అసెంబ్లీ లో ‘పంచ్‌’ శీల!!

Andhra-Assembly‘నమస్కారం సార్‌! తమరంత పలికిమాలిన వారు మరొకరు వుండరట కదా!’ ఇలా సంభాషణ ఎవరయినా మొదలు పెడతరా?

‘పెద్దలు, సంస్కార వంతులు, విజ్ఞులూ అయిన మీరు..’ అని మొదలు పెట్టి , ‘ఇంత నీచ, నీకృష్టమైన స్థితికి దిగజారతారా?’ అంటూ ఏ వక్తయినా ముగిస్తారా?

‘నీ కాళ్లు కడిగి నెత్తి మీద వేసుకుంటా; నీకు జీవితాంతం ఊడిగం చేస్తా; చచ్చి నీ కడుపున పుడతా.’ అని ప్రాధేయపడి, వెంటనే ‘ ఈ రాష్ట్రాన్ని దోచుకోవటం ఆపవయ్యా!’ అని ఏ బాధితుడయినా మొరపెట్టుకుంటాడా?

తిట్టు అంటే ఇలా తిట్టాలి. తిట్టే కదా, అనుకుంటాం కానీ, ఒక్క సారి తిట్టి చూస్తే తెలుస్తుంది. తిట్టాలనుకున్న తిట్టు సమయానికి నోటికి రాక, మనల్ని మనమే తిట్టుకోవాలని అనిపిస్తుంది.

ఎలా తిట్టాలో సరిగా చిన్నప్పుడు తెలుగు మాస్టారు కూడా చెప్పి వుండరు. తప్పు ఆయనది కూడా కాదు. తెలుగు వాచకాల్లో ‘స్త్రోత్ర గీతాల’ కున్న స్థానం ‘తిట్టు కవిత్వానికి’ వుండదు. ఆ లెక్క కొస్తే, తెలుగు వాడికున్న తిట్టు శతకాలు, అన్నీ ఇన్నా..!

కానీ ఈ లోటును మన ‘గౌరవ’ శాసన సభ్యులూ, పార్లమెంటు సభ్యులూ తీర్చేస్తున్నారు. సభాహక్కులను దృష్టిలో వుంచుకుని తిట్టదలచుకున్న ఏ సభ్యుడి ముందయినా ఇలా ‘గౌరవం’ పడేయటం మన రక్షణకు మంచిది.

ఎంత సృజనాత్మకంగా తిట్టాలో నేర్చుకోవాలో, తెలియాలంటే తప్పని సరిగా అసెంబ్లీ సమావేశాలు చూడాల్సిందే. ఎవరు ఏ తిట్టుఅయినా తిట్టుకోవచ్చు. కానీ ముందు ‘గౌరవ వాచకం’ వుండి తీరాలి.

తిట్టు తిట్టే సభ్యుడూ బాగానే వుంటాడు; తిట్టించుకునే సభ్యుడూ ఆరోగ్యంగానే వుంటాడు. ఎటొచ్చీ హింస మాత్రం ‘స్పీకర్‌’కే. ఆయన పేరుకే ‘స్పీకర్‌’. కానీ మాట్లాడేది తక్కువ. వినేది ఎక్కువ. అందు ఎవరు, ఎవర్ని తిట్టుకోవాలన్నా, ఆయనని మర్యాద పూర్వకంగా సంబోధించి, ఆయనను చూసి తిడుతుంటారు ‘గౌరవ’ సభ్యులు.

‘అధ్యక్షా! గౌరవ సభ్యుడు ‘ఎక్స్‌’ గారు అన్నం తింటున్నారా? గడ్డితింటున్నారా?- అని అడుగుతున్నాను అధ్యక్షా!’

‘స్పీకర్‌ సర్‌! గడ్డి తిన్న గోవులు పాలిస్తాయి సార్‌! కానీ గౌరవ సభ్యుడు ‘వై’ గారు జనం నెత్తురు పీలుస్తున్నారు సార్‌!’

