Category: ‘భయో’డేటా

‘మసి’ మోహనుడు

‘పేరు : మన్‌మోహన్‌ సింగ్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: మాజీ నెహ్రూ-గాంధీ కుటుంబేతర విధేయ ప్రధాని

ముద్దు పేర్లు :’మసి’ మోహనుడు( ‘కోల్‌’గేట్‌ తోముతా నల్లగా ) ‘మర’మోహనుడు( ‘రోబో’ సినిమాలో ‘చిట్టి’లాంటి వాడిని. కమాండ్స్‌ తీసుకుంటాను.అన్ని కమాండ్స్‌ ఇవ్వగలిగింది ‘హై కమాండ్‌)

‘ఫెలిన్‌’ కుమార్‌ రెడ్డి!

పేరు : కిరణ్‌ కుమార్‌ రెడ్డి

దరఖాస్తు చేయు ఉద్యోగం: రెండు ఉద్యోగాలు. ఒకటి: ‘లాస్ట్‌ ఎంపరర్‌'(సమైక్యాంధ్ర ప్రదేశ్‌ కు చిట్ట చివరి ముఖ్యమంత్రిగా నేనే వుండాలి.) రెండు: ఫస్ట్‌ ఎంపరర్‌( సీమాంధ్రకు తొట్టతొలి ముఖ్యమంత్రి పోస్టుకు కూడా దరఖాస్తు చేస్తున్నాను.)

ముద్దు పేర్లు :కి.కు( ఇది నా పొట్టి పేరు. పూర్వం కాంగ్రెస్‌లో ‘క’ గుణింతం వుండేది. ‘కాకా’, ‘కికు’ ‘కేకే’లము కీలకమైన నేతలం. ‘కాకా’ (జి.వెంకటస్వామి) సంగతి ఎలాగున్నా, ఆయన కుటుంబసభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ‘కేకే’ కూడా టీఆర్‌ఎస్‌లోకే వెళ్ళిపోయారు.

‘అత్యాచారం’ బాపు!

పేరు : ఆసారం బాపు (అసలు పేరు అసుమల్‌ సిరుమలానీ)

ముద్దు పేర్లు : ‘అత్యాచారం’ బాపు (ఇది ఆరోపణే. అయినా అలా పిలుస్తున్నారు.), ‘అనాచారం’ బాపు(ఆచారాలను రూపు మాపుతున్నా, నా మీద ఇలాంటి అభాండాలు వేస్తున్నారు.)

విద్యార్హతలు : ధ్యానం( భూమి మీద. అందుకే ఆశ్రమాలకు భూమిని సేకరించగలిగాను.దేశంలోనూ, దేశం వెలుపలా దాదాపు 400 వరకూ ఆశ్రమాలున్నాయి.) పరధ్యానం(అందుకే భక్తురాళ్ళ మీద చేతులు వేసేటప్పుడు మైనరో, మేజరో చూసుకోను.)

‘అగ్గీ’ రాజా!

అగ్గీ పేరు : దిగ్విజయ్‌ సింగ్‌

ముద్దు పేర్లు : ‘అగ్గీ’రాజా( విభజన ప్రకటన కారణంగా రాష్ట్రంలో రెండు ప్రాంతాల మధ్య రగులుతున్న అగ్గిని చూస్తున్నారు కదా!) ‘విడాకుల’కింగ్‌( నేను మా పార్టీ తరపున ఏ రాష్ట్రానికి ఇన్‌ చార్జ్‌గా వుంటే, ఆ రాష్ట్ర విభజనకు తోడ్పడుతూ వుంటాను.)

‘క్వీని’యా!

పేరు : సోనియా గాంధీ

ముద్దు పేర్లు : ‘సోనియ’ంత, ‘క్వీని’యా,

విద్యార్హతలు : ఇటలీలో చదివిందేమయినా, ఇండియాలోనే రాజనీతి చదివాను. ‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంలో పడితే చాలు, రాజనీతి దానంతటదే వస్తుంది. రాకపోయినా వచ్చిందని జనం అనుకుంటారు. అయితే నాతో పాటు మేనకా గాంధీ కూడా ఈ కుటుంబంలోనే పడ్డారు. కానీ ఆమెకు రాజనీతి తెలుసని జనం భావించలేదు. జనం మెచ్చే ముందు అత్తిల్లు మెచ్చాలి కదా! ఇందిరమ్మ నన్ను మెచ్చారు. వారసత్వం దానంతటదే వచ్చింది.

వి.’కుప్పిగంతు’ల్రావు!

పేరు : వి.హనుమంత రావు

ముద్దు పేరు : వీహెచ్‌, హన్మన్న, వి.’కుప్పిగంతు ‘ ల్రావు (శత్రువు ఎదురయితే వయసను సైతం మరచి ‘కుప్పించి’ గెంత గలను.)

విద్యార్హతలు : సంస్కృతంలో ప్రావీణ్యం( డెహరాడూన్‌ ఎయిర్‌ పోర్ట్‌ వద్ద నేనూ, తెలుగుదేశం నేత రమేష్‌ రాథోడ్‌ మాట్లాడుకున్నది సంస్కృతంలోనే. గమనించలేదా..?) దీనిని ‘బూతు’ క్యాప్చరింగ్‌ అని కూడా అంటారు. (బూతుల్ని స్వాధీనంలోకి తీసుకోవచ్చన్నమాట.) పూర్వం పోలింగ్‌ బూతుల్లోకి చొరబడటాన్ని ఇలా పిలిచేవారు.

‘లౌకిక్‌’ కుమార్‌!

పేరు : నితిష్‌ కుమార్‌

ముద్దు పేరు : ‘లౌకిక్‌’ కుమార్‌(పదిహేడేళ్ళ సుదీర్ఘనిద్ర తర్వాత మేల్కొని, నేనున్నది మతవాద పార్టీ అని గ్రహించి బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాను. మార్క్స్‌ చెప్పింది నిజమే సుమండీ.. ‘మతం మత్తు మందే.’), ‘అద్వానీష్‌’ కుమార్‌(గుజరాత్‌ అల్లర్లు దారుణమా? బాబ్రీ విధ్వంసం దారుణమా? అని ఎవరయినా నన్నడిగితే ‘రెండూ దారుణమే’ అంటాను. కానీ ‘గుజరాత్‌ అల్లర్లు ‘కాస్త ఎక్కువ దారుణం’ అని అంటాను. అందుకే ‘తక్కువ దారుణానికి’ కారకుడయిన అద్వానీ వైపే వుంటాను.)

‘రథ్వా’నీ – ‘యుధ్ధ్వా’నీ- ‘వృధ్ధ్వా’నీ!!

పేరు : లాల్‌ కృష్ణ అద్వానీ

ముద్దు పేరు : ”రథ్వా’నీ(మందిర నిర్మాణం కోసం రథ యాత్ర చేసినప్పుడు),

‘యుధ్వా’నీ( కార్గిల్‌ వద్ద పాకిస్థాన్‌తో యుధ్ధం చేసినప్పుడు) ‘వృధ్ధ్వా’నీ( ఎనభయ్యదేళ్ళ

వయస్సులో నేను ప్రధాని పదవి అర్హుణ్ణి కానని, నరేంద్ర మోడీని ముందుకు తెస్తున్నప్పుడు).

అయినా కానీ ఎప్పటికయినా నేను ‘ప్రధ్వా’నీనే( ప్రధాని కావాలన్న కోరికను నానుంచి ఎవరూ

దూరం చేయలేరు.)

డియల్‌.. డియల్‌… డియ్యాలో..!!

పేరు : డి.యల్‌. రవీంద్రారెడ్డి

ముద్దు పేరు : ‘డియ్యాలో’

విద్యార్హతలు : ‘అసమ్మతి’లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌

హోదాలు : నాకే హోదా కొత్త కాదు. శాసన సభ్యత్వమూ కొత్త కాదు.(ఆరు సార్లు మైదుకూరు స్థానంనుంచి ఎన్నికయ్యాను.) మంత్రి పదవి అస్సలు కొత్త కాదు. పలువురు మఖ్యమంత్రుల కేబినెట్ల వున్నాను. ఎటొచ్చీ ఇప్పుడు వచ్చిన హోదా యే కొత్త. అదే ‘తొలగించబడ్డ మంత్రి

‘ఆపధ్ధర్మాన’ ప్రసాద రావు

పేరు : ధర్మాన ప్రసాద రావు

ముద్దు పేరు : ‘ఆపద్ధర్మాన’ ప్రసాదరావు.( కేబినెట్‌ నిర్ణయాలనే ‘ఆపధ్ధర్మంగా’ అమలు జరిపాను కానీ, నా స్వంత నిర్ణయాలు కాదు. అయినా ‘వాన్‌ పిక్‌’లో నన్ను బుక్‌ చేశారు.)

విద్యార్హతలు : ఎన్ని విద్యలుండి ఏం లాభం? తప్పించుకునే విద్య ఒక్కటీ లేకపోతే, మిగిలిన విద్యలన్నీ వృధా.

సి ఫర్‌ ‘కాపు’ చంద్రయ్య!

పేరు : సి(చెన్నంశెట్టి). రామచంద్రయ్య

ముద్దు పేరు : సి ఫర్‌ ‘కాపు’ చంద్రయ్య.(కాపులను బీసీలో చేర్చాలని కోరుతున్నాను.)

