మోడీ ఒప్పేసుకున్న ‘మూడు అబధ్ధాలు’!


పిడికిలిని బిగించటం సులువే; సడలించకుండా వుండటమే కష్టం. అలా ఎంతసేపని బిగించి వుంచగలరు? కొన్ని గంటలు, లేదా కొన్ని రోజులు, కాకుంటే కొన్ని వారాలు. ఇదేమిటి? ఏకంగా ఏడాది పాటు సడలకుండా వుండటమేమిటి? చర్మాన్ని వాన తడిపేసినా, వేళ్ళను వాన కొరికేసినా, ముంజేతిని ఎండ కాల్చేసినా అదే బిగింపు. రైతు పిడికిలి.


అయినా బెట్టు. ‘అధికారం మీద వొట్టు, మెట్టు కూడా దిగనన్న కేంద్రంలోని సర్కారు బెట్టు. ఒకటికి రెండు సార్లు ఒకే వ్యక్తిని పీఠం మీద కూర్చోబెడితే ఏ ప్రధానికయినా వచ్చే బెట్టు. ఒకప్పటి ఖద్దరు నేత ఇందిరమ్మా ఇలాంటి బెట్టే చేసి, ఎమర్జన్సీ పెట్టారు. ఇప్పటి కాషాయ నేత మోడీ ఇదే బెట్టు చేశారు. చాలా మంది నేతలంతే. చరిత్ర చెవి మెలిపెట్టి చెప్పినా పాఠాలు నేర్చుకోరు. నిలబడ్డ కాళ్ళ కింద మట్టి జారిపోతే కానీ, తెలివిలోకి రారు. మోడీ అదే చేశారు. కడకు వచ్చారు. అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ఇంకేముంది? బెంగాల్‌లో పులులు గాండ్రించటం మానేసి ‘న.మో’ అంటున్నాయనుకున్నారు. కానీ అన లేదు. అందుకు భిన్నంగా ‘దీదీ’ అన్నాయి. కేరళ, తమిళనాడులో బీజేపీ అలికిడే లేదు. ఇవి ఈ ఏడాది (2021) మార్చిలో జరిగిన ఎన్నికలు. పోనీ, తర్వాతయినా పరిస్థితి మారిందా? అంటే మారింది. కానీ ఆ మార్పు పెనం మీంచి పొయ్యిలోకే. మళ్ళీ ఇదే ఏడు అక్టోబరులో మూడు పార్లమెంటు సీట్లకూ, 30 అసెంబ్లీ సీట్లకూ ఉప ఎన్నికలు జరిగాయి. వాటిల్లో సంతృప్తీ లేదు; అసంతృప్తీ లేదు. సగానికి సగం వైరి పక్షాల పాలయ్యాయి. ఇదే స్పీడులో వెళ్ళిపోతే, వచ్చే ఏడు (2022) పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ లతో పాటు మరో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో, బీజేపీకి ఇంతకు మించి గొప్పతీర్పు వస్తుందన్న హామీ లేదు.

వేలు చూపితే వణికిన సర్కారు
ఇప్పుడు కూడా బెట్టు చేస్తే ఎలా వీలవుతుంది? వీడాల్సిందే! రైతును అణచివెయ్యటానికి తుపాకుల వంటి మారణాయుధాలతో పోలీసులనూ, సైన్యాన్ని దించుతాయి సర్కారులు… కేంద్రంలో అయినా, రాష్ట్రంలో అయినా. అనుకుంటాం కానీ, అన్నీ ఊపిరి తక్కువ ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వాన్నయినా వేలితో కూల్చెయ్యవచ్చు. అవును ఓటరు తలచుకుంటే, ఒకే ఒక్క చూపుడు వేలితో కూల్చి వేస్తాడు. అతడి వేలి మీద చుక్క తడి ఆరకుండానే సర్కారు కుప్పకూలి పోతుంది. అయినా వోటరుతో అయిదేళ్ళూ పరాచికాలాడతాయి. ఆ వోటరు రైతు కూడా కావచ్చు కదా! కావచ్చేమిటి? అతడే రేపు పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌లో కీలకమైన వోటరు కాబోతున్నాడు.

మూడూ మూడు అబధ్ధాలు
అందుకే రైతుతో ఆడిన ‘మూడు అబధ్ధాలనూ’ ప్రధానిగా నరేంద్ర మోడీ నేడు -అనగా 19 నవంబరు 2021, గురునానక్‌ జయింతి నాడు- వెనక్కి తీసుకున్నారు. పంజాబ్‌, హరియాణలోని సిక్కు రైతు తొట్టతొలుత ఆనందించాలని. ఈ రోజుకు అవి మూడు అబధ్ధాలు. ఇంతవరకూ అవి మూడు చట్టాలు, అంతకు ముందు మూడు బిల్లులు, ఇంకా ముందు, మూడు ఆర్డినెన్సులు. ఇంతవరకూ మోడీ దృష్టిలో అవి ‘మూడు సత్యాలే’ .


ఇంకా చెప్పాలంటే, రైతుకు తన సర్కారు ఏరి, కోరి ఇచ్చిన ‘మూడు వరాలు’: రైతుల ఉత్పత్తుల వర్తక వాణిజ్యాల చట్టం, ఒప్పంద ధర హామీ, క్షేత్ర సేవల చట్టం, నిత్యావసర వస్తువుల చట్టం.

-‘మీరు పండించిన పంట సర్కారు ద్వారానే, సర్కారు నిర్ణయించిన ధరకే అమ్ముకోవాల్సిన ఖర్మ ఏమిటి? ఎంచక్కా ఏ దళారికో తెగనమ్ముకోవచ్చుకదా?’ అన్నది మొదటి వరం.

-‘ఆ మాటకొస్తే, పంటకోసేవరకూ ఎందుకూ? నాట్లు వేసినప్పుడే రాబోయే పంటకు చౌక బేరం పెట్టేసుకోవచ్చు కదా!’ ఇది రెండవ వరం. ‘

-దోచుకున్న వాడికి దోచుకున్నంత లాగా, దాచుకున్న వాడికి దాచుకున్నంత. పంటంతా దాచేసుకుని, చేసిన అప్పులకు వడ్డీల మీద వడ్డీలు కట్టేసుకుని, వీలునప్పుడు అమ్మేసుకో వచ్చు కదా!’ ఇదేమో మూడవ వరం.


జాగ్రత్త గా చూస్తే, మార్కెట్టనే కత్తితో రైతు కడుపులో పొడిచిన చోటే, మూడు పోట్లు పొడిచినట్లు లేదూ? అందుకే అమాయకపు రైతు కూడా, ఈ మూడు చట్టాలూ, మూడు అబధ్ధాలని ముందే గ్రహించేశాడు. ఈ ‘మూడు అబధ్ధాల’నూ వెనక్కి తీసుకోవాలంటే కుదిరే పని కాదు. చెప్పిన సర్కారు ఆషామాషీ సర్కారు కాదు. అంత తేలిగ్గా వెనక్కి తగ్గదు. ఒక వినతిపత్రంతోనో, ఒకరోజు బందుతోనో, ఒక పూట నిరహార దీక్షతోనో కదలదు. ఇలా అనుకునే, వలస వెళ్ళే వాళ్ళు సిధ్ధమయినట్లు, హస్తినలో ఆందోళన చెయ్యటానికి పంజాబ్‌, హర్యాణా లనుంచి రైతులు సిధ్ధమయి వచ్చారు. సహనంలో రైతు గొప్పా? రాజు గొప్పా? అనే పోటీలో పాల్గొన్నారు.

అన్నంపెట్టే రైతును ఖలిస్తాన్‌ ఉగ్రవాది అన్నది; మావోయిస్టు అన్నది; పాకిస్తానీ అన్నది; చీనావాడన్నది. అయినా సహించాడు. రైతు ఉద్యమాన్ని ఉధ్ధృతం చేశాడు.

