Month: January 2016

‘కత్తుల’ రత్తయ్య!

పేరు : పందాల రాయుడు

దరఖాస్తు చేయు ఉద్యోగం: పుంజుల్ని పెంచటం. (పెట్టల పెంపకంలో అనుభవం లేదు.)

ముద్దు పేర్లు : ‘కత్తుల’ రత్తయ్య.( అపార్థం చేసుకోకండి. అసలే నేను అహింసా వాదిని. కత్తి నేను పట్టను. నా కోడికి కడతాను) . ‘కాలు దువ్వే’ కనకయ్య.( అదుగో మళ్ళీ అపార్ధం. ఎవరిమీదకీ కాలు దువ్వను. నా కంత సీను లేదు. కత్తి కట్టి బరిలోకి వదలితే. నా కోడే దువ్వుతుంది.)

‘విద్యార్హతలు :మా వాళ్లందరిలో నేనే నాలుగు ఆకులు… సారీ… ‘నాలుగు ఈకలు’ ఎక్కువ చదువుకున్నాను. కాబట్టే ‘పుంజు’ను చూడగానే, ఏది ‘నెమలో’, ఏది ‘డేగో’ ఇట్టే చెప్పేయ గలుగుతాను. (అన్నీ కోళ్ళే. కానీ పందె గాళ్ళు అలా పిలవరు. ‘ఈకలు’ తేడాలు పీకి ఇలా ‘జాతుల్ని’ నిర్థారిస్తారు. ఏం? మన దేశంలో మనుషులకు కులాలున్నప్పుడు, కోళ్ళకు మాత్రం కులాలు- ఉండాలా? లేదా?

‘సెటిలర్‌’ అంటే మాట కాదు, వోటు!

సెటిలర్‌. హఠాత్తుగా ఈ మాట ముద్దొచ్చేస్తోంది. అది కూడా ఎక్కడ? గ్రేటర్‌ హైదరాబాద్‌లో. ఒక్క సారి రెండేళ్ళ వెనక్కి వెళ్ళితే, తెలంగాణ లో ఇదే తిట్టు. కానీ, అట్టు తిరగబడింది. తిట్టు కాస్తా వొట్టు అయింది. సెటిలర్ల మీద వొట్టేసి చెబుతున్నారు కేటీఆర్‌: ‘నేను కూడా సెటిలర్‌ నే’. ఇలా అన్నాక, చిన్న గ్యాప్‌ ఇచ్చి. ‘తెలంగాణ పల్లె నుంచి హైదరాబాద్‌ వచ్చాను కదా… సెటిలర్‌ని కానా?’ అన్నారు. మరీ రెండేళ్ళ క్రితమో…! నేరుగా ఆయన అని వుండక పోవచ్చు కానీ, ఆయన పార్టీ నేతలు ఏమన్నారు? సెటిలర్లు మూటా, ముల్లె సర్దుకోవలిసందే.. అని. అంతెందుకు కేసీఆర్‌ మాత్రం అనలేదూ! సీమాంధ్ర ఉద్యోగుల్లో కొందరికి ఆప్షన్ల ఇచ్చే ఆలోచన చేసేది వుందా? అన్న ప్రశ్న వచ్చినప్పుడు ‘ఆప్షన్లూ లేవు, గీప్షన్లూ లేవు’ అని అనేయ్‌ లేదూ! (అఫ్‌ కోర్సు !కొన్నాళ్ళ తర్వాత ఆంధ్రుల కాలికి ముల్లు గుచ్చుకున్నా, పంటితో తీస్తానని కూడా అన్నారు. అది వేరే విషయం.) ఇప్పుడు ‘సెటిలర్‌’ అనేది కేవలం మాట కాదు, వోటు. ఈ వోటు ఎటు వైపు వెళ్తుంది?

ఇది ‘గ్రేటర్‌’ నామ సంవత్సరం!!

‘గ్రేటర్‌’! కొత్త ఏడాది(2016) ఏ మాటతోనే మొదలవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో పౌరులందరూ ‘హ్యాపీ న్యూయియర్‌’ అని ఒకరినొకరు అభినందించుకోవచ్చు. అందు వల్ల ఆనంద పొందవచ్చు. కానీ ఈ రాష్ట్రాలలో నేతల్ని ఆనందింప చెయ్యాలంటే మాత్రం ‘హ్యాపీ న్యూయియర్‌’ అని అనకుండా ‘గ్రేటర్‌ న్యూయియర్‌’ అనాలి. అప్పుడు విన్న నేత ముఖం వెలుగుతుంది. తెలుగు సంవత్సరాలకు నెంబర్లతో పాటు, పేర్లు కూడా వుంటాయి. కానీ ఇంగ్లీషు సంవత్సరాలకు అంకెలు మాత్రమే వుంటాయి. కానీ 2016కు మాత్రం ఈ రెండు రాష్ట్రాల వారూ పేరు కూడా పెట్టుకోవచ్చు. అదే ‘గ్రేటర్‌’ నామ సంవత్సరం.