డొనాల్డ్‌ ‘జంప్‌’

పేరు : డొనాల్డ్‌ ట్రంప్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: హాఫ్‌ అమెరికన్‌ ప్రెసిడెంట్‌( అమెరికాలో సగం మంది నాకు వ్యతిరేకంగా వున్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని నేను ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లు ఇవ్వను.)

ముద్దు పేర్లు : డొనాల్డ్‌ ‘జంప్‌’ ( ఈ చివరనుంచి ఆ చివరకు జంప్‌ చెయ్యగలను. వలస రావటానికి వీలుకాదని చెప్పిన ఏడు దేశాల్లోంచి ఒక దేశాన్ని మినహాయించాను.)

‘విద్యార్హతలు : మాస్టర్‌ ఆఫ్‌ మిలటరీ మేనేజ్‌ మెంట్‌( భయం పెంచి తగ్గిస్తుంటాను.)

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: భయం. నేనెక్కడుంటే అక్కడ భయం వుంటుంది. ఉద్యోగం పోతుందన్న భయం, ప్రాణం పోతుందన్న భయం.

రెండు: భద్రత. నేనెక్కడుంటే అక్కడ అమెరికన్లకు భద్రత వుంటుంది. ఉద్యోగం వుంటుందన్న భద్రత. ప్రాణం వుంటుందన్న భద్రత.

సిధ్ధాంతం :చెక్కిళ్ల మీద కన్నీళ్ళు ఆరిపోయాక, కర్చీఫ్‌ పట్టుకుని వెళ్ళటం. ( నా దృష్టిలో ఇదే ఓదార్పు. శ్రీనివాస్‌ కూచిభొట్ల కుటుంబ సభ్యులను అలాగే ఓదార్చాను. కాస్త ఆలస్యంగా ఈ దాడిని ఖండించాను.)

వృత్తి : మీడియా ‘డేమేజ్‌’ మెంట్‌. (అందరూ మీడియాను బుజ్జగించి తమగురించి రాయించుకుంటారు. నేను మీడియాను తిట్టి, రెచ్చగొట్టి రాయించుకుంటాను. కాబట్టే అతి తక్కువ కాలంలో అమెరికా అధ్యక్షుడు ప్రపంచ ప్రసిధ్ధి కెక్కాను.)

హాబీలు :1.జుట్టు ఊడకుండా చూసుకోవటం. ( మల్టీనేషనల్‌ వ్యాపారులు నన్ను నమ్మాలంటే, వాళ్ళు పట్టుకోవటానికి సమృధ్ధిగా జుట్టు వుండాలి.)

2. వైట్‌ హౌస్‌ ను ‘వైట్స్‌’ హౌస్‌గా మార్చటం. (ఒబామా ఎంతో కొంత నలుపు చేశాడు కదా. అలా అని నన్ను జాత్యహంకారి గా భావించకండి సుమీ!)

అనుభవం : వోట్‌ అసలు పేరు ‘హేట్‌’ (ద్వేషం) ఇది అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను. జనం దీనికి కదలివచ్చినట్లు మరి దేనికీ కదలరు.

శత్రువులు : అతి కొద్ది మందిగా వున్న ఈ సమూహమైనా (ఉద్యోగాలను అపహరించుకు పోయే భారతీయులు కావచ్చు, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే మధ్య ప్రాచ్య దేశీయులు కావచ్చు.)

వేదాంతం : యూదులెవ్వరు? ముస్లిం లెవ్వరు? భారతీయులెవ్వరు? మధ్యప్రాచ్య దేశీయలెవరు? అంతా మిథ్య. ఒక్క అమెరికన్లే వాస్తవం.

జీవిత ధ్యేయం :నేను నాలుగేళ్లు అధ్యక్షుడిగా వున్నా నా గురించి నాలుగు కాలాల పాటు చెప్పుకోవాలి. మంచికి కావచ్చు. చెడుకు కావచ్చు.

-స‌తీష్ చంద‌ర్‌

Leave a Reply