‘జగడ’ పాటి!

పేరు : లగడపాటి రాజగోపాల్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘సమైక్యాంధ్ర’ ముఖ్యమంత్రి

ముద్దు పేర్లు : ‘రగడ’ పాటి, ‘జగడ’పాటి,

విద్యార్హతలు : బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫాస్టింగ్‌( బిఎఫ్‌). నరాల ద్వారా శరీరానికి కావలసినవి పొందుతూ, కేవలం నోటి ద్వారా తిండిని బంద్‌ చేసే నిరాహార దీక్షలు చెయ్యటం నా స్పెషలైజేషన్‌. అయితే ఇందులో నా కన్నా ముందు ‘కేసీఆర్‌’ మాస్టర్స్‌ డిగ్రీ తీసుకున్నారు.

హోదాలు : ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క హోదా వుంటుంది. ఒకప్పుడు ఉపేంద్ర అల్లుడే పెద్ద హోదా, తర్వాత వైయస్‌ అనుచరుడు . ఇది ఇంకా పెద్ద హోదా.(ఆయన పాద యాత్రలో నేను కూడా స్పోర్ట్స్‌ బూట్లు వేసుకుని, నడచి కాళ్ళు నొప్పులు తెచ్చుకున్నాను. అయితే బహిరంగా కూడా నాకు పాద సేవ చేసి నొప్పులు తగ్గించే వారుంటారనుకోండి అది వేరే విషయం.) ఇప్పుడు వైయస్‌ వ్యతిరేకి. ఇది హోదాలను మించిన హోదా.

గుర్తింపు చిహ్నాలు : బెజవాడలో శుధ్ధ ఖద్దరూ, జెండా కర్రతో మాయమయి, హైదరాబాద్‌లో జీన్‌ ఫ్యాంటూ, టీషర్టుతో ప్రత్యక్షమవ్వగలను. (నేను ఏ వేషం వేసిన మీడియా పోల్చుకుంటుంది.)

సిధ్ధాంతం : సమైక్యాంధ్ర పటం గీయమంటే గీస్తాను కానీ, ఎందుకనో అది హైదరాబాద్‌ మ్యాప్‌లా వస్తుంది. బహుశా నా పరిశ్రమలు అక్కడ వుండిపోవటం వల్ల కావచ్చు.

వృత్తి : ‘కలహ భోజనుడి’ వృత్తే నా వృత్తి. ఎప్పుడూ ఏదో ఒక వివాదం వుండాలి.ఇప్పుడు వైయస్‌ కుటుంబ సభ్యులతో వాదులాడటం.

హబీలు :1. తెలంగాణ వ్యతిరేకత

2. జగన్‌ వ్యతిరేకత

అనుభవం : సహస్ర కోటీశ్వరులు కూడా ఉద్యమాలు చెయవచ్చు. చైతన్యాన్ని పెంచవచ్చు. (ఒకప్పటి జై ఆంధ్రా ఉద్యమాన్ని, సమైక్యాంధ్ర ఉద్యమంగా మార్చటంలో నేనూ ఒక పాత్ర పోషించాను.) నా ఉద్యమం, ఇతర పార్టీలోని వారికి కూడా ‘ముద్దొ”చ్చింది. ముద్దిచ్చారు కూడా.

మిత్రులు : ఈ కాలమ్‌ను నేను పూరించలేను. మీరు చదివేటప్పటికి నా మిత్రులు మార వచ్చు. ఒకప్పుడు వైయస్‌ అనుచరుణ్ణి. ఇప్పుడు కాను. అలాగన్న మాట.

శత్రువులు : మీకు తెలుసా? నేను శత్రువుల్నే ఎక్కువ ప్రేమిస్తాను. వారి విద్యావికాసాల కోసం, ఎంతగానో శ్రమిస్తాను. అందుకనే కదా, నా సొంత ఖర్చుల మీద ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర, తెలంగాణ ఉద్యమాల మీద పుస్తకాలను కేసీఆర్‌కు పంపించాను.

మిత్రశత్రువులు : తెలుగుదేశం వారు. జగన్‌ మీద నేను చేసే ప్రతీ విమర్శా చంద్రబాబుకు కూడా సంతోషం కలిగిస్తుంది.

జీవిత ధ్యేయం : సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి, లేదా హైదరాబాద్‌ ‘మేయరు’.

-సతీష్ చందర్

 

 

 

 

2 comments for “‘జగడ’ పాటి!

  1. సమైక్యాంధ్ర పటం గీస్తే హైదరాబాద్ మ్యాపు లాగా రావటం అద్భుతం!! వెటకారం అదిరింది!!

Leave a Reply