టాపు(లేని) స్టోరీ:
అలకల్లేని కాపురం- అలల్లేని సముద్రం వంటిది. అంటే మృతసాగరం(డెడ్‌సీ) అన్నమాట. ‘మా ఆవిడ అలగనే అలగదు’ అని ఏ మగడయినా అన్నాడంటే అతడి మీద జాలి పడాలి. కారణం- అమెకు అతగాడి మీద రవంత ప్రేమ కూడా లేదన్నమాట.
అలకల్లేని కాపురాలు లేనట్టే, అసమ్మతి లేని పార్టీలూ వుండవు. ‘మా పార్టీలో ‘అసమ్మతి’ అన్న ప్రశ్నే లేదు’- అన్నారంటే అది పార్టీయే కాదన్నమాట. ఒక వ్యక్తి కేంద్రంగా నడిచే సమూహమన్నమాట. అక్కడ ప్రజస్వామ్యన్నదే లేదన్నమాట. ప్రేమ లేని కాపురాలు- కాపురాలు ఎలా కావో, ప్రజాస్వామ్యం లేని పార్టీలు కూడా పార్టీలు కావు.
‘ఈ మధ్య ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువయి పోయాయి. అందుకే భార్యాభర్తలు రోజూ కొట్టుకు చస్తున్నారు. ఎప్పుడూ కీచులాటలే.’ ఈ మాటలు తరచు వింటూ వుంటాం. పైకి ఫిర్యాదు లాగా అనిపిస్తుంది కానీ, ప్రేమ వివాహాలకు కితాబే. ‘మీరలా అంటారు. ఈ కీచులాటలు విడాకుల వరకూ వెళ్ళి పోతున్నాయి. దీనికే మంటారు?’ అని వాదనకు కూడా దిగుతారు. ఇది ఇంకా పెద్ద కితాబు. ప్రేమ లేకుండా పెళ్ళికి గోల్డెన్ జూబిలీలూ, డైమెండ్ జూబిలీలూ చేసుకోవటంతో పోలిస్తే, ఇది విముక్తే.
పాత కాలం వాళ్ళు ఉన్నది ‘ఒకే వైఫ్’ అనుకునే వారు. (ఒకేఒక హజ్బెండ్ అని కూడా అనుకోవచ్చు)
ఇప్పటి వాళ్ళు ఉన్నది ఒకే ఒక ‘లైఫ్’ అనుకుంటున్నారు.
ప్రేమ లేకుండా జీవితాంతం రాజీపడేదాని కన్నా, తెగతెంపులు చేసుకుని సరికొత్త జీవితం ప్రారంభిద్దామనుకుంటున్నారు.
రాజకీయాల్లోను అంతే పూర్వం సంపూర్ణమెజారిటీలతోనూ, తిరుగులేని మెజారిటీలతోనూ పార్టీలు ప్రభుత్వాలను స్థాపిస్తూ వుండేవి. అప్పుడు పార్టీ అధినేత లేదా అధినేత్రి ముందు ‘శిరసు వంచి’ నడచుకోవటం తప్ప పార్టీలో వుండే శాసన సభ్యులకూ,పార్లమెంటు సభ్యులకూ వీలుండేది కాదు. ఇప్పుడా యుగం పోయి, సంకీర్ణ యుగం వచ్చింది. అంటే ‘ప్రేమ’ యుగం అన్నమాట. ఇంకా చెప్పాలంటే అలకల యుగం!
పార్టీలోని గ్రూపులనీ, ఇతర పార్టీలనూ కలుపుకుంటేనే కానీ పాలించలేని స్థితి అధినేతలకు వుంటుంది.
కాంగ్రెస్ లో ఎప్పుడో ఈ ‘ప్రేమ’ యుగం వచ్చేసింది. ఏదో గ్రూపు నేత, ఎక్కడో అక్కడ అలక పాన్పు ఎక్కుతూనే వుంటాడు. ‘గెలిచిన ఆ రెండూ నావే’ అంటూ చిరంజీవి ఉప ఎన్నికలలో తన ప్రమేయాన్ని గుర్తించ మంటూ చిన్నగా అలిగారు. ఒక్కొక్క సారి ఈ అలకలే శ్రుతి మించి, ‘తెగతెంపుల’ వరకూ వచ్చిన సందర్భాలున్నాయి. శరద్ పవార్, మమతా బెనర్జీ అలాగే చేసి వేర్వేరు కుంపట్లు( నేషనలిస్ట్ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌లు) ఏర్పాటు చేశారు. మళ్ళీ వెనక్కి వచ్చి మద్దతు ఇచ్చి కాంగ్రెస్‌తోనే ‘యుపీయే’ కాపురం పెట్టుకున్నారు. వైయస్ జగన్మోహన రెడ్డి కూడా తెగతెంపులు చేసుకునేటంత వరకూ అలిగారు. ఏమో! తర్వాత, భవిష్యత్తులో మమత. శరద్ పవార్ల బాట పట్టినా పట్ట వచ్చు. (ప్రణబ్ ముఖర్జీ తనకు వోటు వేయమని జగన్ పార్టీని అడిగేశారు కదా!)
ఇప్పుడు ఈ ‘అలకల’ బారిన ‘కాషాయాంబర ధారులు’ కూడా పడ్డారు. దక్షిణాదిన విచ్చుకున్న ఏకైక ‘కమలం’ ‘కర్ణాటం’. అక్కడ ఆది నుంచీ అలకలే. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప అలక పాన్పు ఎక్కారు. అక్కడ యెడ్యూరప్ప వల్ల బీజేపీ గెలిచిందా? బీజేపి వల్ల యెడ్యూరప్ప గెలిచారా? అంటే ఏమి చెబుతాం? చూడబోతే యెడ్యూరప్ప కున్న బీసీ( లింగాయత్)ల బలం తో గెలిచారన్నది విశ్లేషకుల అంచనా. అలాంటంప్పుడు ‘అలక’ ఏ స్థాయిలో ఊహించగలం. ఆయన మీద వున్న ‘ఆరోపణల’ కారణంగా ఆయన స్థానంలో వచ్చి ‘సదనాంద గౌడ్’నే ఇంకా కొనసాగిస్తే కుదరదంటున్నారు యెడ్యూరప్ప ఆయన వర్గీయులు. యెడ్యూరప్పను కాదని బీజేపీ ఏదయినా చేస్తే, ‘అలిగి’ వెలుపలికి పోవచ్చు. అదీ కూడా ప్రేమ చిహ్నమే. ఇక బీజేపీ వారు కాంగ్రెస్ వారిని తప్పు పట్టనక్కర్లేదు. అంతర్గత ప్రజాస్వామ్యం తమ పార్టీలోకి కూడా వచ్చేసంది. అలకే అంతర్గత ప్రజాస్వామ్యం.
న్యూస్ బ్రేకులు:
ఎడా, పెడా
తెలంగాణ ప్రాంత విషయంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను వ్యక్తం చేస్తున్నాయి.
-వినోద్,టీఆర్‌ఎస్ సీనియర్ నేత
వామ్మో! అటు కేంద్రం, ఇటు రాష్ట్రం- ఇద్దరు సవతి తల్లులా? భరించటం కష్టమే.
రాయల తెలంగాణ ప్రతిపాదనను అంగీకరించే ప్రసక్తి లేదు. రాయల సీమ నాయకత్వం వల్లే మొదటి నుంచీ తెలంగాణ అన్యాయానికి గురయింది.
-కె. ఆర్. ఆమోస్. కాంగ్రెస్ సీనియర్ నేత
చూశారా? ఆంధ్ర ప్రాంతీయుల మీద వుండే కోపం, సీమ నేతల మీదకు మళ్ళించారు! ‘రాయల తెలంగాణ’ స్క్రిప్టును ఎవరో తెలివిగానే రాసినట్టున్నారు.
