కాక్ ‘పిట్ట’ కథలు

ఒక జీపు టాపూ, ఒక మైకూ, ఒక నోరూ, చుట్టూ వంద మంది జనం- ఉంటే చాలు, అదే ఎన్నికల ప్రచారం! ఇలా అనుకునే రోజులు పోయాయి.

ఒక తిట్టూ, ఒక జోకూ, ఒక కథా, ఒక ఫ్లాష్‌ బ్యాకూ- వీటితో పాటు ఓ వంద మంది ‘ఈల’పాట గాళ్ళు, మరో మంద మంది ‘చప్పట్ల’ మోత రాయుళ్ళూ వుంటేనే కానీ, ప్రచారం ఇవాళ రక్తి కట్టటం లేదు.

వీళ్ళుకూడా సుశిక్షితులయి వుండాలి. లేకపోతే, మాంచి ట్రాజెడీ సన్నివేశంలో మోతెక్కించేయగలరు. ‘మనల్ని ఎంతగానో ప్రేమించే మన దివంగత నేత మన మధ్య లేరు’ అన్నప్పుడు ఈల వేసేయగలరు. ‘కానీ ఆయన పేరు చెప్పి నేడు వోట్లు దండుకుంటున్నారు’ అన్నప్పుడూ చప్పుడు లేకుండానూ వుండగలరు. అందుకే, నాయకుల ‘కూత’లకే కాదు, కార్యకర్తల ‘మోత’లకు కూడా శిక్షణ అవసరం.

‘మార్నింగ్‌ షోలూ, మ్యాటినీ షోలూ వదలి రోడ్‌ షోలకు ఊరికే వస్తారా? పశువుల బజారు సెంటర్లో మన ప్రియతమ నేత రోడ్‌ షో వుంది. రండి. లారీలెక్కండీ’ అని అభ్యర్థులో, కార్యకర్తలో అడగ్గానే జనం ఎక్కేసే రోజులు కూడా పోయాయి.

వినిపెట్టటానికి రోజు కూలీ ఎంత? లారీ ఎక్కే ముందు ఇస్తారా? దిగాక ఇస్తారా? దాహానికి ఏమిస్తారు. ‘ప్యాకెట్లలో నీరా? సీసాల్లో బీరా?’ లంచ్‌కేం పెడతరా? ‘ఉత్త పులిహోరా పొట్లాలా? బిర్యానీ ప్యాకెట్లా?’ ఇవన్నీ మాట్లాడుకున్నాకే జనం కదులుతారు. ‘ప్రచార ఉపాధి హామీ పథకం’ కింద ఈ మాత్రం ఇస్తారనుకోండి. నిజానికి ఇవన్నీ ఇచ్చేస్తే, ప్రచార సభలో సగం మంది నిద్రపోతారు. అదే ఈ మధ్య చిక్కొచ్చి పడింది. టీవీచానెళ్ళ కెమెరామెన్‌లు మూడేసి కళ్ళతో(ఒక కన్ను కెమెరాది) చూసేస్తున్నారు. ‘వేదిక మీద నేత ఊగుతుంటే, సభలో జనం జోగుతున్నార’ంటూ క్లిపింగులు చూపి, పరువు నిలువునా తీసేస్తారు.

కాబట్టి, వచ్చిన జనం మేల్కొని వుండటమే కాకుండా, ఉత్సాహం నవ్వాలి, తుళ్ళిపడాలి, నవ్వాలి, చేతులూపాలి. కార్యకర్తల ఈలలకు తమ ఈలలతో వంతలు పాడాలి. చప్పట్లకు చప్పట్లతో తాళం వెయ్యాలి.

ఇవన్నీ జరగాలంటే నేత ఉపన్యాసం ఒక కళా ప్రదర్శనలా వుండాలి. అందులో నవరసాలూ వుండాలి. మంచి స్క్రిప్టును ముందే సహాయకులు సిధ్దం చేస్తారనుకోండి. కానీ, దానిని అఢ్భుతంగా పండించాలి. అది సినిమాలో నటించటం కన్నా కష్టం. తడబడితే మరో మారో నటించటానికి(రీటేక్‌లు తీయటానికి) ఇక్కడ వీలుపడదు. టీవీల వాళ్ళు ‘లైవ్‌’లు పెట్టుకుని కూర్చుంటారు. అసలే టీవీ వాళ్ళది రజనీ స్టయిల్‌. ‘నేత ఒక్కసారి నోరు జారితే , వంద సార్లు జారినట్లు లెక్క’ . ఉదయం నుంచి సాయింత్రం వరకూ బులెటిన్‌ తర్వాత బులెటిన్‌లో జారుతూనే వుంటారు. ఈ జారుడు ప్రక్రియను అరికట్టాలంటే, ఉపన్యాసం మొత్తం ‘సింగిల్‌ టేక్‌’లో వోకే కావాలి.

