మ్యాచ్‌ ఫిక్సింగ్‌!-: – మనీ మిక్సింగ్‌!!

వియ్యమన్నాక- వావీ, వరసల ప్రస్తావన వస్తుంది. వరసయిన వారితోనే ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ వుండాలి. వరసలు తప్పితేనే అల్లరవుతారు.

రాజకీయ వియ్యాల్లోనూ ఇదే నియమం. వరస తప్పకూడదు. ఉదాహరణకు ‘కాషాయానికీ’, ‘ఎరుపున’కూ వియ్యం కుదరదు. అనగా ‘కమలాని’కీ, ‘కొడవలి’కీ మధ్య ‘ఎఫైర్‌’ నడవదన్నమాట. (కమలమొచ్చి, కొడవలి మీద పడ్డా, కొడవలి వచ్చి కమలం మీద పడ్డా- తెగిపడేది కమలమే!)

‘బోఫోర్స్‌’ బూచిని చూపించి, రాజీవ్‌ గాంధీ(కాంగ్రెస్‌) ని ఓడించి, విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ (జనతాళ్‌)ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు, ఇలాగే కమ్యూనిస్టుల మద్దతూ, బీజేపీ మద్దతూ తీసుకున్నారు. . ఈ కాపురం ఎన్నాళ్ళో సాగలేదు. మధ్యలోనే కూలిపోయింది. ఈ కాస్తంత కాపురంలో గాయాలు ‘కమలానికే’ అయ్యాయి.

వరస కాని వారి మధ్య ‘రాజకీయ వియ్యాలు’ ఇలాగే మధ్యలో పెడాకులు అవుతుంటాయి. సంకీర్ణ రాజకీయాలొచ్చాక అప్పుడప్పుడు ఇలా వరసలు తప్పటం అనివార్యమవుతుంది. అందుకు కారణం ఒక్కటే- ఏర్పాడే ప్రభుత్వాలు ‘నెలతక్కువ బిడ్డల్లా’గా వుంటాయి. అంటే ఏలటానికి కావలసిన మెజారిటీలు వుండవు. అలాంటప్పుడే ‘ఏ మగడు లేకుంటే….’ అన్న సామెత వారికి అక్కరకు వస్తుంటుంది.

అయితే, ఈ వరసలు తప్పటమన్నది- ఇటీవలి కాలం వరకూ మన రాష్ట్రంలో జరగలేదు. కానీ, ఇప్పుడిప్పుడే మొదలయింది. అందుకే కంగారు పడుతున్నారు. ఈ గాబరా జనానికి వుండాలి. కానీ అందుకు భిన్నంగా ‘వరసలు తప్పుతున్న’ వారికే వుంటోంది.

వైయస్‌ మృతి తర్వాతే ఈ ‘మ్యాచ్‌ పిక్సింగ్‌’ల ఆరోపణలు మొదలయ్యాయి. ఒకటి, రెండు నిజమయ్యాయి కూడా. 2009 ఎన్నికలప్పుడు, కాంగ్రెస్‌ మీద ‘తొడలు చరచిన’ ప్రజారాజ్యం నేత చిరంజీవి ‘ఒడలు మరచి’ అదే కాంగ్రెస్‌లో విలీనమయ్యారు.

ఈ విలీనానికి ముందు- కాంగ్రెస్‌కీ, ప్రజారాజ్యానికీ మధ్య ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ‘ నడుస్తుందంటే ఒప్పుకొన్నారా? టీవీ చానెళ్ళ చర్చల్లో ‘మెగా’ నేతలు ఎగిరెగిరి ఖండించలేదూ..? ‘కాంగ్రెస్‌ విధానాలు వేరూ, మా విధానాలు వేరూ’ అని లెక్చర్లు దంచలేదూ..?

ఎప్పుడయితే ఒక పుకారు నిజమయిందో, పుకార్లకు లేనిపోని గిరాకీ పెరుగుతుంది. ఇప్పుడు చూడండి. ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ ఆరోపణకు గురికాని పార్టీ అంటూ లేదు.

కాంగ్రెస్‌కూ, టీఆర్‌ఎస్‌కూ మధ్య ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ వుందని తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రమే కాదు. నిన్నమొన్నటి వరకూ టీఆర్‌ఎస్‌తో భుజం, భుజం- కలిపి తిరిగిన తెలంగాణ ఉద్యమ సంఘాల నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ‘తెలంగాణ ప్రకటన చేస్తే, టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలిపేస్తారన్న’ ప్రచారం చాలా హెచ్చు స్థాయిలోనే జరిగింది.

కాంగ్రెస్‌కూ, తెలుగుదేశం పార్టీకి మధ్య ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ వుందని ఎప్పటి నుంచో వైయస్సార్‌ కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. తెలుగుదేశం నేతలు చిదంబరాన్ని కలిసిన తర్వాతనే, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఇడి) రంగంలోకి దిగి జగన్‌ కంపెనీల ఆస్తుల జప్తునకు రంగం సిధ్ధమయిందనీ, ఫలితంగానే బెయిల్‌ ఇవ్వలేని వాతావరణాన్ని సృష్టించారనీ వైయస్సార్‌ కాంగ్రెస్‌ నేతల అభియోగం. జగన్‌ ను జైలులోనే వుంచి చంద్రబాబు, కిరణ్‌కుమార్‌ రెడ్డీ ‘పాదయాత్ర’లూ, ‘పల్లెబాట’లూ చేసుకోవచ్చని భావించారని కూడా ఈ అభియోగంలో కీలకాంశం.

అసలు ‘కాంగ్రెస్‌, వైయస్సార్‌ కాంగ్రెస్‌లు’- రెండూ ఒక తానులోని వస్త్రాలే కాబట్టి ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ ఎప్పుడో జరిగిపోయిందని తెలుగుదేశం పార్టీ ఆరోపణ. అలాకాని పక్షంలో యూపీయే రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీకి జైలునుంచి అనుమతి తీసుకుని వచ్చి, జగన్‌ ఎందుకు వోటు చేసారన్నది -వీరి ‘ధర్మ’ సందేహం!

ఎన్ని పుకార్లు వున్నా, ఈ ‘వియ్యాల’లో(మ్యాచ్‌ ఫిక్సింగ్‌లలో) కట్న కానుకల ప్రస్తావన లేదు. ‘రాజకీయ’ ప్రయోజనాల కోసమే ‘ఇచ్చిపుచ్చుకోవటాలు’ జరిగాయన్నారు. కానీ ‘అన్నా’కి తమ్ముడయిన కేజ్రీవాల్‌ ఒక్కసారిగా ఈ ‘ఇచ్చిపుచ్చుకోవటాన్నే’ ‘క్విడ్‌ప్రోకో’ అంటారనీ, ఇవి రెండు పార్టీల మధ్యకూడా జరగుతాయనీ కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. లేక పోతే మహరాష్ట్రలో వున్న ‘నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ’ నేత, బీజేపీ అధినేత నితిన్‌ గడ్కారీకి పేద రైతుల భూముల్ని కారు చౌకగా ధారాదత్తం చేయటమేమిటీ?

మొత్తానికి ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ల సీజన్‌ మన దేశంలోనూ, రాష్ట్రంలోనూ చాలా కాలం నడిచేటట్టుంది. ఇప్పుడప్పుడప్పుడే ‘మూఢ’మొచ్చే సంకేతాలు లేవు.

వరసల్నీ, విలువల్నీ ఏక్షణంలోనయినా తగలెయ్యటానికి రాజకీయ పక్షాలు సిధ్ధంగా వున్నాయి. కాకపోతే ఫలితం వుండాలి. పదవులయినా రావాలి. పైసలైనా రావాలి. ఇవీ మన రాజకీయాలు.

వివిధ పార్టీల వీరాభిమానులారా! ఇప్పుడు ఎవరికి కొడతారో కొట్టండి- జిందాబాద్‌లూ, డౌన్‌ డౌన్‌లూనూ…!

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *