‘అమితా’శలపై తెలుగు నీళ్ళు..?

అణచుకుంటే అణిగేదీ, తీర్చుకుంటే తీరేదీ కోరిక కాదు. ఆ తర్వాత పెరుగుతుంది, చచ్చినట్టే చచ్చి తిరిగి పుడుతుంది. అందుకే కాబోలు- అటు అణచటం, ఇటు తీర్చుకోవటమూ కాకుండా- కోరికను జయించ మన్నాడు బుద్ధుడు.
కాంక్షలన్నిటిలోనూ పెద్ద కాంక్ష రాజ్యకాంక్ష. ఇది ఒక పట్టాన తీరదు. రాచరికాలు పోయినా, ప్రజాస్వామ్యం వచ్చేసినా రాజ్యమేలాలనే కాంక్ష పదిలంగా వుంది. ఈ కోరిక ప్రజలకు పుడితే బాగుండేది. పాలకులకే పుడుతూ వస్తోంది. ఒక రాజ్యం తర్వాత, మరొక రాజ్యం, ఆపై మరో రాజ్యం ఆక్రమించుకోవాలన్న ఆరాటం అలనాటి రాజుల కన్నా
ఇప్పుడే పుడుతోంది. ఒకరకంగా రాచరికంలో నయం. కొన్నాళ్ళు పాలించేశాక
వానప్రస్తం, సన్యాసం స్వీకరించే వారు. ఇప్పుడు అలా కాదు, సన్యాసం పుచ్చుకున్నవారు, గృహస్తు ధర్మాన్ని వదలి బ్రహ్మచర్యం పాటించిన వారూ రాజ్యాలేలుతున్నారు. ఒక రాష్ట్రం తర్వాత మరొక రాష్ట్రంలో తమ విజయ(కాషాయ)పతాకాన్ని ఎగుర
వేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు.

ఉత్తరాన ఉదయం-ఈశాన్యాన అభయం
మినీ భారతమైన ఉత్తర ప్రదేశ్‌లో విజయ దుందుభి మోగించాక, ఇతర రాష్ట్రాలను సైతం ‘కాషాయ’మయం చెయ్యాలనే రాజ్యవిస్తరణ కాంక్ష బీజేపీలో తీవ్రమయ్యింది. ఇంత వరకూ ఈ పార్టీకి కొన్ని రాష్ట్రాలు దర్భేద్యంగా వుండేవి. ఈశాన్య భారతం, దక్షిణభారతంతో పాటు కొన్ని తూర్పు రాష్ట్రాలు కూడా బీజేపీకి చిక్కేవి కావు. అసోంలో విజయ తర్వాత ఈశాన్య రాష్ట్రాల వైపు ప్రయాణం సుగమమం అయ్యింది. ఎంతసులువయి పోయిందంటే, (మణిపూర్‌ వంటి రాష్ట్రాల్లో) మెజారిటీ రాకపోయినా ప్రభుత్వాలు ఏర్పాటు చెయ్యగలుగుతోంది. ( ఏ పార్టీ టిక్కెట్టు మీద గెలిచినా, గెలిచిన వెంటనే కొందరి శాసన సభ్యులతో ‘కాషాయం’ కట్టించటం తేలికయిపోయింది.) కమ్యూనిస్టుల చుకోటల మీద కూడా కన్ను పడింది. కేరళలో ‘కత్తుల’ పోరు చెయ్యటానికి సైతం వెనకాడటం లేదు. బీజేపీ పేరు చెబితే ఒంటికాలు మీద లేచే
తృణమూల్‌ కాంగ్రెస్‌ వున్న పశ్చిమ బెంగాల్‌లోనూ కాలు మోపటానికీ, ఖాతాతెరవటానికీ ఎంతటి సాహసానికయినా సిధ్ధమవుతోంది.

‘పూజారి’ శాసిస్తే రజనీ పాటిస్తారా..?
ఇక పట్టు దొరికనట్టే దొరికి, జారిపోయేది దక్షిణ భారతం. ఇంకేముంది.. ‘మనదే మనదే కర్ణాటకం’ అనుకున్న మరుక్షణమే జారిపోతూ వస్తోంది ఆ రాష్ట్రం. ఇక అటు ఇటయినా, ఇటు అటయినా ‘ద్రావిడపార్టీలే గెలవాలి’ అని తీర్పుచెప్పే తమిళనాడూ అంతు చిక్కలేదు. జయలలిత అస్తమయం తర్వాత శశికళ జైలు పాలు కావటంతో ఎఐఎడిఎంకె ‘రెండాకులు’గా విడిపోయి, తిరిగి కలిసిపోయే నేపథ్యంలో ఆ పార్టీ వైపూ బీజేపీ ఆశగానూ చూస్తోంది. రచ్చకెక్కి కలిస్తే, ఆ రెండు వర్గాలూ తిరిగి ‘రెండాకులు’ అవుతాయో, లేక
‘ఎండుటాకు’లవుతాయో వేచి చూడాలి. ఏదో ఒక దేవుడు శాసిస్తేనే కానీ రాజకీయాల్లోకి రానన్న రజనీకాంత్‌ కు దేవుడితో కాకపోయినా, ఏదో ఒక ‘పూజారి’తోనైనా వర్తమానం పంపి పార్టీలోకి చేర్చుకోవాలన్న ఆరాటంతోనూ ఆ పార్టీ వుంది.

అగ్రవర్ణాల వంట..దళితుల ఇంట..?
ఇక రెండుగా వేరుపడ్డ తెలుగు రాష్ట్రాలలో కూడా పాగా వెయ్యాలన్న సంకల్పం ఎంత వుందో, మండుటెండల్లో(మే రెండవ పక్షంలో) ఆ పార్టీఅధ్యక్షులు, వ్యూహకర్త అమిత్‌ షా పర్యటన ద్వారా స్పష్టం చేస్తున్నారు. ముందు తెలంగాణలో చాలా మాట్లాడారు. ఇప్పటికే లక్ష కోట్లిచ్చేసామన్నారు. ఇంకే ముంది 2019 లో తెలంగాణలో కూడా బీజేపీ సర్కారు వచ్చేస్తుందన్నారు. అంతటితో ఆగలేదు. ఒక జనాకర్షక నేతగా ( మోడీకున్నజనాకర్షణ తనకీ వుందని భావించారో, యేమో), చేనేత కార్మికులతో పాటు మగ్గం పట్టారు. దళితుల సరసన కూర్చొని భోజనాలు చేశారు. అయితే ఆ భోజనాలు దళితుల ఇంట వండి, వార్చినవీ కావనీ, ఎక్కడో తోటలోఅగ్రవర్ణాలు స్వహస్తాలతో తయారు చేసినవనీ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీడియా సమావేశం పెట్టి మరీఆరోపించారు. ‘లక్ష కోట్లు’ ఇచ్చింది ఎలా నిజం కాదో చెప్పే పేరు మీద అమిత్‌ షాకూ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర నేతలకూ రేవు పెట్టేశారు. తాను ప్రధాని అవుతానని ప్రకటిస్తే ఎంత జోక్‌గా తీసుకుంటారో, బీజేపీ తెలంగాణలో సర్కారు ఏర్పాటు చేస్తుందనటాన్ని కూడాజోక్‌గా తీసుకుంటారని వెక్కిరించారు.

కేసీఆర్‌ ప్రతి విమర్శలనేమీ ఖాతరు చెయ్యకుండా, ఆంధ్రప్రదేశ్‌ వెళ్ళి అక్కడ.. ‘ప్రత్యేక హోదా’ కు బదులు ‘ప్రత్యేక ప్యాకేజీ’ ఇచ్చి ఇంత మేలు చేశామో చెప్పారు. ఇలా ఇచ్చిన ప్రధాని మోడీ జులై నెలలో ఆంధ్రప్రదేశ్‌ లో పాదం మోపగానే, ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలు పండగ
చేస్కోవాలన్నారు.

స్లోగన్ మార్చిన కేసీఆర్
బీజేపీ ఒక తెలుగు రాష్ట్రంలో విపక్షంగానూ, మరొక రాష్ట్రంలో భాగస్వామ్య పాలక పక్షంగానూ వుంది. ఈ రెండు చోట్లా కేవలం రెండేళ్ళలో సంపూర్ణ అధికారం చేపట్టే దిశకు నిజంగా వెళ్ళిపోతుందా? మిగిలినచోట రగిలించినట్లుగానే ముస్లిం ‘మైనారిటీల’ మీద వ్యతిరేకతను రగిలించి, దానితో మెజారీటీ హిందూ వోట్లను కూడగట్టాలనే పాచిక తెలంగాణలో చెల్లదని ఎప్పుడో రుజువయి పోయింది. అలాకాకుండా ముస్లిం వ్యతిరేకతతో పనిలేకుండా హిందూ వోట్లను సమీకరించాలనుకుంటే.. ఆపనిని జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందే కేసీఆర్‌ చేసేశారు. అయినా ‘ముస్లింల రిజర్వేషన్ల’ను వ్యతిరేకిస్తూ అమిత్‌ పాత పాట పాడారు. కానీ ఇదే అదను అనుకుని మారిన రాజకీయ నేపథ్యంలో ‘తెలంగాణ ఆత్మగౌరవాన్ని’ కేసీఆర్‌ పునర్విచించారు. అంతవరకూ, ‘ఆంధ్రపాలకుల వ్యతిరేకత’లోంచి ఈ అంశాన్ని చూస్తే, ఇప్పుడు ‘ఉత్తరాది పాలకులవ్యతిరేకత’లోంచి తెలంగాణ అస్తిత్వాన్ని చూపే ప్రయత్నం చేశారు.

‘పక్క వాయిద్యం‘ వదలి సొంత కచేరీనా..?
ఇక ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంతో పొత్తు, గతంలో బీజేపీకన్నా, తెలుగుదేశంకే లాభించింది. ఇప్పుడూ అదే జరగబోతోందని ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన బీజేపీ నేతలే పలుసార్లు విన్నవించుకున్నారు. అమిత్‌ షా సభలో కూడా కొందరు బీజేపీ కార్యకర్తలు’తెలుగుదేశాన్ని వీడండి, బీజేపీని కాపాడండి’ అనే ప్లకార్డులు పట్టుకున్నారు. ‘ప్యాకేజీ’అన్నది ‘రాజీ’ అని ప్రజల్లో నాటుకు పోయింది. అమిత్‌ షా వచ్చి, ఇవ్వని ‘హోదా’గురించి పదేపదే గుర్తు చేసి ‘పండగ’ చేస్కోమంటే, అది బీజేపీకి ఏవిధంగా లాభిస్తుందో ఆయనకే తెలియాలి. పైపెచ్చు అక్కడ గట్టి ప్రతిపక్షంగా వైయస్సార్సీపీ వుంది. అక్కడ తెలుగుదేశానికి ‘పక్కవాయిద్యం’గా నే వుండాల్సిన అగత్యం బీజేపీకి వుంది.

కాబట్టి, రేపు అమిత్‌ షా చాణక్యానికి అసలు సిసలైన పరీక్ష పెట్టేవి తెలుగు రాష్ట్రాలే.

-సతీష్ చందర్

25 మే 2017

Leave a Reply