‘ఐ డోన్ట్‌ లవ్యూ’ – అను అవిశ్వాస ప్రేమకథ

photo by by Squirmelia

జైలు గదిలో ఒక రాత్రి ఇద్దరికి నిద్రపట్టటం లేదు. అందులో ఒకడు దొంగా, ఇంకొకడు హంతకుడు.

బయిటున్నప్పుడూ ఇద్దరూ నైట్‌ డ్యూటీలే చేసేవారు.

‘సరదాగా ఒక కల కందామా?’ అన్నాడు దొంగ.

‘నిద్ర పట్టి చస్తే కదా- కలకనటానికి!’ హంతకుడు విసుక్కున్నాడు.

‘కలంటే కల కాదు. ఒక ఊహ.’

‘అది పగటి కల కదా! రాత్రిళ్ళు కనటం కుదరదు’.

హంతకుడంతే. మాట్లాడితే పొడిచినట్లో, ఎత్తి పొడిచినట్లో వుంటుంది.వృత్తికి కట్టుబడ్డ మనిషి.

అంత మాత్రాన దొంగ వదులుతాడా? చిన్న సందు దొరికితే చాలు. దూరిపోడూ..?!

‘ఇది రాత్రి కనే పగటి కల.. దీని పేరే సినిమా. ఈ సినిమాకి ఇద్దరం కలిసి ఒక కథ ఆలోచిద్దాం’ అని హంతకుడికి ప్రతి పాదించాడు.

‘నాకు ‘పొడుపు’కథలే వచ్చు. సినిమా కథలు రావు మరి.’ హంతకుడు మళ్ళీ కత్తి పట్టిన హంతకుడిలాగానే బదులిచ్చాడు..

‘నాకూ రావు. ఆ మాటకొస్తే, సినిమా వాళ్ళకు మాత్రం వస్తాయా? ఎక్కువ భాగం ఎత్తుకొచ్చిన కథలే కదా?’

‘ఇన్ని దొంగతనాలు చేశావు. నీకు దొరకని కథలు, వాళ్ళకెలా దొరుకుతాయి?’

‘నేను ఇంతవరకూ తెలుగిళ్ళనే దోచాను. వారు ఇంగ్లీషు, హిందీ, తమిళ, భోజపూరీ ఇళ్ళను దోచేశారు. అందుకే వాళ్ళకి దొరుకుతాయి. ఆ గొడవెందుకు కానీ, నేను ఒక తెలుగింట్లోనే కొట్టుకొచ్చిన కథను చెబుతాను. విను. నచ్చితే సినిమా తీసేద్దాం.’ అని ప్రతిపాదించాడు దొంగ.

‘వినే వాణ్ణే కాని, నాకు హింస పడదు.’ ఖచ్చితంగా చెప్పేశాడు హంతకుడు.

‘నాకు తెలుసు కథల్తో చేసే హింస కత్తుల్తో కూడా చేయలేం. నీ సుకుమార హృదయాన్ని హింసించకుండా మూడు ముక్కల్లో చెప్పేస్తాను.’

‘ఒక్క ముక్కలో చెప్పలేవా? చెప్పాను కదా నాకు హింస నచ్చదని. నేను ఎవర్నయినా ఒక్క పోటుతోనే చంపేస్తాను. మూడు పోట్లంటే హింసే కదా..?’

‘అలాగే ఒక ముక్కలోనే చెపుతాను. మనం తీసేది ప్రేమ కథ. సినిమా పేరు: పరీక్ష.’ మొదలు పెట్టాడు దొంగ.

‘తెలుగు టైటిలా? ఎవడికి అర్థమవుతుందీ? ఇంగ్లీషులో పెడదాం: ‘టెస్ట్‌’ అని’. హంతకుడు లీనమయ్యాడు కథలో- ఇంకా మొదలు కాకుండానే.

‘అవును. అలాగే. ‘టెస్ట్‌’! ఇది హీరోయిన్‌ పెడుతుంది..హీరోకి. ఇంటర్వెల్‌ కు ముందు ‘నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లు నిరూపించుకో’ అంటుంది. ఈ పరీక్ష గెలుస్తాడు కానీ, ఆమె మీద చికాకు కలుగుతుంది.దూరమవ్వాలనుకుంటాడు. దానిక్కూడా మళ్ళీ పరీక్ష పెడుతుంది. ‘నువ్వు నన్ను ప్రేమించటంలేదని’ నిరూపించుకోమంటుంది. అంతే కథ.’ దొంగ కొట్టుకొచ్చిన కథను హంతకుడి ముందు పెట్టాడు.

‘ఈ కథకు యాక్షన్‌ పార్ట్‌ నేను చెబుతాను. ఒకే ఒక్క కత్తి పోటు. ప్రేమిస్తున్నానని చెప్పటానికి, ఒక కత్తి పోటుతో ఆమె వెంటే పడే విలన్‌ని పొడిచేస్తాడు. ప్రేమించటం లేదని చెప్పటానికీ కూడా మళ్ళీ ఒకటే కత్తి పోటు…’ హంతకుడి కళ్ళు చీకటి గదిలో బల్బుల్లా వెలిగాయి.

‘ఏడిసినట్టుంది తెలివి. ఫస్ట్‌ హాఫ్‌లోనే విలన్‌ని చంపేస్తే.. సెకండ్‌ హాఫ్‌లో చంపటానికి ఎవరు వుంటారు?’ ఈ సారి దొంగే నోరు వెళ్ళబెట్టాడు.

‘పిచ్చివాడా? ప్రేమించటంలేదని చెప్పాలంటే ఎవర్ని పొడవాలి? ప్రియురాలినే కదా? అలా రెండో కత్తి పోటుతో ‘శుభం’ కార్డు వేసుకో వచ్చు.’ గొప్ప ముగింపు ఇచ్చినట్లుగా హంతకుడు విజయదరహాసం చేశాడు.

‘అలా చేస్తే, శుభం కాదు. అశుభం అవుతుంది. అప్పుడు హీరో ఎక్కడుంటాడో తెలుసా?’

‘నీ పక్కన…!!’

అలా ఠక్కున ఇచ్చిన హంతకుడి సమాధానం దొంగకి మింగుడు పడలేదు.

‘అవును. నీ పక్కనే వుంటాడు కాదు. నువ్వు కొట్టేసింది నా కథే. నేను పైసలు కోసం చాలా హత్యలు చేశాను. జైలుకి రాలేదు. కానీ నా ప్రియురాలు స్వర్గానికి పోయి, నన్ను జైలుకు పంపింది.’

నీతి కూడా తెలిసిపోయింది కదా: కథ స్వంతం కాక పోతే, ముగింపూ స్వంతం కాదు.

దొరికి పోయిన దొంగ తన ముఖాన్ని తాను కూడా చూసుకోలేడు. అందుకే మీడియా వాళ్ళ ముందు అరచేతులూ, అట్టలూ, ముసుగులూ ముఖానికి అడ్డుపెట్టుకోడు. టీవీలో వస్తే తన ముఖాన్ని ఎవరో చూసేస్తారని కాదు…తనకు తాను చూసుకోవాల్సి వస్తుందని.

అంత చీకట్లోనూ, దొంగ తన ముఖాన్ని మోకాళ్ళ మధ్య దాచేసుకుని…,

‘ఇంతకీ, నీ ప్రియురాలి పేరు రాజ్యలక్ష్మి కదా!’ అని ఆరా తీశాడు దొంగ.

‘అవును. రాజ్యలక్ష్మే. ఎలా చెప్పావ్‌?’ సందేహించ కుండా అడిగేశాడు హంతకుడు

కొట్టేసేవాళ్ళు కథనే కొడతారు. పేర్లను వదిలేస్తారు. అందుకే హంతకుడిలో ఈ ఆశ్చర్యం.

‘రాజ్యలక్ష్మి మాత్రమే రెండు పరీక్షలు పెడుతుంది. ఒకటి: విశ్వాస పరీక్ష, రెండు: అవిశ్వాస పరీక్ష’

అవును. దొంగ కొట్టుకొచ్చింది రాజకీయ కథే.

విశ్వాసంతోనే వోటరు వోటు వేస్తాడు. వోటుతోనే రాజ్యలక్ష్మి ఒకర్ని వరిస్తుంది.

మధ్యలో కలిగే విశ్వాసాలూ, అవిశ్వాసాలూ- సంభవించేవి తెగిన వోటు వల్ల కాదు. తెగని వాటా వల్ల..!

-సతీష్ చందర్
(ఆంధ్రభూమి దినపత్రిక 4-12-11 సంచికలో ప్రచురితం)

3 comments for “‘ఐ డోన్ట్‌ లవ్యూ’ – అను అవిశ్వాస ప్రేమకథ

Leave a Reply to umamaheswara rao c Cancel reply