‘సెటిలర్‌’ అంటే మాట కాదు, వోటు!

kukatpallyసెటిలర్‌. హఠాత్తుగా ఈ మాట ముద్దొచ్చేస్తోంది. అది కూడా ఎక్కడ? గ్రేటర్‌ హైదరాబాద్‌లో. ఒక్క సారి రెండేళ్ళ వెనక్కి వెళ్ళితే, తెలంగాణ లో ఇదే తిట్టు. కానీ, అట్టు తిరగబడింది. తిట్టు కాస్తా వొట్టు అయింది. సెటిలర్ల మీద వొట్టేసి చెబుతున్నారు కేటీఆర్‌: ‘నేను కూడా సెటిలర్‌ నే’. ఇలా అన్నాక, చిన్న గ్యాప్‌ ఇచ్చి. ‘తెలంగాణ పల్లె నుంచి హైదరాబాద్‌ వచ్చాను కదా… సెటిలర్‌ని కానా?’ అన్నారు. మరీ రెండేళ్ళ క్రితమో…! నేరుగా ఆయన అని వుండక పోవచ్చు కానీ, ఆయన పార్టీ నేతలు ఏమన్నారు? సెటిలర్లు మూటా, ముల్లె సర్దుకోవలిసందే.. అని. అంతెందుకు కేసీఆర్‌ మాత్రం అనలేదూ! సీమాంధ్ర ఉద్యోగుల్లో కొందరికి ఆప్షన్ల ఇచ్చే ఆలోచన చేసేది వుందా? అన్న ప్రశ్న వచ్చినప్పుడు ‘ఆప్షన్లూ లేవు, గీప్షన్లూ లేవు’ అని అనేయ్‌ లేదూ! (అఫ్‌ కోర్సు !కొన్నాళ్ళ తర్వాత ఆంధ్రుల కాలికి ముల్లు గుచ్చుకున్నా, పంటితో తీస్తానని కూడా అన్నారు. అది వేరే విషయం.) ఇప్పుడు ‘సెటిలర్‌’ అనేది కేవలం మాట కాదు, వోటు. ఈ వోటు ఎటు వైపు వెళ్తుంది? ఈ అంశంపైనే అందరి వ్యూహాలూ వున్నాయి.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో రాజకీయాలు పూర్తిగా తెలంగాణలోని ఇతర జిల్లాలనూ పోలి వుండవు; అలాగే ఆంధ్రప్రాంతాన్నీ పోలి వుండవు. గ్రేటర్‌ రెంటికీ భిన్నంగా వుంటుంది. భౌగోళికంగా చూసినప్పుడు, పాతనగరంలో ముస్లిం మైనారిటీ వోటర్లూ, సికింద్రాబాద్‌లో గణనీయమైన క్రైస్తవుల వోటర్లూ, కొత్తగా పెరిగిన సైబరాబాద్‌ లో సెటిలర్లూ, నగర విస్తీర్ణ కారణంగా మెదక్‌, మహబుబ్‌ నగర్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఒకప్పుడు వుండి, తర్వాత నగరంలో అంతర్భాగమైన సబర్బన్‌ వోటర్లూ వుంటారు. వీరందిరికీ రాజకీయ పరంగా ఒకే రకమైన భావోద్వేగాలు వుండటానికి వీల్లేదు.

ముస్లిం వోటర్ల వరకూ వచ్చేటప్పటికీ, వారికి శక్తిమంతమైన ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ మజ్లిస్‌. ఈ పార్టీకి మరే ఇతర ముస్లింల పార్టీ దీటుగా నిలవలేక పోయింది. కాబట్టి, ఆ వోట్ల మీద వారికే పట్టు వుంది. ఇక క్రైస్తవుల వోట్లలో స్థానికంగా వున్న క్రైస్తవులతో పాటు, సీమాంద్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన క్రైస్తవులూ, దళిత క్రైస్తవులూ వున్నారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పోటీలో వుండి వుంటే, ఈ వోట్లలో కొంత శాతాన్నయినా తీసుకునేది. కాంగ్రెస్‌ కూడా ఈ వోట్ల మీద ఆశలు పెట్టుకుంటుంది. ఇక నగర శివార్లలో వున్న గ్రామీణ వోటర్లు, గ్రామీణ తెలంగాణకు వున్న సెంటిమెంటే వుంటుంది. ఈ సెంటిమెంటుకు ఇటీవల వరంగల్‌ (ఉప ఎన్నిక)లో జరిగిన ప్రయోగం కొంత వరకూ అద్దం పట్టింది. అంటే గట్టి పట్టు ఇప్పటికీ టీఆర్‌ ఎస్‌కే వున్నట్టుంది. ఇక సెటిలర్ల విషయానికి వస్తే, తెలుగుదేశం పార్టీ, వైయస్సార్సీపీ- ఈ రెండు పార్టీలూ పంచుకుంటాయని భావించవచ్చు. కానీ వైయస్సార్సీపీ పోటీలోనుంచి తప్పుకొంది. ఈ పార్టీకి వచ్చే వోట్లు ఎటు వెళ్తాయి- అన్నది ప్రశ్న. ఒక ఆంద్రా పార్టీ తప్పుకుంటే, ఇంకో ఆంధ్ర పార్టీకి వెయ్యటమనేది ఇక్కడ జరగదు. ఎందుకంటే రెండూ (టీడీపీ, వైయస్సార్సీపీ) ఆంధ్రప్రదేశ్‌లో వైరి పక్షాలుగా కత్తులు నూరుకుంటున్నాయి. కాబట్టి వైయాస్పార్సీపీ వోటర్లకు గ్రేటర్‌ లో రెండే మార్గాలు. అయితే విసుగుతో వోటింగుకు వెళ్ళకుండనన్నా వుండాలి. లేకుంటే టీఆర్‌ఎస్‌ కన్నా వెయ్యాలి. ఎందుకంటే, కాంగ్రెస్‌, బీజేపీ ల పట్ల వైయస్సార్సీపీ అధినాయకత్వానికి ఎలా వున్నా ఆ పార్టీ వోటర్లకూ, కార్యకర్తలకూ వుంటుంది.

ఇక మజ్లిస్‌ వల్ల బీజేపీకి కొంత జాగా ఏర్పడుతుంది. మతపరమైన అంశాల తెరమీదకు రావటం వల్ల ‘హిందూత్వ’ వోటుని సృష్టించుకోవాలన్న కుతూహలం బీజేపీకి సహజంగానే వుంటుంది. టీడీపీతో వున్న పొత్తువల్ల, ‘సెటిలర్ల’ వోట్లు కలసి వస్తాయని కూడా భావిస్తుంది. అంటే ‘సెటిలర్లు’ వున్న చోట తెలుగుదేశం పార్టీ, ‘ముస్లింలు’ వున్న చోట వ్యతిరేక వోటు కోసం బీజేపీ ముందు వుండవచ్చు. అలాగే ఎన్నికల తర్వాతయినా మజ్లిస్‌, టీఆర్‌ఎస్‌కు దగ్గరవుతుందనే ప్రచారం చేసి, ‘హిందూత్వ’ వోటును పెంచుకోవాలనే వ్యూహంతో ముందుకు పోతోంది. ఆ మాట నిజమే కావచ్చు కానీ, కేసీఆర్‌ చేసిన ‘చండీయాగం’ తర్వాత, ఆయన మీద ఈ ముద్ర వెయ్యటం బీజేపీకి కొంత కష్టమే. కాబట్టి ఈ వ్యూహాల పర్యావసానం చూస్తుంటే, గ్రేటర్‌లో గతం లో లేనంతగా టీఆర్‌ఎస్‌ లాభపడటానికి అవకాశం కనిపిస్తోంది. అయితే లబ్ధి, గెలుపునకు దారి తీస్తుందా? లేదా? అన్నది వేరే విషయం. కడకు సెటిలర్లు కేసీఆర్‌ మీద వ్యతిరేకతతోనూ, తమ ప్రాంత పార్టీ ల పట్ల విసుగుతోనూ, పోలింగ్‌కు వెళ్ళటం మానుకున్నా టీఆర్‌ఎస్‌ లాభపడుతుంది. అ అనుకూలాంశాలను చూసుకునే కేటీఆర్‌ ‘గెలవక పోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తాన’నని సవాలు చేసినట్లున్నారు. వీటన్నిటితో పాటు నగరంలో వుండే వారు ప్రధానం గా విద్యుత్‌ కోతలను అనుభవించక పోవటం కూడా సాధారణ వోటరు మీద ప్రభావం చూపవచ్చు. కానీ అంతిమంగా పోలింగ్‌ బూత్‌ దగ్గరకు వెళ్ళేలోగా, ఇంకా ఎన్నో పరిణామాలు జరగవచ్చు. వాటి ప్రభావం తీర్పు పైనా కూడా వుండవచ్చు. మొత్తాని గ్రేటర్‌ ఎన్నిక ‘గ్రేటర్‌ సర్కస్‌’ లాగానే వుంది.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 15-21 జనవరి 2016 సంచికలో ప్రచురితం)

1 comment for “‘సెటిలర్‌’ అంటే మాట కాదు, వోటు!

Leave a Reply