Tag: నవీన్ పట్నాయక్

సుష్మా ‘హిందూ’ రాజ్‌!

పేరు : సుష్మా స్వరాజ్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: తొలి మహిళా ఎన్డీయే ప్రధాని అభ్యర్థిని( వెంటనే కాదు లెండి. సార్వత్రిక ఎన్నికలు జరగాలి. అత్యధిక సీట్లు సాధించిన ఏకైక కూటమిగా ఎన్డీయే నిలవాలి. అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ఇంకా డెభ్యయ్యో, ఎనభయ్యో సీట్లు తక్కువ కావాలి. అప్పుడు ప్రాంతీయ పార్టీలు నరేంద్రమోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని నిరాకరించాలి. అప్పుడు మహిళ ప్రధాని కావాలి-అని దేశమంతటా ఉద్యమం తేవాలి. అప్పుడు మనకి ఛాన్స్‌ వుంది. అయితే నేను ప్రధాని అయితే, గుండు గీయించుకుంటాను అని ఏ కాంగ్రెస్‌ మహిళా నేతా శపథం మాత్రం చెయ్యకూడదు. ఎందుకంటే, 2004 లో సోనియాని ప్రధానిని చేస్తారని అనుకున్నప్పుడు, నేను అలాంటి శపథమే చేశాను లెండి.)

కేంద్రంలో ‘పంబలకిడి జంబ’

రాజకీయంగా దేశం ఎలా వుంది? ఏదో గాలివాన వచ్చి కొట్టేసినట్టుంది. మహా వృక్షాలు కూలిపోయాయి. చిన్న చిన్న మొక్కలు తలలెత్తి నిలుచున్నాయి. జాతీయ పక్షాలు జాలిగొలిపే పార్టీలుగా కూలబడిపోతుంటే, ప్రాంతీయ పక్షాలు పెత్తనం చేసే పార్టీలుగా స్థిరపడిపోతున్నాయి.

ఇదే పరిస్థితి కొనసాగితే, 2014లో పరిస్థితి ‘జంబలకిడి పంబ’ కాస్తా, ‘పంబలకిడి జంబ’ అయ్యే లా వుంది. (పురుషులపై స్త్రీలు ఆధిపత్యం చెలాయించటం ‘జంబలకిడి పంబ’ అయితే, పెద్దలపై పిల్లలు ఆధిపత్యం చేయటం ‘పంబలకిడి జంబ’ అని ఒక సినిమాలో సూత్రీకరిస్తారు.)