Tag: Vijayamma

తుంటరి ‘చేతి’కి ఒంటరి ‘గులాబి’

ఒకప్పుడు ‘సమైకాంధ్ర’ నినాదమిచ్చిన సీమాంధ్ర నేతలెవరూ, తెలంగాణ గడ్డ మీద కేసీఆర్‌కు ఎదురు నిలువ లేదు. ఆ మాట కొస్తే ఉద్యమం ఉధ్ధృతం అయ్యాక కాలు కూడా మోప లేదు. అలాంటిది- ఒకప్పుడు ఇదే కారణం మీద మహబూబా బాద్‌ నుంచి వెనుతిరిగిన వై.యస్‌ జగన్‌, తన తల్లి(విజయమ్మ)నీ, చెల్లి(షర్మిల)నీ తెలంగాణ ఉప ఎన్నికకు ప్రచారానికి పంపిస్తే, కేసీఆర్‌ చోద్యం చూశారు. అంతే కాదు, పరకాలలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా సురేఖ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ‘నువ్వా-నేనా’ అన్నంతటి పోటీ ఇచ్చి ముచ్చెమట్లు పోయించారు. స్వల్ప ఆధిక్యంతో టీఆర్‌ఎస్‌ పరువు నిలుపు కున్నది కానీ, పట్టు కోల్పోయింది.

వన్-టూ-టెన్ జగనే..జగను

నెంబర్ వన్ జగన్‌, టూ జగన్‌, త్రీజగన్‌… టెన్‌కూడా జగనే. వైయస్సార్‌ కాంగ్రెస్‌లో నాయకత్వ పరిస్థితి అది. ఒకప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌లో వైయస్‌ రాజశేఖర రెడ్డి కూడా అలాగే వున్నారు. వోటర్లను సమ్మోహితుల్ని చెయ్యటానికి పార్టీలో అగ్రతార అలాగే కనిపించాలి. ఇదే ఆకర్షణ. కానీ, పార్టీనిర్మాణానికి ఇది అడ్డంకి అవుతుంది. ప్రతీ పనికీ కార్యకర్తలు అగ్రనేత ఆదేశాల కోసం ఎదురు చూస్తుంటారు. ప్రతి చిన్న విషయంలోనూ అగ్రనేత తల దూర్చాల్సి వుంటుంది. ఈ పనే ఇప్పుడు జగన్‌ చేస్తున్నారు. జగన్‌ ఆస్తుల కేసులో సిబిఐ జగన్‌ను అరెస్టు చేసి, జైలు పాలు చేస్తే, ఆయన తర్వాత ఆ పాత్రని ఏ నేతలు పోషిస్తారు? రాజకీయాల్లో సంక్షోభం కూడా అవకాశమే. దీనిని ఉపయోగించుకోవటానికి జగన్‌ తర్వాత ఎవరు సిద్ధంగా వున్నారు?