ఏడుపు గొట్టు పథకాలు!

Photo By: Alma Ayon

ఏడ్వని కొడుకును చూసి తల్లిదండ్రులు ఒక్కటే ఏడుపు.

తిట్టినా, చితగ్గొట్టేసినా, నిలువునా చీరేసినా ఏడ్వటం లేదు. పైపెచ్చు ఒంటి మీద చెయ్యేస్తే చాలు-కితకితలు పెడుతున్నట్టుంటుంది వాడికి. దాంతో ఒక్కటే నవ్వు.

వాళ్ళ వృత్తికి ఏడుపే జీవనాధారం. ఏడ్వనిదే పూట గడవదు. పగటిపూట గడిచినా రాత్రి పూట అసలు గడవదు. పేవ్‌మెంట్‌ మీద పడుకోగానే నిద్రపట్టి చావదు. కప్పుకోవటానికి రగ్గున్నా లేకున్నా, కడుపు వెచ్చబెట్టుకోవటానికి ఒక్క ‘పెగ్గు’ అన్నా పడాలి.

అడుక్కోవటమనేది అరవనాలుగు కళల్లో వుందో లేదో, తెలీదు కానీ, వాళ్ళు ఈ కళమీదే ఆధారపడ్డారు. ఏడ్వకుండా, కనీసం ఏడుపు ముఖమయినా పెట్టకుండా, ఎవ్వడూ రూపాయి విదల్చడు.

ఆ మాటనే ఒక్క ఏడుపునే వంద రకాలుగా ఏడ్వాలి. అలాంటిది అసలు ఏడుపే ఏడ్వకుండా, ఏడేళ్ళు పెరిగిపోయాడు. కడకు ఇరుగు పొరుగు బిచ్చగాళ్ళు కూడా ప్రయత్నించారు- వాణ్ని ఏడిపిద్దామని. విసిగి పోయి. వాళ్ళే వెక్కి వెక్కి ఏడ్చారు. ఏడుపు గొట్టు తల్లిదండ్రుల కడుపున చెడపుట్టాడని వాణ్ని శాపనార్థాలు పెట్టారు.

నిజమే మరి. వాడి తల్లిండ్రులు ఏడుపుల్లో ప్రపూర్ణులు. ‘దు:ఖ ప్రపూర్ణ’ బిరుదుకి ఇద్దరూ అక్షరాలా అర్హులు. పిల్లాడికి మూడేళ్ళు నిండగానే నర్సరీ వేసినట్లు, ఇరుగుపొరుగు బిచ్చగాళ్ళు, శిక్షణ కోసం వీళ్ళద్దరి దగ్గరికీ పంపిస్తారు. వీరి దగ్గర ‘ఏడుపు గొట్టు పథకాలు’ ఎన్నో వుంటాయి.

‘ఉత్త పుణ్యానే’ ఎవరూ ధర్మం చెయ్యరు. ‘కిట్టుబాటయ్యే పుణ్యం’ కోసమే చేస్తారు.

గుడి మెట్ల మీదనే కూర్చుని అడుక్కోవాలనుకోండి. ఏడుపు మామూలే. దరిద్రమంతా ఏడుపులో కనిపించేటంత దరిద్రంగా ఏడ్వాలి. ఆ ఏడుపు కేవలం దృష్టిని ఆకర్షించటం కోసమే. కానీ వెంటనే ‘భక్త సంక్షేమ పథకాన్ని’ ప్రకటించాలి. అందరికీ ‘ఒకే పథకం’ ఎక్కదు. ఉద్యోగులుంటారు; గృహిణులుంటారు; కొత్తగా పెళ్ళయిన వాళ్ళుంటారు; తల్లి దండ్రులకు చెప్పాపెట్టకుండా లేచి వచ్చేసిన జంటలుంటారు; రైతులుంటారు; కూలి వాళ్ళుంటారు; నిరుద్యోగులుంటారు; విద్యార్థులుంటారు;వృధ్ధులుంటారు.

ఒక్కొక్కసారి బోణీ బాగుండదు. దేవుడి దర్శనం చేసుకుని సాక్షాత్తూ కూలి వాడే దిగి వస్తాడు. అప్పుడు ఏ పథకం వదలాలి?

‘బాబూ! అయ్యా! రూపాయి ధర్మం చేసుకో నాయినా! నీకు కరువే వుండదు బాబూ! ఆ దేవుడు నీకు కిలోబియ్యం ఇస్తాడు బాబూ!’ అంటే చాలు. కూలి దాత బొడ్డు దగ్గర ముడివేసుకున్న రూపాయి నాణెం కాస్తా-బొచ్చెలో ఖంగుమని పడుతుంది. ( ‘పూర్వం ఈ మాత్రం ‘పుణ్యాని’కి రెండు రూపాయిలు విసరాల్సి వచ్చేది. ఇప్పుడు రూపాయికే వస్తుంది. పుణ్యం చౌకయి పోలేదూ!!’ అని అనుకుంటూ ఆ కూలి దాత మెట్లు దిగేస్తాడు.)

ఈ లోగా తాగుబోతు భర్తను దేవుడి దర్శనం చేయించి, పడిపోకుండా వాడి మీద చేయి వేసి జాగ్రత్తగా మెట్లు దించుతూ ఓ ఇల్లాలు వస్తుందనుకోండి. అప్పుడే పథకం వదలాలి? దానికీ మన ‘దు:ఖ ప్రపూర్ణులు’ దగ్గర మార్గం వుంటుంది:

‘అమ్మా! సావిత్రమ్మా! సక్కుబాయమ్మా! ( పురాణాల్లో భర్తల్ని ఇలా భరించి పూజించిన ‘సతు’ల్ని’ ఇలా గే కదా! పిలుస్తారు?) పది రూపాయిలు ధర్మం చేసుకో అమ్మా! దేవుడు చల్లంగ చూస్తాడమ్మా! బెల్టుషాపులెత్తేస్తాడమ్మా!?’ అని అనీ అనగానే, పది రూపాయిల నోటు బొచ్చెలో పడుతుంది. కొంచెం స్పృహలోకి వచ్చిన తాగుబోతు భర్త వోరకంటతో చూస్తాడు. అయినా ఫీలవ్వడు. ‘పది రూపాయిలకు క్వార్టర్‌ రాదులే’ అని ఆమె చెవిలో మాత్రం అంటాడు.

వారూ, వీరు కాక, డిగ్రీ పరీక్ష రాయటానికి ముందు ఓ ఆడకూతురు, తన హాల్‌ టిక్కెట్టునీ, పెన్నునీ పూజారికిచ్చి దేవుడి దగ్గర పూజ చేయించి దిగి వస్తుందనుకోండి. దానికి ‘దు:ఖ ప్రపూర్ణు’ల దగ్గర ఓ మతలబు వుంటుంది.

‘తల్లీ! బంగారు తల్లీ!! యాభయి రూపాయిలు ధర్మం చెయ్యి తల్లీ! నువ్వు పరీక్ష పాసవుతావు తల్లీ! లక్ష రూపాయిలు నడుచుకుంటూ వస్తాయి. నువ్వు నిజంగానే బంగారు తల్లివమ్మా!’ అంటాడు. ఆమె ఆటోకోసం దాచుకున్న యాభయి, బొచ్చెలో వేసి పరీక్ష హాలుకు బస్సెక్కి వెళ్ళిపోతుంది.

ఇలా ఇన్ని ‘ఏడుపుగొట్టు పథకాలకు’ రూప కల్ప చేసి ‘దు:ఖ’ దంపతులకు కలిగిన ఏకైక సంతానం ఏడ్వటం లేనందుకు విసిగి పోయి, ఆరోజు అంతిమ పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నారు.

‘ఈ పూటనుంచీ, నీ బువ్వ నువ్వే సంపాదించుకోవాలి.’ అని అనేశారు.

‘ఓస్‌ అంతేనా? చూస్తారుకదా! ఒక్క ఏడుపూ ఏడ్వకుండా సంపాదిస్తాను’ అని శపథం చేసి వెళ్ళిపోయాడు.

సీన్‌ కట్‌ చేస్తే-

గుడిమెట్లు. ఇటువైపు ఏడ్చే తల్లి దండ్రులు. అటు వైపు ఏడ్వని కొడుకు. తల్లి దండ్రులుతమ ‘ఏడుపు గొట్టు పథకాలను’ ప్రకటించినప్పుడెల్లా , వాడు పగల బడి పెద్ద నవ్వు నవ్వే వాడు. దాంతో ఈ పథకాలు ‘ఉత్త డొల్ల’ అని భక్తులకు స్ఫురించేది. అంతే ఇటు వెయ్య వలసిన రూపాయి, పదిరూపాయిలూ, యాభయి రూపాయిలూ- అన్నీ ‘నవ్వే కొడుకు బొచ్చె’లో పడేవి.!

వోటు కయినా, నోటుకయినా అడుక్కునే విధానాలు అవే వుంటాయి.

-సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమి దినపత్రిక 9జూన్2013 తేదీ సంచికలో ప్రచురితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *