‘నెలవంక’య్య నాయుడు

venkaiah naiduపేరు : ఎం.వెంకయ్య నాయుడు

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘సీమాంధ్ర చాంపియన్‌-4’ ( మొదటి మూడు స్థానాలు నిండిపోయాయి. జగన్‌, కిరణ్‌, బాబులు వాటిని సాధించారు. అయినా సరే, ప్రయత్నిస్తే ఎప్పుడోకప్పుడు మొదటి స్థానానికి చేరక పోతామా- అన్నది పట్టుదల)

ముద్దు పేర్లు : ‘నెల వంక’య్య నాయుడు.( అవును. నెలవంక అంటే ‘చంద్రుడే’. తెలుగు ‘చంద్రుడే’. బీజేపీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకోవాలనుకున్నప్పుడెల్లా, చంద్రాబునాయుడుతో మాట్లాడటానికి, వెంకయ్య నాయుడు- అను నాతో పని వుంటుంది కదా)

విద్యార్హతలు : బీ ‘ట్రక్‌’ (బీటెక్‌ విన్నాం, కానీ, ఈ బీట్రక్‌- అంటే, ఏమిటీ-అని అనుకుంటున్నారా? ( ట్రక్‌ అంటే పొత్తు. బ్యాచిలర్‌ ఆప్‌ ట్రక్‌ అన్నమాట. అంటే నేను పొత్తులు పెట్టుకోవటంలో పట్ట భద్రుణ్ణీ అన్నమాట.)

హోదాలు : మోడీ నెంబర్‌ వన్‌ అయతే, బీజేపీలో నెంబర్‌టూ పోస్టు ఖాళీగా వుంటుంది కదా! అయితే ఈ పోస్టుకు ఓ పదిమంది లైన్లో వున్నారనుకోండి. అయినా ట్రై చేస్తే పోలా!

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: సినిమాలో ‘ఎస్వీఆర్‌’ ను చూస్తే, నన్ను చూసినట్టే. అయితే ‘వర్ణం’ ( ఐ మీన్‌ రంగు.) వేరండోయ్‌. అపార్థం చేసుకోకండి. నాకు మహా అయితే ‘స్వవర్ణా’ భిమానం వుంటుంది, కానీ పర వర్ణ ద్వేషం వుండదు.

రెండు: నేను ఏం మాట్లాడినా జనం వింటారు. అందుకనే ఏదయినా మాట్లాడేస్తాను. తెలంగాణ కావాలంటాను. తెలుగు వాళ్ళు సమైక్యంగా వుండాలంటాను. ( ఇదే ముక్కను చంద్రబాబు ‘సమన్యాయం’ అంటే జనం స్వీకరించరు. కానీ నేను చెబితే ‘జాతీయ మీడియా’ కూడా వింటుంది.)

సిధ్ధాంతం : మీకు తెలియదా! నాది ఛాందస వాదం కాదు. పూర్తి ‘మోడి’రనిజం. ‘మోడి’రన్‌ గా ప్రతీవాడూ ‘టీ’ తాగుతాడు. నేను కూడా ‘టీ’ తాగటం మొదలు పెట్టాను. ‘ఛాయ్‌వాలా’యే దేశానికి ప్రధాని కాగలడు. మణిశంకర్‌ అయ్యర్‌కు ఈ రహస్యం తెలియదు. కాఫీ తాగే వాడు కార్పోరేటర్‌ కూడా కాలేడు.

వృత్తి : ‘వెంకయ్య మాట్రిమోనియల్స్‌’ ఎప్పుడూ చూడలేదా? పెళ్ళిళ్ళు కుదర్చటం. టీడీపీకీ, బీజేపీకీ పెళ్ళి కుదర్చగలిగిన వాణ్ణి. ఇక చిన్న చిన్న వియ్యాలు పెద్ద పని కాదు.

హబీలు :1. కోమల విలాస్‌ (నెల్లూరు) లో భోంచెయ్యటం.

2. ఎల్బీస్టేడియం(హైదరాబాద్‌)లో లెక్చరు దంచెయ్యటం.

అనుభవం : ‘జై ఆంద్ర’ నుంచి ‘సమన్యాయం’ వరకూ.

మిత్రులు : మాపార్టీ కేంద్ర కమిటీలో వున్నవారు.

శత్రువులు : మాపార్టీలో రాష్ట్రకమిటీలో కొందరు వున్నారు. ఎవరితో పొత్తు వద్దంటారు.

మిత్రశత్రువులు : మా పార్టీలోనే నా వెంట తిరిగే వారిలో కొందరు.

వేదాంతం : ఓడలు బళ్ళవుతాయి. బళ్ళు ఓడలవుతాయి. అద్వానీలు మోడీలు అవుతారు. మోడీలు అద్వానీలవుతారు. నాప్రయాణం ఎప్పుడూ ‘ఓడ’లోనే

జీవిత ధ్యేయం : ఏముంటుంది? 1999-2004 మధ్యకాలంలో చక్రం తిప్పినట్టు, ( బాబు ఎలాగూ నాతో నే వుంటాడు కాబట్టి) మరో మారు దేశంలోనూ, రాష్ట్రంలోనూ చక్రం తిప్పాలని.

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 1-6 ఫిబ్రవరి 2014 వ తేదీ సంచికలో ప్రచురితం)

Leave a Reply