నటనలు చాలించరా!

నటనే కదా-ఎక్కడయినా అనుకుని నటులు రాజకీయాల్లోకి దిగిపోతారు. ఆ తర్వాత తెలుస్తుంది- తేడా. అది సాంఘికానికీ, పౌరాణికానికీ వుండే మామూలు తేడా కాదు. ఇక్కడా ‘లైట్స్‌, కెమెరా’ వుంటాయి. కానీ తర్వాత ‘యాక్షన్‌’ వుండదు. ‘రియాక్షన్‌ ‘ వుంటుంది. నటనకు మెచ్చి ‘ఆస్కార్‌’ ఎవ్వరూ ఇవ్వరిక్కడ. ఇస్తే గిస్తే, ‘తిరస్కారే’. ‘నింద’ వస్తుందేమో కానీ, కనీసం ‘నంది’ కూడా రాదు.

రెండు చోట్లా నటించి మెప్పించగలిగిన వారు- ఒక ఎంజీఆర్‌, ఒక ఎన్టీఆర్‌ లాంటి వారు ఇద్దరో ముగ్గురో. అలాంటి వారు కూడా మధ్యలో రాజకీయ నటనలో తడబడటం వల్ల ‘కట్‌’లు తప్పలేదు. సినిమా షూటింగ్‌లో ‘కట్‌’ కాస్త విరామాన్నిస్తుంది. కానీ రాజకీయాల్లో ‘పవర్‌ కట్‌’లు ఏకంగా ఇంటికే పంపించేస్తాయి. ఆదమరిస్తే నటనలో ప్రమాదాలు తప్పవు. సినిమా నటనలో కాలికో, చేతికో గాయాలవుతాయి. కానీ రాజకీయానటనలో దెబ్బ తగిలితే ఒక్క ‘వెన్ను’కే తగులుతుంది. ఎన్టీఆర్‌ ఈ ‘పోటు’ను రెండు సార్లు చవి చూశారు.

సినిమాల్లో హీరోలకేమయినా అయితే, అభిమానులు తమ స్వంత ఖర్చులు మీద రోడ్లెక్కి ‘శాంతి, భద్రతల’ సమస్యను సృష్టించగలరు. కానీ రాజకీయాల్లోకి వచ్చాక, వారి స్థానాన్ని కార్యకర్తలు భర్తీ చేస్తారు. వారు వాహనాల్లేని ‘నిర్వాహకులు’ కారు. లారీలో, కార్లో, బైకులో- ఏవో ఒక్కటి ఎక్కిస్తే కానీ గడప దాటరు. అందుచేత, రాజకీయాల్లో శాంతి భద్రతల సమస్య సృష్టించి అరెస్టులు అయ్యేలా చెయ్యాలంటే ‘పెట్రోలు’ పొయ్యాలి, పెట్టుబడి పెట్టాలి. కానీ ఏమాటకాటే చెప్పాలి. అభిమానులకన్నా, కార్యకర్తలే ‘ప్రియం’.

ఇప్పుడు రాష్ట్ర రాజకీయ తెరమీద ఇద్దరు పెద్ద సినిమా హీరోల చిత్రాలు ఆడుతున్నాయి. ఒకటి చిరంజీవిదీ, ఇంకొకటి బాలకృష్ణదీ.

ఫలితాలు ముందే తెలిసిపోతున్నాయి: చిరంజీవి సినిమాల్లో ‘మెగా’, రాజకీయాల్లో ‘చిరు’. బాలకృష్ణ కూడా అంతే సినిమాల్లో ‘బాలయ్య’, రాజకీయాల్లో ‘బాలు’డే. ఈ బిరుదులు ఎవరో ఇస్తున్నవి కావు. వారిద్దరూ ఒకరికొకరు ఇచ్చుకున్నవి.తొడలు చరిచి, మీసాలు మెలివేసి పెట్టిన పార్టీని(ప్రజారాజ్యాన్ని) కాంగ్రెస్‌లో కలిపేసి చిరంజీవి, పార్టీ అధినేత పాత్రనుంచి, ‘చిరు’నేత పాత్రలోకి వొదిగిపోయాడన్నది బాలకృష్ణ చేస్తున్న అభియోగాల సారాంశం. బాలయ్య ఇంకా రాజకీయాల్లో ఇంకా, మాటలే రాని (చంద్ర) బాబు చాటు ‘బాలు’డని చిరంజీవి ఆరోపణ.

నిజమే కదా; వీళ్ళు సినిమాల్లో వేషం కడితే విలన్లను గడగడలాడించగల ‘ఇంద్ర’లు ‘సమరసింహారెడ్డి’లు. వీరి పైన ఎవరూ వుండరు. కానీ రాజకీయాల్లో చేరాక, ఇప్పటికీ వారికి పైన ‘హీరో’లు వున్నారు. ‘హైకమాండ్‌’లున్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఒక ‘కార్యకర్త’లా పనిచేయగలనని బాలయ్యా, కాంగ్రెస్‌ పార్టీ హైమాండ్‌ ఆదేశానుసారం నడుచుకోగలనని చిరంజీవీ బహిరంగంగా చెప్పకనే చెప్పుతున్నారు.

హీరోలు రాజకీయ తెరమీద కొస్తే, ఈ ‘ద్వితీయ’ ‘తృతీయ’ స్థానాలన్నా దొరుకుతున్నాయి. అదే హీరోయిన్లయితే…ఇంటర్వెల్‌కు ముందే తమ పాత్రల్ని ముగించుకుని వెళ్ళి పోవలసి వస్తుంది. జయప్రద, రోజాలు ఒక్కొక్క దశలో తెలుగుదేశం పార్టీలో ఒక్కొక్క వెలుగు వెలిగారు. కానీ వారి పాత్రల్ని సగంలోనే ముగించేస్తే, ఏం చేస్తారు? ఇంకో పార్టీని వెతుక్కుంటారు. జయప్రదను ఇక్కడ ‘సైకిలు'(తెలుగుదేశం గుర్తు) మీద నుంచి దించేసినా, అక్కడ(యుపిలో) ‘సైకిలు’ (సమాజ్‌ వాదీ పార్టీ గుర్తు) మీద చోటిచ్చారు. తర్వాత అక్కడ కూడా దించేసారనుకోండి అది వేరే విషయం. రోజాదీ అదే రూటు. పాపం తానూ ఉద్యమంలో భాగంగా ఒక పార్టీ(తల్లి తెలంగాణ)ని స్థాపించారు విజయశాంతి. చిరంజీవి చేసినట్టే తాను కూడా తన పార్టీని మరో పార్టీ(తెలంగాణ రాష్ట్ర సమితి)లో కలిపేశారు. చాలా కాలం ఆ పార్టీ అధినేత(కేసీఆర్‌) తన పక్కనే సమస్థానం కల్పించారు. కానీ తర్వాత తర్వాత తెలిసింది-ఆమె పోషించింది ‘డైలాగుల్లేని పాత్ర’ అని. కాంగ్రెస్‌లోని నాటి జమునకయినా, నేటి జయసుధకయినా ఇంతకు మించి గొప్ప గౌరవాలు దక్కక పోవచ్చు.

నటనే కదా- అని దిగిపోతే ఇలాగే వుంటుంది మరి. వెండితెర మీద ఏది లోపించినా పూరించ వచ్చు. నెత్తి మీద జుత్తు లేకపోతే, మొలిపించ వచ్చు. ముఖానికి కాంతి లేక పోతే రంగు పులమ వచ్చు. మాట్లాడే ప్రతీ మాటా రాయించుకోవచ్చు. కొరియోగ్రాఫర్‌ అడుగులో అడుగేసి సొంత ‘స్టెప్పు’లని భ్రమింప చేయవచ్చు. కనీసం గోడ దూకాలన్నా, డూప్‌ను ముందు తోసేయవచ్చు. కానీ రాజకీయాల్లో అన్ని వేళలా ఆ పప్పులుడకవే..!?

అంతా సొంత సరుకే వుండాలి. రాజకీయాల్లో పుట్టుకతో ఆరితేరిన మహానటులుంటారు. వారి ముందు సినిమా వాళ్లు చేసేవి హనుమంతుడి ముందు కుప్పిగంతులే.

ఒకటి మాత్రం నిజం. సినిమా తారల నటన – ఒక కళ. జనానికి ఆనందాన్నిస్తుంది. కానీ రాజకీయ నాయకుల నటన ఒక వంచన. అది జనానికి విషాదాన్నిస్తుంది. ఎంత కాదన్నా, కళాకారులు వంచకుల ముందు అమాయకులే.

-సతీష్‌ చందర్‌

2 comments for “నటనలు చాలించరా!

  1. “ఒకటి మాత్రం నిజం. సినిమా తారల నటన – ఒక కళ. జనానికి ఆనందాన్నిస్తుంది. కానీ రాజకీయ నాయకుల నటన ఒక వంచన. అది జనానికి విషాదాన్నిస్తుంది. ఎంత కాదన్నా, కళాకారులు వంచకుల ముందు అమాయకులే” Good comment sir!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *