుంది.

ఎవరి పంచన చేరాలి?

రెండు రాష్ట్రాలలోనూ జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ‘వారు కాదంటే వీరు; వీరు కాదంటే వారు’ అన్న స్థితికి బీజేపీ, కాంగ్రెస్‌ లాంటి పార్టీలు వచ్చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2014 ఎన్నికలలోనే మట్టి కరిచింది; తెలంగాణలో ఓటమి పాలయ్యింది. తెలుగుదేశాన్ని ముందు పెట్టి బీజేపీ వెనుక వుంది. నాలుగుయేళ్ళు తర్వాత నిజంగానే బీజేపీని ‘తెలుగుదేశం’ వెనక్కి నెట్టేసింది. ఇప్పుడు బీజేపీ దానంతట తాను, ఆంధ్రప్రదేశ్‌లో పోటీచేసి గెలవ లేదు. మరో ప్రాంతీయ పార్టీ ఆలంబన కావాల్సిందే. అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా వున్న వైసీపీ, పోటీచెయ్యటం కోసం అయిదేళ్ళు ఎదురు చూసిన జనసేన వున్నాయి. వీటిలో ఏదో ఒక పక్షంతో బీజేపీ పొత్తు పెట్టుకోవాలి; లేదా అవగాహనకు రావాలి. రాష్ట్రంలో పరిపాలన కోసం కాదు; కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే పార్లమెంటు సీట్ల కోసం. విభజనానంతరం కూడా ఆంధ్రప్రదేశ్‌కు 25 సీట్లు వున్నాయి. వీటిలో కనీసం అరడజను సీట్లు కూడా సొంతంగా సాధించుకునే శక్తి బీజేపీకి లేదు. ఎవరినీడకో వెళ్ళి తీరాల్సిందే. వైసీపీతో నేరుగా పొత్తుగా పెట్టుకుంటే, రెండు పార్టీలకూ నష్టమే వుంటుంది. ఎందుకంటే వైసీపీ కి దళితులూ, దళిత క్రైస్తవులూ, ముస్లింలూ చెక్కుచెదరని వోటు బ్యాంకులుగా వుంటూవస్తున్నారు. వీరంతా బీజేపీని ‘హిందూ మత తత్వ పార్టీ’ గా చూస్తారు. కాబట్టి నేరుగా కలిస్తే వైసీపీ చెప్పలేనంత నష్టం. అలాగే ఈ వర్గాలకు ‘రిజర్వేషన్లు ‘ ఇవ్వటం వల్లే తాము నష్టపోతున్నామనుకునే సామాజిక వర్గాల వారు బీజేపీకి ఆలంబనగా వుంటారు. అంతే కాదు ‘మతపరమైన రిజర్వేషన్ల’కు ససేమిరా అనే వారికి కూడా బీజేపీ బాగా నచ్చుతుంది. అలాంటి బీజేపీ, వైసీపీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకి వున్న ‘సాంప్రదాయక’ వోటును కోల్పోతుంది.

అడ్డురానున్న‘మూడు లడ్డూలు

ఇక బీజేపీ ముందు వున్న మరో ప్రత్యామ్నాయం ‘జనసేన’. తొలుత నరేంద్ర మోడీ తో ‘జనసేన’ అధినేత పవన్‌ కల్యాణ్‌ గట్టి బాంధ్యవ్యమే ఏర్పడ్డా, ‘ప్రత్యేక హోదా’ విషయంలో బీజేపీని తూర్పారబడుతూనే వచ్చారు. ‘హోదా’ బదులు ఇచ్చిన ‘ప్యాకేజీ’ని ‘పాచిపోయిన మూడు లడ్డూల’తో పోల్చి మరీ వెక్కిరించారు. ఇప్పటికీ ఆదే స్థాయిలో ఆయన బీజేపీ మీద విరుచుకుపడుతున్నారు. దానికి తోడు ఆయన కమ్యూనిస్టు పార్టీలను, ముఖ్యంగా సీపీఐను వెనక వేసుకుని తిరుగుతున్నారు. తాను కూడా అక్కడక్కడా వామపక్ష నినాదాలను ఇస్తున్నారు. కాబట్టి బీజేపీ ‘జనసేన’తో కలవటం కష్టమే అనిపిస్తుంది.

అయితే ‘తెలంగాణ’లో మారిన వరసల వల్ల, ఆంధ్రప్రదేశ్‌ లో బీజేపీ పొత్తులకు కొంత మార్గం సుగమమం అయ్యే అవకాశం వుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో ‘తెలుగుదేశం, కాంగ్రెస్‌ వున్న కూటమి’లో సీపీఐ చేరిపోయింది. అంటే అక్కడ కూడా సీపీఐ తెలుగుదేశం తోవుండాలి. కానీ అక్కడ ‘జనసేన’ ‘తెలుగుదేశం’ పార్టీలు కత్తులు నూరుకుంటున్నాయి. అందుచేత సీపీఐ ‘జనసేన’ను వదలి ‘తెలుగుదేశం’ వైపు రావటం మినహా మార్గం లేదని- తెలంగాణ సీపీఐ నేతలే సూచనప్రాయంగా చెబుతున్నారు. ఇక సీపీఎం కూడా జాతీయ స్థాయిలో చంద్రబాబు- రాహుల్‌ ల ఫ్రంట్‌ కు మద్దతు ఇస్తున్నట్లు చెబుతోంది. కాబట్టి ఆ మేరకు ‘జనసేన’ కమ్యూనిస్టులతో కలవటం కష్టమవుతుంది. కానీ ‘జనసేన’ ఒక వైపు మాయావతి నేతృత్వంలోని ‘బీఎస్పీ’ వైపు పొత్తు కోసం చూస్తోంది. సాక్షాత్తూ ‘జనసేనానే’ ఆమెను కలవటం కోసం లక్నో వెళ్ళారు. ( ఆమె సమయానికి లక్నోలో లేరనుకోండి. అది వేరే విషయం.) దానికి తోడు ఫూలే, అంబేద్కర్‌, కాన్షీరాంల పేర్లను పవన్‌ తరచు ప్రస్తావిస్తుంటారు. బీఎస్పీకి బధ్ధ వ్యతిరేకి బీజేపీ. ఈ అంశాన్ని కాదనుకుంటే, కమ్యూనిస్టుల వెళ్ళిన జాగాలోకి బీజేపీ రావచ్చు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్ళ క్రితం మట్టికరిచిన కాంగ్రెస్‌, ఇప్పుడిప్పుడే తిరిగి ఊపిరి పోసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. తెలంగాణలో సాగిన ‘తెలుగుదేశం- కాంగ్రెస్‌’ కుదిరిన వియ్యమే, ఇక్కడ కూడా కొనసాగించే వీలుంది. ఒక వేళ ఈ మైత్రి వల్ల ఆంధ్రప్రదేశ్‌ లో నష్టమంటూ వుంటే ‘తెలుగుదేశం’ పార్టీకి వుండాలి కానీ, ‘కాంగ్రెస్‌’ కు వుండాల్సిన అవసరంలేదు.

ఇక ఆంధ్రప్రదేశ్‌ వోటర్లలాగే ఆలోచించే వోటర్లు, తెలంగాణలో వున్న సీమాంధ్ర సెటిలర్లు. రాష్ట్రం విడిన ఏడాదికే ‘కేసీఆర్‌-చంద్రబాబు’ ల అనుబంధాన్ని ( రాజధాని శంకు స్థాపనకు కేసీఆర్‌ వచ్చారు కదా!) చూసి, కొంత విరక్తితో, కొంత నిరాసక్తతతో ఈ సెటిలర్లు తర్వాత జరిగిన ‘గ్రేటర్‌ హైదరాబాద్‌’ ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొన లేదు. ఇక పారిశ్రామిక రంగంలో వున్న ఆంధ్ర సెటిలర్లతో ‘కేసీఆర్‌ సర్కారు’ సత్సంబంధాలు పెంచుకుంది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని సెటిలర్లకు గేలం వెయ్యవచ్చని తెలుగుదేశం కలలు కంటోంది.

తెలంగాణలో కూడా బీజేపీ పార్లమెంటు ఎన్నికలనే దృష్టిలో పెట్టుకుని పాచికలు వేస్తుంది. అందుచేత కేసీఆర్‌ కోరుకున్న ‘జోనల్‌ వ్యవస్థ’కు ఆమోదం తెలిపి కేసీఆర్‌ ను పంపించింది. వెంటనే ఆయన అసెంబ్లీ రద్దుకు తయారయ్యారు. అంటే ఇప్పటికి కేసీఆర్‌ ఎం.ఐ.ఎంతో పొత్తు పెట్టుకున్నా, అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ వైపు మొగ్గ వచ్చు. ఈ మేరకు ఇప్పటికే ఊహాగానాలు నడుస్తున్నాయి.

సారాంశం ఒక్కటే: రెండు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీల ప్రాపకం కోసం జాతీయపార్టీలు వెంపర్లాడుతున్నాయి.

-సతీష్ చందర్ 

(గ్రేట్ ఆంధ్ర వారపత్రికలో ప్రచురితం)

Leave a Reply