విద్యార్హతలు : లెక్కల్లో మనిషిని.(ఒకప్పుడు చార్టర్డ్‌ అకౌంటెంట్‌ను లెండి.) ఇప్పుడు కూడా లెక్కలు తప్పటం లేదు. కాపులు+బీసీలు= కాంగ్రెస్‌ అని అంటున్నాను. (సీమాంధ్రలో రెడ్లూ, దళితులూ వైయస్సార్‌ కాంగ్రెస్‌లోకి జారుకుంటున్నారు కదా! అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి చిరునామా మిగలాలంటే నా ‘లెక్క’ను పాటించాల్సిందే. (కాపుల్ని కూడా బీసీల్లో కలిపేస్తే మొత్తం బీసీలయిపోతారు.)

రాజకీయ దురంధరేశ్వరి

పేరు : దగ్గుబాటి పురంధేశ్వరి

ముద్దు పేరు : రాజకీయ దురంధరేశ్వరి

విద్యార్హతలు : వారసత్వ రాజకీయాలలో పి.హెచ్‌.డి. (ఈ విషయంలో చంద్రబాబు కూడా నా ముందు దిగదుడుపే. బాబు ‘అత్తింటి'(పోనీ, ‘మామింటి’) వారసత్వం కోసం తాప త్రయ పడితే, నేను ‘పుట్టింటి ‘వారసత్వాన్ని నిలబెట్టుకుంటాను.

ఎదురు ‘దాడి’

పేరు : దాడి వీరభద్రరావు

ముద్దు పేరు : ‘గాడి'( బాబును నమ్మి ఒక గాడిలో ‘సైకిలు’తొక్కాను. ఏముంటుంది. ఎదుగూ లేదు. బొదుగూ లేదు.) ‘దాడి'( బాబును నమ్ముకుని కాంగ్రెస్‌నూ, వైయస్సార్‌ కాంగ్రెస్‌నూ అనరాని మాటలన్నాను. ఇప్పుడు వాటిల్లో ఏదో ఒకటి ద్కియ్యేట్టుంది.) ‘ఎదురు దాడి’ (ఇన్నాళ్ళకు తెలివి వచ్చి బాబు మీదకు దాడికి సిధ్ధపడ్డాను. అది కూడా శాసన మండలి పదవీ కాలాన్ని చిట్ట చివరి రోజు కూడా అనుభవించాక.)

‘డ్రామ్‌’ నారాయణ రెడ్డి

పేరు : ఆనం రామ్‌నారాయణ రెెడ్డి.

ముద్దు పేర్లు : ‘డ్రామ్‌’ నారాయణ రెడ్డి (ఒకప్పుడు జగన్‌కు దగ్గర, ఇప్పుడు దూరం. దీనిని డ్రామా అంటారు తప్పు కాదూ! ‘కన్యాశుల్కం’ లో గిరీశం ఏమన్నాడూ.. ‘ఒపీనియన్స్‌ చేంజ్‌ చేస్తే కానీ పాలిటిష్యన్‌ కాలేడు’ అన్నాడు) . రామ్‌ ‘నోరా’యణ రెడ్డి.(అందరికీ నోరుంది. కానీ పనిచెప్పరు. నేను చెప్పాను. జగన్‌ ను ఉరితీసినా తప్పులేదన్నాను. అయితే ఆయన పార్టీ వారికి కూడా నోర్లుంటాయని మరచిపోయాను. వారు నన్ను ఉరితీయాలంటున్నారు. ఊరికే అంటాం కానీ… అన్నీ జరిగిపోతాయా…ఏమిటి?)

‘ఏ-ఫోర్‌’ సబితమ్మ!

పేరు : సబితా ఇంద్రారెడ్డి

ముద్దు పేర్లు : చేవెళ్ళ చెల్లెమ్మ, ‘ఏఫోర’్‌ సబితమ్మ.

విద్యార్హతలు : ఒకప్పడు మంత్రి భార్యను. తర్వాత ఏకంగా ‘రాజు’కు చెల్లెల్నయ్యాను. రెంటికీ పెద్ద అర్హతలు అవసరం లేదు. చదివింది సైన్సయినా సెంటిమెంటు కు ఎక్కువగా ప్రాధాన్యమిస్తాను.’రాజన్న’ ఏ పని తలపెట్టినా నన్నే ఎదురు రమ్మనే వాడు.(చేవెళ్ళ చెల్లెమ్మ ఎదురూ రావమ్మా- అని). అలాగని ఆయన చెప్పిన ఏపనికీ ఎదురు చెప్పలేదని కాదు.

‘నరేంద్ర’ నాథ్‌ సింగ్‌!

పేరు : రాజ్‌ నాథ్‌ సింగ్‌

ముద్దు పేర్లు : ‘నరేంద్ర’ నాథ్‌ సింగ్‌( పేరు కు పార్టీలో నా బృందాన్ని ‘టీమ్‌ రాజ్‌ నాథ్‌’ అంటారు. కానీ ఈ మధ్య ఓ ప్రముఖ దినపత్రికలో ఓ కార్టూను చూశాను. పార్లమెంటరీ బోర్డులో వున్న సభ్యులందరికీ నరేంద్ర మోడీ ముఖాలే( మాస్క్‌లే) వున్నాయి. నేను కూడా మినహాయింపు కాదు.

విద్యార్హతలు : చదివింది ‘భౌతికం’ (భౌతిక శాస్త్రం) అలోచన ‘వైదికం’. అందుకే నేను ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయనప్పడు పాఠ్యపుస్తకాల్లో మామూలు గణితం తీసి పారేసి, వేద గణితం పెట్టాను. లేక పోతే ఏమిటి చెప్పండి! ఎవరు బడితే వారు ‘విజన్‌ 2020’ అంటారు. నా విజన్‌ అది కాదు. క్రీ.పూ 1010. అప్పటికి సమాజాన్ని నడిపించాలంటే మనకి వేదాలే

‘కుటుంబ’ నిధి!

పేరు : కరుణా నిధి

ముద్దు పేర్లు : కుటుంబ నిధి.( నాకుటుంబానికి నిధి లాంటి వాడిని).రణ నిధి. విరమణ నిధి. రుణ నిధి. దారుణ నిధి

విద్యార్హతలు : కళలో పుట్టాను. రాజకీయాల్లో పెరిగాను.

హోదాలు : అప్పుడప్పుడూ జయలలిత ఇచ్చే ‘కమర్షియల్‌ బ్రేకు’లు మినహా ఎప్పుడూ తమిళనాడు ముఖ్యమంత్రినే. ఇప్పుడు ‘కమర్షియల్‌ బ్రేకు’ నడుస్తోంది కాబట్టి నన్ను ‘మాజీ’ అంటున్నారు. అంతే.

పిట్ట ‘కథాం’బరం

పేరు : చిదంబరం

ముద్దు పేర్లు : ‘పదా’ంబరం( లెక్క ప్రకారం బడ్జెట్‌ లెక్కల్లో వుండాలి. కానీ ఈ సారి సంక్షేమం వరకూ మాటలు జాస్తి, అంకెలు నాస్తి) మహిళలనీ, యువతనీ, పేదల్నీ పొగడ్తల్లో ఆకాశంలోకి ఎత్తాను. కేటాయింపుల్లో కొంచెమే ఇవ్వగలనని నాకు ముందే తెలుసు.’కథ’ంబరం( బడ్జెట్‌ నిండా పిట్ట కథలే!)

పురుషాధిక్యానంద బాబా(పు.బా)

పేరు : పురుషాధిక్యానంద బాబా(పుబా. తిరగేస్తే ‘బాపు’ కావచ్చు. నాకనవసరం కానీ నేను పు.బానే)

దరఖాస్తు చేయు ఉద్యోగం: రక్తిదాత, ముక్తిదాత, విరక్తి దాత.

ముద్దు పేర్లు :ఏ పేరుతో పిలిచినా పలుకుతాను. మీరు ‘పోబే’ అన్నా నాకు ‘బాబా-అన్నట్లే వినపడుతుంది. ఒక్కో చోట ఒక్కో రూపంలో అవతరిస్తుంటాను. హంసతూలిక తూలికా తల్పంమీద వున్న అనునిత్యానందుణ్నీ నేనే. మనసారా మధువును గ్రోలినప్పుడు ‘పెగ్గు’బాబానీ నేనే, పట్టపగలు నా ఆశీస్సులకోసం వచ్చిన యువభక్తురాళ్ళకు వెచ్చని కౌగిలి నిచ్చే ‘హగ్గు’ బాబానీ నేనే

‘ఉమ్మడి’ గాదె!

పేరు : గాదె వెంకటరెడ్డి

దరఖాస్తు చేయు ఉద్యోగం: ఆంధ్ర దూత.( ఇదేదో పత్రిక పేరులాగా వుంది కదా! కానీ కాదు. ఎప్పటికీ తేలని తెలంగాణ సమస్య వచ్చినప్పుడెల్లా, అఖిల పక్ష సమావేశాలూ స్వపక్ష సమావేశాలూ ఎలాగూ తప్పవు. కాబట్టి సీమాంధ్ర ప్రాంతం నుంచి నన్ను శాశ్వత దూతగా కాంగ్రెస్‌ పార్టీ పెట్టుకోవటం నాకూ మంచిది. పార్టీకీ మంచిది. పీసీసీనేత, ముఖ్యమంత్రి వంటి పదవులు అశాశ్వతాలు.)