Tag: సుష్మా స్వరాజ్

‘సూటేంద్ర’ మోడీ!

పేరు : నరేంద్ర మోడీ

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘విదేశాంగ’ ప్రధాన మంత్రి ( ఇంతవరకూ విదేశాంగ శాఖ కు ఒక మంత్రి బాధ్యత వహించేవారు. నేను వచ్చాక, ఇందుకు మంత్రి మాత్రమే సరిపోరనీ, ఆ శాఖను నిర్వహించటానికి ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తి వుండాలనీ నిర్ణయించాను. ఇందుకు విదేశాంగ మంత్రిగా వున్న, సోదరి సుష్మా స్వరాజ్‌ నొచ్చుకోకూడదు.)

వయసు : వయసుకీ ముచ్చటకీ సంబంధంలేదు. ఇరవయ్యవ పడిలో వేసిన దుస్తులే పదేపదే వేసేవాణ్ణి. ఈ అరవయ్యే పడిలో చూడండి గంటకో డ్రెస్‌తో మారుస్తున్నాను. ఈ డ్రెస్‌తో విమానం ఎక్కితే, అడ్రస్‌తో దిగాలని రూలు లేదు కదా?

సుష్మా ‘హిందూ’ రాజ్‌!

పేరు : సుష్మా స్వరాజ్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: తొలి మహిళా ఎన్డీయే ప్రధాని అభ్యర్థిని( వెంటనే కాదు లెండి. సార్వత్రిక ఎన్నికలు జరగాలి. అత్యధిక సీట్లు సాధించిన ఏకైక కూటమిగా ఎన్డీయే నిలవాలి. అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ఇంకా డెభ్యయ్యో, ఎనభయ్యో సీట్లు తక్కువ కావాలి. అప్పుడు ప్రాంతీయ పార్టీలు నరేంద్రమోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని నిరాకరించాలి. అప్పుడు మహిళ ప్రధాని కావాలి-అని దేశమంతటా ఉద్యమం తేవాలి. అప్పుడు మనకి ఛాన్స్‌ వుంది. అయితే నేను ప్రధాని అయితే, గుండు గీయించుకుంటాను అని ఏ కాంగ్రెస్‌ మహిళా నేతా శపథం మాత్రం చెయ్యకూడదు. ఎందుకంటే, 2004 లో సోనియాని ప్రధానిని చేస్తారని అనుకున్నప్పుడు, నేను అలాంటి శపథమే చేశాను లెండి.)

తిన్నదెక్కువ, తినిపించింది తక్కువ!

తిను, తినిపించు, లైఫ్‌ అందించు.

ఇదేదో ‘ఎఫ్‌ ఎమ్‌’ రేడియో నినాదం కాదు. చక్కటి రాజకీయ నినాదం. రాజకీయాల్లో వున్నవారు ‘తినటం’ సర్వ సాధారణం. అయితే తాను మాత్రమే ‘తిని’ ఊరుకునే నేతకు పేరు రాదు. ‘వంద’లో ‘తొంభయి’ తాను తిని, ఇతరుల చేతిలో ‘పద’న్నా పెట్టే వాడు ‘మారాజు’ అయిపోతాడు. ఇదీ అవినీతిలో కూడా జనం తీయగల నీతి. ఇన్నాళ్ళూ ఈ ‘నీతి’కి మార్కెట్టుందనుకున్నారు.

కానీ కళ్ళ ముందు ‘కర్ణాటకం’ కనిపించింది. ‘తిని’ ఊరుకున్న వారే కారు, ‘తిని, తినిపించి’న వారు కూడా 2013 అసెంబ్లీ ఎన్నికలలో మట్టి కరిచారు.