Tag: ఒంటరితనం

రాలిన తూలిక

కొంచెం దిగులు. కాస్త కంటి తడి. పిసరంత ఆనందం. పెదవుల మీదకు వచ్చిపోయిన చిరునవ్వు. ఇవి చాలు, గుంపు నుంచి పారిపోవటానికి. మొబైల్‌ మోగని, టీవీ కనబడని, డియోడరెంట్‌ వాసన రాని, కృత్రిమ కర స్పర్శలేని, పిజ్జాలతో రుచిచెడని చోటకు నా అంతట నేను వెళ్ళిపోతాను. అజ్ఞాతానికి అరణ్యమే అవసరంలేదు. వాకిలి చాలు, కారిడార్‌ చాలు, బాల్కనీ చాలు. వీటన్నిటి కంటే బాత్‌ రూమ్‌ మేలు. ఇష్టమైన తలపులతో నిలువెల్లా తడిసిపోతున్నప్పుడు ఎవరూ ఉండకూడదు. నా కలల హైవేలో నేను వెళ్తున్నప్పుడు, ఎదురుగా ఒక్క వాహనమూ కనపడకూడదు. నా ఇష్టం వచ్చినప్పుడు తిరిగి వస్తాను. ప్లీజ్‌ తలుపులు దబదబా బాదకండి. వెనక నుంచి హారన్ల రొద చేయకండి.