ముఖ చిత్రం

నాకో ముఖముండాలి
ఇక్కడే ఎక్కడో వదలిపెట్టాను
దేశానికి జెండా కూడావుండాలి…నా కనవసరం
ముందు నా ముఖం సంగతి తేల్చండి

నేను పుట్టగానే కెవ్వున ఏడ్చి, అమ్మను నవ్వించిన ముఖం
ఎవ్వరికీ ఎందుకూ పనికి రాదు
విత్తు మొలకెత్తినప్పుడు కూడా తాను పగిలి, మట్టిని మురిపిస్తుంది…
ఆ ముచ్చట ఎందుగ్గానీ,
నా ముఖం దొరికితే ఇచ్చేయండి

నేనెప్పుడూ నా ముఖంతో లేను
అది పెద్ద కష్టం కూడా కాదు
పెళ్ళిపీటల మీద తలవంచుకున్న రూపాయిక్కూడా ముఖంలేదు… మనకెందుగ్గానీ
మీ కాళ్ళ దగ్గర నా ముఖం అడ్డుపడితే, ఇలా తన్నిపెట్టండి

బళ్ళోకి వెళ్ళే ముందు నీళ్ళ బాల్చీలో చూసుకున్న ముఖం
పాఠ్య పుస్తకంలో పెట్టి తీసినప్పుడే మాయమయ్యింది
రొయ్యల చెరువు తవ్వాక, పొలం అదృశ్యమయ్యింది…
ఆ చోద్యం వద్దు గానీ,
విదేశీ వీసా మడతల్లో నాముఖం కనిపించ వచ్చు. కాస్త చెప్పండి.

నా ముఖమేదని నన్నెవరూ అడగలేదు
నా తల్లయినా- నా నోట బొట్లేరు ముక్కల్నీ, కాలి బూట్లనీ చూసింది కానీ,
ముఖం ఊసెత్తలేదు
దేశమాతకు సైనికుడి ప్రాణమే కావాలి. ముఖమెందుకు? ఆ వైనం నాకెందుగ్గానీ,
పరీక్షహాలు ఊడుస్తుంటారు కదా, ఆ చెత్తలో నా ముఖం వుండొచ్చు. చూడండి.

నాన్న కూడా నా బుగ్గల మీద కాకుండా, రాంకుల మీదనే ముద్దులు పెట్టాడు.
ఓట్లనాడు నాయకులూ అంతే.
ముఖానికొకటి కాకుండా, పొట్టకొకటి చొప్పున సారా ప్యాకెట్లు ఇస్తారు. ఆ గొడవ ఎవడిక్కావాలి గానీ,
ఏ స్టెతస్కోపు మధ్యనైనా నా ముఖం రోగగ్రస్తమై వుంటే వుండవచ్చు. వెనక్కివ్వండి

ప్రేయసి కూడా నా పెదవుల గురించి ఆరా తీసిన గుర్తే లేదు
ఆమెకు నేనంటేనే పిచ్చి- నా ముఖం కాదు
దేశభక్తులూ అంతే- సరిహద్దుల్ని ప్రేమిస్తారు . దేశాన్ని కాదు. అయినా నా కెందుగ్గానీ
ఇవన్నీ ఆమె రాసిన ప్రేమలేఖలే. దయచేసి నా ముఖముందేమో చూసిపెట్టండి

ఎన్నో నౌకరీలకు అర్జీలు పెట్టాను
ఊరూపేరూ అడిగారు గానీ ముఖమడగలేదు
పశువుల సంతలో పొదుగుల కున్న విలువ ముఖాలకుంటుందా? నాకెందుకులే గానీ,
ఏ అకాల ఉద్యోగ విరమణల మహోత్సవంలోనో నా ముఖం పకాలున నవ్వవచ్చు. భయపడకుండా కబురు చెయ్యండి.

కడకు నా గుండెలమీద సేద తీరే పిల్లలక్కూడా
నాన్నకో ముఖముండాలన్న ధ్యాసలేదు
శిలువ దిగిన జీసస్‌కు గాయమే గుర్తింపు చిహ్నం. ముఖం కాదు
ఆ దృశ్యం ఇప్పుడెందుకు గానీ
తలారినయినా అడిగిచూడండి. ముసుగు వేసే ముందు ఎప్పుడయినా నా ముఖం చూసి వుండవచ్చు.

ఒక జననం, ఒక మరణం మధ్య కాకుండా
ఒక క్రయానికీ, ఒక విక్రయానికీ మధ్యనున్నదే జీవితమయిన చోట
ముఖం ఒక అదనపు చర్మం
విపణికి ఒక పుర్రె చాలు
ఏడుపుకీ, నవ్వుకీ ఒకే రకంగా ఇకిలించటం దానికి తెలుసు

ముఖాన్ని తొలగించుకోవటం కూడా సులువే
మార్కెట్‌కు వెళ్ళే ముందు చేతి రుమాలుతో ముఖం తుడుచుకుంటే చాలు.
ముఖం పోయి మేకప్‌ మిగులుతుంది
పైపూతలకు గ్యారంటీ వుండాలి కానీ,
ఏ పుర్రెకు కిరీటం పెట్టినా ప్రపంచ సుందరిలాగానే వుంటుంది

నాకు ముఖం లేదని మీరు కూడా చింతించకండి.
చితిపేర్చినప్పుడు ముఖం మీద పెట్టే చివరి పిడకను ఆదాచెయ్యవచ్చు.

ముఖం నాకే కాదు
దేశానిక్కూడా లేదు
అది నాకనవసరం

(సతీష్ చందర్ కవితా సంకలనం ‘ఆదిపర్వం’ లోని కవిత ఇది. ఈ గ్రంథం 2008 వ సంవత్సరంలో ముద్రితమయినది. పుస్తకం కావలసినవారు ఈ-మెయిల్ ద్వారా సంప్రదించగలరు. వెల: రు.60 లు)

2 comments for “ముఖ చిత్రం

Leave a Reply to sailajamithra Cancel reply