నేతలందరూ ఉపన్యాసకులవ్వాలన్న రూలు ఒకప్పుడు ఉండేది కాదు. కానీ వారిప్పుడు గొప్ప వక్తలే కాదు, గొప్ప నటులు కావలసిన అవసరం కూడా వుంది. అయితే సినిమా నటనలో శిక్షణా సంస్థలు వున్నట్టు, రాజకీయ నటనలో శిక్షణా సంస్థలు లేవు. అందుకే విడివిడిగా శిక్షకుల్ని పెట్టుకుని శిక్షణ పొందుతున్నారు. ఇందులో భాగంగా ఈ మధ్య అందరూ సంభాషణల్లో భాగంగా ‘పిట్ట కథల్ని’ చెప్పటం నేర్చుకుంటున్నారు. ఇది గతంలో రోశయ్య, వెంకయ్య నాయుడు, కేసీఆర్‌ లాంటి వారు మాత్రమే చమత్కారంగా చెబుతుండేవారు. కానీ పాపం, చంద్రబాబు, వైయస్‌ రాజశేఖరరెడ్డి లాంటి నేతలు, తమ ధోరణిలో తాము చెప్పుకుంటూ పోయేవారు కానీ ఈ కథల జోలికి వచ్చే వారు కారు. కానీ ఇప్పుడు అదే చంద్రబాబు కు కూడా పిట్ట కథలు తప్ప లేదు.

‘అనగనగా ఒక తల్లీ, ఒక కొడుకూ.( ఒక మామా, ఒక అల్లుడు కథ ఎలాగూ ఆయన చెప్పరు!) చిన్నప్పుడు కొడుకు తోటకూర దొంగతనం చేస్తాడు. తల్లి మెచ్చుకుని తోటకూర వండి, వడ్డిస్తుంది. ఆ తర్వాత జడ్జిగారు ఆ దొంగకు ఉరిశిక్ష వేసేస్తారు. శిక్ష అమలు ముందు చివరి కోరికగా తల్లిని కలుస్తానంటాడు దొంగ. అలా వచ్చిన దొంగ తల్లి పీక నులిమి చంపేస్తాడు. ఎందుకంటే- తోటకూర దొంగిలించినప్పుడు తనకు బుధ్ధి చెప్పలేదని.’ ఈ కథలోకమెరిగిందే. కానీ కొత్త గా చెప్పారాయన. వైయస్‌ విజయమ్మ కొడుకు జగన్‌కు బుద్ధి చెప్పలేదని చెప్పటం కోసం ఈ కథను ఆయన అరువు తెచ్చుకుని చెప్పారు.

సీన్‌ కట్‌ చేస్తే- పదేళ్ళ క్రితం రోశయ్య ఒక బహిరంగసభలో ఒక పిట్ట కథ చెప్పారు: (అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నారు.)

అనగనగా ఒక స్మశానవాటిక. అక్కడ భర్త సమాధి వద్ద భార్య కూర్చొని విసనకర్రతో విసురుతోంది. అటువైపుగా వచ్చిన వాళ్ళు ఆమె ‘పతిభక్తి’కి ఆశ్చర్యపోయి ‘బతికుండగానే భర్తను చూడని ఈ రోజుల్లో చనిపోయాక కూడా సేవలందిస్తున్నావు. గొప్పదానివమ్మా!’ అని ప్రశంసించారు. అందుకావిడ, ‘సేవా? పాడా? నా భర్త పోతూ, పోతూ నా దగ్గర ఒక మాట తీసుకున్నాడు-‘చనిపోయాక నా సమాధి మీద చెమ్మ ఆరేవరకయినా, నువ్వు మరొకర్ని పెళ్ళి చేసుకోవద్దు.’ -అని. బయిట మబ్బుగా వుంది. తడి ఆరటానికి సమయం పడుతుందని ఇలా విసన కర్రతో విసురుతున్నాను’ అని చెప్పి, పక్కనే నిలబడ్డ తన ప్రియుడి వైపు చూసింది.

ఈ కథ చెప్పిన రోశయ్య- ‘ఇప్పుడు చంద్రబాబు గారు రైతుల మీద చూపిస్తున్న భక్తి కూడా అలాగే వుంది’ అని ముక్తాయించారు. చూశారా! ఇలాంటి పిట్టకథలు చెబితే, ఎంత ప్రచార సభకొస్తే మాత్రం జనం ఎందుకు నిద్రపోతారు?

అయితే ఈ ఉప ఎన్నికల ప్రచారంలో ‘పిట్ట కథ’ల్తో పాటు, ‘కాక్‌ పిట్‌’ కథలు కూడా చెలామణిలోకి వచ్చాయి. (విమాన లేదా హెలికాప్టర్‌ ప్రమాదమప్పుడు జరిగిన శబ్దాల్నీ, సంభాషణల్నీ రికార్డు చేసేది కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌). వైయస్‌ హెలికాప్టర్‌ విమాన ప్రమాదం గురించి ‘అనుమానాలు ‘ వ్యక్తం చేస్తున్న విజయమ్మ, ‘కాక్‌ పిట్‌’లో ఏముందో కూడా వెల్లడి చేయలేదనీ, ఆ టేపులూ తమకివ్వలేదనీ ప్రచారసభలో ‘సానుభూతి’ని పెంచుకుంటూ ఆమె కథనాలు ఆమె చెబుతున్నారు. అయితే ‘కాక్‌ పిట్‌’ వాయిస్‌ తాను విన్నానని, ఆ ప్రమాదంలో కుట్ర ఏమీలేదనీ కాంగ్రెస్‌ నేత ఉండ వల్లి అరుణ్‌ కుమార్‌ చెప్పారు. కథలన్నీ నిజాలు కానట్టే, నిజాలన్నీ కథలు కాలేవు.

-సతీష్‌ చందర్‌

 

 

 

 

3 comments for “కాక్ ‘పిట్ట’ కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *