
‘‘అర నిమిషం దాటేసరి
కదే నాకు గత శతాబ్ది’’
‘‘కవులను కదిలించడం అంటే
కాలం డొంకంతా అమాంతంగా
కదిలించడమే అవుతుంది’’
ఎవరిని వారితోనే కొలవడం మంచిది. మహా కవి శ్రీశ్రీని ఆయన మాటల్తోనే అంచా వేద్దాం. శ్రీశ్రీ కవిత్వాన్ని తూచడానికి చలం దగ్గర తూనిక రాళ్ళు లేవు. అది 1940 నాటి మాట. కానీ చలం కన్నా కాలం పెద్దది. ఇవాళ కొత్త శతాబ్దపు సింహ ద్వారం దగ్గర ఉన్నాం. కవిత్వానికి కొలమానం లేకపోయినా కాలమానం ఉంది.
‘ఈ శతాబ్దం నాది’ అన్నాడు శ్రీశ్రీ ఇరవయ్యొవ శతాబ్దాన్ని పట్టుకొని. నిజంగానే శ్రీశ్రీ, ఆ ‘శతాబ్దాన్ని కాగితంలా మడిచి జేబులో పెట్టుకొని’ వెళ్ళిపోయాడా? ఒక దశలో శ్రీశ్రీ తనకీ, ఆధునిక తెలుగు కవిత్వానికీ ఉండే ఈడూ, జోడూ గురించి పరోక్షంగా చర్చించాడు. ఎవరు పెద్ద? ఎవరు చిన్న? 1930 వరకూ తనని తెలుగు కవిత్వం చెయ్యిపట్టుకొని నడిపిస్తే 1930 నుంచి తనే తెలుగు కవిత్వాన్ని చెయ్యి పట్టుకొని నడిపించాడు.
ఈ మాటలు శ్రీశ్రీకి చెల్లాయి. ఆయన ఆత్మ విశ్వాసానికి నిదర్శనాలయ్యాయి. మరొకరని ఉంటే అహంకారానికి ఆనవాళ్ళయ్యేవి.
నిజంగానే ‘మహాప్రస్థానం’ (1930-40) వచ్చాక, శ్రీశ్రీకి ఆధునిక తెలుగు కవిత్వానికి అధినాయకుడయ్యాడు. అయితే ఈ అధినాయకత్వం ఎంతవరకూ నడిచింది? కవి మరణించినా కవిత్వం జీవిస్తుంది కదా! ఇప్పటికీ శ్రీశ్రీ ప్రభావంతోనే తెలుగు కవిత్వం నడుస్తోందా?
ఒక ‘అధి విశేషం’
ఇవాళ ‘మహాప్రస్థానం’ చదవని కవులు కూడా కవిత్వం రాస్తున్నారు. అనుమానం లేదు, కొందరు మంచి కవిత్వం కూడా రాస్తున్నారు. అలాగే మహాప్రస్థానం కనివినీ ఎరుగని పాఠకులు కూడా ఆ కవిత్వాన్ని చదువుతున్నారు. స్వీకరిస్తున్నారు.
ఒకప్పుడు కొత్తగా కలం పట్టుకునే వాళ్ళకి ‘పెద్దబాలశిక్ష’ గా ఉండే మహాప్రస్థానం ఎప్పుడయినా చదవదగ్గ పూర్వ గ్రంథం అయిపోయిందా!?
