పార్టీలు పెట్టనేల? గంగలో కలపనేల?

కొన్ని సమాజాల్లో, కొన్ని కాలాల్లో బహు భార్యత్వాలూ, బహు భర్తృత్వాలూ వున్నట్లు, మన ప్రజాస్వామ్యంలో బహుళ పార్టీ విధానం వుంది. ఎన్ని పార్టీలయినా పెట్టుకోవచ్చు. దాంతో, ‘ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్ల’లా రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. ఇంకా పుడుతూనే వున్నాయి. ఇంకా పుడతాయి కూడా. అయితే మన అదృష్టం బాగుండి, అన్నీ పూర్ణాయుష్షుతో వుండవు.

కొన్ని పుట్టగానే మరణిస్తాయి. చిత్రం! కొన్ని పుట్టకుండా మరణిస్తాయి.(వేరే పార్టీలో పదవిని ఇస్తానంటే, పిండంగా వుండగానే చిదిమేసే వ్యవస్థాపకులుంటారు. ఒక రకంగా చెప్పాలంటే భ్రూణ హత్య అన్న మాట!) ఇంకా కొన్ని పార్టీలుంటాయి. వాటికి బతకటానికే కాదు, చావటానికి కూడా ఓపిక వుండదు. దాంతో, అవి జీవఛ్ఛవాలులాగా, ఉన్నా లేనట్టుంటాయి. చాలా పార్టీలు ఎన్నికల రణంలో ‘డిపాజిట్లు గల్లంతయి’ వీరమరణం చెందుతాయి. ఇంకా కొన్ని పార్టీలుంటాయి. అవి పుట్టగానే ఒక ఊపు ఊపుతాయి. తర్వాత వేరే పెద్ద పార్టీలో విలీనమయి పోతాయి. అలా తమ పార్టీలను ఇలా విలీనం చేసిన వ్యవస్థాపకుల్లో ఎక్కువ మంది సోదెలోకి కూడా మిగలకుండా పోయారు. పోతున్నారు.

Chiranjeeviపాత పురాణాలు ఎందుకుగాని, ఓ పదేళ్ళ చరిత్ర తీసుకున్నా, ఉదంతాలు మెండుగానే కనిపిస్తాయి. వెనకి నుంచి వెళ్ళితే,రాష్ట్రరాజకీయాల్లో ముందుగా స్ఫురణకు వచ్చే ఉదాహరణ చిరంజీవి రాజకీయ ప్రయోగం. ‘ఇదుగో వస్తాడు, అదుగో వస్తాడు’ అంటూ మీడియా ఎన్నో సార్లు ముందస్తు హెచ్చరికలు జారీచేసినప్పుడు కాకుండా, తనకు వీలు చిక్కినప్పుడు రాజకీయాల్లోకి వచ్చేసి, ‘ప్రజారాజ్యం’ అనే పార్టీ కూడా పెట్టేశారు చిరంజీవి. 2009 ఎన్నికల ప్రచారాల్లో మీసాలు మెలివేశారు. తొడలు కొట్టేశారు. ఫలితాలొచ్చాక దాదాపు 18 శాతం వోట్లను సాధించారు. (ఒక కొత్త పార్టీ ఈ మాత్రం భాగాన్ని పంచుకోవటం చిన్న విషయమేమీ కాదు.) 18 అసెంబ్లీ సీట్లను కూడా సాధించారు. కానీ పార్టీని పోషించలేక పోయారు. తమిళనాడులో పార్టీ పెట్టి ఎన్నికల్లో రెండు శాతం వోట్లు కూడా రాని విజయకాంత్‌ తన పార్టీని కొనసాగించ గలిగితే, చిరంజీవి మాత్రం తన పార్టీని మేళ తాళాలతో తీసుకువెళ్ళి కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసేశారు. ఆ తర్వాత ఏమయ్యింది? ఆయనకు కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టారు. ఆయన చెప్పిన ఇద్దరు ముగ్గురికి రాష్ట్రంలో పదవులిచ్చారు. కడకు వారిలో ఒకరయిన సి.రామచంద్రయ్య మీద వేటు పడుతుందనే సరికి, కాంగ్రెస్‌పార్టీ అధిష్ఠానం దగ్గరకు వెళ్ళి నివేదించుకున్నారు. బహుశా, 2014 ఎన్నికల తర్వాత, చిరంజీవి కాంగ్రెస్‌లోని అనేకానేక నేతల్లో ఒకానొకగానే మిగిలిపోవచ్చు. ఇప్పటికే ఆ దిశగా ఆయన ప్రయాణం మొదలయ్యింది.

vijayashantiఅలాగే వెండి తెర మీదనుంచి ఊడిపడ్డ మరో తార విజయశాంతి. తెలంగాణ సెంటిమెంటును ఆలంబనగా చేసుకుని, ‘తల్లి తెలంగాణ’ పార్టీ పెట్టారు. ఉన్నంతలో ఆమె వెంట జనం బాగానే వచ్చారు. కానీ తర్వాత ఆమె ఆ పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితి( టీఆర్‌ఎస్‌)లో కలిపారు. మెదక్‌ స్థానంనుంచి ఎం.పిగా గెలుపొందారు. చూడటానికి పార్టీలో ఆమెకు ‘ద్వితీయ స్థానం’ ఉన్నట్టే కనిపిస్తుంది. ఏ పార్టీ సమావేశంలోనయినా, కేసీఆర్‌ ఆమెను సోదరిగా గౌరవించి తన పక్కనే సీటు వేస్తారు. కానీ ఇప్పుడు చూడండి. 2014 ఎన్నికలలో ఆమె మెదక్‌ నుంచి పోటీ చేయటానికి దాదాపు వీలుకావటం లేదు. సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేయమని ఆమెను కోరుతున్నట్టు భోగట్టా. అలా మారితే ఆమెకు విజయావకాశాలు సన్నగిల్లే పరిస్థితి వుంది. ఆమె కంటె ముందు ‘టైగర్‌’ నరేంద్ర తన పార్టీని( తెలంగాణ సాధన సమితిని) కూడా ఇలాగే టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. తర్వాత ఏమయ్యారు? వ్యక్తిగా వెలుపలికి రావాల్సి వచ్చింది. అలాగే అంతకు ముందు తెలుగుదేశం నుంచి బయిటకు వచ్చి సొంతగా పార్టీ పెట్టిన దేవేందర్‌ గౌడ్‌, తన పార్టీని చిరంజీవి పార్టీ ‘ప్రజారాజ్యం’లో విలీనం చేశారు. (పాపం! అంతిమంగా అది కాంగ్రెస్‌ లో కలుస్తుందని ఊహించలేదనకుంటాను.) తిరిగి ఆయన ఒక వ్యక్తిగా తెలుగుదేశం పార్టీలో చేరాల్సి వచ్చింది. ఇంకాస్త ముందుకు వెళ్ళితే, చెన్నారెడ్డి, బ్రహ్మానంద రెడ్లు లాంటి వారు పార్టీలను పెట్టి, వాటిని తిరిగి కాంగ్రెస్‌లోనే కలిపేశారు. ఈ మధ్య కాలంలో ఒక భారీ విలీనం గురించి పెద్ద యెత్తున వినవచ్చింది. ‘తెలంగాణ ఇచ్చేస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ లో విలీనం చేసే’ ప్రతిపాదన అది. ఒక వేళ తెలంగాణ రావటమో, ఆ మేరకు ప్రకటన రావటమో జరిగి కేసీఆర్‌ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే, అంత పెద్ద కేసీఆర్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీలో ఒకానొక నేతగానే మిగిలిపోవాల్సి వస్తుంది. జగన్‌ తన పెట్టిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని కాంగ్రెస్‌లో కలుపుతానని అన లేదుకానీ, ఎన్నికల అనంతరం యుపీయేకు మద్దతు ఇస్తానని ఒక దశలో చెప్పారు.

నిజానికి ఏ పెద్దపార్టీలోనూ విలీనం కాకుండా తమ ఉనికిని చాటుకున్న అనేక ప్రాంతీయ పార్టీలు, దేశంలో శక్తిని పుంజుకున్నాయి. పుంజుకుంటున్నాయి కూడా. ప్రపంచ శాంతికి అలీన విధానం ఒకప్పుడు అవసరమయిందో కానీ, దేశంలో ప్రజాస్వామ్య శాంతికి మాత్రం ‘విలీన విధానం’ అంత ఆరోగ్య కరం కాదని తేలిపోయింది.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 14-20 జూన్2013 వ సంచికలోప్రచురితం)

1 comment for “పార్టీలు పెట్టనేల? గంగలో కలపనేల?

Leave a Reply to Yandamuri Souri Cancel reply