Tag: Chandra Babu

‘తూచ్‌..! నేనొప్పుకోను!!’

‘నేను ప్రేమించేది నిన్ను…’ అనేసి, తర్వాత ‘కామా’ పెట్టి, రెండు నిమిషాలు ఆగి, ఊపిరి పీల్చుకుని ‘కాదు’ అని నచ్చిన అమ్మాయి ప్రకటిస్తే ఏమవుతుంది? ఒక్క ‘కామా’ చాలు పేషెంటును ‘కోమా’లోకి పంపించేయటానికి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఆమె ప్రియుడు ఆమె కోసం ప్రాణం విడవటానికి ఒక్క నిమిషం చాలు. కానీ, ఆమే… అనవసరంగా మాట తిప్పుకోవటానికి రెండు నిమిషాలు తీసుకుంది.

రాష్ట్రవిభజన విషయంలో పార్టీలు దాదాపు అలాగే మాట తిప్పాయి.

‘విభజనకు మేము అనుకూలం…’ అనేసి, తర్వాత ‘కామా’ పెట్టి, రెండు వారాలు ఆగి, ఊపిరి సలపక, ‘కాదు’ అని ప్రకటించాలని చూస్తున్నాయి.

మ్యాచ్‌ ఫిక్సింగ్‌!-: – మనీ మిక్సింగ్‌!!

వియ్యమన్నాక– వావీ, వరసల ప్రస్తావన వస్తుంది. వరసయిన వారితోనే ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ వుండాలి. వరసలు తప్పితేనే అల్లరవుతారు.

రాజకీయ వియ్యాల్లోనూ ఇదే నియమం. వరస తప్పకూడదు. ఉదాహరణకు ‘కాషాయానికీ’, ‘ఎరుపున’కూ వియ్యం కుదరదు. అనగా ‘కమలాని’కీ, ‘కొడవలి’కీ మధ్య ‘ఎఫైర్‌’ నడవదన్నమాట. (కమలమొచ్చి, కొడవలి మీద పడ్డా, కొడవలి వచ్చి కమలం మీద పడ్డా- తెగిపడేది కమలమే!)