ఆధునిక తెలుగు కవిత్వ వేదిక మీదికి స్త్రీ, దళిత, మైనారిటీ వాదులు ఒకరి తర్వాత ఒకరు దూసుకువచ్చాక ఒక్కసారి వెనక్కి తిరిగిచూస్తే ఎన్నో విశేషాలు. అందులో శ్రీశ్రీ అధినాయకత్వానికి తెరదించడం ఒక ‘అధివిశేషం’ (అధివాస్తవికత కాదులెండి)
ఇలా అనగానే విపరీతార్థాలు ముందుకొస్తాయి. అంటే శ్రీశ్రీ కవిత్వానికి కాలం చెల్లిందనా మీ ఉద్దేశం? అని కూడా నిలదీయవచ్చు. తెలుగు కవిత్వంతో తెలుగు వాడికి పని ఉన్నంత కాలం శ్రీశ్రీ కవిత్వం నిలుస్తుంది. అయితే శ్రీశ్రీ కవిత్వం నిలవడం వేరు. శ్రీశ్రీ అధినాయకత్వం వహించడం వేరు.

ప్రజల ‘చేత’ చేయించాల్సిన ఆకలి పోరాటాలను, కొందరు ప్రజల ‘తరపున’ చెయ్యడం మొదలుపెట్టారు. ప్రజల్ని ప్రేక్షకుల్ని చేసారు. ఇంకొందరు ఎన్నికల హడావుడిలో పడి ‘ఆకలి పోరు’ ను ఒక జీవిత కాలం పాటు వాయిదా వేశారు. ఈ 50 ఏళ్ళ కవిత్వానికి శ్రామికుడే హీరో. శ్రీశ్రీ ‘మానవుడే నా సంగీతం’ అన్నప్పుడు అందులోని మానవుడు ఈ శ్రామికుడే.
మొదటిది : కవిత్వంలోని జీవగుణానికి సంబంధించింది.
రెండవది : యుగ కర్తృత్వానికి చెందినది.
కవిత్వంలో శ్రీశ్రీ ప్రవేశపెట్టిన కవిత్వ వస్తువు 1930 నుంచి 1970 వరకూ కొనసాగింది. ఆ వస్తువు పేరు ఆకలి.
‘దీనులారా, హీనులారా
కూడులేని,గూడులేని
పక్షులారా,భిక్షులారా’
అర్ధ శతాబ్దం పాటు ఆధునిక తెలుగు కవిత్వం (కొన్ని మినహాయింపులతో) అక్షరాలా అన్నార్తుల వేదననీ, ఆక్రోశాన్ని పలికింది. అతి,మిత,విధ్వంసక ధోరణులలో తేడా ఉండొచ్చు. కానీ అంతా వెరసి ఆర్థికోద్యమమే ఈ కవిత్వానికి దిక్సూచి అయ్యింది. అది అభ్యుదయం కావచ్చు, దిగంబరం కావచ్చు. లేదా విప్లవం కావచ్చు. అన్నిటా కవిత్వ వస్తువు ఆకలి. అందుకోసం చేసే పోరాటం వేలయేళ్ళు మూగబోయిన జాతి ఒక్కసారి ‘వెర్రిగొంతుక విచ్చుకున్నట్లుగా పెళపెళ పెళపెళ విరుచుకుపడ్డాడు’’ శ్రీశ్రీ. అలా వచ్చిన యుగ కర్తృత్వానికి 1980 వ దశకం నుంచి గండి పడిరది. అంటే ఆకలి సమస్య తీరిపోయిందా? లేదు. ప్రజల ‘చేత’ చేయించాల్సిన ఆకలి పోరాటాలను, కొందరు ప్రజల ‘తరపున’ చెయ్యడం మొదలుపెట్టారు. ప్రజల్ని ప్రేక్షకుల్ని చేసారు. ఇంకొందరు ఎన్నికల హడావుడిలో పడి ‘ఆకలి పోరు’ ను ఒక జీవిత కాలం పాటు వాయిదా వేశారు. ఈ 50 ఏళ్ళ కవిత్వానికి శ్రామికుడే హీరో. శ్రీశ్రీ ‘మానవుడే నా సంగీతం’ అన్నప్పుడు అందులోని మానవుడు ఈ శ్రామికుడే.
కవుల కుట్ర కేసులు
ఇవాళ శ్రీశ్రీ మీద ఎవరి అభియోగాలు వాళ్ళు మోపుతున్నారు. ‘కసాయిబు’ అన్న పద ప్రయోగం చేసినందుకు ఒక మైనారిటీ కవి శ్రీశ్రీ మీద కుట్ర కేసు పెట్టాడు. ‘‘దొంగ ల.. కొడుకులసలే మెసలే ఈ ధూర్త లోకంలో నిలబడజాలక తలవంచుకు వెళ్ళిపోయావా నేస్తం?’’ అన్న శ్రీశ్రీ లోకంలో స్త్రీని కించపరిచినందుకు ఒక స్త్రీ వాదకవి పీకపట్టుకున్నారు. అంటరాని వారిపై కవిత్వం కట్టకపోగా, మరో మహా కవి జాషువా ఉనికినే గుర్తించని శ్రీశ్రీని క్షమార్హుడుగా చూడడం లేదు దళిత వాదులు.
ఇవి కొత్త ప్రశ్నలు. శ్రీశ్రీ కవిత్వాభిమానులకన్నా ‘‘శ్రీశ్రీ మార్గీయుల’ నూ, శ్రీశ్రీ కవిత్వం గొప్పది! అంతకన్నా ఆయన మార్గం గొప్పదీ అని నమ్మేవారినీ ఈ ప్రశ్నలు బాగా కలవరపెట్టాయి.
శ్రీశ్రీ మీద ఇలాంటి అభియోగాలు మోపుతున్న వారెవ్వరికీ శ్రామిక వర్గ స్పృహ లేదని, ఒక్క ముక్కలో కొట్టిపారెయ్యవచ్చు. అంతేకాదు మైనారిటీ వాదిని ‘మతవాదనీ’, ‘దళితవాదిని’ కులవాద’ నీ , స్త్రీవాదిని ‘నీలివాది’ అనీ ప్రక్కకు పెట్టవచ్చు. ఈ ప్రయత్నాలన్నీ తొలి దశలో పూర్తయ్యాయి. కానీ ఫలితం శూన్యం.
నేడు స్త్రీ, దళిత, మైనారిటీ వాదాల కవిత్వమే తెలుగనాట ప్రధాన స్రవంతి కవిత్వంగా స్థిరపడిరది. అదే ‘ప్రజాస్వామిక కవిత్వం.’ ఇది ముచ్చటగా పెడుతున్న పేరు. కాస్త ద్వేషంతో కూడా నామకరణం చెయ్యాలనుకుంటే మధ్య తరగతి కవిత్వం (అంటే శ్రామిక వర్గ కవిత్వం కాదని లోలోపల ఆనందించుకోవచ్చు) ఇదికూడా నప్పుతుంది. వ్యక్తిత్వం, అవమానం, ఉనికి ఈ సమస్యలు కడుపులో కాస్త గంజి పడ్డాకే అర్థమవుతాయి.దేశం, గ్రామం, వల్లకాడు.. ఇవన్నీ దేవుడెరుగు. ఎవరి శరీరం మీద వాళ్ళకు హక్కులేకపోవడం ఎంత దారుణం? ఈ ప్రశ్న స్త్రీవాది వేస్తుంది.
చెప్పులు కుట్టడంకాదు నీలాగా చెప్పులు తొడుక్కుని నిలబడతాను. ఎందుకు గౌరవించవు? ఈ మాట దళితవాది అడుగుతాడు.
ఈ గడ్డ మీద పుట్టాను’ ఈ గడ్డ మీద పెరిగాను’ ఈ గడ్డ కోసం నెత్తురు ధార బోశాను’ ఈ దేశం నాది. కాదనడానికి నువ్వెవడవు
అని నిలదీస్తాడు మైనారిటీ వాది.
నిజమే ఈ ప్రశ్నలు కూటికి లేని శ్రామికవర్గం నుంచి పుట్టలేదు. వాళ్ళకీ ఈ అవమానం తెలీదు. బువ్వదొరికే కోస్తా ప్రాంతపు దళితులూ (కారంచేడు, చుండూరుల సాక్షిగా) భర్తతోపాటు ఉద్యోగం చెయ్యగలిగిన మధ్యతరగతి మహిళలూ, కాస్త మెరుగైన చదువుకున్న మైనారిటీలూ ఈ ప్రశ్నలు వేసారు.
ఈ స్పృహల్లోంచి వచ్చిన కవిత్వానికీ శ్రీశ్రీ ఎలా అధినాయకుడు కాగలడు?
1930 కి ముందు గురజాడ యుగం నడిచింది. 1980 తర్వాత ఈ కొత్త యుగం వచ్చింది. అలాచూస్తే శ్రీశ్రీ యుగం అర్థ శతాబ్ధి మాత్రమే. శాస్త్రీయ శకంలో ఇదేమీ తక్కువ కాలం కాదు.
‘ప్రాతినిథ్య కవిత్వానికి’ విరామం
ఇక్కడ ఇంకో ప్రశ్న ఉదయిస్తుంది. స్త్రీల గురించీ, దళితుల గురించీ.. శ్రీశ్రీ లేదా శ్రీశ్రీ మార్గీయులు అంతకు రాయలేదా? ‘గురించి’ రాసిన వాళ్ళు, ‘పైన’ రాసిన వాళ్ళూ అనేకులున్నారు. ఇప్పటి యుగ లక్షణం అది కాదు. స్త్రీలు స్త్రీలుగా రాయడం, దళితులు దళితులుగా రాయడం, మైనారిటీలు మైనారిటీలుగా రాయడం, బహుశా మున్ముందు ఆదివాసులు ఆదివాసులుగా రాయడం. ఇదే ఇప్పటి యుగలక్షణం. అవమానం అనుభవించినవాడికే తెలుస్తుంది.
ఆకలి మాత్రం అనుభవిస్తేనే కానీ తెలియదు కదా! ఈ అవకాశం పేదలందరికీ ఉంది. కావాలంటే పేదరికాన్ని కవి వరించి అనుభవించవచ్చు. కానీ అంటరానితనాన్ని, జెండర్ పీడనని ఈ రకంగా తెలుసుకోవడం కష్టం
అందుచేతనే ఒకరి గురించి ఒకరు రాసే ’ప్రాతినిధ్య’ కవిత్వం ఆకలిని పలికించి నంతగా అవమానాన్ని వ్యక్తం చేయలేకపోయింది.
‘‘కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం
జాలరి పగ్గం, సాలెల మగ్గం
శరీర కష్టం స్ఫురింపచేసే
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి
సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు’’
అని శ్రీశ్రీ రాసింది ‘శ్రామికవర్గ ప్రాతినిధ్య కవిత్వమే’ ఇందులో వృత్తులూ వృత్తుల వారి ఆర్థిక పీడనలు మాత్రమే ఉన్నాయి. కుల ప్రస్తావన ఉన్నా వారికున్న సాంఘిక పీడన వ్యక్తం కాదు.
అయితే ‘ఖడ్గసృష్టి’ లో చోటుచేసుకున్న ‘వెండి పండుగ’ (తొలి ముద్రణ) కవితలో మాత్రం
ఇంకా ఈ సాహిత్య ఏమి ఒరగబెట్టింది ఆకలి చావులు, హరిజన దహనాలు’ అని దళితులపై దాడుల్ని అని శ్రీశ్రీ ఉటంకిం చారు. ఇదీ ప్రాతినిధ్య కవిత్వమే’ హరిజన పదం’ దళితుల్ని కించపరిచే పదమని, మిగిలిన కమ్యూనిస్టులకు లాగానే శ్రీశ్రీకి కూడా అప్పటికి తెలియలేదు.
ఆ లెక్కన స్త్రీ గురించి కూడా ‘స్త్రీ స్త్రీ’ అనే ఖండిక (తొలి ముద్రణ 1942) లో ఏనాడో రాశారు.
కథా నాయిక, వార్తా పత్రికల గర్భస్రావం వంట ఇంటికుందేలు. బురఖాలో ఘోషా, అన్యాయానికి అనుమతించిన అజ్ఞాని’’ అని రాశారు. ఇదీ ప్రాతనిధ్యమే. కాకుంటే కొంత ‘జెండర్’ స్పృహ ఉంది.ఇక ఉద్యమంలో పనిచేసే స్త్రీల వీరత్వం మీదా అమరత్వం మీదా శ్రీశ్రీ రాశారు. శ్రీశ్రీ మార్గీయులూ రాశారు.
అయితే, రాబోయే ‘యుగ స్పృహ’ ని సూచన ప్రాయంగానైనా రాయగలిగింది కొంతవరకు ‘దిగంబర కవులు.
‘‘యుగ స్పృహ’లోనే ‘యుగ పరిమితి’ కూడా ఉంటుంది.
శ్రీశ్రీ యుగానికి ‘వర్గ స్పృహే యుగ స్పృహ. వర్గ పరిమితే యుగపరిమితి!
సమకాలీన జీవితమే సత్కవితా వస్తువు అన్నాడు శ్రీశ్రీ.
వర్ణం, జెండర్‌ల మీద నేటి కవిత్వం దాడిచేస్తోంది. ఈ కవిత్వంలో శ్రీశ్రీ ప్రమేయం లేదు.
ఇవాళ వీరేశలింగాన్ని కూడా అలాగే చూద్దామా? ఆయన బ్రాహ్మణ స్త్రీలనే ఉద్ధరించాడు కాబట్టి బ్రాహ్మణవాది అందామా? అలాంటప్పుడు ఆయన కాలంలోనే అదే బ్రాహ్మణ స్త్రీలకు ‘విద్యకూడదు’ అన్న కొక్కొండ వెంకటరత్నం పంతుల్నేమందాం? ఇద్దరికీ తేడా లేదా? అలాగే ‘వేయిపడగల’ నీడకింద ‘కులవ్యవస్థను’ కాపాడాలన్న విశ్వనాథ సత్యనారాయణనీ, ‘‘రెడ్డి తగవు, కమ్మ తగవు, రెడ్స్ తీర్త్రు గుట్టుగా అన్న భరోసాతో వున్న ‘వర్గనిర్మూలన’ కవిత్వాన్ని రాసిన శ్రీశ్రీని ఒకేవిధంగా చూద్దామా?

కొక్కొండ, కందుకూరి వేరు వేరు
మారిన ఈ చారిత్రక సందర్భంలో శ్రీశ్రీ కవిత్వంపై పునస్సమీక్ష అవసరమే. అయితే అది నిష్పాక్షికంగా జరగాలి. కానీ అలాలేదు. ఒక శిబిరంలో ‘వీరారాధన’ ఎక్కువగా ఉంటే, ఇంకో శిబిరంలో ‘గుడ్డిద్వేషం’ విపరీతంగా ఉంది. ‘వీరారాధకులు’ ఈ యుగానికి కూడా శ్రీశ్రీనే కర్తగా నిలబెడుతున్నారు. ఇందుకు పూర్తి విరుద్ధంగా వేరే శిబిరాల వారు శ్రీశ్రీని ఒక బ్రాహ్మణవాదిగా, ఒక పురుషాహంకారిగా, ఒక మెజారిటీవాదిగా ముద్రవేస్తున్నారు. ఇది విచారకరం. ఇవాళ వీరేశలింగాన్ని కూడా అలాగే చూద్దామా? ఆయన బ్రాహ్మణ స్త్రీలనే ఉద్ధరించాడు కాబట్టి బ్రాహ్మణవాది అందామా? అలాంటప్పుడు ఆయన కాలంలోనే అదే బ్రాహ్మణ స్త్రీలకు ‘విద్యకూడదు’ అన్న కొక్కొండ వెంకటరత్నం పంతుల్నేమందాం? ఇద్దరికీ తేడా లేదా? అలాగే ‘వేయిపడగల’ నీడకింద ‘కులవ్యవస్థను’ కాపాడాలన్న విశ్వనాథ సత్యనారాయణనీ, ‘‘రెడ్డి తగవు, కమ్మ తగవు, రెడ్స్ తీర్త్రు గుట్టుగా అన్న భరోసాతో వున్న ‘వర్గనిర్మూలన’ కవిత్వాన్ని రాసిన శ్రీశ్రీని ఒకేవిధంగా చూద్దామా?
శ్రీశ్రీ బ్రాహ్మణవాదం మీద, పురుషాహంకారం మీదా, మెజారిటీ వాదం మీదా యుద్ధం ప్రకటించకపోవడం వాస్తవమే. అందులో ఆయన ‘ఉదాసీనత’ ఉంది. ఈ ఉదాసీనత అప్పటికి ఆయన నమ్మిన మార్గంలో ఉంది. అలాగని వీటిని పెంచిపోషించిన వారి జాబితాలో శ్రీశ్రీని వెయ్యటం మాత్రం దురదృష్టకరం.
నిన్నటి కవి ఏకవచనం, నేటి కవి బహువచనం
శ్రీశ్రీ ‘ఖడ్గసృష్టి’ ఎన్నో ఆలోచనల్ని రేకెత్తించింది. మొదటి ముద్రణకీ, (చలసాని ప్రసాద్ సంపాదకత్వంలో ) ఇటీవల వచ్చిన ముద్రణకీ పోలికలేదు. అంతకుముందు లేని కవితలతో పుష్టిగా ఉంది. బహుశా ఇది ‘సంపూర్ణ ఖడ్గ సృష్టి’ కావచ్చు. ఇది ‘మహాప్రస్థానం’ తర్వాత 1940 – 1970 మధ్యకాలంలో వచ్చిన కవిత్వం, మహాప్రస్థానంలో ఉన్న ఉధ్ధృతీ, హోరూ ‘ఖడ్గసృష్టి’లో ఉండదు. అయితేనేం? అంతకన్నా స్వేచ్ఛగా ఉంటుంది. వచన కవిత్వ సహజ విన్యాసం చాలావరకూ బయల్పడుతుంది.
ఆధునిక కవిత్వానికి ఆధునిక రూపం ఉండాలని కలలుకన్నాడు శ్రీశ్రీ. అందుకే ‘ఛందోబందోబస్తుల్లో’ ఆధునిక కవిత్వం ఒదగదనుకున్నాడు. అయితే అప్పటికి తెలుగు వాడు పద్యానికే అలవాటుపడ్డాడు. అంటే కవిత్వాన్ని విని ఆనందించటానికే ఎక్కువ అలవాటుపడ్డాడు. రాగయతులు లేని కవితను ఊహించుకోలేని స్థితిలో ఉన్నాడు. అలాంటి పాఠకుడికి హఠాత్తుగా (ఛందస్సు, కథా, శుద్ధవర్ణనాలేని) వచన కవితను వినిపిస్తే, ఆ నిరాడంబరతను తట్టుకోగలడా?
కాబట్టి, మద్యం మాన్పించడానికి మద్యం పోలిన ఔషధం ఇచ్చినట్టు, పద్యం చదివిన వాళ్ళకి పద్యాన్ని పోలిన వచన కవిత్వాన్ని పట్టించి Deaddict చేసాడు శ్రీశ్రీ. ఈ ప్రయోగం ‘మహాప్రస్థానం’లో జరిగింది.
అందుకే ఛందస్సుని తిట్టిపోసిన ‘మహాప్రస్థానం’లోనూ ఛందస్సు వెతుకుతుంటారు చాలా మంది.. ‘మాత్రా ఛందస్సు ఉంది కదా! లేదా ఫలానా ఛందోరూపం ఉంది కదా! అంటారు. అది కేవలం మన భాషకు పారంపర్యంగా వచ్చిన ఛందస్సే. అయితే అంతటి హోరు ఉండదు. ఇందులో ఛందస్సుకు మించిన సంగీతం ఉంది. ఈ సంగీత రహస్యం శ్రీశ్రీకి కాకుండా మరొక్కడికే తెలుసు. అతడి పేరు ‘స్విన్‌బర్న్’ .
మొత్తం ‘మహాప్రస్థాన గీతాల్లో కవుల మీద రాసినవి రెండే రెండు. కొంపెల్ల జనార్ధన రావు మీద ఒకటి రాస్తే, స్విన్‌బర్న్ కవి మీద మరొకటి రాశాడు. మొదటిది కేవలం స్మృతి గీతం. రెండవది కృతజ్ఞతతో రాసినది.
‘‘షెల్లీ కవనపు హల్లీ సకమూ
ఫ్రెంచి గీతుల మంచిరీతులు
మోహినీ గంధర్వగానం
కవీ, నీ పాటల్!’’
స్విన్‌బర్న్ కవి శిల్పాన్ని శ్రీశ్రీ ఎంత లోతుగా అధ్యయనం చేసాడో దీనిని బట్టి అర్థమవుతుంది. అది ఛందస్సు కాదు. ఛందస్సులా (prosodic effect) అనిపిస్తుంది అని స్విన్‌బర్న్ గీతాలకు పరిచయ వాక్యాలు రాసిన బోనమీ డాబ్రీ అనే ఇంగ్లీషు విమర్శకుడు అంటాడు.
ఇక ‘అద్వైతం’ కవితకు శ్రీశ్రీ రాసుకున్న ఫుట్‌నోట్‌లో అయితే స్విన్‌బర్న్ చేసిన, చూపిన మార్గానికి నేరుగా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు శ్రీశ్రీ.
If love were what the rose is
and i were like the leaf…
ఇలా సాగే స్విన్‌బర్న్ పద్య సంగీతాన్ని పట్టుకుని
‘‘ఆనందం ఆర్ణవమయితే
అనురాగం అంబరమయితే…’’ అని రాశాడు శ్రీశ్రీ.
వచన కవిత్వాన్ని పీడిస్తున్న పద్యం
అలా Deaddict కాబడ్డ అ పాఠకుడు తర్వాత కాలంలో వచన కవిత్వానికి అలవాటుపడ్డాడు. నిరాడంబర వచన కవిత్వాన్ని స్వీకరించడం మొదలుపెట్టాడు. ‘ఖడ్గసృష్టి’ కాలంలో శ్రీశ్రీ వచన కవిత్వ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఎందరో కవుల శిల్పరీతుల్ని పరిచయం చేశాడు.
అలా చూసినపుడు వస్తువు విషయంలో నేటి ‘ప్రజాస్వామిక కవులు’’ శ్రీశ్రీని అధిగమించినా కవిత్వ శిల్పం విషయంలో ఇంకా వెనకబడ్డట్టుగానే కనిపిస్తుంది.

వచన కవిత్వ నిర్మాణం విషయంలో మనవాళ్ళింకా పాత పద్యలక్షణాలను పూర్తిగా వదిలించుకోలేదు.
ఇప్పటికీ చదివి వినిపించే వచన కవిత్వాన్ని రాస్తున్నారు. మనసులో చదువుకోవటానికి మాత్రమే ఉద్దేశించిన వచన కవిత్వాన్ని రాయలేకపోతున్నారు. అలాగే కథను నడిపించిన పద్ధతిలోనే కవిత్వాన్ని నడిపే సాంప్రదాయక పద్ధతి కి స్వస్తి పలకలేక పోతున్నారు. ఉత్త వర్ణన చేసి కవిత్వమని బుకాయించే పనిని ఇంకా కొందరు చేస్తూనే ఉన్నారు.
భాష విషయంలో మార్పు వచ్చింది. కొత్త ఉద్యమం ఎలాగూ కొత్త పలుకుబడిని తెస్తుంది. శ్రీశ్రీ 1960 లోనే ‘ఇంకా ఎన్నాళ్ళు మనకి ఈ సంస్కృత దాస్యం’’ అన్నాడు.అయితే వచన కవిత్వ నిర్మాణం విషయంలో మనవాళ్ళింకా పాత పద్యలక్షణాలను పూర్తిగా వదిలించుకోలేదు.ఇప్పటికీ చదివి వినిపించే వచన కవిత్వాన్ని రాస్తున్నారు. మనసులో చదువుకోవటానికి మాత్రమే ఉద్దేశించిన వచన కవిత్వాన్ని రాయలేకపోతున్నారు. అలాగే కథను నడిపించిన పద్ధతిలోనే కవిత్వాన్ని నడిపే సాంప్రదాయక పద్ధతి కి స్వస్తి పలకలేక పోతున్నారు. ఉత్త వర్ణన చేసి కవిత్వమని బుకాయించే పనిని ఇంకా కొందరు చేస్తూనే ఉన్నారు.
నిజానికి ‘మహాప్రస్థానం’ కన్నా ‘ఖడ్గసృష్టి’ లోతైనది. కానీ ‘మహాప్రస్థానమే’ శ్రీశ్రీకి సంకేతమయింది. అందుకు కారణం ‘ఖడ్గసృష్టి’లో రూప ప్రయోగం కొంచెం వికటించింది. ఆధునికతలో భాగమైన వాస్తవికతే ఇంకా కళా సిద్థాంతం స్థిరపడని కాలంలో, అధివాస్తవికతను తెచ్చిపెడితే అది ముందు ఇమిడినట్టే ఇమిడి తర్వాత అయోమయమయి కూర్చుంది.నాడు శ్రామికవర్గ కవిత్వానికి శ్రీశ్రీ ‘అధివాస్తవికత’ ను తొడిగినట్టే, నేడు దళిత కవిత్వానికి ‘ఆధునికానంతరవాదాన్ని’ తొడిగే ప్రయోగం చేస్తున్నారు. మనం ఇప్పటికి ఆధునికతకు చేరుకోగలుగుతున్నాం.ఈ సందర్భంలో సఫలమైన శ్రీశ్రీ ప్రయోగాలను స్వీకరించవచ్చు. ఆ రకంగా శ్రీశ్రీ కవిత్వ పఠనావశ్యకత కవిత్వాభిమానులకే కాకుండా, కవులకు కూడా ఉంటుంది.శ్రీశ్రీ నేటికి యుగానికి కర్త కాకపోయినా చిరంజీవి. ఆయన కవిత్వం చిరంజీవి. శ్రీశ్రీ కర్తృత్వాన్ని 50 ఏళ్ళకే పరిమితం చెయ్యటంలో ఎలాంటి దురుద్దేశాలూ ఎవరికీ ఉండడానికి వీలులేదు. శ్రీశ్రీయేచెప్పినట్లు
‘‘ఇది వరకు కవులను
మింగెయ్యాలనేఆకలి కాదిది
నిన్నటి నుంచి ఇవాళ లాగ
నిరుటి కవుల నుంచి నేటి కవులు పుడుతారు’’
కానీ ఒక్కటే తేడా! నిన్నటి కవి ఏకవచనం. నేటి కవి బహువచనం.
- సతీష్ చందర్
(ఆంధ్ర ప్రభ’ దినపత్రిక , 2000)
You may please leave your comments here