యువర్ ఆనర్



కోరిక కలిగితే తీర్చుకోవచ్చు. ఆకలి వేస్తే తినవచ్చు.
కానీ, సమస్య అది కాదు. తినాలి. ఆకలి వెయ్యటం లేదు. ఆకలి కలిగించుకోవాలి. ఇష్టమైన తిండే. ఆకలి లేకుండా ఎలా తినేదీ.?
ప్రేమ కలిగించుకోవాలి. అవును. ప్రియుడి మీదే. అప్పుడు కదా, ఊపిరాడకుండా కావలించుకోవటమో, లేక మీదపడి ముద్దు పెట్టుకోవటమో, భుజం మీద వాలి భోరున ఏడ్చుకోవటమో చేసేదీ..!
పద్దెనిమిదేళ్ళు. అంటే పెళ్ళికి ముందు రెండేళ్ళూ, పెళ్ళి తర్వాత పదహారేళ్ళూ ప్రియుడితో కలిసి బతికేశాక, అనిపిస్తోంది-అతని మీద ప్రేమ కలిగి వుంటే బాగుండునూ- అని. ఇన్నాళ్ళూ కలగకపోతే పోయె! ఇప్పుడు.. ఇప్పటికిప్పడు కలగవచ్చు కదా! అది కొన్ని క్షణాలయినా ఫర్వాలేదు. ఆకలి వెయ్యటానికి వున్నట్లు ప్రేమకలిగించటానికీ ‘ఎపటైజర్లు’ ఎందుకు లేవు?

ఇలా అనుకుంటూ, హస్పటల్‌ నాలుగో అంతస్తులోని రెస్సారెంట్లో నెస్‌కెఫె కాఫీ తాగుతూ, అద్దాల్లోంచి బంజరాహిల్స్‌ ట్రాఫిక్‌ను చూస్తోంది ఇవాంజెలిన్‌.
శబ్దంలేని దృశ్యమేమో, కార్లమీద కార్లు, బైక్‌ల మీద బైక్‌లూ, ట్రక్కుల మీద ట్రక్కులూ పడిపోతున్నా, నింగిలో తెల్లని దూదిమబ్బుల ఊరేగింపులా మెత్తగా కదలిపోతున్నట్లుగానే వుంది. బహుశా తన జీవితమూ ఇంతేనేమో! ఇలా అద్దాల్లోంచి చూసే వాళ్ళకి సాఫీగా వెళ్ళిపోతున్నట్లు కనిపించవచ్చు.

ఆదిత్య అందగాడు. కానీ అలా అంటే, ఇప్పడెవ్వరూ ఒప్పకోరు. నల్లని బొగ్గులా మారిపోయాడు. చేర్పించిన రోజునే డాక్టర్ చెప్పారు కాలేయం మొత్తం దెబ్బతిందని. ఒక పెద్ద డాక్టరయితే, అదే ముక్కను ఇంగ్లీషులో అన్నాడు కాస్త కోపాన్నీ, ఎక్కువ జాలిని మేళవిస్తూ- ’హి హేజ్ నో లివర్ ఎట్ ఆల్- అని.
కానీ, ఇప్పుడనిపిస్తోంది ఇవాంజెలిన్ కు, అదే డాక్టరు ఈ క్షణంలో తనను పరీక్ష చేస్తే, ’నీకు హృదయమే లేదు.. యూ హేవ్ నో హార్ట్ ఎట్ ఆల్‘ అని ముఖం మీద చెబుతాడు.

భర్తగా మారిన ప్రియుడు ఆదిత్య గౌడ్ ను గ్రౌండ్ ఫ్లోర్లో వున్న ఐసీయూ లో. చేర్పించి వారం అయ్యింది. బతికే
అవకాశం చాలా తక్కువ. అయినా ఎంతయినా ఖర్చుపెట్టాలని నిర్ణయించుకుంది. ప్రాణమున్నంతవరకూ పైసలు పొయ్యాల్సిందే అని తనకు తాను చెప్పేసుకుంది. తీరా అతడు చనిపోయాక- చెయ్యాల్సింది చెయ్యలేక పోయానే- అన నేర భావన ఆమెకు వుండకూడదు. నిజం చెప్పాలంటే ఆదిత్య మీద కాదు, తన మీద తాను ఖర్చుచేసుకుంటోంది.
ఆఫీసుకు వెళ్ళే ముందు ప్రతీ రోజూ ఇలా ఆసుపత్రికి రావటమూ, నిశ్చలనంగా బెడ్ మీద వున్న ఆదిత్యను చూడటమూ, ఇలా పైకి వచ్చి ఒక కప్పు కాఫీ తాగటమూ గత ఏడు రోజులుగా చేస్తూ వుంది.

