వడ్ల గింజల్లో ‘కయ్యపు’ గింజలు


వడ్లను వలిస్తే బియ్యం రావాలి, కానీ తెలంగాణలో కయ్యం వచ్చింది. అది కూడా రెండు అదికారపక్షాల మధ్య. ఒకటి కేంద్రంలో ఏలుబడి చేస్తున్న ‘కాషాయ’ పక్షం; మరొకటి రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న ‘గులాబీ’ పక్షం. ఇది ‘కొని’ తెచ్చుకున్న కయ్యం కాదు, ‘కొనకుండా’ తెచ్చుకున్న కయ్యం. ‘నువ్వు కొను’ అంటే, ‘నువ్వు కొను’ అని రోడ్లెక్కుతున్న కయ్యం. రాష్ట్రంలో పండిన వడ్లను ఎవరు కొనాలీ, అన్నదగ్గర వచ్చిన జగడం.

టన్నుల కొద్దీ ఆవేశం
నిజమే. ‘పండించిన ప్రతీ గింజా కొనేస్తానని’ ప్రగల్బాలు పలికింది రాష్ట్రంలోని కేసీఆర్‌ సర్కారు. అంత పంట పండదని అనుకున్నారోయేమో! నిలిచి కురిసిన వానలకు, నిజంగానే తెలంగాణలో వరి విరగపండింది. టన్నులకు టన్నులు ధాన్యం దిగుబడి వచ్చింది. ఇప్పటికే మార్కెటింగ్‌ యార్డులకు కోటి టన్నులకు పైగా పంట చేరింది. ఇది ఖరీఫ్‌ పంట దిగుబడి. అంతకు ముందు రబీలో 98 లక్షల టన్నులు వుంది. ఇలాంటప్పుడు ఏం చెయ్యాలి? ‘ఇక మేం కొనలేం బాబోయ్‌!’ అని చేతులెత్తెయ్యాలి రాష్ట్ర సర్కారు. లేదా, ‘బాబూ కొనండీ’ అని చేతులు చాచాలి. అబ్బే! అలా చేస్తే అది పాలక పక్షమెందుకు అవుతుందీ? అయినా చేతులెత్తింది. ఎలా? బిగించిన పిడికిళ్ళతో. రైతే రాజు, అని ఇప్పటి వరకూ అనుకున్నారేమో, అదికాదూ, రాజే రైతు, అని కేసీఆరే రైతు ఉద్యమ కారుడయి పోయారు.

ఈ డాబు పంజాబులో ఏమయ్యిందీ?
మరి కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ, తెలంగాణ రాష్ట్రంలో తిన్నగా వుంటుందా? బీజేపీ పేరు చెబితే, పంజాబ్‌ రైతు ఎలా ఊగిపోతున్నాడో తెలుసు. ఢిల్లీలో వుండేది రాజేనేమిటి? రైతు వుండకూడదా? అని అక్కడే తిష్ట వేశాడు. ఆందోళనకు అర్థవార్షికోత్సవం చేసుకున్నాడు. వార్షికోత్సవం చేసుకోవటానికి పరుగులు తీస్తున్నాడు. ఋతువులతో సంబంధం లేకుండా, ఆరుబయిటే నివాసాలు పెట్టాడు. ఎందుకూ? కేంద్రంలో వున్న బీజేపీ, ‘పంట కొనుబడి’కి ఎగనామం పెడదామనుకుంది. ‘ఎక్కడయినా, ఎవరికయినా అమ్మేసుకోవచ్చ’ని చెప్పింది. అంటే, ‘కేంద్ర సర్కారుగా నేను నీ పంటను కొననూ, నీకు దిక్కున్నకాడ చెప్పుకో’ అన్నది. ఆ మేరకు మూడు చట్టాలు చేసింది. అయినా రైతులు వినలేదు. తిరగబడ్డారు.
కేంద్రంలో వున్న ‘కాషాయ’ సర్కారుకు వ్యతిరేకంగా చేసిన ఆందోళనలో ఇప్పటివరకూ 460 మంది రైతులు ప్రాణాలు వదలిన వారే. అందరూ చిన్నా, చితకా రైతులే, ఎవరికీ మూడెకరాలు మించి లేవు. ఏదో ఆవేశంలోనో, ఎవరో రెచ్చగొడితేనో ఆందోళనలోకి దిగిన కుర్ర రైతులు మాత్రమే కారు వారు. మృతులందరూ 56 ఏళ్ళు పైబడిన వారే. పంజాబ్‌ లోనే కాదు, హరియాణ, ఉత్తరప్రదేశ్‌లలో రైతులూ ఇంతే. తమ పంటను కొనే నాథుడెవరని అడగటానికి రోడ్డు మీద నిరసన చేస్తుంటే మీదనుంచి కారులు పోనిచ్చారూ? ఎవరూ? కేంద్రంలోని ఈ కాషాయ సర్కారు సంబంధించిన వాళ్ళే. అలాంటి ఈ కేంద్రం వచ్చి, తెలంగాణలో విరగపండిన బియ్యాన్ని కొనమంటే కొంటారా? కొనని వాళ్ళు కొన్నట్టు వుంటారా? ‘ఠాట్‌.. కొనక పోతే ఊరుకునేది లేదూ అంటారూ.. రాష్ట్ర సర్కారు వడ్లు కొనాల్సిందే. 60 లక్షల టన్నులకు మించి కొనలేం. బియ్యం.. మరీ ముఖ్యంగా… ఉప్పుడు బియ్యం అయితే అస్సలు కొనం’ అని తెగేసీ చెప్పేస్తున్నారు. ఎవరూ రాష్ట్ర బీజేపీ అధినేత బండి సంజయ్‌. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిలు. డిమాండు చెయ్యటం వరకూ బాగానే వుంది. కానీ వీరు కూడా తీరుబడిగా ‘పంట కొనుబడి’ గురించి రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే, పంజాబ్‌ రైతు పగలబడి నవ్వడూ..? పైపెచ్చు ఇప్పుడు రబీకి వరి ఎందుకు వెయ్యకూడదూ, వెయ్యాల్సిందే. కొన్నా, కొనక పోయినా, రైతు మళ్ళీ వడ్లు పండించాల్సిందే నని ఈ నేతలు అనేస్తున్నారు. కలక్టరేట్లు ముట్టడించేస్తున్నారు.

విత్తనం మీద కలెక్టర్ పెత్తనం
కలక్టరేట్లనే ఎందుకు ముట్టడిస్తున్నారు? అందుకూ ఒక ముచ్చటయిన ‘ఫ్లాష్‌ బ్యాక్‌’ వుంది. వడ్లు పోగుపడిపోతున్నాయన్న బెంగతో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సెప్టెంబరు 12 వ తేదీన కలెక్టర్లతో సమీక్షా సమావేశం పెట్టారు. ‘ఇప్పుడొచ్చే రబీ సీజన్‌ లో రైతులు వరి వెయ్యకుండా వుంటే మంచిది’ అన్నారు. ముఖ్యమంత్రి అన్నాక శాసనం కాకుండా పోతుందా, అని మిగిలిన కలెక్టర్లు అనుకున్నారో లేదో తెలీదు కానీ, సిద్దిపేట కలెక్టర్‌ పి. వెంకట రామిరెడ్డి మాత్రం భావించారు. అనుకున్నదే తడవుగా, తన జిల్లాలో వరి విత్తనాల విక్రయం మీద ఆంక్షలు పెట్టారు. వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే, విక్రయించిన దుకాణాలను మూయించటమే కాకుండా, లైసెస్సులు రద్దు చేస్తాను అని హెచ్చరించారు. అంతే కాదు, రైతులూ, రైతు నేతలూ ఉలిక్కి పడేలా భీషణ ప్రతిజ్ఞ చేశారు. ‘సుప్రీం కోర్టు నుంచో,, హైకోర్టు నుంచో ఉత్తర్వులు తెచ్చుకున్నా సరే…నేను లక్ష్యపెట్టను. నేను కలెక్టరుగా వున్నంత వరకూ వరి విత్తనాలను అమ్మనివ్వను’ అని అన్నట్లు గా మీడియాలో కథనాలు వచ్చాయి. ఇందుకు బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు కలెక్టర్‌ మీద విరుచుకుపడ్డారు.

తెలంగాణ సర్కారు ’మెట్ట‘ వేదాంతం
కొనలేని సర్కారు, కొనలేనని ఒప్పుకుని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమని చెవ్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర సర్కారు చెప్పిన మాట నిజమే. పొడి నేలల్లో పండే మెట్ట పంటల్నే, ఈ రబీ సీజన్లో వెయ్యాలని ప్రభుత్వం కోరింది. అంటే వేరుశనగ, పెసలు, మినుములు, జొన్నలు. నువ్వులూ వగైరా అన్నమాట. మరీ రైతులు వెయ్యవచ్చు కదా! వెయ్యరు. వెయ్యలేరు. ఎందుకూ? ఆ విషయం రైతుకు మాత్రమే తెలుస్తుంది. రైతు పోజు పెట్టే రాజు కు తెలియక పోవచ్చు. తెలంగాణలో వరుస వర్షాల వల్ల భూగర్భజలాల నీటి మట్టాలు పెరిగిపోయాయి. నేలలు నానివున్నాయి. వీటి మీద మెట్ట పంటలు నిలవవు. నిలిచినా పండిన పంట నాణ్యంగా వుండదు. ఇదే విషయాన్ని రైతులూ, రైతు సంఘాల వారు నెత్తీ నోరూ బాదుకుని మరీ చెబుతున్నారు.
కొంచెం నాణ్యం తగ్గిన వరి ధాన్యాన్ని కొనటానికే మీనమేషాలు లెక్కిస్తున్నారే! మరి నాణ్యంలేని మెట్ట పంటను ఎలా అమ్మగలుగుతారు. ధాన్యం గానుగ పడితే నూకలు వస్తాయన్న అనుమానం వస్తున్నందుకే, ఉడక బెట్టి తర్వాత గానుగ పట్టి ఉప్పుడు బియ్యంగా మారుస్తున్నారు. ఈ ఉప్పుడు బియ్యాన్ని అస్సలు కొనుగోలు చెయ్యలేమని కేంద్రం తెగేసి చెబుతోంది.
ఇప్పుడు తెలంగాణ రైతుకు రెండు వివత్తులు వచ్చాయి. ఒకటి: పండిన వరి ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు అమ్ముకోవటం. రెండు: రబీకి తిరిగి పంట వెయ్యటం.
రాష్ట్ర, కేంద్ర సర్కారులు కలసి, రెంటికీ అడ్డు తగులుతున్నాయి. పైపెచ్చు. తామే రైతు ఉద్యమకారుల్లా అల్లరి చేసేస్తున్నాయి. ఇప్పటికయినా, రైతులు ఆలోచించాలి. తమ పంట తాము పండించినట్టే, తమ ఆందోళన తాము చెయ్యాలి. కేంద్ర, రాష్ట్ర సర్కారుల ‘పగటివేషాల’ను అడ్డుకోవాలి.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 13-20 నవంబరు సంచికలో ప్రచురితం)

2 comments for “వడ్ల గింజల్లో ‘కయ్యపు’ గింజలు

Leave a Reply