‘అగ్గీ’ రాజా!

కేరికేచర్:బలరాం

కేరికేచర్:బలరాం

పేరు : దిగ్విజయ్‌ సింగ్‌

ముద్దు పేర్లు : ‘అగ్గీ’రాజా( విభజన ప్రకటన కారణంగా రాష్ట్రంలో రెండు ప్రాంతాల మధ్య రగులుతున్న అగ్గిని చూస్తున్నారు కదా!) ‘విడాకుల’కింగ్‌( నేను మా పార్టీ తరపున ఏ రాష్ట్రానికి ఇన్‌ చార్జ్‌గా వుంటే, ఆ రాష్ట్ర విభజనకు తోడ్పడుతూ వుంటాను.)

విద్యార్హతలు : ఎం.పి.ఎ ( మాస్టర్‌ ఆఫ్‌ పొలిటికల్‌ ఇంజనీరింగ్‌). కాంగ్రెస్‌ పార్టీని ఎప్పుడయినా, ఎక్కడయినా పాతాళంలో నుంచి, ఆకాశంలోకి లేప గలను. మళ్ళీ పాతాళంలో పడిపోతే ఆ బాధ్యత నాది కాదు. మధ్య ప్రదేశ్‌లో అదే జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే జరుగుతుంది. విభజన ప్రకటనకు ముందు తెలంగాణలో కాంగ్రెస్‌ అధ:పాతాళంలో వుంది. మరి ఇప్పుడు? పైకెక్కడికో వెళ్ళిపోయింది. అఫ్‌ కోర్స్‌ సీమాంధ్రలో కాంగ్రెస్‌ పాతాళంలోకి పడిపోయిందనుకోండి. అది వేరే విషయం.

హోదాలు : పేరుకు రాజాని కానీ, ప్రజలకు సేవకుణ్ణి. మా పూర్వికులు సంస్థానాలను వంశపారంపర్యంగా పాలించారు. ఇప్పుడు ‘సేవ’ను కూడా పారంపర్యంగానే అందిచబోతున్నాం. నా తర్వాత నా కొడుకు జయివర్థన్‌ కూడా ‘సేవ’కు సిధ్ధమవుతున్నాడు. రాజు (సారీ, సేవకుడు) తలచుకుంటే, నియోజకవర్గాలు కరువా? మూల్‌సింగ్‌ అనే అభిమాని తన నియోజకవర్గాన్ని (రాకుమారుడి, సారీ, సేవక కుమారుడికోసం ఖాళీ చేసి ఇస్తున్నారు.) అలా చూసినప్పుడు నన్ను ‘దిగ్గీ’ రాజా అని పిలవనవసరం లేదు, ‘దిగ్గీ’ సేవక్‌ అని పిలిస్తే చాలు.

గుర్తింపు చిహ్నాలు : ఒకటి: ఎక్కడ సంక్షోభం వుంటుందో అక్కడ ‘దిగ్గీ’ వుంటాడు. ప్రశాంతత నివ్వటానికి.

రెండు: ఎక్కడ ప్రశాంతత వుంటుందో, అక్కడ ‘దిగ్గీ’ వుంటాడు. సంక్షోభాన్నివ్వటానికి.

( ‘ఆఫ్‌ ది రికార్డ్‌’ అంటే ‘మీకూ నాకూ మధ్యే’. రాజకీయాలకు ఈ రెండూ అవసరమే.)

అనుభవం : దివాళా తీసిన బ్యాంకులను లాభాల్లో పెట్టగలం. బ్యాంకులంటే నోట్ల బ్యాంకులనుకునేరు. ‘వోట్ల’ బ్యాంకులు. కాంగ్రెస్‌ వోటు బ్యాంకును ఉత్తరాదిన దివాళా తీయించినవి రెండు పార్టీలు: బీజేపీ, బీఎస్పీ. కాబట్టే నా వ్యాఖ్యలు ఎప్పుడు ‘కాషాయ పార్టీలకూ’ ‘కాషాయ నేతల’కూ వ్యతిరేకంగా వుంటాయి. లేకుంటే ‘మెజారిటీ హిందూ వోటు’ వాళ్ళకే పోతుంది. ఇక ‘మండల్‌ ‘ తర్వాత దళిత వోట్లను బీఎస్పీ ఆకర్షించేసింది. అందుకోసం 2002లోనే ‘భోపాల్‌ డిక్లరేషన్‌’ పేరు మీద దళిత వోట్లకు గాలం వేశాను. ఈ అనుభవాన్నే తెలంగాణలో కాంగ్రెస్‌ ను దివాళా తీయించిన టీఆర్‌ఎస్‌ మీద ప్రయోగించాను. ఇక సీమాంధ్రలో కాంగ్రెస్‌ను దివాళా తీయిస్తున్న వైయస్సార్‌ కాంగ్రెస్‌ను ఏం చేయాలా- అని యోచిస్తున్నాను.

వేదాంతం : ప్రాంతాలు( సీమాంధ్ర, తెలంగాణ) వేరు కావాలి. పార్టీలు( కాంగ్రెస్‌ టీఆర్‌ఎస్‌) లు విలీనం కావాలి. ఇదే నా వేదాంతం. ఈ తత్వాన్ని విభజన ప్రకటనరోజే కేసీఆర్‌కు ఎరుక పరచాను.

వృత్తి : విడాకుల ప్లీడరు ఏం చేస్తాడు? అదే చేస్తాను.( నిత్యమూ కలహించుకునే వారిని కలసి వుండమనటం పాపం కదా! అందుకే ఈ పుణ్య వృత్తి చేపట్టాను.)

హాబీలు :1. మైకులకు లీకులు: అత్యంత గోప్యంగా జరిగాయన్న పార్టీ సమావేశాల వివరాలు మీడియాకు లీకవుతుంటే, తమాషాగా చూస్తుంటాను.

2. లీకులకు మైకులు: లీకులే వ్యాపించి విస్తరించాక, వాటి గురించి వివరణలు అడిగినప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటాను.

నచ్చని విషయం :మోడీ. అతని మతతత్వం కాదు. ‘మెజారిటీ’ తత్వం.

మిత్రులు : గుర్తుంచుకోండి. నన్నే కాదు, మా పార్టీ ఏ నేతను అడిగేటప్పుడయినా ‘మిత్రులెవరు?’ అని అడగకూడదు ‘ ఈ పూట మిత్రులెవరు?’ అని. అవును ‘సంకీర్ణ’ రాజకీయాలు, పొద్దున్న శత్రువులుగా వున్న వారు , సాయింత్రానికి మిత్రులు కావచ్చు. ఇప్పుడు చూడండి. కేసీఆర్‌ మాకు మంచి మిత్రులు.

శత్రువులు :ఎవర్ని తిడితే వోటర్ల మైండ్‌ బ్లాంక్‌ అయి మాకు గుద్దేస్తారో, వారు మా శత్రువులు.

జపించే మంత్రం : యువ నాయకత్వం.( ఏం చేస్తాం? ప్రతీ సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ఇంట్లోనూ ఒక్కొక్క యువనాయకుడు అధికారం కోసం అల్లాడిపోతున్నాడు.)

విలాసం :ముందే చెప్పాను. నేను సేవకుణ్ణి కానీ, రాజును కానూ- అని. నాకు ‘విలాసాలు’ండవు. చిరునామాలే.

గురువు : మాకు ముందు నడచిన ప్రణబ్‌జీ. ఆయనకూడా పార్టీ పరిధిలో వున్నప్పుడు ‘సంక్షోభ నివారకుడే’.

జీవిత ధ్యేయం : చిన్న సేవకుడు ఏమాలోచిస్తాడు. పెద్ద సేవకుడు కావాలనుకుంటాడు. మా రాష్ట్రం ‘ముఖ్య’ సేవకుడిగా పనిచేశాను. దేశానికి ‘ప్రధాన’ సేవకుణ్ణి కావాలనుకోవటం లో తప్పులేదు కదా!

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 31ఆగస్టు -6సెప్టెంబరు 2013 సంచికలో ప్రచురితం)

1 comment for “‘అగ్గీ’ రాజా!

Leave a Reply