స్పీకర్‌ తన చెవిలో వున్న ఫోన్ల సాక్షిగా వినేశాక, సభమొత్తం ఆలకించేశాక, లోకం మొత్తానికి బహిర్గతమయి పోయాక, రికార్డుల్లోంచి తొలగించేసుకునే సౌకర్యం చట్ట సభలకు వుందనుకోండి.

కానీ అసెంబ్లీ ‘లైవ్‌’ రావటం మొదలయ్యాక, ‘అలంకారికంగా’ తిట్టుకోవటం బాగా పెరిగింది. ఇంతమంది ‘ఆశు’ (ఇస్పేటు ఆసు కాదు) కవులు ఎలా వచ్చేరా- అని అనిపిస్తుంది.

కేవలం గొప్ప గొప్ప నాటకాల్లోనూ, కావ్యాల్లోనూ వుండే ‘సారాలంకారం'(క్లయిమాక్స్‌’, ‘ప్రతిసారాలంకారం'(యాంటీ క్లయమాక్స్‌) , మన ‘గౌరవ’ శాసన సభ్యుల మాటల్లో కనిపిస్తున్నందుకు మనమందరమూ గర్వపడాలి.

మరీ ముఖ్యంగా ఈ సభ్యులు ‘యాంటీ క్లయిమాక్స్‌’ మీద బతికేస్తున్నారు. గౌరవంతో మొదలయి, అగౌరవంతో వాక్యాన్ని ముగించటం ఈ అలంకారం ప్రత్యేకత.

‘రాజాధి రాజ, రాజ మార్తాండ శ్రీశ్రీశ్రీ కాల భైరవ చక్రవర్తులుంగారు… ఊర కుక్కల్ని తరుముతున్నారు.’

‘చారిత్రక నగరమైన హస్తినా పురి ప్రభువులు కేజ్రీవాల్‌ గారు రోడ్డు మీద పడకేశారు’

ఈ రేంజ్‌ లో వుంటుందన్న మాట.

‘ఘనత వహించిన రాజావారు గాడిద మీద వచ్చారు’ (హిజ్‌ హైనెస్‌ కేమ్‌ ఆన్‌ ఎ డాంకీ.)

ఈ వాక్యం కూడా అలాంటిదే.

ఈ ‘యాంటీ క్లయిమాక్స్‌’ ఎలా ప్రాక్టీసు చేశారో తెలియదు కానీ, మన ‘గౌరవ’ సభ్యులు మాత్రం తెగ వాడేస్తున్నారు. ‘పంచ్‌’ ల మీద ‘పంచ్‌’లు కుమ్మేసుకుంటున్నారు.

సభ ‘రాష్ట్ర పునర్విభజన బిల్లు’ మీద చర్చించటానికి సమావేశమయిందని, మరుసటి రోజు పత్రికల్లో చదివితే తప్ప, సమావేశం ‘లైవ్‌’ చూసిన వారికి ఎవరికీ అర్థం కాదు.

‘క్లాజ్‌’ ‘క్లాజ్‌’కో సవరణ ప్రతిపాదించారో లేదో కానీ, ‘తిట్టు’ ‘తిట్టు’కో వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం నేటి సమావేశాల్లో ఏర్పడింది.

ఇప్పుడర్థమయింది. కొత్తగా విడుదలయిన సినిమాలను కూడా పక్కన పెట్టి, అసెంబ్లీ ‘లైవ్‌’ ను జనం ఎందుకు ఎగబడిచూస్తున్నారో..! మూడు గంటల సినిమాలో మహా అయితే అయిదో, ఆరో పంచ్‌లు వుంటాయి. కానీ ఇక్కడ అలా కాదే..! మాట, మాటకో పంచ్‌!

వీళ్లంతా నెహ్రూ గారి రికార్డులు బద్దలు కొట్టేస్తున్నారు. ఆయన ఒక్క ‘పంచ శీల’ రాశారు. కానీ వీరో..! ఎన్నెన్ని ‘పంచ్‌’ శీలలో…!!

-సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమి దినపత్రిక 26జనవరి 2014 వ తేదీ సంచికలో వెలువడింది.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *