‘ఇచ్చే’ పార్టీనుంచి, ‘తెచ్చే’ పార్టీకి!!

vivek2ఆరోపణలు ఆరోపణలే. ఆకర్షణలు ఆకర్షణలే. ‘గులాబీ’ తీరే అంత. ముళ్ళు ముళ్ళే. మోజులు మోజులే.

ముళ్ళున్నాయని ‘గులాబీ’ చెంతకు వెళ్ళటం మానేస్తామా? కాంగ్రెస్‌ ఎంపీలు వివేక్‌. మందా జగన్నాథంలకు పని చేసి వుండవచ్చు. అందుకే, వెనకా, ముందు చూసి కూడా కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి దూకేశారు. వివేక్‌ సోదరుడు వినోద్‌ కూడా ఇదే బాటలో వున్నారు.

ఒక పక్క టీఆర్‌ఎస్‌ లో కేసీఆర్‌ కుటుంబ సభ్యులపైన, ఆ పార్టీనుంచే బయిటకొచ్చిన ఆరోపణల మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయినా సరే, 2014 ఎన్నికలముందు ‘సీటు హామీ పథకం’ కింద ఈ నేతలు చేరిపోయారు. ఈ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ నుంచి వారు పోటీ చేసే స్థానాల విషయంలో సంపూర్ణమైన స్పష్టత వచ్చిన తర్వాతే, ఈ నిర్ణయం తీసుకున్నారు.

మందా జగన్నాథం పార్టీ మారటం పట్ల రాజకీయ వర్గాలు పెద్దగా విస్మయాన్ని వ్యక్తం చేయవు. ఎందుకంటే ఆయనది రెండవ జంపు. ముందు తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌కు వచ్చారు. తర్వాత ఇప్పుడు టీఆర్‌ఎస్‌ కొత్త కాదు. అప్పుడు కాంగ్రెస్‌లోకి రావటానికి కూడా కారణం- ఎంపీ సీటు విషయంలో స్పష్టాతి స్పష్టమైన హామీ వుండటమే.

కానీ వివేక్‌, వినోద్‌ల విషయం అలా కాదు. వీరిది కాంగ్రెస్‌ కుటుంబం. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ కురువృధ్ధుడు, మాజీ కేంద్ర మంత్రి జి. వెంకటస్వామి తనయులు. వెంకటస్వామి ఇందిరాగాంధీ హయాం నుంచి కూడా, నెహ్రూ-గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితులు. ‘కాకా’గా రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యకర్తలకు సుపరిచుతులు. ఆయన ఒక దశలో ఏకంగా రాష్ట్రపదవిని ఆశించారు. అప్పట్లో తనకు రావలసిన అవకాశాన్ని మళ్ళించటానికి ‘మహిళా రాష్ట్రపతి’ అనే అంశాన్ని ముందుకు తెచ్చి ప్రతిభా పాటిల్‌కు కట్టబెట్టినందుకు ఆయన పార్టీ మీద నిప్పులు చెరిగారు. అంతే కానీ, పార్టీని వీడి పోలేదు. అంతే కాదు, రాష్ట్రంలో వై.యస్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయనకు వ్యతిరేకంగా ఎన్నో సార్లు ప్రకటనలు ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణ విషయంలో కూడా ‘తెలంగాణను తెచ్చేదీ మేమే. ఇచ్చేదీ మేమే.’ అన్న నినాదానికి ‘కాకా’ బహుళ ప్రచారం కల్పించారు. అలాంటి ‘కాకా’ తనయులు, ‘తెలంగాణ సాధన’ కోసమే టీఆర్‌ఎస్‌కు వెళ్ళామని చెబుతున్నారు. అది కూడా, ‘అన్ని డెడ్‌లైన్లూ’ ముగిసి పోయాక వెళ్ళామన్నది వారి వాదన. అంటే ‘కాకా’ లెక్కల ప్రకారం ‘ఇచ్చే’ పార్టీ నుంచి ‘తెచ్చే’ పార్టీకి వెళ్ళిపోయారా?

నిజానికి కేసీఆర్‌ ‘సంఖ్యా శాస్త్రం’ ప్రకారం. వంద అసెంబ్లీ సీట్లూ, పదిహేను పార్లమెంటు సీట్లు తెచ్చుకున్నాక తెలంగాణ వచ్చేయాలి. అప్పుడయినా ఎవరు ఇస్తారు? అయతే యుపీయే లేదా ఎన్డీయే. ఈ రెండూ కాకుండా మూడో ప్రత్యామ్నాయం( థర్డ్‌ ఫ్రంట్‌) వస్తే, అది ఇవ్వాలి. కానీ టీఆర్‌ఎస్‌ ఎప్పుడూ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేను దూరంగా పెడుతూనే వస్తోంది. అంటే యూపీయే మీదనే ఆధారపడుతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ‘తెచ్చేది’ టీఆర్‌ఎస్‌ అయినా ‘ఇచ్చేది’ యుపీయే కావాలి. ఈ స్థితిలో యూపీయేలోనే వుండి పోవచ్చు కదా! ఈ మాత్రం ఆలోచన ‘కాకా’ తనయులకు రాకుండా వుంటుందా?

కానీ, వరుసగా వస్తున్న అభిప్రాయ సేకరణల ఫలితాలు చూస్తుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్‌ కోలుకోవటం లేదు. తెలంగాణలో ఇప్పటికీ వోటర్ల మొగ్గు టీఆర్‌ఎస్‌ వైపే వుంది. కాబట్టి, ‘కాకా’ తనయులు కాంగ్రెస్‌లో వుండిపోతే, 2014లో ఏర్పడే కేంద్ర సర్కారు గురించినది తర్వాత విషయం. ముందు అసలు ఎం.పీగానో, ఎమ్మెల్యేగానో ఎన్నికలలో గెలుపొందాలి కదా! కాబట్టి టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయం కదా- అన్న ధీమా మీద, వివేక్‌ సోదరులు టీఆర్‌ఎస్‌ వైపు దూకాలని అనుకొని వుంటారు. ఇలా చెయటం వల్ల మరో మారు ఎం.పీ కావటమో, ఎమ్మెల్యే కావటమో జరిగితీరుతుందన్నది వారి నమ్మకం.

కాంగ్రెస్‌ 2014లోపు తన ప్రతిష్ఠను నిలబెట్టుకోవటం కోసమైనా, తెలంగాణ మీద ప్రకటన వెలువరిస్తుంది. నిజంగానే ఆప్రకటన చిత్త శుధ్ధితో చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలి. అలా ఏర్పాటయిన ప్రభుత్వంలో ఇప్పటి సమీకరణల రీత్యా టీఆర్‌ఎస్‌ కీలక పాత్ర వహిస్తుంది. ఎప్పటినుంచో కేసీఆర్‌ చెప్పుకుంటూ వస్తున్నారు: తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే కావాలని. అలాంటి స్థితిలో దళిత వర్గాలకు చెందిన వివేక్‌, వినోద్‌ల వైపు చూసే అవకాశం వుంది. ఆ విధంగా ముఖ్యమంత్రి పీఠం ‘కాకా’ కుటుంబానికి దక్కుతుంది. అప్పుడు ఈ సోదరులు కాంగ్రెస్‌ లో వుండటం కంటె, తామే నిర్ణేతలుగా వుండటం కోసం టీఆర్‌ఎస్‌ లో వుండటం పదవుల విషయంలో మేలవుతుంది.

ఇలా దూరదృష్టితోనే వివేక్‌ ‘జంప్‌’ చేసివుంటారు.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 31 మే- 7జూన్ 2013 సంచికలో ప్రచురితం)

1 comment for “‘ఇచ్చే’ పార్టీనుంచి, ‘తెచ్చే’ పార్టీకి!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *