Month: November 2010

మేతకు ముందు! నీతికి వెనుక!!

ఒకటి: కామన్‌ వెల్త్‌!
రెండు: ఆదర్శ్‌!!
మూడు:స్పెక్ట్రమ్‌!!!

ఈ మూడింటి గురించి నీ కేమి తెలియును?
ఇలా ఏ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రంలో నైనా ఇస్తే, సమాధానాలు ఎలాగుంటాయి?
ఒకటి: యూ…జర్‌ ఛార్జ్‌
రెండు: పీ…నాల్టీ
మూడు:ఎ…డిషనల్‌ టాక్స్‌.
వెరసి ‘యూ. పీ, ఎ’ సర్కారు తిరిగి రెండవ సారి ఎన్నుకున్న ప్రజలకు ఇచ్చే పరిహారం.
దీని పేరే అవినీతి.

‘పోవోయ్‌’ అంటే-‘మావో’య్‌ అన్నారు!

వాళ్ళ ముందు
ఇస్లామిక్‌ టెర్రరిస్టులూ చిన్నవారే.
హిందూ ఉగ్రవాదులూ పిపీలకాలే.
అండర్‌ గ్రౌండ్‌ మాఫియాలూ అంగుష్ట మాత్రులే.
వాళ్ళ పేరు చెబితే-
ఒక్క రాష్ట్రమే కాదు. అన్ని రాష్ట్రాలూ హడలెత్తిపోతాయి.
ఆ మాట కొస్తే ప్రభుత్వమే కాదు.
దేశీయ కాంట్రాక్టర్లూ, విదేశీ బహుళజాతి సంస్థలూ బిక్కచచ్చిపోతాయి.
వారున్న చోటా భయమే. వారు లేకున్నా భయమే.
వారి మౌనమూ, అలికిడీ – రెండూ ఆందోళన కరమే.
ఎవరూ వారు? బరినీ, గిరినీ తెగించిన వారు.
‘చావో, మావో’ అని తెంపుచేసుకున్నవారు.
అవతరించినప్పుడు నక్సలైట్లు. ఇప్పుడు మావోయిస్టులు.