అవినీతిని చూస్తే ఒకప్పుడు కోపం వచ్చేది. కానీ ఇప్పుడు కడుపు మంట పుడుతోంది.
రూపాయి మీద ఒట్టు. కోపం వేరు. కడుపు మంట వేరు.
అందగత్తె ఐశ్యర్యారాయ్‌ను చూస్తే అనాకారులయిన అప్పలమ్మలకి వచ్చేది కోపం; కానీ అంతో ఇంతో అందగత్తెలకు వచ్చేది మాత్రం కడుపు మంటే.
బుద్ధివున్న వాణ్ణి చూస్తే, బుర్రలేని వాడికి వచ్చేది కోపం; సగం బుర్ర వున్నవాడికి వచ్చేది కడుపు మంట.
అలాగే..,
బిర్యానీ మెక్కే వాణ్ణి చూస్తే , తిండి లేనివాడికి వచ్చేది కోపం; తెల్లన్నం తినేవాడికి వచ్చేది కడుపు మంట.
ఇప్పుడు దేశం మొత్తం… కోపంతో ఊగిపోవటం లేదు. కడుపు మంటతో కాలిపోతోంది. కారణం అవినీతి.
లక్షల కోట్ల మింగిన వాణ్ణి చూస్తే, వేల కోట్లు మింగిన వాడికి మంట.
టూ-జీలో మేసిన వాణ్ణి చూస్తే, వన్-జీలో చప్పరించిన వాడికి మంట.
ఉప ఎన్నికల్లో వోటు అమ్మబోయే వాణ్ణి చూస్తే, సాధారణ ఎన్నికల్లో వోటు అమ్మేసుకున్నవాడికి మంట.( అప్పుడు పుచ్చుకున్న రెండు వందలు ఎక్కడ? ఇప్పుడు పుచ్చుకోబోయే పదివేలెక్కడ?)
అవినీతిని చూస్తే ఒకప్పుడు అతికొద్ది మందిగా వున్న నీతిమంతులుకు కోపం వచ్చేది. వారు తమ సంఖ్యకు తగ్గట్టుగానే అతి బలహీన స్వరంతో అరిచి, అరిచి నోరు నొప్పి పెట్టి ఊరుకొనే వారు.
కానీ ఇప్పుడు అదే అవినీతిని చూస్తే, అసంఖ్యాకులయిన అర్థనీతిమంతులకు కడుపు దహించుకుపోతోంది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశం ఏమవుతుంది? రెండుగా చీలిపోయింది.
పూర్తిగా తినేవాళ్ళు పవిత్రమైన ‘ప్రజాస్వామ్యం’లో చేరిపోతే, సగం తినేవాళ్ళు అంతకన్నా పరిశుధ్ధమైన ‘పౌర సమాజం’ లో చేరిపోయారు. రెండు శిబిరాల్లోనూ అంత వరకూ వున్న నీతిమంతులు దిక్కుతోచక పారిపోయారు.
యుధ్ధం. దేశంలో యుధ్ధం. అంతర్యుధ్ధం లాంటి యుధ్ధం. కొందరు ‘అరబ్బు దేశాల్లో వస్తున్న అంతర్యుధ్ధాల్లాంటిదే కాబోలు’ అని సంబరపడ్డారు. కానీ అక్కడ యుధ్ధాలకు కోపం కారణం. కానీ ఇక్కడి యుధ్ధానికి మాత్రం ముమ్మాటికీ కడుపు మంటే కారణం.
‘ప్రజాస్వామ్యాన్ని’ చూస్తే, ‘పౌర సమాజానికి’ కడుపు మంట. ఎందుకు వుండదూ? అవినీతి ప్రజాస్వామ్యంలో ఏరులై వడివడిగా పారుతుంటే, పౌరసమాజంలో పిల్లకాలువల్లో నిక్కుతూ, నీలుగుతూ కారుతోంది. ఈ దయనీయ దృశ్యాన్ని ఎన్నాళ్ళని చూస్తారు? అందుకే తిరగబడుతున్నారు.
అవినీతి చెయ్యటానికి ప్రజాస్వామ్యంలో పధ్ధతీ, పాడూ వుంటాయి. సబ్సిడీ బియ్యాన్ని పేదలకు చేర్చటంలో ప్రజాస్వామ్యం విఫలం కావచ్చు. కానీ పోలింగ్ తేదీ నాటికి రోజు ముందే ప్రతి ముంగిటా ఒక సారా సీసా వుంచే విధానం ప్రజాస్వామ్యానికి తెలుసు. బతికున్న వృధ్ధులందరికీ పించను ఇప్పించ లేక పోవచ్చు. కానీ చచ్చిన యువకుడికి కూడా వోటుకు రెండు వందలు చచ్చినట్టు వచ్చేస్తాయి. ఇలాంటి కార్యదక్షత వున్న వారే ఎన్నికయి చట్ట సభలకు వెళ్తారు. మంత్రులవుతారు. కొడుకులూ, కూతుళ్ళూ, కోడళ్ళూ, అల్లుళ్ళ సారథ్యంలో ఈ పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకుంటారు. ఇలా చేయటం వల్ల దేశంలో ఆర్థిక మాంద్యం వున్నప్పటికీ వారికున్న వందల కోట్ల ఆస్తులకు విలువ పెరిగి లక్షల కోట్ల ఆస్తులుగా మారిపోతాయి. ఇలాంటి పనులు చేయించి, దేశ ఆర్థిక వృద్ధిని ఎప్పటికీ రెండంకెల మీద స్వారీ చేయించాలన్నది, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వారి కోరిక.
ఇంతటి పటిష్టమైన ప్రజాస్వామ్యాన్ని చూసి ఉడుక్కుంటోంది ‘పౌరసమాజం’.
ఎక్కడదీ పౌరసమాజం? ప్రజాస్వామ్యంలాగే పవిత్రమైన వోటు ద్వారా ఏర్పడుతుందా?
మేధావులూ, వ్యాపారవేత్తలూ, ఉద్యోగులూ, మహోద్యోగులూ, పూర్వ ఉద్యోగులూ, ఎన్జీవోల్లో పనిచేసేవారూ-వీలుంటే మీరూ, నేనూ- పౌరసమాజంలోకి చొరబడిపోవచ్చు.
అర్హత ఒక్కటే: తినే వాళ్ళ మీద కుళ్ళూ, ఈర్ష్యా… వెరసి కడుపు మంట వుండాలి.
అలా వుండాలంటే కొంచెంగానే తినాలి కానీ, పెద్ద యెత్తున మింగ కూడదు.
ఇందుకు కొన్ని ఉదాహరణలు:
-ఐఐటి చదివికూడా కోటిరూపాయిల కట్నం ఆశించకుండా వుండి, యాభయి లక్షలతోనే సరిపెట్టుకోవటం.
-ప్రొఫెసరయితే, మూడుగంటల్లో దిద్దాల్సిన జవాబు పత్రాలను, మరీ మూడు నిమిషాల్లో కాకుండా, ముఫ్ఫయి నిమిషాల్లో పూర్తి చేసి సంపూర్ణ పారితోషికాన్ని పుచ్చుకోవటం.
-వైద్యులయితే గర్భస్త శిశువుల లింగనిర్ధారణ పరీక్షలకు అతి తక్కువ ఫీజు తీసుకుని, పేద మహిళ గర్భాలను సులభంగా తొలగించటం.
-న్యాయవాదులయితే, పేదలకూ, సంపన్నులకూ మధ్య ఎంతో కొంత తేడా పాటించాలి. క్లయింట్లు పేదవాళ్ళయితే ఎంతో కొంత కనికరం చూపగలగాలి. అంటే సంపన్న రేపిస్టుకీ, పేద రేపిస్టుకీ ఒకే ఫీజు చార్జి చెయ్యకూడదు.పేద కీచకుడి పట్ల కనికరం పాటించగలగాలి.
-సంఘసేవకులయితే తాము ఏసీ గదుల్లో వున్నా ఖరీదయిన కారుల్లో తిరిగినా, మారు మూల పల్లెలకు వెళ్లినప్పుడు, పెట్టినదంతా తినేసి, పేదరికాన్నీ, వీలయితే పేదల్నీ నిర్మూలించి ‘వెలుగు’ల్ని ప్రసాదించగలగాలి.
ఇలాంటి నేపథ్యం వున్నప్పుడు మాత్రమే అవినీతి మీద పుట్టాల్సినంత కడుపు మంట పుడుతుంది.
అవినీతిని ఎండగట్టే పౌరసమాజంలో అగ్రభాగాన అసలు సిసలయిన వ్యాపారవేత్తలూ, వాణిజ్యవేత్తలూ వున్నారు. మిగిలిన వారికన్నా వీరు అవినీతి పట్ల కడుపుమంటను తీవ్రాతి తీవ్రంగా ప్రకటిస్తున్నారు.
నాసిరకం బ్రేకు వైరు అమ్మినందుకు ‘అపరిచితుడి’కి వచ్చిన ఆగ్రహం కన్నా, అవినీతి బ్రేక్ ఇన్స్పెక్టరు మీద ‘భారతీయుడి’కి కలిగిన అసహనం కన్నా, ఈ వ్యాపారుల కడుపు మంట ఎక్కువగా వుండటం ఆశ్చర్యమే.
కారణం చిన్నదే. ఒకప్పుడు అవినీతికి పాల్పడుతుంటే, ప్రజల డబ్బును కొట్టేస్తున్నారని బాధపడేవారు.
ఇప్పుడున్నది బాధ కాదు. ఏడుపు.
దోపిడీలో బాధ వుంటుంది. పంపకంలో ఏడుపు వుంటుంది.
‘నాకు రావాల్సిన కాంట్రాక్టు పక్కవాడి కొస్తే..’ వామ్మో, ఏడుపు కాదూ…!
నేడు సర్కారును మార్కెట్టును నడుపుతోంది. సర్కారు తప్పు చేస్తే మార్కెట్టుకు కోపం వస్తుంది.
మార్కెట్టు సూత్రాలకు లోబడే సర్కారూ- అందులోని మంత్రులూ అధికారులూ- నడవాలి.
అందుకే దేశంలో జరుగుతున్న ఈ ‘ అంతర్యుధ్ధం’ లో ప్రజాస్వామ్యం వైపు సర్కారూ, పౌరసమాజం వైపు మార్కెట్టూ నిలిచాయి.
సహజంగా బాధనుంచి కోపం వస్తుంది.
కానీ, ఇప్పుడున్నది ఏడుపు కాబట్టి దానినుంచి కడుపు మంట వచ్చింది.
ఇది అవినీతిపూ అర్థనీతి జరుపుతున్న సమరం!
-సతీష్ చందర్
20-5-11