ఆదిత్య అందగాడు. కానీ అలా అంటే, ఇప్పడెవ్వరూ ఒప్పకోరు. నల్లని బొగ్గులా మారిపోయాడు. చేర్పించిన రోజునే డాక్టర్ చెప్పారు కాలేయం మొత్తం దెబ్బతిందని. ఒక పెద్ద డాక్టరయితే, అదే ముక్కను ఇంగ్లీషులో అన్నాడు కాస్త కోపాన్నీ, ఎక్కువ జాలిని మేళవిస్తూ- ’హి హేజ్ నో లివర్ ఎట్ ఆల్- అని.
కానీ, ఇప్పుడనిపిస్తోంది ఇవాంజెలిన్ కు, అదే డాక్టరు ఈ క్షణంలో తనను పరీక్ష చేస్తే, ’నీకు హృదయమే లేదు.. యూ హేవ్ నో హార్ట్ ఎట్ ఆల్‘ అని ముఖం మీద చెబుతాడు.

ఓ అర్థగంట క్రితమే గ్రౌండ్ ఫ్లోర్ లో కుడి చెయ్యీ, కుడి కాలూ ఆడటంలేదంటూ ఓ పండు ముసలాయన్ని ఇదీ ఐసీయూ కు స్ట్రెచర్ మీద తెచ్చారు. ఆయన భార్య కాబోలు. ఎనభయ్యేళ్ళుంటాయి. వెనకాలే నడవలేక నడవలేక నడుస్తూ కుప్పకూలిపోయింది. పక్కవాళ్ళు లేవదీసి స్టీల్ సోఫాలో
కూర్చోబెడితే, ధారాపాతంగా ఏడ్చి, తేరుకుంది. నిర్మలంగా వుంది ఆవిడ ముఖం.

తానూ ఏడ్చివుంటే బాగుండును. ఆసుపత్రికి తెచ్చినప్పుడు దుఃఖమే రాలేదు. తర్వాతయినా రావచ్చు కదా! పోనీ ఇప్పటికి ఇప్పుడయినా ఏడ్వవచ్చుకదా! ఏడుపులంటే ఇష్టమైన జ్ఞాపకాలేనేమో!

ఆదిత్యను అలాగే స్ట్రెచర్ మీద తీసుకు వెళ్ళినప్పుడు కానీ, బెడ్ మీద పడుకోబెట్టి ఆక్సిజన్అమరస్తున్నప్పడు కానీ, ఒక్కటంటే, ఒక్క తీపి జ్ఞాపకమూ ముంచుకురాలేదే…! పైపెచ్చు అతడు ప్రేమకు తెగించిన వాడూ, తెగించి పెళ్ళాడినవాడూనూ..! ఎన్ని స్మృతులు వుండాలీ?
పోనీ తన పదహారేళ్ళ కూతురు ప్రీతీ గౌడ్ ను చూసయినా గుండె కరగాలి కదా! ’డాడీ..నీకేం కాలేదు డాడీ. ! యూ ఆర్ వెల్ డాడీ!’ అంటూనే ఐసీయూ లో భోరుమంది. తర్వాత కొద్ది సేపటికే ప్రీతి కళ్లు తేటబడ్డాయి. కానీ తాను నీళ్ళు ఇచ్చినా తాగలేదు. తాగదని తెలిసి కూడా ఇచ్చింది. అది వేరే విషయం. అమ్మ అంటే ప్రీతికి అంత ద్వేషం. అయితేనేం? కొన్నినిమిషాలకే తన కిష్టమైన మిల్క్ షేక్ తెచ్చుకుని తృప్తిగా తాగింది.
తేరుకోవటం తక్షణావసరమయిపోతుందందరికీ.

ఆ రోజు ముసలావిడ కూడా అంతే, ఏడ్చి, తేరుకున్నాక, వెచ్చటి టీ ఇస్తే.. వేడికప్పును తన చీర కొసతో చుట్టుకుని, నోటిదగ్గర పెట్టుకుని, బోసినోరుతో ఉఫ్ ఉఫ్ మని ఊదుకుంటూ, చల్లార్చుకుంటూ, చప్పరిస్తూ దుఃఖం నుంచి సులభ వాయిదాల్లో బయిటపడి పోయింది. వీళ్ళు తేరుకోవటం కోసం ఏడుస్తున్నారా? ఏడ్చి తేరుకుంటున్నారా?
ఏమయినా ఈ ఇన్స్టెంట్ రిలీఫ్ కు తాను నోచుకోలేదు. ఎందుకూ? అసలు తనకి దుఃఖమే లేదా, అంటే చెప్పలేదు. కాస్సేపు ఉందనుకుంటుంది. కాస్సేపు లేదనుకుంటుంది. ఉంటే రావాలి కదా..? రాదే..! ఎంత గింజుకున్నా రాదే..!

ఆదిత్యతో వున్న ఏదో ఒక్క గుర్తు కోసం, ఒకే ఒక్క గుర్తు కోసం.. ముచ్చటైన ఒకే ఒక గుర్తుకోసం ఎంతగానో ప్రయత్నిస్తోంది ఇవాంజెలిన్. బోసినోటి ముసలావిడను చూసినప్పటినుంచీ, ఒక మంచి జ్ఞాపకం కోసం తెగ
ఆరాటపడిపోతోంది.
‘ఏమో! నా కళ్ళు నాకు తెలియకుండా తడిసాయేమో..!‘ ఇలా అనుకుందో లేదో, తన చేతిలోని పేపర్ కప్పుని నలిపి డస్ట్ బిన్ లో వేసి, వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి అద్దం లో చూసుకుంది. మెరిసే కళ్ళే, కానీ తడిసిన కళ్ళు కాదు. కాస్సేపు తన ముఖాన్ని తేరిపార గమనిస్తూనే వుండిపోయింది. చెక్కు చెదరని ఛాయ. మేకప్ తో పని లేని ముఖ కాంతి. ఈ వెలుగులో వేడిమి వుందని తను మాత్రం తెలుసా యేమి? కానీ ఈ ఉష్ణానికి ఆదిత్య మాడిమసయిపోయాడు. అలా అనుకుంటూ నవ్వుకుంది. ముత్యాలు
గుదిగుచ్చినట్లున్న తన పలువరస. ఇప్పుడొస్తున్నాయి జ్ఞాపకాలు వరుసగానే. ఇందులో ఒక్కటయినా తియ్యనది వుండక పోతుందా..!?

పరుగున వచ్చింది ప్రీతి. ’చంపాసేవంటే .. మా డాడీని చంపేసావంటే…!’ అంటూ ఇవాంజెలిన్ ను కొట్టబోయినంత పని చేసింది. ఇవాంజెలిన్ కదల్లేదు, మెదల్లేదు. రాతి విగ్రహంలానిలుచుంది. కాకుంటే ఎప్పుడు తీసిందో హ్యాండ్ బ్యాగ్ లోనుంచి మొబైల్ తీసింది. ఫలితంగా ఎవరూ ఆదిత్య వాళ్ళ వూరు వెళ్ళలేదు. అంబులెన్స్ వచ్చి, ఆదిత్యను ఇదుగో ఈ హాస్సటల్ కు తెచ్చిపడేసింది.


అఫ్జల్ గంజ్ గవర్నమెంట్ డెంటల్ కాలేజిలో బీడియస్ చదివే రోజులు. ఒకళ్ళకొకళ్ళు వరసలు కలుపుకునే ముందు పలువరసలు చూసేవారు. ఇవాంజెలిన్ పలువరస చూసే భాగ్యం ఆమె సీనియర్లకు దక్కేది కాదు, వాళ్ళు చేసి ర్యాగింగ్ ఏడిపించటానికి కానీ, నవ్వించటానికి కాదు కదా! ఇలా సీనియర్లు వెళ్ళగానే. వాళ్ళ మీద ఫ్రెషర్లు కామెంట్లు చేసుకుంటారే, అప్పడు మాత్రం, ముడుచుకున్న ముఖాలు వికసించేవి.

తన బ్యాచ్ మేట్ భోగేశ్వర రెడ్డి అయితే మరీను. అంతవరకూ తలవంచుకుని నోట్లో నాలుకే లేనట్లుండేవాడా.. ఇలా సీనియర్లు వెళ్లారో లేదో, అలా మొదలు పెట్టేసేవాడు, ‘ఫాఫా, ఫక్క చూఫులు ఆఫి, ఒక ఫాట ఫాడు..’ అని క్షణం క్రితం వీరంగమాడిన వెలితి పళ్ళ సీనియర్ ని వెక్కిరించేవాడు. రెండు పళ్ళ మధ్యనుంచి వచ్చే గాలితో ’ఫ‘ గుణింతాన్ని అంత ‘ఫక్కా’గా ‘ఫ’లక వచ్చని, భోగేశ్వరరెడ్డి మిమిక్రీ ద్వారా మాత్రమే తెలిసేది. ఇవాంజెలిన్ నవ్వుతూనే వుండేది. ‘ఆపకండి. ఆపకండి. అలాగే నవ్వండి. కోల్గేట్ కంపెనీ వాళ్ళొస్తున్నారు. యాడ్ ఫిల్మ్ షూట్ చేసుకోవటానికి. ఇంత అందమైన పలువరస, వాళ్ళకు మాత్రం ఎక్కడ దొరుకుందీ…?’ అనే వాడు కూడా.
అదేమిటీ? ఆదిత్య తీపి గుర్తులు కదా తెచ్చుకోవాల్సీందీ, భోగేశ్వరరెడ్డివి వస్తున్నాయేమిటి? అది అంతే. ఆదిత్య అంటేనే ఆద్యంతం చేదు. తీపి పక్కనే చేదు. కాదు, కాదు, తీపి వెంటే చేదు. భోగేశ్వర రెడ్డి వెంటే ఆదిత్య గౌడ్.
భోగేశ్వరరెడ్డి కబుర్ల పోగు. అతడుంటే సంతోషమే సంతోషం. అయితే, అది తీపి కాదు, తీపి పూత మాత్రమే, అని చెప్పింది ఆదిత్యే. అది కూడా వెంటనే కాదు, కాలేజీలో చేరిన నాలుగు నెలల తర్వాత. అప్పటికి ఈ చేదు మనిషి ఆదిత్య తనకు తెలియకుండానే దగ్గరవుతూ వచ్చాడు.
ఆదిత్య పెద్దగా మాట్లాడడు. నవ్వటమూ, నవ్వించటమనేవి అతనికి అందని యోగ విద్యలు. అయితేనేం? కాదనలేని స్థితిలో కాలికి అడ్డబడతాడు. ఇవాంజెలిన్ అమ్మ కు బాగా లేదని ఇవాంజెలిన్ కే తెలుస్తుంది. వెంటనే కొంపల్లి వెళ్ళాలని కూడా ఇవాంజెలిన్ కు మాత్రమే తెలుస్తుంది. కానీ, అక్కడకు ఇవాంజెలిన్ వేగంగా చేరుకోవాలని మాత్రం ఆదిత్యకు తెలుస్తుంది. వెంటనే బైక్ తో సిధ్ధంగా వుంటాడు. కాదనలేదు ఇవాంజిలెన్. గంట ప్రయాణంలోనూ ముక్క మాట్లాడడు. చనువు తీసుకోడు. బైక్ మీద వున్నప్పుడు కూడా తనను తాకాలనే తహతహ సైతం వుండేది కాదు. ఇవాంజెలిన్ బైక్ మీద ముడుచుకుని కూర్చుంటే, అలాగే కూర్చోనిచ్చే వాడు. ఆదిత్య సాయం తీసుకోవటం ఇవాంజిలిన్ కు అసలు నచ్చేది కాదు. కానీ తీసుకోకుండా వుండటం కుదిరేది కాదు. సిటీబస్సు మిస్సయినప్పుడు, మీద నుంచి పోనిస్తున్నట్టుగా వచ్చి ఆపిన ఆటో డ్రైవర్ లాంటి వాడు ఆదిత్య. ఆటోవాడి మొరటుతనం విసుగనిపించినా కూడా, ఆటో ఎక్కుతామా? లేదా? ఆదిత్య అవసరం కూడా అలాగే ఏర్పడేది. కాలేజీ ఫీ కౌంటర్ దగ్గర, కేవలం అయిదే అయిదువేలు రూపాయిలు తక్కువయ్యాయి. ‘రేపు పే చెయ్యవచ్చు. లాస్ట్ డేట్ వుంది కదా!’ అని క్లర్క్అంటూనే వున్నాడు. ఈ లోగా వెనక నుంచి ఆదిత్య హస్తం అయిదువేలతో. అతడు చేసేది చేతి సాయమే. కానీ మెల్లమెల్లగా ఇవాంజెలిన్ అతడి చెప్పుచేతల్లోకి వెళ్ళిపోతోంది. అతడు ఎప్పడు క్యాంటీన్ కు రమ్మన్నా వెళ్ళిపోయేది.
అతని కంపెనీ ఇష్టమయ్యి కాదు, ’నో‘ అనటానకి మనస్కరించక. కానీ, అదే సమయానికి ఎలా వచ్చేవాడో, అరెస్టయిన తనకు బెయిలు ఇవ్వటానికి అన్నట్లు వచ్చేవాడు భోగేశ్వరరెడ్డి. అప్పడు ఉక్కబోత పోయి, చల్లని గాలి వీచినట్లు అనిపించేది.

