రాను, రాను
ప్రేమలు ప్రియమయి పోతున్నాయి; కాపురాలు ఖరీదయిపోతున్నాయి.
ఇవాళ ప్రేమించాలంటే.., విశాలమయిన హృదయముంటే సరిపోదు, లోతయిన బావి వుండాలి. బావి అంటే అల్లాటప్పా నీళ్ళ బావి కాదు, చమురు బావి వుండాలి.
అప్పుడు, ఆ ప్రేమ అరబ్బువాడి ప్రేమలాగా వెలిగిపోతుంది. ఏడుపదుల వయసొచ్చినా, మూడు పదుల మనువులతో మెరిసిపోతుంది. ‘తలాకు’లు ‘తలాకు’లుగా… విడాకులు విడాకులుగా ఎప్పటికప్పుడు చిగురిస్తుంటుంది.
నిజమే మరి. ఏ భావకవికీ ఎందుకు తట్టలేదో తెలియదు కానీ,
ప్రేమను పెట్రోలుతో, కాపురాన్ని గ్యాస్‌తోనూ ఏనాడో పోల్చి వుండాలి.
బైకున్న ప్రతీవాడూ ప్రియుడు కాలేడు. బండిలో చమురున్నవాడే రొమాంటిక్ హీరో. లేకుంటే బస్సు లో వెళ్ళే మిస్సుకు లిఫ్ట్ ఇవ్వలేడు. మిస్సును మిస్సయ్యాక కానీ, వెర్రి రోమియోకి తత్వం బోధపడదు: పెట్రోలు లేకుండా బండే కాదు, ప్రేమ కూడా స్టార్ట్ కాదు.
ఇన్నాళ్ళూ అన్యోన్యతంటే ‘గ్యాస్’ అనుకునే వాళ్ళం. ఇప్పుడు కాపురమే ‘గ్యాస్’గా మారింది. ‘స్టౌ మీద కొంచెం టీ పెట్టుకుందామా?’ అని ఎంత ప్రజాస్వామికంగా ఆయన అడిగినా ఆవిడ భగ్గుమంటుంది. ‘బండ మీద యాభయి పెరిగింది.’ పాపం ఏంచేస్తాడతడు. టీవేడినే కాదు, ఆవిడ వేడిని కూడా ఒక ఫ్లాస్కులో దాచే ప్రయత్నం చేస్తాడు. గంట తర్వాత కాపురం లాగానే ఫ్లాస్కులో టీ కూడా చల్లారిపోతుంది. ముందు టీ మీదా, తర్వాత జీవితం మీదా విరక్తి కలుగుతుంది.
చూశారా? ఐడియా కాదు- ఒక గ్యాస్‌బండ మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఒక్కొక్కడు ఇదే గ్యాస్ బండతో తన జీవిత భాగస్వామినే మార్చేసుకుంటాడు.(వరకట్న హత్యకు వంటగ్యాస్‌కు మించిన ఆయుధం లేదు కదా!) అది వేరేవిషయం. కాలం మారిపోయింది మరి. పూర్వపు రోజుల్లో అగ్ని సాక్షిగా పెళ్ళి మాత్రమే చేసుకునే వారు. ఇప్పుడు కాపురమూ ‘అగ్ని’ సాక్షిగానే చెయ్యాలి. విడాకులూ ‘అగ్ని'(స్టౌ సాక్షిగా) పుచ్చుకోవాలి.
పుట్టింది ఒక్క చోటయినా, ‘శుధ్ధి’ చేసేవాళ్ళు ‘వర్ణాన్ని’ బట్టి, ఇది ‘పెట్రోలు’ అనీ, ఇది ‘డీజిల్’ అనీ, ఇది ‘కిరోసిన్’ అనీ అంతరాలు సృష్టించారు.
పెట్టిపుట్టిన వాళ్ళు పెట్రోలు వాడతారనీ, కాయికష్టం చేసేవాళ్ళు కిరోసిన్ వాడతారనీ ఏలిన వారు గ్రహించేసి ఇన్నాళ్ళూ వడ్డించే విషయంలో కొంత సామాజిక నాయ్యానికి ప్రయత్నించేవారు. పెట్రో సంపన్నుల్ని కొట్టి కిరోసిన్ పేదలికి పెట్టిన బిల్డప్ ఇచ్చే వారు.
అటు ‘అగ్ర’వర్ణానికి ఎక్కువా, ఇటు ‘నీచ’వర్ణానికి తక్కువా- అన్నట్లు ఓ మధ్యస్తపు చమురు వుంది. దాని పేరే డీసెల్. నడమంతరపు మధ్యతరగతిని నిజంగానే నడిపించేది డీసెల్. జనరవాణాసాధనాలు- బస్సులయినా, రైళ్ళయినా- ఎక్కువగా కదిలేది డీసెల్ మీదనే.
అసలే మధ్యతరగతి వాడు ఒంటెత్తు మనిషి. ‘నా భార్య, నా ఇల్లు, నా బిడ్డ. నాకుక్క… ‘ఈ వృత్తం దాటి బయిటకు పోడు. ఈ మధ్య ఈ జాబితాలోకి ‘నా కారు’ కూడా చేరిపోయింది. అన్ని రోజులూ ముసుగు వేసి వుంచి ఆదివారం పూట బయిటకు తీస్తాడు. ‘నా..’ అనుకున్న వారిని అందులో ఎక్కించుకుని ధియేటర్ వరకూ వెళ్ళి, సినిమా చూపించి, పరమ చీప్‌గా వుండే పాప్ కార్న్ మాత్రమే తినిపించి, జాగ్రత్త వెనక్కి తెచ్చేసి ఇంటి ముంగిట పార్క్ చేసేస్తాడు. ఎక్కడా ఎవరికీ కూల్ డ్రింక్ కూడా తాగించడు. మనిషయితే ఏమీ తాగకుండా కొన్ని గంటలుండగలడు. కానీ కారన్నాక తాగకుండా వుంటుందా? కాకపోతే అది మధ్యతరగతి వాడిది కాబట్టి పెట్రోలు తాగకుండా, మధ్యస్తపు చమురు- డీజెల్‌నే తాగుతుంది. ఇప్పుడు వెనకా ముందూ చూడకుండా దాని మీదా వడ్డించేశారు. ఇక వారానికి కాకుండా నెలకొక సారి మాత్రమే మన మధ్యతరగతి మానవుడు, కారు ముసుగు తీస్తాడు.
ఈ చమురు వర్ణ వ్యవస్థలో మిగిలిపోయింది గ్యాస్ బండ కదూ? మరి స్థానం ఏమిటి? ఏ వర్ణంలోనైనా స్త్రీ స్థానం మారదు. అన్ని వర్ణాల్లోనూ లోకువయిన వర్ణం ఆమెది. గ్యాస్ బండదూ అంతే. అది కూడా వంటింటి కుందేలే. స్త్రీలను ఉధ్ధరించే పేరు మీద ఈ బండను కదిలించే పని చేయదు సర్కారు. అలా చేస్తే వంటింటి విప్లవం వస్తుందని వారికి అనుమానం.
కట్టెల పొయ్యి ముందు కూర్చున్న కన్నతల్లిని చూసి కడుపు తరుక్కు పోయిందట ఒకాయనకి. ఊదిఊది ఆమె ఊపిరితిత్తులు అలసి పోయయానీ, పొగతో కళ్ళన్నీ మండిపోయాయనీ, ఆమెను విముక్తం చెయ్యటానికి ఈ బండను తెచ్చి ఇంట్లో పెట్టాడు. కట్టెల పొయ్యిని వెలిగించటానికి ఒక్క ఊపిరి చాలు. కానీ బండను వెలిగించటానికి ఊదాల్సింది ఊపిరిని కాదు- కష్టార్జితాన్ని.
నీరు పల్లమెరుగు- అన్నది ఎంత నిజమో తెలియదు కానీ, చమురు ఎత్తులెరుగు- అన్నది మాత్రం సత్యం.
చమురు-పాలక పక్షంలో వున్న వారికిచల్లగానూ, ప్రతిపక్షంలో వున్నవారికి వేడిగానూ వుంటుంది.
అందుకే ధర పెరిగినప్పుడు- వీళ్ళు చిరునవ్వులు చిలికిస్తుంటూ, వాళ్ళు భగభగలాడిపోతుంటారు.
అయితే ప్రతిపక్షాల వారిని ఇప్పుడు కొంచెం సానుభూతి తో అర్థం చేసుకోవాలి. వారికీ హృదయముందని భావించాలి. మరీ ముఖ్యంగా నిరసనలూ, ఆందోళనలూ పేరు మీద రోడ్డెక్కే కొన్ని పక్షాలకు ఇవాళ స్త్రీల కష్టాలు తెలిసిపోయాయి.
మరీ ముఖ్యంగా రోడ్ల మీదే వంటా, వార్పులూ చేశాక వీరికి ఆడవాళ్ళ శ్రమ నిజంగా అర్థమయింది. గరిటె తిప్పటమంటే, (రాజకీయాల్లో) చక్రం తిప్పటమంత సులువు కాదని తెలిసిపోయింది.
వీరిలో చాలామంది తొలిసారిగా ఉల్లిని తరిగి కన్నీళ్ళు తెచ్చుకున్నారు. పొయ్యిని దర్శించుకుని మసిబారి పోయారు. చేతులు కాల్చుకున్నాకే (విస్తరి) ఆకుల్ని పట్టుకున్నారు.
అందుకే గ్యాస్ మీద వడ్డించినందుకు వీరికి ఆగ్రహం కలగాలి.
‘వేరు కుంపటి’ పెట్టాలంటే, అందరి మద్దతూ కావాలి కదా!
-సతీష్ చందర్
25-6-11