రేపటి ‘రా’కుమారులు!

దేశం రాష్ట్ర మయింది.
రాష్ట్రం ప్రాంతమయింది.
ప్రాంతం జోనయింది.
ఈ జోను జిల్లా కావచ్చు. జిల్లా మండలం కావచ్చు. మండలం ఊరు కావచ్చు. ఊరు అంతిమంగా వాడ కావచ్చు. పోరు అనివార్యం.
యుధ్ధాలేమయినా, కారణాలు అవే వుంటాయి.
పిడికెడు మెతుకులో, గుప్పెడు స్వేఛ్చో..? ఏదో ఒకటి అయివుంటుంది.
తృప్తి కోసమో, హోదా కోసమో ఉద్యోగాలు వెలగబెట్టే వారు ఎప్పుడూ తక్కువే వుంటారు. ఎక్కువ మంది కడుపాకలి కోసమే కొలువులు చేస్తుంటారు.
తాను ఆశించిన కొలువు, పక్కవాడికొచ్చినప్పుడెల్లా బాధగానే వుంటుంది.
తన చేతిలోని అన్నంగిన్నెను ఎవ్వరో తన్నుకు పోయినట్లే అనిపిస్తుంది.
ఒకప్పుడు అన్ని కొలువులూ అందరూ చేసేవారు కారు. కులాన్ని బట్టి, కులహీనతను బట్టి కొలువులుండేవి.
ఆయుధాలనూ, అంబరాలనూ, ఆభరణాలనూ చెయ్యటానికి కులమానమే కొలమానం.
ఇంతవరకూ అందరికీ గుర్తుంటాయి.
కానీ కులహీనతను బట్టి వున్న కొలువులు గుర్తు చేస్తే కానీ గుర్తుకు రావు.
కాలుతున్న చితి మీది శవం బుర్రను బద్దలు కొట్టి కపాల మోక్షాన్ని ప్రసాదించే కొలువులూ; ముక్కుమోసుకోకుండా పశువుల మృతకళేబరాల్ని మోసుకుపోయే కొలువులూ, మానవ విసర్జనాలను సైతం తొడుగులులేని చేతుల్తో ఎత్తి, నెత్తిన పెట్టుకుని అవతల పారేసే కొలువులూ, గుండెను రాయి చేసుకొని ప్రసవాల్ని చేసిన చేత్తోనే చిత్రహింసల గర్భస్రావాల్ని చేసే మంత్రసాని కొలువులూ- ఇవన్నీ -కులాన్ని బట్టి కాదు- కులహీనతను బట్టి వచ్చే ఉద్యోగాలు. ‘జాబ్‌ శాటిస్‌ ఫేక్షన్‌’ అంటూ ఇప్పుడు మురిపెంగా చెప్పుకుంటున్న తృప్తి ఈ కొలువుల్లో వుందని ఇవాళ ఎవరయినా అంటే- మనదాకా ఎందుకు? మానవహక్కుల కమిషనే ముందు అభ్యంతరం చెబుతుంది.
పెట్టి పుట్టిన వారెవ్వరూ, ఈ కొలువుల్ని ఎగబడి తీసుకునే వారు కారు.
కారణాలు రెండు: భయం, అసహ్యం.
అవును. చెయ్యటానికి అందరూ భయపడే వృత్తుల్నీ, లేదా అసహ్యించుకునే వృత్తుల్నే ‘కులహీనత’ ప్రాతిపదిక గా కేటాయించారు.
వాళ్ళు చెయ్యనంటే కుదరదు కదా! కడుపెలా నిండుతుంది?
చిత్రం. స్వరాజ్యం వచ్చాక కూడా, కొలువుల విభజన ఇంచుమించుగా ఇలాగే సాగింది.
భయం ఎప్పుడూ భయమే. ఉగ్రవాదం జడలు విప్పిన ఈశాన్య రాష్ట్రాలలో మిలటరీ ఉద్యోగమంటే ఇప్పటికీ చాలామందికి వెన్నులో భయం పుడుతుంది. అంతెందుకు? మావోయిస్టులు సంచరించే చత్తీస్‌ గఢ్‌ సరిహద్దుల్లో పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగం చేయమంటే- ఉరకలు వేసే వారు ఎవరయినా వుంటారా?
విజ్ఞులు మన్నిస్తే- మన ఆడవాళ్ళు పరపురుషుల్ని తాకటాన్ని మనం భరించగలమా? ఈ రకమైన తెచ్చిపెట్టుకున్న ‘అసహ్యం’తోనే, తొట్టతొలుత నర్సు ఉద్యోగాల్లోకి బాగా బతికిన వారు తమ ఆడపిల్లల్ని పంపించే వారు కారు.రోగులకు సేవచేసిన ‘ఫ్లారెన్స్‌ నైటింగేళ్ళ’ను పెదవులతో పొగడే వారు కానీ, లోలోపల ఛీత్కరించుకుంటూనే వుండేవారు.
స్వరాజ్యం వచ్చాక కూడా ఈ కొలువులను ‘కులహీనత’ను మోసేవారే ఎక్కువగా స్వీకరించారు.
కింది స్థాయి ‘యూనిఫాం’ కొలువులకు పై వర్గాల వారు ఇటీవలి కాలం వరకూ ఆకర్షితులయ్యే వారు కారు.
అందుకే కదా ఒక విప్లవ కవి, ‘మా లోని మనిషివే నీవు. పొట్ట కూటి కోసం పోలీసువైనావు’ అంటూ ‘పోరాడే’ వారిపై తుపాకుల్ని ఎక్కుపెడుతున్న కానిస్టేబుళ్ళను కూడా సానుభూతితో చూశాడు. కారణం- వారు అట్టడుగు ఆర్థిక,సామాజిక వర్గాలనుంచి రావటమే.
కానీ నేడు గొప్ప గొప్ప, మంచి మంచి, తృప్తినిచ్చే ఉద్యోగాలన్నింటినీ ప్రయివేటు రంగానికి మన ప్రభుత్వాలు రాసిచ్చేశాయి.
ఇక సర్కారీ కొలువులుగా మిగిలివున్నవి ఇవిగో- ఇలా ఒకప్పుడు చిన్న చూపు చూసిన ఉద్యోగాలే. ‘యూనిఫాం’ వేసుకుని చేసే ఉద్యోగాలే. అందుకే కానిస్టేబుల్‌ ఉద్యోగాలకూ, ఎస్సయి ఉద్యోగాలు గొప్పవయి పోయాయి.
కూటికి లేని వాళ్ళు తమకు ‘కానిస్టేబుల్‌’ ఉద్యోగం వస్తే, ‘రాకుమారుల్లా’గానే భావిస్తారు. ( అవును. పై అధికారులచేత ‘రా’ ‘ఏరా’ అనిపించుకునే వారు ‘రా’కుమారులే అవుతారు. ‘ఆర్డర్లీ’ వ్యవస్థ సాక్షిగా ఇంకా ఈ సంస్కృతి కొనసాగుతూనే వుంది’)
సబ్‌ఇన్స్పెక్టర్లను పై అధికారులు మరీ అంతమాట అనరు కానీ, అదే స్థాయిలో తొక్కిపెట్టి వుంచుతారు. దానికి తోడు ‘లాకప్‌ డెత్‌’లూ, ‘ఎన్‌కౌంటర్లూ’ వంటి నేర ముద్రల్ని వీరు మోసుకు తిరగాలి.
వరద వచ్చి సర్వం తుడిచేశాక, కట్టుబట్టల్తో, కడుపాకలితో వుండిపోయిన వారికి పులిహోరా పొట్లాలు పంచుతుంటే బాధితులు వారిలో వారు చేసుకునే యుధ్ధాన్ని ఎప్పుడయినా చూశారా?
అన్నీ పోగా, మిగిలిన ఈ సర్కారు కొలువుల కోసం, మన నిరుద్యోగ యువకులు నేడు చేస్తున్న పోరాటాలు ఇవే. వీటికే మనం ముద్దుగా, రాష్ట్రమనో, ప్రాంతమనో, జోన్‌ అనో అనువయిన పేర్లు పెట్టుకుంటున్నాం.
(ఆంధ్రభూమి దినపత్రిక 14 ఆగస్టు 2011 సంచికలో ప్రచురితమయ్యింది)
-సతీష్‌ చందర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *