‘ఏటూజెడ్‌’ యూరప్ప!

కేరికేచర్ : బలరాం

పేరు : బి.ఎస్‌. యెడ్యూరప్ప

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘నాజీ’ ముఖ్యమంత్రి. (అంటే మామూలు ‘మాజీ’ ముఖ్యమంత్రి అని కాదు. నియతలా శాసించే ముఖ్యమంత్రి అన్న మాట.)

ముద్దు పేర్లు : ఎ-టూ-జెడ్‌ యూరప్ప(కర్ణాటక లో బీజేపీ యూనిట్‌ వరకూ ఆది నుంచి అంతం వరకూ నేనే.)

విద్యార్హతలు : గుమస్తా పనికి సరిపోయే చదువనుకునేరు. అదే సమస్తానికి సరిపోతుంది. నా క్యాంపులో ఎంతమంది ఎమ్మెల్యేలున్నారో, లెక్కలేసుకోవటానికి ఆ మాత్రం చదువు చాలదా?

హోదాలు : పార్టీలో జాతీయాధ్యక్షుడిని మించిన హోదా వుండదనుకునే వాణ్ణి. ఉందని ఈ మధ్యనే తెలుసుకున్నాను. ఇంతకీ ఆ హోదాలోవున్నది నేనే. నేను చెప్పిన దానికే మా (బీజేపీ) జాతీయాధ్యక్షుడు గడ్కారీ తలాడిస్తారు.

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: అప్పుడప్పుడూ ఆనందంగా వుండేవాళ్ళను నమ్ముతాను. (‘సదా-ఆనందం’గా వాళ్లు నమ్మక ద్రోహులు. సదానంద గౌడ ను చూశారు కదా!)

                             రెండు: మా పార్టీకి మతం వుంటే వుండొచ్చు. నేను మాత్రం లోకిక యుతంగా వుంటాను. (‘లోకా యుత’ం కాదండో య్‌! అదే నా సి.ఎం పదవికి ముప్పు తెచ్చింది.)

సిధ్ధాంతం : దేశమంతటా మా పార్టీ బీజేపీ కావచ్చు. కానీ ఇక్కడ మాత్రం ‘బీసీపీ’. అంటే బ్యాక్‌ వార్డ్‌ క్లాసెస్‌ పార్టీ. (మనలో మన మాట. ఇంకా చెప్పాలంటే, ‘బీ.ఎల్‌.పి’ అని కూడా అనవచ్చు. అంటే ‘బారతీయ లింగాయత్‌ పార్టీ’ . మా లింగాయత్‌లో వోట్లతోనే కదా అధికారంలోకి వచ్చాం?)

వృత్తి : పడి లేవటం, లేచి పడటం (నేను మొదటి సారి ముఖ్యమంత్రినయినప్పటినుంచీ అదే పనిలో వున్నాను.)

హబీలు :1. సొంత పార్టీతో బేరాలడటం. మన రేటు…. సారీ మన విలువ.. మన పార్టీకి తెలిసినంతగా బయిట వాళ్ళకి తెలియదు కదా!

              2. రోబోలను తయారు చెయ్యటం. సదానంద కూడా ఒక రోబోయే. కానీ తర్వాత అది పాడయి నాకే వ్యతిరేకంగా మారింది. ఇప్పుడు కొత్త రోబో పేరు షెట్టర్‌.

అనుభవం : ఎమ్మెల్యేలను మించిన చపల చిత్తులు మరొకరుండరు. (రోజుకో దిక్కు చూస్తారు. వారు మెడలు తిప్పకుండా వుండటానికి రోజూ ‘చమురు’ రాయాల్సిందే.)

మిత్రులు : పక్క రాష్ట్రాలలో వుంటారు. మా ‘కర్ణాటక’లో వుండరు.

శత్రువులు :కూర్చున వాళ్లే శత్రువులవుతారు. నిలబడ్డ వాళ్ళెప్పుడూ మిత్రులుగానే వుంటారు. ( ఇప్పుడు షెట్టెర్‌ను కూర్చో బెడుతున్నాను. ఏమవుతాడో చూడాలి.)

మిత్రశత్రువులు : నాలాగా వుండేవాళ్ళు. ఉదాహరణకి దేవె గౌడ, ఆయన తనయుడు కుమార స్వామి.

వేదాంతం : కేసులూ, కాసులూ- వీటి చుట్టూ తిరిగేదే నాటకం, కర్ణాటకం.

జీవిత ధ్యేయం : మోడీ కన్నా నేనెందులో తక్కువ? కేసులు తేలనివ్వండి చెబుతాను. పి.ఎం అభ్యర్థిగా నన్నెందుకు ప్రకటించరో చూస్తాను! ఉత్తర భారతంలో మోడీ లాంటి వాళ్ళు ఇంకా దొరుకుతారు. కానీ దక్షిణ భారతానికి నేనే ఏకైక కమలనాథుణ్ణి.

-సతీష్ చందర్ 

(గ్రేట్ ఆంధ్ర  వార పత్రిక 13-20 జులై 2012 వ సంచికలో వెలువడింది)

 

 

 

 

 

2 comments for “‘ఏటూజెడ్‌’ యూరప్ప!

Leave a Reply