ట్విట్టోరియల్
రూపాయి(బియ్యం) పడి పోయింది.
నగ అందం ధరించిన వారి మీద వుంటుంది. నెక్‌లెస్ బాగాలేదంటే లోపం ‘నెక్'(మెడ)దే అయివుంటుంది. చీరా అంతే. కొందరు నార చీర కట్టినా నాజూగ్గా వుంటారు. ఇంకొందరు పట్టుచీర కట్టినా కూడా అమ్మ వారిలానే వుంటారు. తప్పు చీరదంటే ఎలా? ఆడా, మగా అని కాదు. కొందర పంచె కడితే పంచెకే అందం వస్తుంది. కొందరు కోటు వేస్తే, ‘పగటి వేషమా?’ అనాలని పిస్తుంది. తప్పు కోటుది కాదు. సంక్షేమ పథకాలు కూడా నగలు లాంటివే. పేదలకు ‘పక్కా ఇళ్ళ’ని ఇందిరమ్మ ఇచ్చారు. ఇచ్చిన ఇళ్లు ‘ఇంటికి తక్కువ- గుడిసెకు ఎక్కువ’ లాగానే వుంటాయి. అయినా ఇందిరమ్మకు కీర్తిని తెచ్చాయి. అలాగే ‘కిలో రెండురూపాయిల బియ్యం’ ఎన్టీఆర్‌కీ, ‘ఉచిత విద్యుత్తు’ వైయస్‌కీ పేరు తెచ్చాయి. కానీ ఇప్పటి ముఖ్యమంత్రి నెత్తిన ‘కిలో రూపాయి బియ్యం’ పెట్టుకుని తిరిగినా ‘ఉప ఎన్నికల్లో ఎందుకు వోట్లు పడలేదు?’ ఇదీ కాంగ్రెస్ వారు తమ ‘అంతర్మథనం’లో వేసుకున్న ప్రశ్న. సమాధానం ఒక్కటే: తప్పు బియ్యపు మూటది కాదు. మోస్తున్న తలది. అంతే.
‘ట్వీట్ ‘ఫర్ టాట్
‘ఆస్తికులు’
కిరణ్ బేడీ: తమ తమ ఆస్తులను వెల్లడించమని ఉత్తర్ ప్రదేశ్ తన మంత్రులను కోరారు. శుభ పరిణామం.
కౌంటర్ ట్వీట్: వెల్లడిస్తారు చూడండి. ‘నాకు ఒక డొక్కూ సైకిలూ, పూరిపాకా, బ్యాంకులో నాలువేల రూపాయి నగదూ’ అని . శుభ పరిణామమేనా?
ఈ- తవిక
‘దేవుని స్మరింపుము’
బస్సు లోపల
డ్రైవరు వెనక బోర్డు:
‘దేవుని స్మరింపుము.’
‘ఎందుకీ బోర్డు’ అన్నాడో పాసింజరు.
‘నీకు తెలుసా? నడపాల్సింది దేవుడే.
డ్రైవరు శిక్షణలో వున్నాడు లే’ అని
బ్లాగ్ (బ్లాక్) స్పాట్:
‘పాక్ జైలునుంచి సరబ్ జిత్ వస్తాడనుకుంటే సుర్జిత్ వచ్చాడు.’
‘అలాఅని వారు అనలేదు. మనం అలా విన్నాం. మీడియాకు తాను విన్నదే వార్త’
కొట్టేశాన్( కొటేషన్):
కొందరు తినటం కోసం బతుకుతారు. ఇంకొందరు బతకటం కోసం తింటారు. ఇతనెవరో తిని చస్తానంటున్నాడు. పాపం! పాలిటిష్యన్ కాబోలు.
-సతీష్ చందర్
(సూర్య దినపత్రికలో 3జులై2012 నాడు ప్రచురితం)