ఆ చల్లదనం కూడా సహజం కాదని, ఒక రోజు భోగేశ్వరరెడ్డి వెళ్ళగానే, ఆదిత్య చెప్పాడు: ’జాగ్రత్త.
మిమ్మల్ని వారం తిరక్కుండా పడేస్తానని బెట్ కట్టాడు.‘ అని. ఇవాంజెలిన్ బిత్తర పోయింది. రోడ్డుపక్కగా తన మానాన, తాను నడుచుకుంటూ వెళ్తుంటే, గుంతలోనుంచి కారు పోనిస్తూ, మురికి నీటితో చీరంతా తడిపి పోయే ర్యాష్ డ్రైవర్లా అనిపించాడు భోగేశ్వరరెడ్డి.
’పడెయ్యటమా.. ? వారంలోనా..?‘ అని పైకి అనేసింది ఏవగింపుగా ముఖం పెడుతూ ఇవాంజెలిన్.
‘మీ కేటగిరీ అమ్మాయిలకు వారం ఎక్కువ అంటాడు,’ భోగేశ్వరరెడ్డి భాగోతానికి బ్రేక్ ఇవ్వటంలేదు ఆదిత్య.
‘మా కేటగిరీయా..? అంటే..?‘
’మేరీ జాస్మిన్ , విక్టోరియా, రూత్ ఏంజెల్.. వీళ్ళు. మేరీ, విక్టోరియాలనయితే, ఇప్పటికే లైన్లో పెట్టేశాడు.’ ఈ మాట అనటం ఆదిత్య పూర్తిచేశాడో, లేదో.. చాచిపెట్టి ఆదిత్య చెంపమీద ఒక్కటిచ్చింది ఇవాంజెలిన్. ’ఇడియట్స్.. !ఏమనుకుంటున్నార్రా మాగురించీ… ? వాడెవడో మొరిగితే.. నువ్వూ అదే మొరగాలా…పళ్ళు రాలిపోతాయి..’ ఇవాంజెలిన్ ఊగిపోయింది. అక్కడున్న వారంతా అవాక్కయి చూస్తూ వుండి పోయారు. ఆదిత్య కూడా ఎందుకనో ఎదురుగా ఒక్క మాట కూడా అనకుండా, అలాగే కూర్చుండిపోతే, ఇవాంజెలిన్ అక్కడ నుంచి చివాల్న లేచి వెళ్ళిపోయింది.

