‘మహిళా స్ట్రింగ్‌’ యాదవ్‌!

caricature:balram

caricature:balram

పేరు : ములాయంసింగ్‌ యాదవ్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: అత్యాచార నిందితుల హక్కుల పరిరక్షకుడు (అ.ని.హ.ప)

వయసు : అరవయి నాలుగేళ్ళప్పుడు రెండోపెళ్ళి చేసికొని, సీనియర్‌ సిటిజన్లకు దిశానిర్దేశం చేసిన వాణ్ణి . నన్ను వయసు అడగటం పధ్ధతి కాదు. (అఫ్‌ కోర్స్‌ ఇలాంటి అవకాశం దేశంలో స్త్రీలకు ఇంకా వచ్చి వుండక పోవచ్చు.)

ముద్దు పేర్లు : ‘మల్ల’యాం సింగ్‌ యాదవ్‌( నేను మల్లయోధుణ్ణి లెండి. ఒకప్పుడు కండలుపెంచిన వస్తాదును కూడా.) ‘మహిళా’ ‘స్ట్రింగ్‌’ యాదవ్‌. (మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల పై స్ట్రింగ్‌ అపరేషన్‌ చేసిన వాణ్ణి. కాబట్టే ‘సామూహిక అత్యాచారాలు’ ఆచరణ సాధ్యం కావని తేల్చి చెప్పగలిగాను.

‘విద్యార్హతలు : చాలా చదివాను. కానీ ‘మాస్టర్‌ ఆఫ్‌ రేప్‌ సైకాలజీ’ (ఎం. ఆర్‌.ఎస్‌) ను ప్రత్యేకంగా చెప్పదలిచాను. కాబట్టే, ఆడపిల్లలు ఇష్టపూర్వకంగా మగ పిల్లలు సంబంధాలు పెట్టుకుని, తర్వాత బెడిసి కొడితే రేప్‌ అని అబధ్ధమాడుతున్నారనే , విషయాన్ని రూఢిగా చెప్పగలిగాను. ( దేశంలో మహిళా సంఘాల వాళ్ళంతా, నేనేదో స్త్రీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాని ఆడిపోసుకుంటున్నారు.)

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: దేశంలో అతి పెద్ద రాష్ట్రానికి ముమ్మారు ముఖ్యమంత్రిగా చేశాను. కానీ నన్ను ముమ్మారు రేప్‌ మీద వివాదస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తిగా గుర్తు పెట్టుకుంటారు. పలు బీజేపీ పాలిత రాష్ట్రాలలో కన్నా రేప్‌ల శాతం యూపీలో తక్కువ- అన్న విషయాన్ని ఇలాంటి వారు గుర్తించుకోవాలి.

రెండు: అతి పెద్ద బాధితురాలు, బ్యాండిట్‌ క్వీన్‌ ఫూలన్‌ దేవిని జైలునుంచి విడుదల చేయించి, ఎన్నికలలో గెలిపించిన వాడిని. అయినా నన్ను పురుష పక్షపాతిగానే గుర్తుంచుకుంటారు.

సిధ్ధాంతం : బోయ్స్‌ విల్‌ బి బోయ్స్‌.. తప్పులు చేస్తుంటారు. ( ఇందులో తప్పేముందీ…!) కావాలంటే ఈ వాక్యాన్ని ‘లీడర్స్‌ విల్‌ బి లీడర్స్‌’ అని మార్చుకోండి.

వృత్తి : వ్యతిరేక ప్రచారం పొందటం..! ఈ పనిని నా ప్రత్యర్థులే చేస్తారు. ఏ ప్రచారమైనా సరే ఎన్నికలకు పనికి వస్తుందన్న విషయం వాళ్ళకి తెలియదు.

హాబీలు :1.పొత్తులు పెట్టుకోవటం, తక్షణం చిత్తు చెయ్యటం.

2. నా పెద్ద కొడుక్కి(అఖిలేష్‌కి) ఏది కావాలంటే అది ఇస్తాను. పాలించుకోవటానికి రాష్ట్రం కావాలన్నాడు. దేశంలోనే అతి రాష్ట్రమయిన ఉత్తర ప్రదేశ్‌ అతడి చేతిలో పెట్టాను.

అనుభవం : నా రాష్ట్రంలో నేను బీసీలను బీసీలుగా చూపించనంతకాలం నేనే గెలిచాను. కానీ, అమిత్‌ షా వచ్చి బీసీలు కాక ముందు మీరు హిందువులు అని చెప్పాడు. ముజఫర్‌ నగర్‌ అల్లర్ల సాక్షిగా వారిలో ముస్లిం వ్యతిరేకత పోశాడు. దాంతో బీజేపీ గెలిచింది. దేశంలో ‘హిందువులే ఎక్కు’ అన్న మెజారిటీ వాదాన్ని వారు నమ్ముకుంటే, ‘స్త్రీ కన్నా పురుషుడే ఎక్కువ’ అన్న వారు పురుషుల్లోనూ, స్త్రీలలోనూ ఎక్కువ అన్న ‘మెజారిటీ వాదాన్ని’ నేను నమ్ముకున్నాను. కాబట్టి నా వ్యాఖ్యలకు భవిష్యత్‌ ఎన్నికలలో మంచి ఫలితాలే రావచ్చు.

మిత్రులు : లాలూ, నితిష్‌.. జనతా ‘పరివారమంతా’ ఇప్పుడు నా మిత్రులే. బీజేపీ నా ప్రధాన శత్రువు కాబట్టి, శత్రువుకు శత్రువులంతా నా మిత్రులే. ఒక్క మాయావతి తప్ప. అయితే నాలా భావసారూప్యం వున్న అసారామ్‌ బాపు లాంటి బాబాలు కూడా వున్నారు. వారు కూడా రేప్‌ ల మీద వ్యాఖ్యలతో ప్రాచుర్యం పొందారు.

శత్రువులు : అద్వానీ కాలం నుంచి, మోడీ యుగం వరకూ శత్రుత్వం విషయంలో మనకి తేడాలుండవు.

మిత్రశత్రువులు : అమర్‌ సింగ్‌ లాంటి వారు. అన్ని పార్టీల్లోనూ వుంటారు. అంతిమంగా మిత్రులయిపోతారు లెండి.

వేదాంతం : ఏక కాలంలో రెండు చక్రాలూ తిరగక పోతే ‘సైకిలు’ ( మా సమాజ్‌ వాదీ పార్టీ గుర్తు) కదలదు. ఏక కాలంలో ‘రెండు రకాల ‘ మాటలూ మాట్లాడక పోతే రాజకీయం నడవదు.

జీవిత ధ్యేయం :దేశంలోని అధిక శాతం స్త్రీల వోట్లతో గెలిచి జనతా పరివార్‌ తరఫున దేశ ప్రధాని కావాలన్నది.

-సతీష్‌ చందర్

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 21-28 ఆగస్టు 2015 వ తేదీ సంచికలో ప్రచురితం)

2 comments for “‘మహిళా స్ట్రింగ్‌’ యాదవ్‌!

Leave a Reply