శీలావీర్రాజు కలానికి ఇటూ అటూ:


అమాయకత్వం, కవిత్వంఈ రెంటినే భూమ్మీద దొరికే అరుదైన వజ్రాలుగా నేను భావిస్తాను. అమాయకుడు కానివాడు కవి కాలేడు. అమాయకత్వమంటే తెలియనితనం కాదు, తెలిసినా పట్టని తనం. లోకం రూపాయికి నమస్కరిస్తుందని తెలిసి కూడా, పాపాయిలా విసిరికొట్టగలగడం అమాయకత్వం.

“ఏదీ! నీకొచ్చిన ఇంగ్లీష్ రైమ్ చెప్పు. అంకుల్ వింటారు.” అని తల్లిదండ్రులు జ్ఞాన ప్రదర్శన చేయమన్నా, ‘నేను చెప్పను’ అని తుర్రున చెక్కేసే పసితనం అమాయకత్వమయితే, ఆది కవికి ఉంటుంది. వెనకటికి చాసోగారు ‘చిన్నారి’ అనే కథలో పసిపిల్ల చిన్నారి గురించి చెబుతూ. “చిన్నారి కవిత్వం లాంటిది. అది మనం పిలిచినప్పుడెల్లా రాదు. దానికి బుద్ధి పుడితెనే వస్తుంది.” అన్నారు. కవిత్వం కవీ వేరు కారు. అలాగే రచనా, రచయితా. రచన గొప్పదా? రచయిత గొప్పవాడా? అంటే చెప్పటం కష్టమే. చాలా సార్లు వింటుంటాం “ఆయన మంచి రచనలు చేశారు కాని, మనిషి మంచివాడు కాదు” అని విమర్శిస్తుంటారు.
మంచి మనిషి కాలేని వాడు మంచి రచన చేయగలడా? హృదయాన్ని తాకే ఏవచనమయినా హృదమున్నవాడే రాయగలడు.
కాని దొంగలు రాసిన రచనలు కూడా ప్రాచుర్యం పొందుతాయి కదా! కీర్తింప బడుతాయి కదా! అందుకు వంద కారణాలుంటాయి. అందులో బూతులుండవచ్చు, లేదా పై నుంచి చెప్పే నీతులుండవచ్చు లేదా రెచ్చగొట్టే ప్రకటనలుండవచ్చు కాని నిఖార్సయిన జీవితానుభం ఉండదు. ఈ రచనలు బాజాభజంత్రీల మధ్య తాత్కాలికంగా ఊరేగినాఅవి తాత్కాలికం. చరిత్ర పక్కనే, చెత్తబుట్టకూడా ఉంటుంది. ఇలాంటి రచనలకు తుది గమ్యం అదే. అయితే, నిష్కపటమైన అనుభవం నుంచి వచ్చే రచనలు గొప్ప రచనలుగా ఎప్పటికీ నిలుస్తాయి. గోర్కీ రచనలు అలాంటివే. గోర్కీ రచనలు చదివిన టాల్‌స్టాయ్ ఒక ఉత్తరం రాశాడు. “మీ రచనలంటే ఇష్టపడ్డాను కానీ, ఆ రచనల కన్నా మీరు ఎత్తులో మీరున్నారని కనుగొన్నాను” (“I have liked your writings, but I have found you better than those writings”) ఆ ఉత్తరం చదువుకున్న గోర్కీ ఇలా బదులిచ్చాడు: “నా గ్రంథాలకన్నా నేను ఉన్నతుణ్ని అవునో, కాదో తెలియదు కానీ, ఏ రచయితయినా తాను రాసేదాని కన్నా తాను ఎత్తులో ఉండి తీరాలని మాత్రం తెలుసు.” నిజం చెప్పటం, అబద్ధం చెప్పక పోవటం వంటి మామూలు అర్థంలో ఈ మాట అనటం లేదు. తానేమిటో అదే చెప్పటం లేదా, రాయటం అన్నది గోర్కీ ఆంతర్యం. అదే నిజాయితీ. దీన్నే ప్రపంచం అమాయకత్వమంటుంది. లేదా పసితనమంటుంది. ఇది లేని రచయిత, నకిలీ రచయిత.