ఆరోజంతా ఆమె మనసు మనసులో లేదు. ’భోగేశ్వర రెడ్డి గాడు రోగ్. వాడన్న మాటల్నేకదా ఆదిత్య చెప్పాడు? పైపెచ్చు అలర్ట్ చేశాడు. కాకుంటే అంతే పచ్చిగా చెప్పాడు. మసిబూసి చెప్పటం ఆదిత్యకు రాదు కూడా..! అలాంటిది.. ఆదిత్యను … ఛ.ఛ…! ’ గుర్తు తెచ్చుకునే కొద్దీ, తన మీద తనకు చికాకు పెరిగిపోయింది. ఎప్పుడు తెల్లవారుతుందా,
ఎప్పుడు కాలేజీ తెరుస్తారా అని చూసింది. ఎప్పడూ ఆదిత్య చేసే పనే అది. ఆ రోజు తాను చేసింది. దారి కాసింది. ఆదిత్య బైక్ ను ఆపింది. క్యాంటీన్ కు తీసుకు వెళ్ళింది. అతని చేతుల్ని తన రెండు చేతుల్లోకి తీసుకుని, ‘ఆదీ, నన్ను క్షమిస్తారా..?‘ అని నీళ్ళ కళ్ళతో అడిగేసింది.
’ఈవ్..! నాకు స్వీట్ కోటింగ్ తెలీదు. భోగిగాడు అంతే. వాడే కాదు. చాలా మంది అంతే. మీ వాళ్ళంటే చులకన.
అడిగావ్ కాబట్టి చెబుతున్నాను. నాకు నువ్వు సారీ చెప్పకు. ఎందుకంటే నువ్వు నాదానివనుకున్నాను….‘ అని ఇంకా ఏదో చెప్పబోతున్నాడు ఆదిత్య. ’అంటే..?‘ అని మళ్ళీ సీరియస్ గా అనేసింది ఇవాంజెలిన్.
’చూశావా..? నాకు ఇది కూడా చెప్పటం రావట్లేదు. నువ్వే నా లైఫ్ పార్టనర్ అని డిసైడ్ అయిపోయాను. నువ్వు కాదంటే సింగిల్ గా వుండిపోతాను.‘ అని ప్రతిపాదించాడు ఆదిత్య.

అంతే. అతడంతే. తిరస్కరించటానికి వీలు లేకుండా చేస్తాడు. ఆ తర్వాత అతడు క్షణం ఆలస్యం చెయ్యలేదు. ఫలితంగా రిజిస్టర్ ఆఫీసులో చట్టబధ్ధంగా పెళ్ళయిపోయింది. నాటి ఎంసెట్ ను అప్పటికే ఇద్దరూ మూడేసి యేళ్ళు, మూడేసి సార్లు రాసి వుండటం వల్ల, వాళ్ళ వయసులేమీ ఆ పనికి తక్కువ కాలేదు.

ఆదిత్యను అందరూ ’అఛీవర్‘ అంటారు. అనుకున్నది సాధిస్తాడు. అందుకోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు. ఆదిత్యది సంగారెడ్డి దగ్గర చిన్నపల్లె. వాళ్ళ తల్లిదండ్రులకు ఏకైక సంతానం. వాళ్ళ నాన్నయితే ముందు కల్లు వ్యాపారం చేసి, తర్వాత అయిదెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఇవాంజెలిన్ ను చేసుకున్నారని తెలుసుకున్నాక, కొడుకును ఇంటి గుమ్మం తొక్కవద్దన్నాడు. ఆదిత్య విషయం తెలుసుకున్న వాళ్ళ నాయనమ్మ ఏకంగా ఉరేసుకుంది.
ఆదిత్య షాకయ్యాడు కానీ, దానిని పంతంగా మార్చుకున్నాడు. చదువు కుంటూనే, రియల్ ఎస్టేట్లో తల దూర్చాడు. కసిగా సంపాదించాడు. రెండేళ్ళలో ఇవాంజెలిన్ కు ప్రీతి గౌడ్ పుట్టేసింది. పాపకు మూడేళ్ళొచ్చాక, ఇవాంజెలిన్ కోసం డెంటల్ క్లినిక్ తెరిచాడు.

ఆదిత్య కొత్త పిచ్చి ఇవాంజెలిన్ కు కూడా వచ్చింది. ఆమెకూడా సంపాదనవైపు దృష్టి పెట్టింది. కాస్మెటిక్ డెంటిస్ర్టీ మీద పట్టు సాధించింది. పలు వరసను సరిచెయ్యించుకోవటంలో టీవీ యాంకర్లూ, రిసీప్షినిస్టులూ
తన తొలి క్లయింట్లయ్యారు. వాళ్ళేమిటి నవ్వటమే వృత్తిగా వున్న వాళ్ళంతా క్యూ కట్టారు.
క్రమేపీ ఆదిత్య కూడా ఇంటిపట్టున వుండటం తగ్గిపోయింది. బిజినెన్ నిమిత్తం పార్టీలిచ్చే పేరు మీద తాగటం అనేది, రోజు వారీ పని నుంచి పూట వారీ పనిగా మారిపోయంది.

ఆదిత్య తల్లి, దండ్రుల ఆరోగ్యం క్షీణించింది. వాళ్ళను చూడటానికి ఊరు వెళ్ళి వస్తూ వుండే వాడు. అక్కడ కూడా తన కొడుకు భూములు కొనటం తండ్రికి నచ్చింది.

ముందు రాత్రిళ్ళు ఇంటిరావటం మానేసిన ఆదిత్య, మెల్లమెల్లగా ఇవాంజెలిన్ తో మాట్లాడటమే తగ్గించాడు. తర్వాత, తర్వాత ఇవాంజెలిన్ తన చేత్తో టీ ఇచ్చినా తాగే వాడు కాడు. ఒక వేళ ఇంటికి వచ్చినా, మూడు పూట్లా విస్కీతోనే వుండే వాడు. కూతురు ప్రీతిని మాత్రం చేరదీసి మాట్లాడే వాడు. ప్రీతికి ఊహ తెలియనప్పుడు మాత్రమే అమ్మకూచి, తర్వాత పూర్తిగా నాన్న కూచి అయిపోయింది. ఆదిత్య ఆదాయం ఎంత పెరిగిందో, ఆరోగ్యం అంత తరిగింది. దాదాపు మంచం పట్టేశాడు.
అందుకు కారణం తన తల్లే అని ప్రీతి గట్టిగా నమ్మేసింది. ఒక పక్క మంచం మీద చిక్కిశల్యమవుతున్న నాన్న, మరొక పక్క అందంలో అరవీసం తగ్గని అమ్మ. దానికి తోడు ఇవాంజెలిన్ ప్రతీ రోజు ఫిల్మ్ స్టార్ లా తయారయి, తన డెంటల్ క్లినిక్ కు వెళ్తుండేంది. దాంతో ప్రీతికి రాకూడని అనుమానం కలిగింది. తన నాన్న కాకుండా, తన తల్లికి వేరే ఎవరితోనయినా ఎఫయిర్ వుందేమోనని తన టీనేజ్ బుర్రకు తట్టేసింది. దాంతో తాను కూడా తల్లి చేత్తో ఏమిచ్చినా తిరస్కరించేది.
ఈ లోగా ఆదిత్య తండ్రి చనిపోయినట్లు వార్త. ఆదిత్యను వీల్ చైర్లోనయినా కూర్చోబెట్టి, కారులో ఊరికి
తీసుకు వెళ్దామని సన్నధ్ధమయ్యింది ఇవాంజెలిన్. మరో ఫుల్ బాటిల్ విస్కీ ఎత్తిపట్టి, కూతురు సాయింతో వీల్ చైర్ తోనే కూర్చున్నాడు. అప్పుడు మాత్రం ఇవాంజెలిన్ కళ్ళల్లోకి తన ఎర్రటి కళ్ళతోచూసి, : ’నువ్వు రావద్దు. ఇప్పటికే ఇద్దర్ని పంపేశావ్. నువ్వొస్తే మూడో చావు చూడాలి. నా తల్లినయినా బతకనివ్వు.‘ అని అన్నాడు ఆదిత్య. వెనువెంటనేఎదురుగా వున్న ఆమె నల్లని చీర మీద భళ్ళున వాంతి చేసుకున్నాడు.

పరుగున వచ్చింది ప్రీతి. ’చంపాసేవంటే .. మా డాడీని చంపేసావంటే…!’ అంటూ ఇవాంజెలిన్ ను కొట్టబోయినంత పని చేసింది. ఇవాంజెలిన్ కదల్లేదు, మెదల్లేదు. రాతి విగ్రహంలానిలుచుంది. కాకుంటే ఎప్పుడు తీసిందో హ్యాండ్ బ్యాగ్ లోనుంచి మొబైల్ తీసింది. ఫలితంగా ఎవరూ ఆదిత్య వాళ్ళ వూరు వెళ్ళలేదు. అంబులెన్స్ వచ్చి, ఆదిత్యను ఇదుగో ఈ హాస్సటల్ కు తెచ్చిపడేసింది.

ఇంతకు మించి ఆదిత్యకు చెందిన గుర్తులు రావటం లేదు ఇవాంజెలిన్ కు. అద్దం ముందే తన కళ్ళను తాను
చూసుకుంది. ఏమాత్రం చెమ్మా వచ్చి చేరలేదు. అదే దిగులుతో లిఫ్ట్ లో కిందకు వచ్చి, ఐసీయూ లో ప్రవేశించింది. అదే బెడ్, అదే ఆదిత్య, కాకుంటే ముఖం మీద తెల్లని షీట్. చూస్తే, చేతికున్న సెలైన్ గొట్టంతో పాటు, ఆక్సిజన్ మాస్క్ కూడా వేలాడుతూ వుంది.

ఇవాంజెలిన్ కు తెలిసి పోయింది. ఇప్పుడస్సలు రాదు ఏడుపు అని. బిల్లులన్నీ కట్టి, ఆదిత్య భౌతిక కాయాన్ని, అతడి ఊరుకు తరలించి, అంత్య క్రియలు జరపించి, పదవ రోజునాటికే, భారీ ఖర్చుతో సమాధి కట్టించింది కూడా.
అందరూ వెళ్ళిపోయినా, సమాధికి చేరబడి చుట్టూ చూస్తోంది. ఏదో తెలియిని విముక్తి. చెంగుచెంగున గోవు పరుగెత్తుతున్నా, పైన పక్షులు ఎగురుతున్నా, కడకు పక్కనే వున్న తేటనీటి చెరువులో చేపలు ఈదుతున్నా.. అవన్నీ బంధనాలు తెంచుకున్న సంబరంలో వున్నాయనుకుంది.

ఈలోగా అలాంటిదే మరొక దృశ్యం. ఓ అమ్మాయి పరుపరుగున వస్తోంది. తనవైపే. ఎవరో కాదు. తన కూతురే.
ప్రీతీయే. ఇది మాత్రం విముక్తి కాదు. బంధనమే. అక్కడనుంచి తొలగి పోవాలనుకుంది. వేరే వైపు నడవబోయింది. కానీ బంధనం. తనను వెనక నుంచి రెండు చేతులతో బంధించిన బంధనం.
’మమ్మీ!’
ఈ పిలుపు విని యుగాలయింది. చటుక్కున తిరిగి తన కూతుర్ని చూసింది. ప్రీతి కళ్ళు నీళ్ళల్లో తేలుతున్నాయి.
’మమ్మీ! నువ్వు జోగినికి పుట్టావా..?! ‘
ఇవాంజెలిన్ కు ఒక్కసారిగా గుండె ఝళ్ళుమంది. అయినా వెనక్కి తిరగలేదు.
’ నీ టెన్త్ సర్టిఫికెట్ చూశాను.. కాలేజిలో సబ్మిట్ చెయ్యమంటేనూ.. ఇవాంజెలిన్ డాటర్ ఆఫ్ దేవుడు అని వుంది. ఫాదర్ఎ వరో తెలియక పోతే, స్కూల్లో దేవుడు అని రాస్తారట కదా. మా హిస్టరీ మ్యాడమ్ చెప్పింది. డాడీ నిన్ను అందుకా.. దూరం పెట్టే వాడూ….!?’ అంటూ ముందు వైపుకు వెళ్ళి మరోసారి తల్లినిహత్తుకుంది.

ఆమె ముఖంలో కి చూసి, ’డాడీకి ఈ విషయం ముందు తెలియదా?‘ అని అడిగింది కూడా.
’తెలిసే చేసుకున్నాడు. నన్ను పొందటానికి పెళ్ళి తప్ప మరో ఛాయస్ లేదు. ఉంచుకుంటానంటే ఒప్పుకోను. అందుకే చేసుకున్నాడు. చేసుకునే వరకూ నేనే కనిపించాను. తర్వాత నన్ను పుట్టించిన దేవుడు కనిపించాడు..‘ శూన్యంలోకి చూస్తూ బదులిచ్చింది ఇవాంజెలిన్.
’యూ మీన్ క్యాస్ట్…!?’ అంటూ అమ్మ భుజం మీద వాలిపోయింది ప్రీతి. అప్పడు మాత్రం ఇవాంజెలిన్ కు ఏడుపు తన్నుకుంటూ వచ్చింది. భుజాలు కుదుపుకుంటూ రోదించింది. ఆ కుదుపులకు కదులుతున్న తన ముఖాన్ని, ఆ ముఖంలోని తన రెండుకళ్ళనూ సమాధి వైపు సారించింది ప్రీతి.

సమాధి ఫలకం మీద ఈ పదాలు రాసి వున్నాయి:
పరువే ఇతనికి ప్రాణం

-సతీష్ చందర్

(ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం, 25 డిశంబరు 2022 సంచికలో ప్రచురితం)


Leave a Reply