Tag: Andhra people in Hyderabad

‘సెటిలర్‌’ అంటే మాట కాదు, వోటు!

సెటిలర్‌. హఠాత్తుగా ఈ మాట ముద్దొచ్చేస్తోంది. అది కూడా ఎక్కడ? గ్రేటర్‌ హైదరాబాద్‌లో. ఒక్క సారి రెండేళ్ళ వెనక్కి వెళ్ళితే, తెలంగాణ లో ఇదే తిట్టు. కానీ, అట్టు తిరగబడింది. తిట్టు కాస్తా వొట్టు అయింది. సెటిలర్ల మీద వొట్టేసి చెబుతున్నారు కేటీఆర్‌: ‘నేను కూడా సెటిలర్‌ నే’. ఇలా అన్నాక, చిన్న గ్యాప్‌ ఇచ్చి. ‘తెలంగాణ పల్లె నుంచి హైదరాబాద్‌ వచ్చాను కదా… సెటిలర్‌ని కానా?’ అన్నారు. మరీ రెండేళ్ళ క్రితమో…! నేరుగా ఆయన అని వుండక పోవచ్చు కానీ, ఆయన పార్టీ నేతలు ఏమన్నారు? సెటిలర్లు మూటా, ముల్లె సర్దుకోవలిసందే.. అని. అంతెందుకు కేసీఆర్‌ మాత్రం అనలేదూ! సీమాంధ్ర ఉద్యోగుల్లో కొందరికి ఆప్షన్ల ఇచ్చే ఆలోచన చేసేది వుందా? అన్న ప్రశ్న వచ్చినప్పుడు ‘ఆప్షన్లూ లేవు, గీప్షన్లూ లేవు’ అని అనేయ్‌ లేదూ! (అఫ్‌ కోర్సు !కొన్నాళ్ళ తర్వాత ఆంధ్రుల కాలికి ముల్లు గుచ్చుకున్నా, పంటితో తీస్తానని కూడా అన్నారు. అది వేరే విషయం.) ఇప్పుడు ‘సెటిలర్‌’ అనేది కేవలం మాట కాదు, వోటు. ఈ వోటు ఎటు వైపు వెళ్తుంది?