శీలా వీర్రాజు గారి ‘కలానికి ఇటూ అటూ’ అనే ‘ఆత్మ విమర్శనాత్మక విమర్శ’ను చదివాను. ప్రతి వాక్యంలోనూ నిజాయితీ కనిపించింది. ముద్దొస్తే ముద్దు. తిట్టొస్తే తిట్టు! ఎక్కడా వడపోతలూ లేవు; ఎత్తిపోతలూ లేవు. కలానికి ఇటువైపు స్వీయ సాహిత్యానుభావాలుంటే, అటువైపు సాహిత్వ విమర్శలున్నాయి. రెండు చోట్లా ఆయన తపించింది ఈ నిజాయితీ కోసమే. అందులో ప్రత్యేకించి ఒక వ్యాసం పేరే “ఆధునిక కవిత్వంలో నిజాయితీ” .అందులో “నా దేవుడు చీమూ, నెత్తురూ ఉన్నమానవుడు మానవత్వాన్ని తప్ప మరో మతాన్ని అంగీకరించడు” అంటారు వీర్రాజు. అలా కాకుండా, మనిషిని దేవుణ్ణి చేసిన ఇంకెవరయినా కవి ప్రతీరోజు పూజ చేస్తే కాని, పచ్చి మంచినీళ్లు ముట్టుకోడని విన్నప్పుడు అతని మీద పాఠకుడికి ఎలాంటి భావం కలుగుతుందదో వేరే చెప్పనవసరం లేదు”.

కథలోనైనా, నవలలోనైనా కల్పనే సౌందర్యం.జరిగిన సంఘటన తీసుకొనే కథ రాయవచ్చు. అందులోని వాస్తవం సగం నిజాన్నే బయట పెడుతుంది. మిగిలిన నిజం కల్పనలోనే బయటపడుతుంది. కల్పన లేకుంటే కథ వార్తలాగే మిగిలిపోతుంది. “కథానిక నిర్మాణ శిల్పం” అనే వ్యాసంలో “శిల్పమంటే మరేం కాదు, ఒక సంఘటనని వార్తగా కాకుండా కథగా చేసేదే శిల్పం” అని వీర్రాజుగారు తేల్చేశారు. ఇవాళ చాలామందిసీరియస్’ కథా రచయితలు` సైతం తమతమ ప్రాంతాల్లోని ‘ముడి జీవితాన్ని’ ఏమాత్రం ‘కల్పన’ లేకుండా రాస్తున్నారు. ఇవి నిజంగా వార్తలే! కథలు కావు.

అంతే కాదు. ‘గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అనే తిరోగమన వాదులకున్న నిజాయితీ, ‘ఉందిలే మంచీ కాలం ముందూ ముందున’ అని నమ్మకాన్నివ్వాల్సిన పురోగమన వాదులకు ఉండటం లేదని బాధపడ్డారు కూడా. “నిజానికి విశ్వనాథ సత్యనారాయణను మనం ఎంతగా ఛాందస వాది, ప్రగతి నిరోధకుడు, అనాగరిక, అశాస్త్రీయ ఆలోచనా శీలి అని ముద్రవేసినప్పటకీ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఉద్యమసదృశంగా కృషి చేశాడు” అంటారు వీర్రాజు. నిజమే. వెనక్కి నడిపించేవారి కన్నా, ముందుకు నడిపించేవారికి ఎక్కువ నిజాయితీ ఉంటేనే సమాజం ముందుకు వెళ్తుంది. ఆనాడు, “పురుషులకు విద్యకూడదు” అన్న కొక్కొండ వారికి ఎంత నిజాయితీ ఉందో, అంతకు మించిన నిజాయితీ వీరేశలింగం గారికి ఉంది. ఇప్పుడు అది లోపిస్తున్నది. కానీ, శీలావిర్రాజు లాంటి కొద్ది మంది రచయితల వల్ల ఆధునిక తెలుగు సాహిత్యం ఇంకా చొంచెం పచ్చగా ఉంది.


“జీవితంలోనైనా, సాహిత్యంలోనైనా నిజాయితీ ముఖ్యమని నమ్మేవాళ్లలో నేనొకడిని” అని లక్ష్య ప్రకటన కూడా శీలా చేశారు. “ఏ కవి అయినా ప్రాసకోసం ఏడ్చి, పెన్నుకాదు, గన్ను పట్టుకొమ్మంటే పాఠకు”లు అతడిని నమ్మేముందు, అతని అభిరుచుల్నీ, అతని మొత్తం కవిత్వాన్నీ పరిగణలోకి తీసుకుని చూస్తారు.” అని “నా రచనల నేపథ్యం” అనే వ్యాసంలో చిరు హెచ్చరిక కూడా చేశారు. రచయితకు ఈ నిజాయితీ ఎలా వస్తుంది? బాల్యాన్ని కాపాడుకుంటేవస్తుంది. “జారిపోయిన బాల్యం ఎలాగూ రాదు కనుక, కనీసం బాల్యంలోని ఆ మనసైనా నాకు మళ్లీ వస్తే ఎంత బాగుండును!” అంటారాయన. ఈ తపనే నిజాయిస్తుంది.

ప్రతీ ఉత్తమ రచనకూ ప్రగతిశీలతా, ప్రయోగ శీలతా అనే రెండు మంచి గుణాలు ఉండాలని వాదించే వాళ్లల్లో శీలావీర్రాజు కూడా ఒకరు. ప్రగతిశీలత అందరికీ తెలిసినదే. అందుకు ఎవరి నిర్వచనాలు వారికి ఉంటాయి. “తెలుగు కథా వర్తమాన రీతులు “అనే వ్యాసంలో” మంచి కథ సహజత్వమంత కల్పనతోనో, కళ్లముందు జరుగుతున్నంత నిజంగానో ఉండాలి” అంటారు. అంటే పరోక్షంగా ప్రగతీ శీలతకు కూడా రచయిత నిజాయితీయే గీటురాయిఅని తేల్చారు. ఇక, ‘ప్రయోగశీలత’లో శిల్పం, శైలీ ప్రధానం. ‘ప్రగతిశీలత’కు నిజాయితీ ఎంత ముఖ్యమో, ‘ప్రయోగశీలత’కు సౌందర్యం అంతే ముఖ్యం. ‘సౌందర్యం ప్రపంచాన్ని రక్షిస్తుంది’ అన్నాడు దోస్తొవిస్కీ. చాలామంది, ‘సౌందర్య దృష్టిని సుఖజీవితానికి పర్యాయపదంగా చూస్తున్నారు. ముసుగు తీయటమే నిజమైన సౌందర్యం. దోపిడీ ముసుగును తియ్యటం ఇంకెంత గొప్ప సౌందర్యం! ఎప్పుడో ‘కొడిగట్టిన సూర్యుడు’ అనే దీర్ఘ కవితలో వీర్రాజు గారు
“కటిక నేల మీదనే నిద్రపోయి, కలల పంచకళ్యాణిపైన తిరగ్గలను” అన్నారు.
ఇదీ సౌందర్యం.
అయిన స్వయంగా చిత్రకారుడు కూడా కావటం వల్ల ఈ సౌందర్యాన్ని రెండు కళ్లతో చూడగలుగుతున్నారు. వీర్రాజు తన ‘ఆస్థి పంజరం’ కథా నేపథ్యం గురించి చెబుతూ అడవి అందాన్ని ఒక చిత్రకారుడు ఎలా చూశాడో, ఒక కవి ఎలా దర్శించాడో రాశాడు. “స్త్రీ ఒంటి మీద ఇతరులకు కనిపించకుండా దాచిన భాగాల్లా, సృష్టిలో దాగిన మారుమూల సౌందర్యాన్ని” బహిర్గతం చేసేలా అడవిని చిత్రించాలని చిత్రకారుడూ; “వక్షాల మధ్య చంద్రహారంలా కొండల మధ్య లోయలో పిల్ల కాలువా” అంటూ అడవి అంతరంగ సౌందర్యాన్ని బహిరంగ పరచాలని కవీ ఆ కథలో ప్రయత్నిస్తారని రాశారు.

కథలోనైనా, నవలలోనైనా కల్పనే సౌందర్యం.జరిగిన సంఘటన తీసుకొనే కథ రాయవచ్చు. అందులోని వాస్తవం సగం నిజాన్నే బయట పెడుతుంది. మిగిలిన నిజం కల్పనలోనే బయటపడుతుంది. కల్పన లేకుంటే కథ వార్తలాగే మిగిలిపోతుంది. “కథానిక నిర్మాణ శిల్పం” అనే వ్యాసంలో “శిల్పమంటే మరేం కాదు, ఒక సంఘటనని వార్తగా కాకుండా కథగా చేసేదే శిల్పం” అని వీర్రాజుగారు తేల్చేశారు. ఇవాళ చాలామందిసీరియస్’ కథా రచయితలు` సైతం తమతమ ప్రాంతాల్లోని ‘ముడి జీవితాన్ని’ ఏమాత్రం ‘కల్పన’ లేకుండా రాస్తున్నారు. ఇవి నిజంగా వార్తలే! కథలు కావు.
ఈ వ్యాస సంకలనంలో కొత్తరచయితలకు స్ఫూర్తినివ్వగల రచనలున్నాయి.
తెలుగు సాహిత్యంలో ఇదొక అరుదయిన పుస్తకం.

కింగ్‌మేకర్, పక్షపత్రిక, 1998

( నేను ప్రచురించిన సాహిత్య విమర్శగ్రంథం ‘నిగ్రహవాక్యం’-2015 లో పునర్ముద్రితం)

1 comment for “శీలావీర్రాజు కలానికి ఇటూ అటూ:

  1. వీర్రాజుగారి కవిత్వంలోనూ, వ్యక్తిత్వంలోనూ నిజాయితీని చాలా బాగా విశ్లేషణ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *