‘కాలా’కు కౌంటర్… ‘అల(కుల) వైకుంఠపురం లో’!?

త్రివిక్రమ్ చూపే వేరు

రాను రాను రావణుడికి గిరాకీ పెరుగుతోంది. రాజకీయాల్లోనే కాదు, సినిమాల్లో కూడా. ఇలా ఈ పాత్రను చూడగా చూడగా, ప్రేక్షకులకు ఒక సందేహం వచ్చి తీరుతుంది. ఇంతకీ రావణుడు నాయకుడా? ప్రతినాయకుడా? (హీరోనా? విలనా?) రామాయణం విన్న వారికీ, చదివిన వారికీ అతడు ‘సీతమ్మ వారిని ఎత్తుకు పోయిన పది తలల రాక్షసుడు’. అయితే ఇంకాస్త లోతుగా చదివిన వారు, రావణుడిలోని సుగుణాలను కూడా చెబుతుంటారు. అందులో ఒకటి సమ్మతిని గౌరవించటం: ‘స్త్రీ సమ్మతి పొందకుండా, ఆమె శరీరాన్ని తాకని నిష్టాగరిష్టుడు. అందుకే సీతమ్మ వారి మీద చెయ్యివెయ్యలేదు.’ ఇలాంటి కారణాలకే విలన్‌ హీరో అయిపోతాడా? యావద్భారతాన, కొన్ని తరాలుగా ప్రజల మనసుల్లో ముద్ర వేసినవి రామాయణ, భారతగాధలు. అయితే చారిత్రక క్రమంలో వీటిని ఎవరు ఎవరికి అనువుగా ఎలా మలచుకున్నారన్న అంశం మీద పలు గ్రంథాలు వెలువడ్డాయి.
సినిమాల వరకూ వచ్చేసరికి, పురాణాల్లో విలన్‌ గా వున్న పాత్రను హీరోగా ఎలా చెయ్యగలుగుతున్నారు? ఎందుకు చెయ్యగలుగుతున్నారు? చేసి ఎలా మెప్పించగలుగుతున్నారు? భారతంలో దుర్యోధనుడు ప్రధాన ప్రతినాయకుడు (మెయిన్‌ విలన్‌).

కురువంశము.. ఏనాడో కులహీనమైనది..!

కానీ ఎన్టీఆర్‌ తీసిన ‘దాన వీర శూర కర్ణ’ సినిమాలో నాయకుడు (హీరో). అప్పట్లో ఈ సినిమాను ఎగబడి చూశారు. ఇటీవల(2018లో) పా రంజిత్‌ తీసిన ‘కాలా’ సినిమాలో (సాంఘిక చిత్రమే అయినప్పటికీ) రావణుడిని ప్రతిబింబించే ‘కాలా’ యే హీరో. సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం. ఇది కూడా తమిళ, తెలుగు భాషల్లో విజయం సాధించింది. యాధృచ్చికమని కొట్టి పారవెయ్యవచ్చు కానీ, ఈ రెండు చిత్రాల్లో కులవ్యవస్థ మీద వ్యతిరేకత ప్రధానంగా వుంటుంది. ఎన్టీఆర్‌ కు బాగా పేరు తెచ్చిన సుధీర్ఘ సంభాషణ .. ‘భరద్వాజునిదే కులము.. ’అని మొదలు పెట్టి కురు సభలో వున్న విదురుడు తదితర పెద్దల కులసంభవాలను ప్రస్తావిస్తూ సాగుతోంది. అంతే కాదు, కురు వంశ మూలపురుషుడయిన వ్యాసుడి పుట్టుక కూడా ‘పంచమ జాతి’ నుంచి పుట్టినదే అని ఎత్తి పొడుస్తాడు. ‘కాగా కురవంశము ఏనాడో కులహీనమయినది’ అని ముగిస్తాడు. ఇంతటి వివరణ సుయోధనుడు ఎందుకు ఇస్తాడంటే, సూత (శూద్ర) పుత్రుడయిన కారణాన కర్ణుడిని క్షాత్ర పరీక్షకు అనుమతించమని చెప్పినందుకు. ఈ సంభాషణలను రచించింది కొండవీటి వెంకట కవి.

కాలా సహచరుడిగా సముతరకని

ముంబయి ధరావి మురికి వాడలోని దళితుల జీవితాల మీద సృష్టించిన ‘కాలా’లో, నలుపునకు చిహ్నంగా రావణుడు (రజనీ కాంత్‌ ) వుంటాడు. పై వర్ణానికి సంకేతంగా, హరిదేవ్‌ అభయంకర్‌ ( నానా పటేకర్‌) వుంటాడు. స్వఛ్చతకూ, (‘స్వఛ్చ భారతానికీ’) తెలుపునకూ చిహ్నంగా వుంటాడు. పరమ రామభక్తుడు. అక్కడున్న పేద దళితుల ఇళ్ళు ఖాళీ చేయించటానికి హత్యాకాండ సాగిస్తాడు. ఈ హత్యలు కొనసాగిస్తుంటే, మనుమరాలిని ఒళ్లో పెట్టుకుని ఇంట్లో రామ కథను చెప్పించుకుంటాడు. కానీ, అంతిమంగా ‘కాలా’ చనిపోయాడనుకుని పోలీసులు సైతం నమ్మేసిన వేళ, రావణుడి నాయకత్వం లో ప్రజలు నల్లని దుమ్ముతో లేవటం పతాక సన్నివేశం. ఈ సన్నివేశానికి అనుగుణంగా ‘ఒంటి తల రావణా.. పది తలల్‌ అవ్వరా..’ అనే పాట వస్తుంది. రోహన్‌ జావ్‌ు రాక్‌ ఆలపిస్తాడు. (రచనలో కూడా ఆయన ప్రమేయం వుంది. ఆంధ్రీకరణ వనమాలి చేశారు.)