ఎన్ని’ఉగ్ర‘ ముద్రలు వేశారు!
ఒకటా రెండా? ఏకంగా 500 సంఘాలు కలిసాయి. సంయుక్త కిసాన్‌ మోర్చా( ఎస్‌.కె.ఎవ్‌ు)గా ఏర్పాడ్డాయి. దేశంలోని రైతులను ఒక్కతాటి మీదకు తెచ్చాయి. ఢిల్లీ పొలిమేరల్లో గుడారాలు వేసుకున్నారు రైతులు. ఉష్ణోగ్రత సున్నా కు పడిపోయినంతటి చలి కాలంలోనూ, 45 డిగ్రీలకు పెరిగిపోయినప్పటి ఎండల్లోనూ, 22 రోజులు ఎడతెరపిలేకుండా తడిపేసిన వానల్లోనూ నిలిచారు. మరి సర్కారు ఏం చేసింది? ముందు అనరాని మాటలన్నది. అన్నంపెట్టే రైతును ఖలిస్తాన్‌ ఉగ్రవాది అన్నది; మావోయిస్టు అన్నది; పాకిస్తానీ అన్నది; చీనావాడన్నది. అయినా సహించాడు. రైతు ఉద్యమాన్ని ఉధ్ధృతం చేశాడు. తర్వాత సర్కారు కవ్వించింది. చిన్న హింస చేస్తే చాలు, మూసివెయ్యచ్చన్న పంథాలో పోలీసు బలగాలు చూశాయి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవమప్పుడు (26 జనవరి 2021న) రైతులు ట్రాక్టర్‌ ర్యాలీని తలపెడితే, ఎర్రకోట దగ్గర బారికేడ్లు లేకుండా చూశారు. ఎవరన్నా చొరబడతారా, ఆని ఆశించినట్లుగా వుంది ఏర్పాటు. కడకు ఎవరో ఒకతను మువన్నె పతాకం దగ్గరే, ఒక మతవిశ్వాసానికి చెందిన పతకాన్ని ఎగురవేశాడు. దాన్ని భూతద్దంలో చూపించి, రైతుల ఉద్యమం మీద మచ్చవెయ్యాలనుకున్నారు. వీలు పడలేదు.

ఈ ఏడాది కాలంలో ఈ మూడు చట్టాలూ ‘మూడు అబధ్ధాలు’ అని చెప్పటానికి మూడు సార్లు భారత్‌ బంద్‌ నిర్వహించారు. రెండు రైల్‌ రోకోలు చేశారు. ఎక్కడా అంగుళం మేర వెనక్కి తగ్గలేదు. కానీ ఉద్యమశిబిరాల్లో వుండగానే, వాతావరణంలోని ప్రతికూల పరిస్థితుల వల్ల 650 నుంచి 700 మంది రైతులు చనిపోయారు.
సర్కారు మధ్వవర్తిత్వాన్ని నెరపబోయింది. సుప్రీం కోర్టు కూడా చొరవ చూపబోయి మధ్యే మర్గాన్ని వెతక బోయింది. మూడు చట్టాల్లో మార్పులు తెస్తామని పలుమార్లు కేంద్రం రాయబారాలు పంపింది. ‘అబధ్దాలకు’ మార్పులు, చేర్పులు చేస్తే ఏమవుతాయి? మహా అయితే ‘అందమైన అబధ్ధాలు’ అవుతాయి. అందుకే, రైతులు ఏ స్థితిలోనూ ఒప్పుకోలేదు. కడకు. ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖేరిలో ఏకంగా కేంద్ర మంత్రి తనయుడు అజయ్‌ కుమార్‌ మిశ్రా, ఆందోళన చేస్తున రైతుల మీదనుంచి కారు పోనిచ్చాడన్న అభియోగం కింద ఆరెస్టయ్యాడు. అలాగయినా మరణించారు కానీ వెనక్కి తగ్గలేదు. కానీ పాలకపక్షానికి ముందు ముంచుకొస్తున్న ఎన్నికలు. తప్పలేదు. రైతు ముందు రాజు శిరస్సు వంచాడు.

ఇది చారిత్రాత్మక పోరాటం. రైతుల ఇంతటి సుధీర్ఘ పోరాటాన్ని స్వరాజ్యానికి ముందూ చెయ్యలేదు, తర్వాత చెయ్యలేదు. అది ఈ తరం రైతుకే సాధ్యమయ్యింది. ఇప్పుడు కదా అనాల్సింది- జై కిసాన్‌- అని!!

సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 20-26 నవంబరు 2021 సంచికలో ప్రచురితం)

4 comments for “మోడీ ఒప్పేసుకున్న ‘మూడు అబధ్ధాలు’!

  1. సార్ అద్భుతంగా వర్ణించారు…మీ వివరణ ఎల్లప్పుడూ ఆలోచింప చేసేవిధంగా ఉంటుంది సార్.

  2. గ్రేట్ రైటర్ ఎది రాసినా..వ్యంగ్యం,విషయం,పోలికలు
    వారికే సాటి

Leave a Reply