Tag: anti-corruption movement

మధ్యతరగతి ‘మెట్టు’ వేదాంతం!

అదేమిటో కానీ, గట్టెక్కిన వాడు నీళ్ళలో వున్న వాడికీ; పై మెట్టు మీద వున్న వాడు, కింద మెట్టు మీద వున్న వాడికీ- పాఠం చెప్పేయాలని తెగ ఉత్సాహపడిపోతాడు. సంపన్నుడు మధ్య తరగతి వాడికీ; మధ్య తరగతి వాడు, పేదవాడికీ ఇలా నీతిని బోధించాలని తెగ ఉబలాట పడిపోతారు. ఈ మధ్య కాలంలో మధ్యతరగతి వారి ఉత్సాహం కట్టలు తెంచేసుకుంటోంది. ఏ ఐటీ చదువో వెలగబెట్టి, అంతకు తగ్గ కార్పోరేటు కొలువు పట్టేస్తే చాలు- కింద వారికి చెప్పడానికి నీతి కథలు తన్నుకుంటూ వచ్చేస్తాయి. అలాంటి నీతి పాఠాల్లో, తొలి నీతి పాఠం- ‘అవినీతి పాఠం’.

చదవేస్తే ఉన్న ‘నీతి’ పోతుందా?

ఒకడేమో కడుపు కోసేస్తానంటాడు; ఇంకొకడేమో గోతులు తీసేస్తానంటాడు; మరొకడేమో మక్కెలు విరగ్గొడతానంటాడు; అదీఇదీ కాక టోపీపెట్టేస్తానంటాడు ఓ తలకాయలేని వాడు. ఇవన్నీ పిచ్చి ప్రగల్బాలు కావు. కలలు. పిల్లకాయలు కనే కలలు.కలలు కనండీ, కలలు కనండీ… అనీ కలామ్‌ గారు పిలుపు నిచ్చారు కదా- అని, ఇలా మొదలు పెట్టేశారు. పనీ పాట లేక పక్క ఫ్లాట్లలో పిల్లల్ని పోగేసి, కలామ్‌ గారడిగినట్లే, మీరేం కావాలనుకుంటున్నార్రా అని అడిగాను. ఒక్క వెధవ తిన్నగా చెప్పలేదు.