‘అంబేద్కర్‌ ప్రదేశ్‌’ అంటే, రాష్ట్రాన్ని అంటించే స్తారా..?

కోనసీమలో అత్యంత శ్రధ్ధగా విధ్వంసాన్ని సృష్టిస్తున్న దృశ్యం

అంబేద్కర్‌. అవును. ఒక పేరే. భారతదేశపు నుదుటి రాతను (రాజ్యాంగాన్ని) రాసిన పేరు. ప్రపంచ అత్యున్నత సంస్థ (ఐక్యరాజ్యసమితి) ముచ్చటపడి స్మరించుకన్న పేరు.
కానీ ఆ పేరే కోనసీమలో చిచ్చురేపింది. ఆ పేరు ‘వద్దంటే.. వద్దంటూ’ రోడ్లమీద కొచ్చారు. రాళ్ళు విసిరారు. ఇళ్ళు దగ్ధం చేశారు. పోలీసుల్ని (జిల్లా ఎస్పీ సహా) నెత్తురొచ్చేట్టు కొట్టారు. షెడ్యూల్డు కులానికి చెందిన మంత్రి నివాసానికి నిప్పు పెట్టారు. ఇదంతా ఒక్క రోజు (24 మే 2022)లో జరిగిపోయింది. కారణం ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పరిచిన ‘కోనసీమ’ జిల్లాను ‘డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ జిల్లా’గా మార్చే ప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వం చెయ్యటం.

ఇంతా చేసి, ఓ జిల్లా కి పెట్టారు..!

దేశంలోని రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాలూ వెరసి 36 ప్రాంతీయ ప్రభుత్వాలు. వీటిలో మొత్తం 773 జిల్లాలున్నాయి. ఈ జిల్లాల్లో ఇంతవరకూ ఒకే ఒక జిల్లాకు అంబేద్కర్‌ పేరు వుంది. ఉత్తరప్రదేశ్‌ లో ఇప్పుడు ‘అయోధ్య డివిజిన్‌’ వున్న ఫైజాబాద్‌ డివిజన్‌ లో ఒక భాగాన్ని జిల్లాగా చేసినప్పుడు దానికి అప్పటి ముఖ్యమంత్రి మాయావతి 1995లోనే ‘అంబేద్కర్‌ నగర్‌’ అని పేరు పెట్టారు. ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే ‘డాక్టర్‌ బి.ఆర్‌. ఆంబేద్కర్‌ జిల్లా’ రెండవది అవుతుంది.
రాష్ట్రవిభజనానంతరం, తెలంగాణలో జిల్లాలు వెంటనే పెంచుకున్నా, ఆంధ్రప్రదేశ్‌ మాత్రం వెంటనే ఆ పని చెయ్యలేక పోయింది. ఒక పదవీకాలం గడచిపోయాక పాలక పక్షం మారిపోయింది. తెలుగుదేశం పోయి వెసీపీ అధికారంలోకి వచ్చింది. అయినా మూడేళ్ళు ఆగి, వున్న 13 జిల్లాలనూ 26 జిల్లాలుగా విస్తరింప చేసింది. కొత్తగా ఏర్పడ్డ 13 జిల్లాల్లోనూ వ్యక్తుల పేర్లు నాలుగు జిల్లాలకు పెట్టారు. అనంతపురం నుంచి వేరు చేసిన జిల్లాకు సత్యసాయి పేరు, కడప నుంచి తీసిన జిల్లాకు అన్నమయ్య పేరు. అనకాపల్లి నుంచి సృష్టించిన జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు, కృష్ణానుంచి విభజించిన జిల్లాకు ఎన్టీ రామారావు పేరూ పెట్టారు. వీరిలో ఒకరు బాబా, మరొకరు వాగ్గేయకారుడు. వీరు కాక ఉద్యమ రాజకీయాలనుంచి అల్లూరి, అధికార రాజకీయాలనుంచి ఎన్టీఆర్‌ వచ్చిన వారు. ఎన్టీఆర్‌ అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు. ఈ ఇద్దరి పేర్లూ దేశవ్యాపితంగా పరిచితమయినవయి

అంబేద్కర్ కు 'కాలనీ'లు, గాంధీకు 'నగర్' లు!

