జిత్తుల సత్తి బాబు

కేరికేచర్ : బలరాం

పేరు : బొత్స సత్యనారాయణ

దరఖాస్తు చేయు ఉద్యోగం : అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి( ప్రత్యేక తెలంగాణను సమర్థిస్తారు. అది వేరే విషయం)

ముద్దు పేర్లు : జిత్తుల సత్తి బాబు( అత్తిలి సత్తిబాబు కాదు)

విద్యార్హతలు : ఎం.సి.ఎ(మాస్టర్‌ ఆఫ్‌ ‘కమ్యూనల్‌’ అడ్మినిస్ట్రేషన్‌). తన సామాజిక వర్గానికి తాను చెయ్యటం కాదు. తనకు తన సామాజిక వర్గం ఏమి చేసిందన్నది ముఖ్యం.

హోదాలు : ఒక టోపీ, ఒక కిరీటం. (పిసిపి చీఫ్‌ టోపీ అయితే, మంత్రి పదవి కిరీటం). వీటినే కిట్టని వారు జోడు పదవులంటున్నారు.

గుర్తింపు చిహ్నాలు : 1) ఏక కాలంలో చంద్రబాబునీ, కిరణ్‌ కుమార్‌ రెడ్డినీ తిట్టగలరు.. కాకుంటే బాబును ముద్దుగా, కిరణ్‌ను మొద్దుగా..!

2) తెలంగాణ విషయంలో పెదవుల పై ప్రేమ, పదవుల్లో వివక్ష ( ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతూనే, సీమాంధ్ర ప్రతినిదిగా, జోడు పదవులు కాజేశారన్నది అభియోగం)

సిధ్ధాంతం : సంక్షేమమే ఏకైక సిధ్ధాంతం. ముందు కుటుంబ సంక్షేమం( సభ్యులందరికీ పదవులొచ్చాయా? లేదా?) తర్వాత కుల సంక్షేమం (కులంలో తనకి అనుకూలురకు న్యాయం జరిగిందా? లేదా?) ఆ పైన గ్రూపు సంక్షేమం( పార్టీలో తన వర్గం వారికి ఏదయినా దక్కిందా? లేదా?) చిట్ట చివరగా చిరు సంక్షేమం( చిరంజీవి వర్గీయులకు ఇచ్చారా? లేదా?) ఆ తర్వాతే పార్టీ సంక్షేమమయినా, ప్రభుత్వ సంక్షేమమయినా..!

వృత్తి : ప్రజా వాహనాన్ని నడిపించటం (జర్మనీలో ప్రజావాహనాన్ని వోక్స్‌ వ్యాగన్‌ అంటారు. వోక్స్‌ అంటే ఫోక్స్‌. అనగా ప్రజలు) కానీ ఈ మాట ఆయనకు నచ్చదు. ఇప్పటికీ ఆయన శత్రువులు ఆ పేరు తో ఉడికిస్తారు. అదో”స్కాము’ లెండి. తనకే పాపం తెలీదని ఆయనెప్పుడో తెగేసి చెప్పేశారు కూడా.కానీ రవాణా శాఖ చేపట్టాక ప్రజావాహనాన్ని నడిపించాల్సిందే కదా!

హబీలు : 1) కిరణ్‌ సర్కారును పడిపోకుండా నిలబెట్టటం

2)కిరణ్‌ ను నిలబడకుండా పడగొట్టటం

అనుభవం : కిరణ్‌ కన్నా ఎక్కువే. అందుకే చీఫ్‌ మినిస్టర్‌ కుర్చీ మీద కర్చీఫ్‌ పరిచారు

మిత్రులు : కిరణ్‌ కుమార్‌కు శత్రువులంతా మిత్రులే

శత్రువులు : కిరణ్‌ కుమార్‌కు మిత్రులంతా నాకు శత్రువులే

మిత్రశత్రువులు : ఒక్కరే. చిరంజీవి.

జీవిత ధ్యేయం : 2009 లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక కిరణ్‌ ఎలా మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారో… అలా, కనీసం పన్నెండవ ముఖ్యమంత్రిగా నయినా ప్రమాణం చెయ్యాలన్నది కోరిక.

సతీష్ చందర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *