Tag: అవినీతి

తిన్నదెక్కువ, తినిపించింది తక్కువ!

తిను, తినిపించు, లైఫ్‌ అందించు.

ఇదేదో ‘ఎఫ్‌ ఎమ్‌’ రేడియో నినాదం కాదు. చక్కటి రాజకీయ నినాదం. రాజకీయాల్లో వున్నవారు ‘తినటం’ సర్వ సాధారణం. అయితే తాను మాత్రమే ‘తిని’ ఊరుకునే నేతకు పేరు రాదు. ‘వంద’లో ‘తొంభయి’ తాను తిని, ఇతరుల చేతిలో ‘పద’న్నా పెట్టే వాడు ‘మారాజు’ అయిపోతాడు. ఇదీ అవినీతిలో కూడా జనం తీయగల నీతి. ఇన్నాళ్ళూ ఈ ‘నీతి’కి మార్కెట్టుందనుకున్నారు.

కానీ కళ్ళ ముందు ‘కర్ణాటకం’ కనిపించింది. ‘తిని’ ఊరుకున్న వారే కారు, ‘తిని, తినిపించి’న వారు కూడా 2013 అసెంబ్లీ ఎన్నికలలో మట్టి కరిచారు.

అవినీతా? అంతా ‘గ్యాస్‌’!!

దేవుళ్ళేనా అవతరాలెత్తేదీ..? దయ్యాలెత్తవూ..?!

హీరోలు మారినప్పుడు.. విలన్లు మారరూ?

అలాగే, నీతి మారినప్పుడు, అవినీతీ మారుతుంది.

ఒకప్పటి అవినీతి అంటే- మామూలు, బల్లకింద చెయ్యి, అమ్యామ్యా..! ‘సంతోషం’. అవును ఇది కూడా అంచానికి ‘పర్యాయ పదం’. పుచ్చుకునే వాడు ముఖమాట పడుతూంటే ఇచ్చే వాడు ‘ఏదో, మా సంతోషం కొద్దీ..!’ అని నాలుగు కట్టలు చేతిలో పెడతాడు. లోపల మాత్రం కట్టలు తెగిన దు:ఖం వుంటుంది లెండి.

ఆడితప్పని లంచగొండులు!

‘లంచం తీసుకుంటున్నావ్‌ కదా! పట్టుబడితే..?’

‘అంచమిచ్చి బయిట పడతా!’

ఇది ఒక సంభాషణా శకలం కాదు; ఒక జీవన విధానం.

లంచం వజ్రం లాంటిది. లంచాన్ని లంచంతోనే కొనగలం; కొయ్యగలం. లంచగొండిని కొనాలన్నా లంచమివ్వాలి. వాడిని పట్టుకోవాలన్నా లంచం ఎర చూపాలి.

వోటు ‘వెయ్యి’

వోటు హక్కూ, వోటు హక్కూ- అని ఎవరూ గొంతు చించుకోనక్కర్లేదు.

వోటు హక్కు అంటే- వోటు కొనే హక్కూ, వోటు అమ్మే హక్కూ- అని వోటు రాని వాడిక్కూడూ తెలిసిపోయింది. ఎటొచ్చీ ఏ రేటుకి అమ్మాలీ, ఏ రేటుకి కొనాలీ- అన్న విషయంలోనే గందరగోళం- వుంది.

అన్నింటా బక్క వాడే నష్టపోతున్నాడు. పండిన పంట అమ్ముకోవటానికి పేద రైతుకు ఎన్ని కష్టాలున్నాయో- పేద వోటరుకి కూడా అన్ని కష్టాలున్నాయి. పంటకన్నా ‘మద్దతు ధర’ ఒకటి వుంటుంది. కానీ వోటుకి అలా కాదే..! ఏ రేటిస్తే, ఆ రేటే యిచ్చుకోవాలి.

‘ఇదేమి దురన్నాయం బాబూ!’ అంటే పట్టించుకునే నాధుడే లేడు.