Tag: బడ్జెట్ సమావేశాలు

దొందూ దొందే!

అటు చంద్రుడు; ఇటు చంద్రుడు. ఇద్దరూ ఇద్దరే.

పేరులోనే కాదు, తీరులో కూడా ఇద్దరికీ పోలికలు వున్నాయి:

పూర్వ విద్యార్ధులు: చంద్రబాబే కాదు, కేసీఆర్‌ కూడా ఎన్టీఆర్‌ ట్రస్టులో చదువుకున్న వారే. ఎదురు తిరిగిన వారిని, ఎలా ‘కూర్చో’ బెట్టాలో తెలిసిన వారు. కొందరికి పదవులిచ్చి ‘కుర్చీలు’ వేస్తారు; ఎందరికో పదవులు ఇస్తామని ఆశ చూపి ‘గోడ కుర్చీ’లు వేస్తారు. దాంతో తమకి వ్యతిరేకుల్లో ఎవరూ’లేవరు’.

బడ్జెట్‌ అంకెలు: 3 అరుపులూ, 4 చరుపులూ!!

బడ్జెంట్‌ అంటే అంకెలూ కాదు, పద్దులూ కాదు! మరి? రంకెలూ, వీలయితే గుద్దులూ..! (కంగారు పడకండి. గుద్దుళ్ళూ అంటే, బల్ల గుద్దుళ్ళే లెండి.) బడ్జెట్‌ సమావేశాలను తిలకించవచ్చు. తెలుగు వారు ఒక్కరాష్ట్రంగా వున్నప్పుడూ, విడిపోయాక కూడా ఇదే తంతు. నెలల తేడాతో జరిగిన రెండు రాష్ట్రాల బడ్జెట్‌ సమావేశాల్లోనూ ఇదే ముచ్చట.

అయితే అరుపులూ, బల్లల చరువులూ అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన ఆవేశకావేశాలనుంచి రావు. వీటన్నిటికీ కూడా ముందస్తు వ్యూహం వుంటుంది. ఫలానా సభ్యుడు ఊరికే నోరు జారాడూ అంటారు కానీ, అది నిజం కాదు. ‘ఊరక (నోరు) జారరు మహానుభావులు’. దానికో ప్రయోజనం వుంటుంది.