’ఒంటితల రావణుడి‘గా అదే నటుడు

ఈ ‘ఒంటి తల రావణుడు’ పాట మళ్ళీ ఏడాది తిరిగేసరికి (2020 ప్రారంభంలో) త్రివిక్రవ్‌ు శ్రీనివాస్‌ విరచించి, దర్శకత్వం వహించిన ‘అల.. వైకుంఠ పురంలో’ వచ్చింది. ‘సిత్తరాల సిరపడు’ మకుటంతో సాగుతుంది. ‘అమ్మోరి జాతరలో.. ఒంటి తల రావణుడు ..గుంటలెంట పడితేనూ.. గుద్ది గుండ చేసినాడూ.. ’ అంటూ జానపద శౖలిలో సూరన్న కంఠంతో సాగుతుంది. ( ఈ పాట రాసింది విజయకుమార్‌ భల్లా). ఇది కూడా పతాక సన్నివేశంలోనే. ఇది కూడా విలన్‌ అప్పల్నాయుణ్ణి హీరో (అల్లు అర్జున్‌) ఉతికి ఆరేసిన తర్వాత .. ‘ఆ దృశ్యం ఎలా వుందంటేనూ.. ’ అని పురాణకవి వర్ణించినట్లుగా చూపెడుతుంటే, వెనుక ఈ పాట వస్తుంటుంది. ఆ విలన్‌ ఎవరో కాదు సముద్రం మీద చేపలు వేటాడి జీవించిన తొలి తరం మత్స్య కారుడు. హఠాత్తుగా డబ్బొచ్చేసి సంపన్నుడయినా… పరమ నాటుగా కనిపిస్తుంటాడు.. ! పుట్టుక తో వచ్చిన చేష్టలు ఎక్కడకు పోతాయి- అన్నది దర్శక రచయిత త్రివిక్రముని భావం కావచ్చు.
మరీ అంత సత్వర నిర్థారణలకు ఎలా వచ్చేస్తారు..?! అవును కదా! ఈ ప్రశ్న రావాల్సిందే! ఎందుకంటే, ‘పుట్టుకతోనే బుధ్ధులు ’ వుంటాయి- అని భావించే ‘కుల ధర్మాన్నే’ పరమ నాజూకయిన కథలా రాసి దానికి ‘అల.. వైకుంఠ పురంలో’ అని పేరు పెట్టి మరీ చూపించారు. ప్లాటు పాతదే. అప్పుడే పుట్టిన పిల్లల్ని ఊయలలు మార్చేస్తారే.. అదే ఇతివృత్తం. దిక్కుమాలిన తరగతి (దిగువ మధ్యతరగతి) లో పుట్టిన వాడు, తన కళ్ళముందే ఎదిగిపోయిన ‘వైకుఠపుర’ వాసి మీద వున్న అక్కసుతో ఈ పనిచేస్తాడు. ఎక్కడా కులం చెప్పడు. కానీ త్రివిక్రముడు ‘మాటల మాంత్రికుడు’ కదా.. ఈ అంశాన్ని అడుగడుగునా స్పుÛరింప చేస్తాడు. సంభాషణలలోనే కాదు, పాత్రలకు పెట్టే పేర్ల లోనూ ఈ ‘వర్ణ’ క్రమం కనిపిస్తుంది. మూర్తీభవించిన కక్కుర్తిలా కనిపించే ‘అట్టడుగు’ పాత్రకు ‘వాల్మీకి’ అని పేరు పెట్టారు. ( ఆ మధ్య ఓ గొప్ప గూండా చిత్రం తీసి దానికి ‘వాల్మీకి’ అని పేరు పెడితే, ఏ ‘వాల్మీకి’ కులస్తులు దాడి చేశారో గుర్తుండే వుంటుంది.) .
మరి వైకుంఠపుర వాసియో..?! అనంత రాధాకృష్ణుల వారి అల్లుడు, రామచంద్ర. దరిద్ర వాల్మీకి అసలు కొడుకు రాజ్‌ మనోహర్‌ (సుషాంత్‌) రామచంద్ర దగ్గరా, రామ చంద్ర అసలు కొడుకు బంటు (అల్లు అర్జున్‌ ) వాల్మీకి దగ్గరా పెరుగుతుంటాడు. రాజు రాజే.. బంటు బంటే. బంటుకి ఎంత గాలికొడితే మాత్రం రాజవుతాడా..? అంతే.. బంటుగా వున్న అసలు రాజు తన దర్పాన్ని చూపుతాడు. రాజుగా వున్న బంటు తన దరిద్రపు కొంపకు వెళ్ళి ‘ఆమ్లెట్‌’ తింటాడు.( అప్పటి వరకూ శాకాహారుల ఇంట్లో పెరిగినా.. పుట్టుక తోవచ్చిన రచులు చావవు కదా..అన్నది దర్శకుల వారి ఆంతర్యం.) ఏ కులం వాళ్ళు ఆ కులం చేసుకుని బతక్క ..ఈ ‘హెచ్చులు ఎందుకంటా..?’ అన్నది త్రివిక్రముల వారి భావన అని సులభంగానే అర్థమవుతుంది.
కానీ ఈ సినిమా కథ రాసుకోవటానికి ముందు ఆయన ఎక్కడన్నా ‘హర్ట్‌ ’ అయ్యారా? దానికి సమాధానం ‘ఒంటి తల రావణుడే’ చెబుతాడు.
ఇంతకీ ‘ఒంటి తల రావణుడు’ ఎక్కడ నుంచి ఊడి పడ్డాడు..? అదే చిత్రం వైకుంఠ పురవాసిని బెదరించే వాడి తండ్రి అప్పల్నాయుడే (సుమతిరకనే). నల్లగా వుంటాడు. ‘కాలా’ లో ‘కాలా’ సహచరుడి పాత్ర వేస్తాడు. ‘కాలా’లోంచే కావాలని ఈ పాత్రను ఎంచక్కా ఎత్తుకొచ్చి, రావణుడు ఎంత నీచుడో చూడండీ అంటూ ఈ సినిమా తీసి వుంటాడు – ఈ‘సిత్తరాల సిరపడు.. మన త్రివిక్రముడు’ అని అనుమానించాల్సి వుంటుంది.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 2-8 మే 2020 సంచిక లో ప్రచురితం)

5 comments for “‘కాలా’కు కౌంటర్… ‘అల(కుల) వైకుంఠపురం లో’!?

  1. Sir, thank you for writing this article. Raised many questions in my mind after reading this.

    Thank you for this much needed and rare observation.

  2. సామాజిక అంశాల పై అవగాహన ఉన్నవారు మాత్రమే ఈ లోతైన విశ్లేషణను అర్ధం చేసుకోగలరు. మీ ఈ విశ్లేషణ చదివాకే మాకు అర్థమైంది. చాలా బాగా చెప్పారు

  3. త్రివిక్రముడంటే వామనుడు కదా, పైకి ఇంతింతై ఎంతైనా బుర్రలో బుద్ధి బుడ్డదిగదా , బురదలోనే దొర్లుతది.
    నువ్ సారా తాగుట మాను లింగం లేకుంటే సచ్చి కూకుంటావ్ లింగం అని సొంత గొంతు వినిపించిన పవన్ ని చెగువేరా సాక్షిగా సగం సినిమాలో తాగుబోతుగా జల్సా చేయించిన సిత్తరాల సిరపడు తాను. ఇంకా ‘అల…లో అలవోకగా ఎవడుబడితేవాడు రానీకి ఇది గుడి కాదు, అని వైకుంఠపురమని చెప్పడంలోని లోతు ఇంకా దిగితేగానీ తెల్వదు.

Leave a Reply