జనమే జయమా?

చప్పట్లు వోట్లవుతాయా? వోట్లు సీట్లవుతాయా?

జనం .. జనం..జనం

ఎటు చూసినా జనం!

చెట్ల మీదా, పుట్ల మీదా, కప్పుల మీదా, గోడల మీదా జనం!

ఒక నేత కానీ, ఒక తార కానీ ‘రోడ్‌ షో’ చేస్తే ఇలా జనం రావటం ఆశ్చర్యమే. కానీ ఒకప్పుడు ఎన్టీఆర్‌ కీ వచ్చారు. ఆ మధ్య ఆయన మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌కీ వచ్చారు. గత ఎన్నికల్లో చిరంజీవికీ వచ్చారు. నిన్నమొన్నటిదాకా వైయస్‌. జగన్మోహన రెడ్డికీ వచ్చారు. ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళాక- ఆయన తల్లి విజయమ్మకీ, చెల్లి షర్మిలకీ వస్తున్నారు. ఈ జనాన్ని చూసి వారి వారి పార్టీలు గెలిచేస్తాయని చెప్పవచ్చా?

 

ఎన్టీఆర్‌ కొచ్చిన జనం తాను స్థాపించిన తెలుగుదేశం పార్టీని 1983లో గెలిపించారు.

కానీ జూనియర్‌ ఎన్టీఆర్‌ కు వచ్చిన జనం 2009లో అదే తెలుగు దేశం పార్టీకి పట్టం కట్టలేదు.

చిరంజీవికి వచ్చిన జనం ఆయన పార్టీకి 2009లో 18 అసెంబ్లీ స్థానాలను మించి ఇవ్వలేదు.( పార్లమెంటు స్థానాల ముచ్చటే లేదు.) పైపెచ్చు (అత్తవారిల్లున్న) సొంత నియోజకవర్గంలో ఓడిపోయారు.

మరి జగన్మోహన రెడ్డిని ఇటీవల వచ్చిన కడప ఉప ఎన్నికల్లో గెలిపించారు.

ఇప్పుడు జరుగుతున్న ఒక పార్లమెంటు, 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలలో విజయమ్మ, షర్మిలలను చూడటానికి వచ్చిన జనమంతా వోట్లు వేస్తారా? ఇదీ నేడు విశ్లేషకుల్నే కాదు, వివిధ రాజకీయ పార్టీల నేతల్ని కూడా వేధిస్తున్న ప్రశ్న.

 

వచ్చారా? తెచ్చారా?

జనమంటే ఏ జనం? వచ్చిన జనమా? తెచ్చిన జనమా? ఇది కూడా శేష ప్రశ్నే.

జనం తమంత తాము రావటానికి- గ్లామరో, అభిమానమో, సానుభూతో వుండాలి. ఒక్కొక్క సారి

ఇవేమీ లేకుండా కూడా ‘విచిత్రమైన ఆసక్తి’తో కూడా జనం వస్తుంటారు. ఎన్టీఆర్‌కు ‘వెన్నుపోటు'( కొందరు తిరుగుబాటు అంటారు లెండి) పొడిచి ముఖ్యమంత్రి అయి, తర్వాత పదవీచ్యుతుడయిన నాదెండ్ల భాస్కరరావు కొత్త పార్టీ (ప్రజాస్వామ్య తెలుగుదేశం) పెట్టి ‘రోడ్‌షో’లు నిర్వహిస్తే, ఆయనను చూడటానికి వచ్చారు. ఎన్టీఆర్‌ మరణానంతరం ఆయన భార్య లక్ష్మీపార్వతి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు కూడా జనం ఆమెను చూడటానికి వచ్చారు. కానీ వీరిద్దరికీ జనం ఘోరపరాజయాన్ని చవిచూపించారు. అందుచచేత తమంతట తాము వచ్చిన జనం కూడా వోట్లు వేస్తారనే హామీ వుండదు.

మరి తెచ్చిన జనం.రావటానికి లారీయో, బస్సో పెట్టి, రోజు కూలి ఇస్తే కూడా జనం వస్తారు. వీరు మాత్రం వోటును ఉచితంగా ఎందుకు వేస్తారు?

అయితే వచ్చిన జనానికీ, తెచ్చిన జనానికీ మధ్యలో ఇంకో రకం వుంటారు. వీరు తమంతట తామే వస్తారు కానీ, తమ సొంత ఖర్చు మీద రారు. కావాలంటే ఆ ఒక్కరోజు కూలి కోల్పోతారు. తిండీతిప్పలు కూడా కోల్పోతారు. కానీ కనీసం వారు రావటానికి ప్రయాణం ఏర్పాట్లన్నా చేయాలి. ఇదే అలవాటు పోలింగప్పుడు కూడా వుంటుంది.

 

కాబట్టి జనమే, జయం కాదు. అలాగని చుట్టూ జనమే లేని నేత పొరపాటున కూడా విజయఢంకా మోగించలేరు. లోక్‌సత్తా జయప్రకాష్‌ నారాయణ్‌ రోడ్‌షోలకు అంతంత మాత్రమే జనం వుంటారు. కాబట్టి ఆయన పార్టీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తుందని, అమాయకులు కూడా అనుకోరు.

జనం ఉండాలి. జనం రావాలి. ప్రచారంలో జనం వస్తేనే విజయానికి నేతలు బాటలు వేసుకోగలరు. అది మొదలు. అంతే. ముగింపు కాదు.

 

గెలవటం మూడంచెల పథకం

ఎన్నికల విజయం మూడంచెల్లో వుంటుంది:

ఒకటి: ప్రచారానికి జనాలు రావాలి.

రెండు: జనాలు వోట్లుగా మారాలి.

మూడు: వోట్లు సీట్లుగా మారకం చెందాలి.

 

ఇప్పుడు విజయమ్మనీ, షర్మిలనీ చూడటానికి వస్తున్న జనం కట్టలు తెగిన వాగుల్లా కనిపిస్తున్నారు. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి ప్రవేశించాక తన సభలకు తరలి వస్తున్న జనాన్ని చూసి తానే ఆశ్చర్యపడేవారు. ‘నేల ఈనిందా? ఆకాశం చిల్లు పడిందా?’ అనే వారు. అదే జనం 1983లో అనూహ్యమైన విజయాన్నిచ్చారు. 1989లో ఇదే ఎన్టీఆర్‌ తన ‘చైతన్య రథాన్ని’ ఎక్కి, ‘చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా’ అని పాటను హోరెత్తిస్తూ రాష్ట్రమంతటా పర్యటించారు. అప్పుడు కూడా ఏక కాలంలో ‘నేల ఈనింది, ఆకాశానికి చిల్లు పడింది.’ కానీ ‘రోడ్‌ షోల’కు వచ్చిన జనమంతా వోటర్లుగా మార లేదు. ఆయన మాటకు కాకుండా, ఆయన ప్లేచేసిన పాటకు స్పందించారో ఏమో- నిజంగానే ‘చెయ్యి’ (హస్తం గుర్తు ) ఎత్తి ‘జై’ కొట్టేసి, కాంగ్రెస్‌ను గెలిపించేశారు. అంటే ఆయన కొచ్చిన జనం 1983 లో వోట్లు గా మారినట్లుగా, 1989లో మారలేదు. అంటే విజయం వైపు వేసే మొదటి మెట్టే ఆయన ఎక్క లేదు. కారణం?

 

ఒక్కొక్కసారి వచ్చిన జనం వోట్లేసినా సరే, అవి సీట్లుగా మారవు. అంటే మొత్తం మీద రాష్ట్రంలో పార్టీకి వచ్చే వోట్ల శాతం పెరుగుతుంది కానీ, ఆ మేరకు నియోజకవర్గాలలో అభ్యర్థులు గెలుపొందరు. 2009 లో చిరంజీవి పెట్టిన ‘ప్రజారాజ్యం పార్టీ’ నే తీసుకోండి. ఆ పార్టీకి 15.6 శాతం వోట్లు వచ్చాయి. ఈ వోట్లకు ఎన్ని సీట్లు రావాలి? అప్పటి మారకపు విలువను చూడండి. 37.3 శాతం వోట్లు తెచ్చుకున్న కాంగ్రెస్‌ 33 పార్లమెంటు, 155 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ లెక్కన చూస్తే వాటిలో సగం కాక పోయినా, ఇంకాస్త తక్కువయినా రావాలి. అంటే కనీసం 10 పార్లమెంటు, 60 అసెంబ్లీ స్థానాలూ రావాలి. అలా వచ్చి వుంటే రాజకీయమే మారిపోయేది. బహుశా సంకీర్ణం వైపు రాష్ట్ర రాజకీయాలు వెళ్ళివుండేవి ( ‘సంకీర్ణం’ ఎందుకని, ఏకంగా కాంగ్రెస్‌లో తన పార్టీని ‘సంలీనమే’ చిరంజీవి తర్వాత చేసేశారు. అది వేరే విషయం.)

ఈ మూడంచెల ఎన్నికల రాజకీయాల్లో ఒక్కొక్క దశకు ఒక్కొక్క అర్హత అనివార్యమవుతుంది.

జనసమీకరణకు జనాకర్షక నేత కావాలి.

జనాన్ని వోట్లుగా మార్చుకోవటానికి తక్షణ జనావసరాన్ని గుర్తు చేసే రాజకీయ నినాదం కావాలి.

వోట్లను సీట్లుగా చేసుకోవటానికి, గల్లీ గల్లీకి, బూతు, బూతుకీ చేరగల కార్యకర్తలుండే పార్టీ వ్యవస్థ కావాలి.

 

ఇప్పుడు జరుగుతున్న ఒక పార్లమెంటు, 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలలోనూ ఎక్కువ సీట్లు ‘అనివార్యం’గా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకే రావాలి. ఎందుకోసమటే, జగన్‌ శిబిరంలో వున్న వారు చేసిన రాజీనామాల వలనే ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అదికూడా వారు దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కోసమే తాము రాజీనామాలు చేసినట్లుగా చెప్పారు. ‘సానుభూతి’ కేంద్రంగా జరుగుతున్న ఈ ఎన్నికలలో విజయమ్మ, షర్మిలలు మొదటి అంచె దాటి నట్లే. జనం పెద్ద ఎత్తున వారిని చూడటానికి వస్తున్నారు.

 

‘సంక్షేమ రాజ్యమా?’ ‘అవినీతి రాజ్యమా?’

అయితే జనాన్ని వోట్లుగా మార్చుకునే రాజకీయ నినాదం వారికి ఏముంది? ఒక్కటే: ‘రాజన్న రాజ్యం మళ్లీ తెచ్చుకుందాం.'( వైయస్‌ రాజశేఖర రెడ్డి తన 2004 ఎన్నికల ప్రచారంలో ‘ఇందిరమ్మ రాజ్యం’ తెస్తానన్నారు.) అయితే ‘రాజన్న రాజ్యానికి’ నేడు రెండు భాష్యాలు వ్యాప్తిలో వున్నాయి. ‘ఉచిత విద్యుత్తూ, ఆరోగ్యశ్రీ, 108 సేవలూ వగైరాలు అందించిన సంక్షేమ రాజ్యం’ అన్నది ఒక భాష్యం. ‘పేదల భూముల్నీ, ప్రభుత్వ భూముల్నీ బడా పెట్టుబడిదారులకు కట్ట బెట్టి వేల కోట్ల రూపాయిలను దండుకున్న అవినీతి రాజ్యం’ అన్నది మరో భాష్యం. మొదటి భాష్యానికి సంకేతంగా వైయస్‌ తనయుడయిన జగనే ‘వారసుడి’గా బరిలోకి దిగటం. రెండవ భాష్యానికి సంకేతంగా ‘సిబిఐ విచారణ చేసి జగన్‌ పై అవినీతి అభియోగాలున్న కేసులు నమోదు చేసి జైలుకు పంపటం. ఈ రెంటి భాష్యాలలో ఏది జనం నమ్ముతారు? ‘రాజన్న రాజ్యమంటే’ కేవలం ‘సంక్షేమ రాజ్యమ’ని మాత్రమే నమ్మితే,, జగన్‌ పై విచారణ, అరెస్టులు- వేధింపు చర్యల్లా వుంటాయి. అప్పుడు తప్పకుండా జనం వోటర్లుగా మారిపోతారు. అంతే కాదు. ఇప్పుడు మళ్ళీ విజయమ్మ తన భర్త మృతి అనుమానాలు లేవనెత్తటం కూడా అందుకు ఉపకరిస్తుంది. భారీ మెజారిటీలతో అత్యధిక స్థానాలను వైయస్సార్‌ కాంగ్రెస్‌ కైవసం చేసుకుంటుంది. అలాకాకుండా, ‘అవినీతి రాజ్యమని’ నమ్మితే, జనం ఎక్కువ భాగం జనంగానే మిగిలిపోతారు. వోటర్లుగా రూపాంతరం చెందరు. అయితే ఇప్పుడు జరుగుతున్నవి ఉప ఎన్నికలు మాత్రమే. వీటిలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ గెలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేదు. కాకపోతే, ఒకమేరకు అప్రభుత్వాన్ని అస్థిరపరచటానికి దారులు వెతుక్కోగలదు. వోటరు మనసు మీద ఈ అంశం కూడా కొంత ప్రభావం చూపుతుంది.

 

ఈ రెండు అంచెలు దాటాక, మూడవ అంచె అన్నది కీలకం. ఈ దశే, వోట్ల శాతాన్ని సీట్లగా మార్చుకునేది. ఇందులో పార్టీ నిర్మాణం పాత్ర చాలా వుంటుంది. జగన్‌ ఏమీ హఠాత్తుగా రాజకీయాల్లోకి పై నుంచి ఊడి పడి రాజకీయ పార్టీని స్థాపించ లేదు. తన తండ్రి వైయస్‌ జీవించి వున్నప్పుడ ఆయన వెంట వున్న అనుచరులూ, కార్యకర్తలూ కొందరు కాంగ్రెస్‌లోనే వుండిపోయినా, కొందరయినా ఆయన వెంట వచ్చివుంటారు. ఫలితంగా ఒక అప్రకటిత నిర్మాణం వుండి తీరాలి. ఇప్పుడు వీరే కీలక పాత్ర వహించాలి. కడపలో జరిగిన ఉప ఎన్నికలో వీరి పాత్ర స్పష్టంగా కనిపించింది. కానీ కడప ఆయన సొంత జిల్లా కాబట్టి, అలాంటి అనుచరగణం వుండటం లో ఆశ్చర్యం లేదు. కానీ, సీమాంధ్ర అంతటా అలా వుందా? కొంచెం అనుమానమే. అలాంటి నిర్మాణమే వుండి వుంటే, జగన్‌ అరెస్టు అప్పుడు నిరసనల్లోనూ, ఆందోళనల్లో స్పష్టంగా కనపడాలి. కానీ జగన్‌ సభలకు అంతవరకూ వచ్చిన జనానికీ, ఆయన అరెస్టు అయినప్పుడు వచ్చిన నిరసన స్థాయికీ సంబంధమే లేదు. నిరసన కు ప్రధాన కేంద్రంగా ఆయన కుటుంబ సభ్యులే నిలిచారు. అయితే జనం తమ నిరసనను రోడ్ల మీద కొచ్చి నినాదాలతో తెల్పటం వేరు, పోలింగ్‌ బూతులదగ్గరకి వచ్చి నిశ్శబ్దంగా వోటు వేసి తెల్పటం వేరు. కానీ, రెంటినీ సఫలీకృతం చేయగలిగింది పటిష్టమైన కార్యకర్తల వ్యవస్థ. ఈ వ్యవస్థ వైయస్సార్‌ కాంగ్రెస్‌తో తల పడుతున్న కాంగ్రెస్‌కీ, తెలుగుదేశం పార్టీకి మెరుగ్గా వుండే అవకాశం వుంది. కానీ ఈ పార్టీలు మొదటి రెండు అంచెలూ దాటటమే కష్టం కావచ్చు.

 

అక్కడ ఆకర్షణ కరువే!

ఈ రెండు పార్టీల్లోనూ జనాకర్షక నేత లేరు. తొమ్మిదన్నరేళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినా చంద్రబాబు జనాకర్షక నేతగా లేరు. ఇప్పటికీ ఆయన సభలకు జనం ఎగబడి రారు. ఆయన తరపున బాలయ్యో, జూనియర్‌ ఎన్టీఆరో వస్తే జనం వస్తారు.

అంతే కాదు జనాన్ని వోట్లు గా మార్చుకునే శక్తి కూడా చంద్రబాబుకు తక్కువే. ఎన్టీఆర్‌ నేతృత్వంలో వున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి పోలయిన వోట్లలో 46 శాతం వరకూ వచ్చిన సందర్బాలున్నాయి. చంద్రబాబు నేతృత్వంలోకి వచ్చాక అది 35-36 శాతం వరకూ వచ్చేసింది. కానీ వచ్చిన వోట్లను సీట్లుగా మార్చుకునే శక్తి మాత్రం ఆయనకు ఆమోఘం. పొత్తులను అందుకు అనువయిన పావులుగా ఇప్పటివరకూ వాడుకుంటూ వచ్చారు. 1999లో తెలుగుదేశం రెండవ సారి అధికారంలోకి రావటానికి బిజెపితో పొత్తు అన్నది అందరికీ తెలిసిందే.

కాంగ్రెస్‌దీ అదే పరిస్థితి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని కానీ, బొత్స సత్యనారాయణను కానీ చూడటానికి జనం ఎగబడి వస్తారని బహుశా వారు కూడా నమ్మరు. ఇప్పుడు చిరంజీవి కూడా వారిలో ఒకరుగా మారిపోవటం విషాదమే. అయితే సినిమావల్ల ఎప్పటికీ తగ్గని ‘మెగా’ ఇమేజ్‌ కారణంగా ఆ మాత్రమయినా జనం వస్తున్నారు.

ఇక వీరి రాజకీయ నినాదం ‘జగన్‌ అవినీతి’ ఒక్కటే. వైయస్‌ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్‌ రెడ్డిల మీద ఉన్న అవినీతి ఆరోపణలూ, జరుగుతున్న విచారణల్నే ప్రచారాస్త్రాలుగా ఈ రెండు పార్టీలూ తీసుకున్నాయి.

అయితే ఈ 18లో తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న (పరకాల) ఉప ఎన్నిక భిన్నమైన వాతావరణంలో జరుగుతోంది.ఈ ‘సానుభూతి’ తో పాటు., తెలంగాణ ఉద్యమానికి నిజమైన ప్రతినిథులెవరు? టీఆర్‌ఎస్సా? లేక బీజేపీయా? అన్న ధోరణిలో జరుగుతోంది. కాబట్టి వైయస్సార్‌ కాంగ్రెస్‌తో అక్కడ తలపడుతున్న పక్షాలూ, వాటి నేతలూ వేరు.

మొత్తానికి ఒక పార్లమెంటు, 18 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఈ ఉప ఎన్నికల ఫలితాలు వైయస్సార్‌ కాంగ్రెస్‌కు చాలా కీలకమయినవి. ఒక పార్టీగా ఎన్నికల రాజకీయాలకు ఏమేరకు సరిపోతుందో తేలే సమయం ఇదే!!

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంద్ర సినీ రాజకీయ వారపత్రికలో 8-15 జూన్ 2012 వ సంచికలో వెలువడింది)

 

 

 

 

 

 

 

1 comment for “జనమే జయమా?

  1. కాబట్టి జనమే, జయం కాదు. అలాగని చుట్టూ జనమే లేని నేత పొరపాటున కూడా విజయఢంకా మోగించలేరు. లోక్‌సత్తా జయప్రకాష్‌ నారాయణ్‌ రోడ్‌షోలకు అంతంత మాత్రమే జనం వుంటారు. కాబట్టి ఆయన పార్టీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తుందని, అమాయకులు కూడా అనుకోరు.

    Not a fair statement sir. How can you say JP can’t get public his around? Do you follow only media news?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *