హోంవర్క్‌ అడగలేదోచ్‌!

ఈ ప్రజాస్వామ్యం ఏమిటో కానీ,
ఇక్కడ ఎవ్వరూ హోం వర్క్‌ చెయ్యరు.
వోటరు దగ్గర నుంచి బ్రోకరు వరకూ, కేడర్‌ మొదలు లీడర్‌ వరకూ- అంతే. ఒక్క ‘మందు’ తప్ప ఏదీ ముందు సిధ్ధం చేసుకోరు.( వీరికి ముందు జాగ్రత్త అనే మాట ‘మందు’ జాగ్రత్త లాగా వినిపిస్తుంది).
పోటీలో వున్న ఫోర్‌ట్వంటీలెందరో కనీసం లెక్కకూడా పెట్టుకోడు వోటరు.
‘నేను ‘నొక్కాల్సిన’ ఫోర్‌ట్వంటీ గాడెవడో చెప్పు. మిగతా వాళ్ళు నాకనవసరం’ అని బూత్‌లోకి వెళ్ళే ముందు అడిగి వెళ్ళి ‘ఈవీఎం’ (ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌ మెషిన్‌) మీట నొక్కేసి వస్తాడు. ఎన్నో వేలిముద్రలు నొక్కిన వాడికి ఈ ముద్రో లెక్కా? చదువుకున్న వోటరు మాత్రం తక్కువ తింటాడా? పాతిక పేజీల న్యూస్‌ పేపర్‌ను ఊదిపారేస్తాడు కానీ, బ్యాలెట్‌ మీద పేర్లను ముందుగా చదవటానికి బధ్ధకిస్తాడు. ముందుగా చదివి వుంటే.., ఎక్కడో, ఎప్పుడో విని వున్నట్లే అనిపించేవి. మార్చురీ శవాల్ని అలంకరించి అమ్మేవాడో, పసిపిల్లలకి పచ్చని చీరలుకట్టి ఏ రెడ్‌లైట్‌ ఏరియాలో విక్రయించేవాడో- ఎవడో ఒకడు స్ఫురణ కొచ్చేవాడు. ‘వాడే వీడు’ కదా అని నిర్ధారణకు వచ్చేవాడు. కానీ ఏ హోంవర్కూ లేకుండానే దర్జాగా క్యూలో నిలబడతాడు.
పోనీ, చచ్చినోడి వోటుకి కూడా అభ్యర్థినుంచి పైసలు లాగేసే బ్రోకరయినా హోంవర్క్‌ చేస్తాడా- అంటే వాడూ చెయ్యడు. పంచమని సంచులిచ్చిన అభ్యర్థెవడని కొంచెం వాకబు చేసినా తెలిసేది- వాడు దొంగనోట్ల పంపిణీలో పట్టుపడి, మంచినోట్లు లంచమిచ్చి తప్పించుకున్నవాడని. వోట్ల లెక్కింపు కూడా అయిపోయాక సదరు బ్రోకరుకి అనుమానం వస్తుంది- అసలు తాను పంచినవి దొంగనోట్లా? అసలు నోట్లా? అలా పంచుతుండగా దొరికి పోయి వుంటే ఏమయ్యేది? తనను విడిపించుకోవడాని ‘మంచి’నోట్లెవ్వడూ ఇవ్వడు కదా! అప్పుడేమవుతుంది? అభ్యర్థి అసెంబ్లీకి వెళ్తాడు. బ్రోకరు జైలుకి వెళ్తాడు. అందుకే మరి- బ్రోకర్‌కి కూడా హోం వర్క్‌ అంత ముఖ్యం.
వెనకా ముందూ చూడకుండా, ఎవడికి ‘జై’ కొట్టమంటే వాడికి ‘జై’ కొట్టటం తప్ప వేరే ఏ సంగతీ పట్టించుకోరు. పార్టీ నేత చెబితే చాలు, ఎవడి బొమ్మ మొయ్యమంటే వాడి బొమ్మను మోసేస్తారు. ఎవడో ఊరూ, పేరూ లేని వాణ్ణి అభ్యర్ధిగా నిలబెట్టారు- ప్రమాదం లేదని మురిసిపోతూ వాణ్ణి మోసేస్తారు. ఎన్నికలయ్యాక గాని తెలియదు- కొన్ని నెలల క్రితమే ఇతడి దిష్టిబొమ్మను అన్ని సెంటర్లలోనూ తమ చేతులతో తాము ఊరేగించామని. అదికూడా ఏ టీవీ చానెలో ఫైల్‌ క్లిపింగ్స్‌ ను చూపించాక తెలివిలోకి వస్తారు. అప్పుడూ పార్టీ నేత చెబితేనే చేసి వుంటారు. హోంవర్క్‌ చేసి వుంటే ఈ పనిజరిగేది కదా!
లీడర్ల సంగతంటారా? కుర్చీయే చూసుకుంటారు తప్ప అది ఎక్కడ వేశారో చూసుకోరు.టాయ్‌లెట్స్‌ పక్కనే వేసారో, చెత్త కుండీ వెనకే వేశారో చూడనయినా చూడరు. వాసన వచ్చాక గాని తెలియదు- తాము నిర్వహిస్తున్నది ఇంత మురికి పదవి- అని. ముందే తెలిసి వుంటే, ఈ పదవి దరిదాపులకు కూడాపోయి వుండే వారు కదా! కానీ హోం వర్క్‌ చేసిందెక్కడ?
హోంవర్క్‌ చేయకుండా క్లాస్‌ కొచ్చిన బడిపిల్లలకీ వీళ్ళకీ పెద్ద తేడా వుండదు. పంతులయ్య బడితె పూజ తప్పించుకోవటానికి గజకర్ణ గోకర్ణ టక్కు టమారా విద్యలన్నీ ప్రదర్శిస్తాడు.
క్లాసులోకి పంతులయ్య రాగానే, హోం వర్క్‌ చూడడాన్ని వాయిదా వేయించాలి.
‘సార్‌! వీడు ఆడపిల్లల బెంచీలో కూర్చున్నాడు’ అంటే చాలు. అంతే టాపిక్‌ మొత్తం సీటింగ్‌ మీదకే వెళ్ళి పోతుంది.
‘ఏరా! ఏమిటా పాడు పని?’ అని విరుచుకు పడతాడు.
‘సీట్లన్నీ ఆడపిల్లలకే రిజర్వ్‌ చేస్తే మేమెక్కడ కూర్చోవాలి సార్‌!’ అంటాడు.
గంట మొత్తం వాదోపవాదాలు వినటానికి సరిపోతుంది. హోమ్‌వర్క్‌ చూడటం నిరవధికంగా వాయిదా పడుతుంది.
దొంగకు వోటు వేసానని తెలుసుకున్న వోటరు, తన బూతుకు రీపోలింగ్‌ చేయించాలనుకుంటాడు.
దొంగనోట్లు పంచానని గ్రహించిన బ్రోకరు నియోజకవర్గం మొత్తానికి ఉప ఎన్నిక జరగాలనుకుంటాడు.
తగలేసిన దిష్టిబొమ్మకే జైకొడుతున్నామని పసిగట్టిన కేడరు, అతడి మీద అసమ్మతి పెంచాలని పూనుకుంటారు
కుర్చీ కింద కంపు వుందని గ్రహించిన లీడరు తాత్కాలికంగా పదవీ త్యాగం చేసి మంచి పదవి కొట్టటానికి పతకం వేస్తాడు.
హోంవర్క్‌ బద్ధకించిన వీరందరిదీ ఒక్కటే మంత్రం: వాయిదా మంత్రం.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చెయ్యటానికి పూర్తి హోం వర్క్‌ ఇటు పాలకపక్షమైన కాంగ్రెసూ చెయ్యలేదు.అటు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశమూ చెయ్యలేదు.
తెలంగాణలో టీఆర్‌ఎస్‌, సీమాంధ్రలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌లు క్లాస్‌ వర్క్‌ పక్కన పెట్టి.. హోంవర్కే హోంవర్కులు చేసేశారు.
ఇప్పుడు హోం వర్క్‌ చేయని వారు ఏం చెయ్యాలి? వేరే ‘సీట్లు రిజర్వు చేసే అంశాన్ని’ లేవ నెత్తాలి. వాయిదా వేయించాలి. కోర్టు మాత్రం ఏం చేస్తుంది. క్లాస్‌ టీచర్‌ పనే చేస్తుంది.
పాలక పక్షానికీ, ప్రతిపక్షానికీ ఎంచక్కా ఎన్నికలు తప్పాయి.
– సతీష్‌ చందర్‌
17-6-11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *