Tag: Manda Jagannadham

‘ఇచ్చే’ పార్టీనుంచి, ‘తెచ్చే’ పార్టీకి!!

ఆరోపణలు ఆరోపణలే. ఆకర్షణలు ఆకర్షణలే. ‘గులాబీ’ తీరే అంత. ముళ్ళు ముళ్ళే. మోజులు మోజులే.

ముళ్ళున్నాయని ‘గులాబీ’ చెంతకు వెళ్ళటం మానేస్తామా? కాంగ్రెస్‌ ఎంపీలు వివేక్‌. మందా జగన్నాథంలకు పని చేసి వుండవచ్చు. అందుకే, వెనకా, ముందు చూసి కూడా కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి దూకేశారు. వివేక్‌ సోదరుడు వినోద్‌ కూడా ఇదే బాటలో వున్నారు.

ఊరక దూకరు మహానుభావులు!

అదే మొబైల్‌. అదే నెంబరు. మారేది ‘సిమ్‌ కార్డే’

అదే పదవి(ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు.) వీలైతే అదే నియోజకవర్గం. మారేది ‘కండువాయే’

రెండు పనులూ ఒకటే. మొదటి దానిని ‘నెంబర్‌ పోర్టబిలిటీ’ అంటారు. ఎయిర్‌టెల్‌ నుంచి టాటా డోకోమోకి మారినా అదే నెంబరు వుంటుంది. రెండో దానిని ‘మెంబర్‌ పోర్టబిలిటీ’ అంటే ‘మెంబర్‌’ ఆఫ్‌ పార్లమెంటు(ఎంపీ) లేదా ‘మెంబర్‌’ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ(ఎమ్యెల్యేలు) గతంలో ఎక్కడనుంచి కాంగ్రెస్‌ పార్టీనుంచి ఎన్నికయ్యారో, మళ్ళీ అక్కడ నుంచే టీఆర్‌ ఎస్‌ నుంచి ఎన్నిక కావచ్చు.