Tag: సతీష్ చందర్ కవిత్వం

గురి పాఠం!

గొర్రెలు నడుస్తాయనుకుంటాం. నడవబడతాయి. చిలుకలు పలుకుతాయనుకుంటాం. పలుకబడతాయి. గాడిదలు మోస్తాయనుకుంటాం. కానీ మోయబడతాయి. తలకాయలు ఎవరికయినా ఇచ్చేస్తే, మనమూ అంతే..! బతకం. బతకబడతాం. గురిని మరచి ఉరి వైపు పరుగులు పెడతాం.

కృతజ్ఞత!

(సొమ్ములు మాత్రమా కాదు. మనం బతకాల్సిన క్షణాలు కూడా బ్యాంకులో వుంటాయి. ఖర్చు చెయ్యాలి తప్పదు- మనకి మనం ఖర్చు చేసుకుని చాలా సార్లు దు:ఖపడుతుంటాం- నిల్వ తగ్గిపోతుందని. మనకిష్టమయిన వాళ్ళకు ఖర్చు చేసినప్పుడు మాత్రం ఎందుకో…బ్యాంకు బాలెన్స్ పెరిగినట్టుంటుంది. గణితానికి అందనిదే- అనుబంధమంటే…!)

పగటి కల!

(భ్రమ కూడా వరమే. లేనిది వున్నట్లు, ఉన్నది లేనట్లు- ఈ కనికట్టు చాలు ఈ క్షణాన్ని దాటెయ్యటానికి. భ్రమ తేలిక పరుస్తుంది. తింటున్న పాప్ కార్న్ సాక్షిగా చూస్తున్నది సినిమా అని తెలుసు.. అయినా ఏమిటా కన్నీళ్ళు? భ్రమ. నీరు, నేలయినట్లూ, నేల నీరయినట్లూ.. అహో! ఏమిదీ..? మయుడి కల్పన. ఒక భ్రమ. పాంచాలిని పకపకా నవ్వించిన భ్రమ. ఏడిపించాలన్నే భ్రమే.నవ్వించాలన్నా భ్రమే. సుయోధనుణ్ణి కయ్యానికి కాలు దువ్వించాలన్నా భ్రమే. నా ప్రియురాలంటే నాకెందుకు అంత ఇష్టమో తెలుసా..? నాకు ఎప్పటికప్పుడు గుప్పెడు భ్రమనిచ్చి వెళ్ళిపోతుంది..)

బువ్వ దొంగలు

దు:ఖిస్తే ఏడుపే రావాలనీ, ఆనందిస్తే నవ్వే రావాలనీ సూత్రీకరణలు చెయ్యటం అన్నివేళలా నడవదు. సుఖపెట్టే రాత్రులూ, కష్ట పెట్టే పగళ్లూ వున్నట్లే, క్షేమం కోరే శత్రువులూ, అణచివేసే మిత్రులూ వుండే ప్రపంచంలో, ఏ జీవితమూ ఒక మూసలో ఇమడదు. గుండెలు తెరవాలే కానీ, ఒక్కొక్క అనుభవమూ ఒక మహా కావ్యం. అలాంటి ఏ గుండెలు ఏమి మాట్లాడుకున్నా, దోసిలి పట్టి కవిత్వం చేయాలనిపిస్తుంది.

సంక్షిప్త మరణం

క్షణం కూడా కాలమే. ఒక్కొక్క సారి క్షణమే శాశ్వతమైన చిత్తరువయిపోతుంది. చెరిపేద్దామన్నా చెరగదు. అందుకే నుదుటి మీద చెమట బొట్టును విదల్చేసినట్టు క్షణాన్ని విసిరేయకూడదు. అది ఎవరో ఒక అపరిచితురాలు అలా నవ్వుతూ చూసిన క్షణం కావచ్చు. లేదా, అమ్మ తన పని తాను చేసుకుంటూ తలను నిమిరి వెళ్ళిన క్షణం కావచ్చు. లేదా, కేవలం ఆత్మగౌరవం కోసం రాజీనామా పత్రాన్ని యజమాని ముఖం మీద కొట్టిన క్షణం కావచ్చు. బతికిన క్షణమంటే అదేనేమో కూడా..!

తడారిన ఎడారి

రోజూ చూసేవే, కానీ చూడనట్లు చూడాలనిపిస్తుంది.ఎరిగిన దారే.ఎరగనట్లుగా వెతుక్కోవాలనిపిస్తుంది. అప్పుడే అంతా వింత వింతగా, కొత్త, కొత్తగా… వుంటుంది. లేకపోతే, బతికిన బతుకే తిరిగి తిరిగి బతకుతున్నట్లుంటుంది.

వెన్నెల ముద్ద

ఒకరి కన్నీళ్ళు ఒకరు తుడుస్తున్నప్పడు చూశారా? గొప్ప్ర సన్నివేశం కదూ.వాన వెలిశాక హరివిల్లు విరిసినట్లుంటుంది. ఈ హరివిల్లేమో, ఈ కొండ నుంచి ఆ కొండకు విస్తరించినట్లువుంటుందా! ఓదార్పు కూడా అంతే, ఈ గుండెనుంచి ఆ గుండెవరకూ …హరివిల్లు వెళ్ళిపోతుంది. ఆ చిత్రం మనసులో నిలిచిపోతుంది.ఇలాంటిదే ఒక పదచిత్రం ’వెన్నెల ముద్ద’..

మెట్ల వేదాంతం

ఆమె నా ముందే వుంది. కానీ ఏం లాభం? రెప్పవేయదు.పెదవులు విరవదు. మెడ కూడా తిప్పదు. కదిలితేనే కదా, చెలి జాడ? పాకటం, నడవటం, ఎగరటం, దూకటం- అన్నీ కదలికలే. ఎటు నుంచి ఎటన్నది తర్వాత విషయం.చలనమే జీవితం. చలనమే కవిత్వం.

సజల నేత్రి

అటూ, ఇటూ, ఎటో చూస్తూ వుంటూంటాం. కన్ను దేని మీదయినా పడవచ్చు. అది గడ్డిపరక కావచ్చు. గగనమూ కావచ్చు. మనల్ని అందులో చూసుకుంటాం. కాదు.. కాదు.. దానిని మనలా మార్చుకుంటాం. అందుకోసం ఉత్తినే నోటికొచ్చిన నాలుగు మాటల్ని వాడుకుంటాం. పాపం! పిచ్చి మాటలు! వాటికి తెలియకుండా అవి కవిత్వమయి కూర్చుంటాయి.