కానీ అంబేద్కర్‌, గాంధీల పేర్లను (వారిద్దరికీ మధ్య తీవ్రమైన సైధ్ధాంతిక వైరుధ్ధ్యం వున్నా) ప్రపంచమంతటా గుర్తుపడతారు; తలుస్తారు. గాంధీ పేరు మీద ఏకంగా ఒక రాష్ట్ర రాజధానే (గాంధీనగర్‌, గుజరాత్‌) వుంది. అంబేద్కర్‌ పేరు మీద ఇంకా రాష్ట్రం కానీ, రాష్ట్ర రాజధానిగాని ఏర్పడలేదు. ఆయన పేరును ఇంకో జిల్లాకు పెడతానంటేనే ఇంత రాధ్ధాంతం జరిగితే, రాష్ట్రానికి పెడతానంటే ఊరుకుంటారా?
అయితే ఆయన పేరున కాలనీలు కొకొల్లలు. బహుశా ‘అంబేద్కర్‌ కాలనీ’ లేని పట్టణం కానీ, నగరం కానీ వుండదేమో! అలాగే గాంధీ పేరు మీద కూడా వుంటాయి. అయితే వాటిని ‘గాంధీ కాలనీల’ని అనకుండా, ‘గాంధీ నగర్‌’లని అంటుంటారు. ఇంతకీ ‘అంబేద్కర్‌ కాలనీ’లని ఏ ప్రదేశాలకు పెడతారు? ముఖ్యంగా మురికి వాడలకే. అంబేద్కర్‌ విగ్రహాలు అధికంగా వుండేవీ అక్కడే. అక్కడ వుండేది ఒకనాటి ‘అస్పృశ్యులే’. (ఊళ్ళల్లో అయితే వాటిని ‘వెలివాడ’లు అనేవారు లెండి.) కానీ, గాంధీ నగర్‌లు అలాకాదు. అక్కడ ఇతర సామాజిక వర్గాల వారు వుంటారు. అలాగే, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నూ అంబేద్కర్‌, గాంధీల ఫోటోలు కనిపిస్తాయి. మంత్రులూ, ఎమ్మెల్యేలూ, ఎమ్మెల్సీలూ, ఎంపీలూ తమ అధికార కార్యాలయాల్లో సైతం ఈ ఇద్దరి చిత్రపటాలను గోడలకు వేళ్ళాడదీస్తారు. కానీ వారి ఇళ్ళల్లోకి..? వెళ్ళితే గాంధీ వెళ్తారు; అంబేద్కర్‌ వెళ్ళరు. వారి వ్యక్తిగత నివాసాల్లో, అంబేద్కర్‌ ఛాయాచిత్రాలేమీ కనిపించవు. (వాళ్ళు రిజర్వుడు నియోజకవర్గాలనుంచి ఎన్నికయిన వారయితే తప్ప.) కావాలంటే ఆయన 125 వ జయంతికి 125 అడుగుల విగ్రహాన్ని ఎక్కడో బహిరంగ ప్రదేశంలో పెట్టమంటే పెడతారు. లేదా పెడతామని కనీసం హామీ అయినా ఇస్తారు. ఇంట్లో మాత్రం పెట్టుకోరు.

కోటా‘ వరకే తెగడ్తలూ, పొగడ్తలూ

పైకి, దేశం మొత్తానికి రాజ్యాంగాన్ని ఇచ్చినవాడనీ, అన్ని వర్గాల మహిళ హక్కుల కోసం ‘హిందూ కోడ్‌ బిల్లు’ను రచించినవాడనీ, కార్మికులకు హక్కులను కల్పించిన వాడనీ వేదికలెక్కి దంచమంటే, వీళ్ళవరికీ వొళ్ళు తెలియదు. సరే, ఇంతకు మించి కొన్ని వందల రెట్లు స్వేఛ్చనీ, సమానత్వాన్నీ కాపడటానికి కృషి చేసిన వాడనీ, అరిస్టాటిల్‌, మార్క్క్‌, ఏంగెల్స్‌ వంటి విశ్వమేధావుల సరసన వుంచ దగ్గ వాడనీ, ఆయన రచనలను చదివిన వారికి తెలుస్తుంది.
కానీ, అంబేద్కర్‌ అంటే అభ్యంతరం వున్న వాళ్ళ మదిలో ఏముందీ? సరే అట్టడుగు సామాజిక వర్గం నుంచి వచ్చిన వాడనా? కొంత కావచ్చు. కానీ అంతకు మించి మరో కారణం వుంది. ఆయన ఎస్సీ, ఎస్టీలకూ రిజర్వేషన్లిచ్చి, వాళ్ళని ఇతరులతో సమానంగా ‘ఊరేగే లాగనో, విర్రవీగేలాగనో’ చేశాడనే అక్కసు ఎక్కడో వుండి వుండాలి. దానికి తోడు ఆయన్ని ‘దేవుడి’లా ఆరాధించే అట్టడుగు వర్గాలు కూడా తమకు ‘రిజర్వేషన్లు మాత్రమే’ ఇచ్చినట్టుగా మాత్రమే సంబరపడి కీర్తిస్తుంటారు. అందుకే ఆయన విగ్రహాలు విధ్యంసం చేసినప్పుడూ, ఎత్తుకుపోయినప్పుడూ ఆ వర్గాలే స్పందిస్తాయి. మిగిలిన వర్గాల వారు కిక్కురుమనరు. పదవుల్లో వున్నవారు మాత్రం పైపై ప్రకటనలిచ్చి చేతులు దులుపుకుంటారు.

అంబేద్కర్ పక్కకు వస్తే అల్లూరి కి చిన్నతనమా?

అంతేకాదు. అంబేద్కర్‌ విగ్రహాలను తమ సామాజిక వర్గాలకు చెందిన దేశ నేతల పక్కనే కాదు, రాష్ట్ర, జిల్లా నేతల పక్కన పెట్టినా తట్టుకోలేరు. ఈ అనుభవం గోదావరికి ఇటువైపున వున్న కోనసీమలోనే కాదు, అటువైపున వున్న పశ్చిమ గోదావరిలో కూడా జరిగింది. గరగపర్రులో (2017లోఒ) ఇలాగే ఊరి చెరువ పక్కన గాంధీ, అల్లూరి సీతారామరాజు విగ్రహాల పక్కన అంబేద్కర్‌ విగ్రహం పెడితే, తెల్లవారేసరికి ఎత్తుకు పోయారు. అలా ఎత్తుకుపోయిన వారిని అరెస్టు చేస్తే, ఊళ్ళో ఆందోళనలు చేశారు. విగ్రహం పెట్టిన ఒక షెడ్యూల్డు కులం (పోనీ, ఉపకులం) వారిని వేరు చేసి, పనుల్లోకి రానివ్వకుండా వెలివేశారు.

విశ్వనేత ముందు వీరంగమా?

అమెరికాలో అబ్రహాం లింకన్‌ పేరుకీ, ఆఫ్రికాలో నెల్సన్‌ మండేలా పేరుకీ ఎవరయినా అభ్యంతరం చెబితే, అవమానం ఎవరికీ? చెప్పిన వారికే. అలాగే ఇండియాలో అంబేద్కర్‌ పేరుకి అభ్యంతరం చెప్పినా పర్యావసానం అదే. ఇప్పుడీ విధ్వంస రాజకీయాలను వెలగబెట్టే నాయకులకు మహా అయితే కుర్చీల్లో స్థానం దక్కవచ్చేమో, కానీ రేపు చరిత్ర వారిని చెత్త బుట్టలో వేస్తుంది. కానీ అంబేద్కర్‌ విశ్వచరిత్రకెక్కినవాడు. అంబేద్కర్‌ జిల్లా కాదు, రేపు ‘అంబేద్కర్‌ప్రదేశ్‌’ అని ఒక రాష్ట్రానికి పెట్టుకున్నా దేశం ఆయన రుణం తీర్చుకున్నట్లు కాదు. అప్పుడూ ఇలాంటి చిచ్చే రగిలిస్తారా..?

సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ వారపత్రికలో ముద్రిత సంపాదకీయం)

4 comments for “‘అంబేద్కర్‌ ప్రదేశ్‌’ అంటే, రాష్ట్రాన్ని అంటించే స్తారా..?

  1. Great and best intresting article sir. Sir I’m your student at young journalist camp mahendrahills secendrabad …

    I’m big fan of ur articles. And books sir..

    Chala intresting ga peace ga matterful disccasive ga unatee sir

  2. అంబేద్కర్ అంటే ప్రపంచ దేశాలు విశ్వ విజ్ఞాని, మహా మేధావి అని పేదవాళ్ల పొగుడుతుంటే, ఈ రాష్ట్రంలో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టడాన్ని సహించలేని వారిని దేశద్రోహులు గానే గుర్తించాలి.

  3. ప్రపంచ దేశాల ప్రజలు, నాయకులు అంబేడ్కర్ ను గౌరవముతో చూస్తున్నా స్వంత దేశమయిన భారత దేశములో ఆంద్రప్రదేశ్ లో
    ఒక జిల్లా కు అంబేడ్కర్ పేరుపెడితె ఓర్చు కోలేక మంటలు రేఫుతున్న వారు మూర్ఖులు ,మేదావిని మేదావి గా ఒప్పు కొనలేనివారు పశువులకన్న హీనులు,అందుకే వీరిని రాజ్యాంగ ద్రోహులుగా గుర్తించి కఠినమైన శిక్ష లు విధించాలి

Leave a Reply