పోరుగడ్డ మీద ‘పరువు’ హత్యలా..?

ప్రేమించి హతుడయిన మధుకర్ తల్లిదండ్రులు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేళ్ళవుతోంది. ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీగా టీఆర్‌ఎస్‌ అందలమెక్కింది. అంకెల్లో చూస్తే పాలన అద్భుతంగా వున్నట్లుంటుంది. అక్షరాలా ఎలావుందన్నదే ప్రశ్న. ముందుకు వెళ్తుందా..? వెనక్కి వెళ్తుందా? అసలిదేం ప్రశ్న? సార్వత్రిక ఎన్నికలే కాదు, తర్వాత ఏ ఎన్నిక జరిగినా టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసేసింది. విపక్షాలు విలవిలలాడిపోయాయి. చిన్నా చితకా నేతలు సైతం తమ తమ పార్టీలను తన్ని, తగలేసి, ఎగురుకుంటూ వచ్చి ‘గులాబీ’ కండువాలకు మీద వేసుకున్నారు. అప్పోజిషన్‌ అన్నది కనుచూపు మేరలో కానరావటం లేదు. ఇది రాజకీయ తెలంగాణం. కానీ ప్రశ్న సాంఘిక తెలంగాణకు చెందినది. మొత్తం కేబినెట్టే ‘స్త్రీ పాత్ర లేని నాటకం’ లాగా వుంది.( ఒకప్పుడు స్త్రీలు రంగస్థలం ఎక్కడానికి వీలు వుండేది కాదు. ఆ పాత్రలు మగవాళ్ళు వేస్తే ఎబ్బెట్టుగా వుంటుందని, మొత్తం నాటకం నుంచి స్త్రీ పాత్రను మరుగు పరచే వారు.) అంత మాత్రాన స్త్రీలేమీ వ్యతిరేకం కాలేదు. సరికదా.. ఏ ఎన్నిక జరిగినా పోలింగ్‌ బూతుల వద్ద బారులు తీరి మరీ గెలిపించారు. మరి సామాజిక వర్గాలో..!? వారి స్థితికి సంబంధించినదే కీలకాంశం. వీరిలో అట్టడుగున వున్న వారు దళితులు. వీరంటే పాలక పక్షానికి ప్రత్యేక అభిమానం. అందుకే ముందు దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేద్దామనుకుంది. అన్నంత పనీ చేయకపోయినా, ఉన్నంతలో ఉప ముఖ్యమంత్రి పదవి నిచ్చింది. ఇక మూడెకరాల పొలం లాంటి హామీలు, ఇతర పథకాలూ సరేసరి.

హత్యల్లో ఉత్తరాది మోడల్

ఏ పథకమయినా బతికుంటే వర్తిస్తుంది. చనిపోతే వర్తించదు కదా! కానీ దళితులు చనిపోతున్నారు. అయితే రైతుల మరణాల లెక్కల్లాగ, వీరి లెక్క అంత తొందరగా బయిట పడదు. అసలు శవాలే రోజులు, వారాలు గడిస్తే కానీ దొరకవు. రైతులు అప్పుల బాధల్తో మరణిస్తుంటే, దళితులు ‘పీకలోతు ప్రేమల్లో’ని మునిగి మరణిస్తున్నారు. పేరుకు మరణాలు కానీ, దాదాపు అన్నీ హత్యలే. మామూలు హత్యలు కావు, ప్రతిష్టకు పోయి చేసే ‘పరువు హత్యలు’. ఇంతవరకూ ఈ హత్యలు ఉత్తర భారతంలోనే (ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్లలో) ప్రముఖంగా జరిగేవి. దక్షిణాదిన అంతంత మాత్రమే. కానీ చూడబోతే, వీటిని సరసన చేరటానికి తెలంగాణ సిధ్ధమవుతుందా.. అని అనిపిస్తోంది. పరువుకీ, పెళ్ళికీ లేనిపోని లింకు ఇప్పుడు వచ్చి పడింది. ఓ అమ్మాయి ఎవరినయినా పెళ్ళాడవచ్చు, అంతకు ముందు ప్రేమించనూ వచ్చు. అన్నీ బాగుంటే ‘కులం’ కూడా పెద్ద అడ్డు కాకపోచ్చు… కానీ ఆ ఒక్క కులమూ తప్ప. అదే ఒకప్పటి ‘అస్పృశ్య’ కులం. ఇప్పటి ‘దళిత’ కులం. కాదూ,కూడదూ.. ఆ కులం వాడినే పెళ్ళాడేస్తానంటే.. !? చూస్తారు. చూస్తారు. చెయ్యాల్సింది చేసేసి, ‘వాడుంటే కదే.. చేసుకోవటానికీ..!’. ఆ మాట అనేటప్పటికే ఆ అస్పృశ్య ప్రేమికుడు అదృశ్యమవుతాడు… కాదు. కాదు. అదృశ్యమవుతాడు. తర్వాత శవమై పొదల్లోనో, పాడుపడ్డ బావిలోనో, రైలు కట్టల మీదనో దొరుకుతాడు. ఇదీ నేటి ‘తెలంగాణ’ మార్కు పరువు హత్య. నెలలోపుగా- అంటే, మార్చి 13నుంచి ఏప్రిల్‌ 14( అంబేద్కర్‌ జయంతి) నాటికి-ఇక్కడ వరుసగా ‘మూడు పరువు హత్యలు’ జరిగిపోయాయి. కరీంనగర్‌ మంథని( ఖానాపూర్‌)లో మంథని మధుకర్‌, జమ్మికుంటలో రాజేష్‌, నిజామాబాద్‌ జిల్లా డిచ్‌ పల్లి( కోరట్‌పల్లి)లో అనుపాల ఇజ్రాయెల్‌ లు ఇలా చనిపోయారు. ముగ్గురూ ఎస్సీలే.(ఎస్సీల్లో కూడా ఉపకులాలు తెలిస్తేనే కానీ స్పందించలేమనుకున్న వారి కోసం ఇంకొంత సమాచారం: వారిలో ఇద్దరు మాదిగలు, ఒకరు మాల). ఈ వార్తలన్నీ ప్రధాన స్రవంతి మాధ్యమాల్లో ఉండీ లేనట్లుగానూ, సామాజిక మాధ్యమాల్లో ప్రముఖంగానూ వచ్చాయి. మరీ ముఖ్యంగా కోర్టు జోక్యంతో రెండోసారి శవపరీక్షకు వెళ్ళిన మధుకర్‌ మృత దేహం మాత్రం అందర్నీ హతాశుల్ని చేసింది. తొట్ట తొలుత సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన ఇతని ఫోటోలను చూస్తే… కన్ను చిదిమినట్లూ, మర్మాంగాన్ని కోసి కారం పెట్టినట్లూ, నోట్లో మన్ను కూరినట్లూ… కనిపిస్తుంది. ఇంచుమించు ఇతర యువకుల శవాలు కూడా దారుణమైన స్థితిలోనే తమ తల్లి దండ్రులకు చేరాయి. వీరిని ప్రేమించిన అమ్మాయిలు మరీ సమాజంలో ‘అగ్రవర్ణాలు’గా వున్న వారికి చెందిన వారు కారు. వారిలో ఇద్దరయితే బీసీ కులస్తులు. మధుకర్‌ ప్రియరాలు అయితే ఏకంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు బంధువు కూడా. ఈ కేసులో ఇంత వరకూ అరెస్టు జరగలేదని, విపక్షాలతో పాటు పలు దళిత సంఘాలు కోడయి కూస్తున్నాయి. అయితే ఇతనిది ఆత్మహత్యేననే వాదన మీద పోలీసులు స్థిరంగా నిలబడిపోయారు. ఈ మూడు కేసుల్లోనూ అమ్మాయిల అభిప్రాయాలతో తల్లి దండ్రులకూ పనిలేదు; వారి వాంగ్మూలాలతో పోలీసులకూ పనిలేదు. అయితే ముగ్గురు హతుల (పోలీసుల లెక్కల్లో మృతుల?) ఫ్లాష్‌ బ్యాక్‌ ఒక్కటే. అదృశ్యమవటానికి ముందు ‘అమ్మాయి’ తరపు వారి నుంచి బెదరింపులు వచ్చాయి.

అగ్రకులాంతర వివాహాలే తప్ప..

మధుకర్ పేదరికాన్ని నిర్వచించే అతడి నివాసం

తెలంగాణ ఉద్యమాల పురిటి గడ్డ. ముందు ఆర్యసమాజ, తర్వాత వామపక్ష ఉద్యమాల కాలంలో, ఇక్కడ కులాంతర వివాహాలు నిరాఘాటంగా జరిగాయి. అస్సృశ్య కులస్తులతోనూ నిస్సంకోచంగా ‘అగ్ర కులస్తులు’ వియ్యమందారు. ఇప్పుడు పరిస్థితి మారింది. అంటే కులాంతర వివాహాలు బొత్తిగా జరగటం లేదని కాదు. జరుగుతున్నాయి. ఇవి ‘అగ్రకులాంతర’ వివాహాలు. ఒక ‘అగ్రకులం’ వారు, మరో ‘అగ్రకులం’ వారితో ఇచ్చి పుచ్చుకుంటున్నారు. కానీ ‘బడుగు కులాల్లో’ మాత్రం ఈ సౌకర్యం చెడిపోయింది. కొంచెం భూమి, కాస్త అధికారం వుంటే చాలు, బీసీల్లో కొన్ని కులాలకు చెందిన కొన్ని కుటుంబాల వారు, తాము అధికులమనే భావనకు గురవుతున్నారు. ఇదిగో ఇలాంటి కుటుంబాలనుంచే ఆడపిల్లలు, ఎవరన్నా ఎస్సీ కులస్తుడిని ఇష్టపడితే, ‘పరువు’ మొత్తం గంగలో కలిసినట్లు భావిస్తున్నారు. మళ్ళీ మరొక ఎస్సీ యువకుడు ఎవరూ ఇటు వైపు తొంగి చూడకూడదనే ‘సందేశాన్ని’వ్వటానికి అన్నట్లు అత క్రూరంగా చంపుతున్నారు. ఉత్తరాదిన ‘పైవర్ణాలు’ చేసే పనిని ఇక్కడ ‘బడుగు వర్ణాల’ వారు చెయ్యటం విశేషం. ఎస్సీ యువకుల్ని ఇలా గల చంపగలుగుతున్నామని పైశాచికానందం పొందే వారు, తమ ఆడపిల్లల ఎంచుకునే హక్కుని హరించి, వారిని శాశ్వత బందీలుగా చేస్తున్నామని తలచటం లేదు. తాము వెనక్కి నడుస్తూ, ముందుకు నడుస్తున్నామన్న భ్రమలోకి వెళ్తున్నారు. ఈ సామాజిక పరిణామానికి బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిది కాకపోవచ్చు. కానీ ఈ పేరున జరిగే నేరాలకు నిష్పాక్షికమైన దర్యాప్తును చెయ్యలేక పోతే, ఆ దోషం మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వానిదే అవుతుంది.

-సతీష్ చందర్,

13 ఏప్రిల్ 2017

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *