ఇది ‘గ్రేటర్‌’ నామ సంవత్సరం!!

 

GHMC‘గ్రేటర్‌’! కొత్త ఏడాది(2016) ఏ మాటతోనే మొదలవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో పౌరులందరూ ‘హ్యాపీ న్యూయియర్‌’ అని ఒకరినొకరు అభినందించుకోవచ్చు. అందు వల్ల ఆనంద పొందవచ్చు. కానీ ఈ రాష్ట్రాలలో నేతల్ని ఆనందింప చెయ్యాలంటే మాత్రం ‘హ్యాపీ న్యూయియర్‌’ అని అనకుండా ‘గ్రేటర్‌ న్యూయియర్‌’ అనాలి. అప్పుడు విన్న నేత ముఖం వెలుగుతుంది. తెలుగు సంవత్సరాలకు నెంబర్లతో పాటు, పేర్లు కూడా వుంటాయి. కానీ ఇంగ్లీషు సంవత్సరాలకు అంకెలు మాత్రమే వుంటాయి. కానీ 2016కు మాత్రం ఈ రెండు రాష్ట్రాల వారూ పేరు కూడా పెట్టుకోవచ్చు. అదే ‘గ్రేటర్‌’ నామ సంవత్సరం.

అవును. గ్రేటర్‌ అంటే గ్రేటర్‌ హైదరాబాద్‌. రెండు రాష్ట్రాలుగా తెలుగు వారు వేరుపడటానికి కారణమైనది కూడా హైదరాబాదే. ఒక్క హైదరాబాద్‌ పెరిగిపోయినట్లుగా రెండు రాష్ట్రాలలో, ఏ ఒక్కనగరమూ వృధ్ధి చెందలేదు. ఇద్దరికీ ఒకే నగరం మీద మోజు పెరిగింది. ‘హైదరాబాద్‌ తో కూడిన తెలంగాణ’ వచ్చినందుకు తెలంగాణ ప్రజలు ఎంత సంబర పడ్డారో, ‘హైదరాబాద్‌ లేని ఆంధ్రప్రదేశ్‌’ గా సీమాంధ్ర మిగిలిపోయినందుకు కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అంతగా డీలా పడ్డారు. హైదరాబాద్‌ ను నేను నిర్మించానంటే, నేను నిర్మించానని సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా వున్న వారు బీరాలు పలికారు కూడా. వీళ్ళ ఉత్తర కుమార ప్రగల్బాలకు కులీ కుతుబ్‌ షా బతికి వస్తే, కుమిలి పోయేవాడు కూడా. నాలుగు షాపింగ్‌ కాంప్లెక్సులు కట్టుకున్నావాడో, రెండు స్టుడియోలు పెట్టుకున్నవాడో, ఒక కార్పోరేటు స్కూలు నడుపుతున్నవాడో నగరాన్ని నిర్మించేశానంటే ఎలా? నగరాన్ని ప్రజలు నిర్మించుకుంటారు. వారి దగ్గర లాభాల గుంజుకోవటం కోసం మార్కెట్టు వస్తుంది. ఆ మార్కెట్టునే నగరమనుకునే ప్రబుధ్దులకు, ప్రజలు ఏర్పరచుకున్న సామాజిక, సాంస్కృతిక నిర్మాణాలు కనిపించవు.

భారతదేశానికి నమూనాలా వుండేది హైదరాబాద్‌. భిన్న మతాల, భిన్న సంస్కృతులకు నిలయంగా వుంటుంది. వివిధ రాష్ట్రాలనుంచి, వివిధ భాషలు మాట్లాడే వారు ఎప్పటి నుంచో ఇక్కడ సహజీవనం చేస్తున్నారు. ఈ బహుళత్వాన్ని దెబ్బతీయటానికి, ఏ నాయకుడు ప్రయత్నించినా, అతడు కుప్పకూలి పోతాడు. అలాగే ఈ అనేకత్వాన్ని కాపాడిన వారికి ఇక్కడి ప్రజలు బ్రహ్మరథం పడతారు. అలాంటి గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పోరేషన్‌ కు ఎన్నికలు ఈ ఏడాది తొలి మాసంలోగా పూర్తికావాలి. అందుకు సన్నాహాలు జరిగిపోతున్నాయి. మొత్తం 150 వార్డులకు జరిగే ఈ ఎన్నికలలో మొత్తం ఇంచుమించు 71 లక్షల (70.68 లక్షల) మంది వోటర్లు వున్నారు. దాదాపు ఒక చిన్న రాష్ట్రానికి జరిగే అసెంబ్లీ ఎన్నికలను తలపించ బోతున్నాయి.

తెలంగాణ రాష్ట్రం తమవల్లనే వచ్చిందని చెప్పుకునే టీఆర్‌ఎస్‌ సైతం, గత జిహెచ్‌ఎంసి ఎన్నికలలో అసలు పోటీలోనే లేదు. ఇతర తెలంగాణ జిల్లాల్లో చూపిన హవా టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించినప్పటి నుంచీ చూపలేక పోయింది. అందు చేత 2014 సార్వత్రిక ఎన్నికల నుంచి తెలంగాణలో జరిగిన అన్ని రకాల ఎన్నికలలోనూ విజయ దుందుభి మోగిస్తూ వస్తున్న టీఆర్‌ఎస్‌కు గ్రేటర్‌ వరకూ వచ్చేసరికి, ఇప్పటికీ అడుగులు తడబడుతూనే వుంటాయి. అధికారంలో వున్న పక్షం పరిస్థితే ఇలా వుంటే, మిగిలిన పార్టీల తీరు చెప్పనవసరం లేదు.

జిహెచ్‌ఎంసి లో ప్రాంతాలు వారిగా వోటర్ల రాజకీయాభిప్రాయాలు మారే అవకాశం వుంటుంది. నగర శివార్లలో కలిసిన పూర్వ పంచాయితీల వోటర్లకు నిన్న మొన్నటి దాకా ‘తెలంగాణ సెంటిమెంటు’ బలంగా వుండేది. అలాగే పాత బస్తీ వోటర్లకు ముస్లింలు నాయకత్వం వహించే పార్టీల మీదనే ఎప్పటి నుంచో మోజు కనిపిస్తుంది. ప్రత్యేకించి ఆంధ్ర ప్రాంతం నుంచి వలసవచ్చిన వారు వుండే ప్రాంతాలలో, రాష్ట్రం చీలికకు కారణమైన పార్టీల పట్ల వ్యతిరేకత వుంటుంది. ప్రాంత పరంగా ఇలా వుంటే, మత విశ్వాసాల పరంగా కూడా పాత బస్తీలో ముస్లింలూ, సికింద్రాబాద్‌ పరిధిలో క్రైస్తవులూ, ఇతర ప్రాంతాలలో వున్న హిందువులున్నంతటి హెచ్చు సంఖ్యలో లేక పోయినా, గణనీయంగానే వుంటారు.

ఒక రకంగా తెలుగు వారు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, ఒక నగరం(హైదరాబాద్‌)లో కలిసి వున్నారు. ఉంటారు కూడా. కాబట్టి ఒకప్పుడు సమైక్యాంధ్రప్రదేశ్‌ లో ఎన్నికలు జరిగితే ఎలాంటి వాతావరణం వుండేదో ఇప్పుడు కూడా అదే వాతావరణం కనిపిస్తోంది. చండీయాగం సాక్షిగా ‘చంద్రుల’ (రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల) మధ్యా తగ్గిన దూరం, జిహెచ్‌ఎంసిలో ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో వేచి చూడాల్సిందే. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో తెలుగుదేశం, వైయస్సార్‌ కాంగ్రెస్‌లను ఆంధ్రపార్టీలు గా ముద్రవేసినట్లు హైదరాబాద్‌లో వీలవుతుందా? తెలంగాణ సెంటిమెంటును చూపకుండా వుండటమే మేలని టీఆర్‌ఎస్‌ భావిస్తుందా? ఇలాంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయంటే హైదరాబాద్‌లో మత, ప్రాంత, భాషా సామరస్యానికి ఇక్కడి ప్రజలు పెద్ద పీట వేస్తున్నారని అర్ధం చేసుకోవాల్సి వుంటుంది.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 2-8 జనవరి 2016 వ సంచికలో వెలువడింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *